ప్రకాశం

22వేల హెక్టార్లలో డ్రిప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేస్తవారపేట: జిల్లాలోని 56 మండలాల్లోని బోరు ఉన్న వ్యవసాయ రైతులకు 22 వేల హెక్టార్లలో డ్రిప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్రబాబుకు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ సూచించారు. గురువారం మండలంలోని కలగొట్ల, పాపాయిపల్లి, సలకలవీడు గ్రామాల్లో రైతులు డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న పత్తి, మిరప, మల్బరీ పంటలను పరిశీలించారు. అనంతరం డ్రిప్ పరికరాలను పరిశీలించి రైతులకు డ్రిప్ వలన కలిగే ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ వలన నీటి ఆదాతోపాటు విద్యుత్, పెట్టుబడి, మందుల ఖర్చు తగ్గుతుందని రైతులు కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలోని అన్నిమండలాల్లో బోరు ఉన్న ప్రతిరైతుకు డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతంపై సబ్సిడీ అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని నీటిని ఆదా చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కలగట్లవాగు పూడికతీతను పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఎపిఎంఐపి పిడి రవీంద్రబాబు, ఎపిడి నాగమురళీ, హార్టికల్చర్ ఎడి-2 జనె్నమ్మ, డిడబ్ల్యుఎంఎ పిడి, ఎపిడి, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల ఉపఎన్నిక తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి దృష్టి
ఒంగోలు : నంద్యాల ఉపఎన్నికల తర్వాత రాష్ట్రంతోపాటు జిల్లాలోని నామినేటెడ్ పదవుల భర్తీపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఈపాటికే జిల్లాలోని 12 నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న ఆశావాహుల జాబితాను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తయారుచేసినట్లు సమాచారం. ఈసారి ప్రకటించే నామినేటెడ్ పదవుల పందారంలో జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచించిన వారికి కూడా పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రెండుసార్లు ఒంగోలు సూపర్‌బజార్ చైర్మన్‌గా వ్యవహరించిన తాతా ప్రసాద్‌కు మళ్లీ ఆ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. కాగా ప్రతిసారి తాతా ప్రసాద్‌కే సూపర్‌బజార్ చైర్మన్ పదవిని కట్టబెడితే పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటన్న సందిగ్ధంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. కాగా తన అనుచరుడు తాతా ప్రసాద్‌కు మళ్లీ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు మాగుంట కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో ప్రకటించే నామినేటెడ్ పదవుల పందారంలో మాత్రం ప్రసాద్‌కు సూపర్‌బజార్ చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే తాతా నియామకాన్ని ఏ మేరకు పార్టీని పూర్తిస్థాయిలో నమ్ముకున్నవారు ఏ విధంగా జీర్ణించుకుంటారో ఆ దేవుడికే తెలియాల్సి ఉంది. ఈ పాటికే సూపర్ బజార్ చైర్మన్ పదవి కావాలంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాతాకు దక్కుతుందో లేక చివరి క్షణంలో ఎవరి పేరు తెరపైకి వస్తుందో వేచిచూడాల్సి ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేసులో దాసరి వెంకటేశ్వర్లు, శిరిగిరి రంగారావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాని ఇంతవరకు గ్రంథాలయ పాలక వర్గాన్ని మాత్రం రాష్టప్రార్టీ ప్రకటించకపోవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారనే చెప్పవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తవుతోందని, ఈ నేపథ్యంలో కేవలం ఒకటిన్నరేళ్లలో ఎవరు చైర్మన్‌గా ఉంటే ఏముందన్న సందిగ్ధంలో కొంతమంది ఉన్నట్లు సమాచారం. కాగా జిల్లాకు చెందిన మరో నేత యర్రాకుల శ్రీనివాసరావు సైతం ఎపి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈ పదవికి సంబంధించి జిల్లాలోని ఎమ్మెల్యేలు సైతం లెటర్లను ఆయనకు ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా స్ర్తి, శిశు సంక్షేమశాఖ రీజనల్ ఆర్గనైజర్ పదవికి పలువురు తెలుగు తమ్ముళ్లు పోటీపడుతున్నారు. అదేవిధంగా పలు దేవాలయాలకు పాలకవర్గాలను ప్రకటించాల్సి ఉంది. ఆయా దేవాలయాలకు సంబంధించిన పాలకవర్గాల్లో తమకు చోటు కల్పించాలని ఈపాటికే ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల చుట్టూ ఆశావాహులు ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఇదిలాఉండగా ఇటీవలే లీడ్‌క్యాప్ చైర్మన్‌గా కనిగిరి ప్రాంతానికి ఏరిక్షన్‌బాబును రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్టస్థ్రాయి చైర్మన్ పదవులను ఆశించేవారి సంఖ్య కూడా భారీగానే పెరిగిందనే చెప్పవచ్చు. మొత్తంమీద నంద్యాల ఉపఎన్నికలు పూర్తయిన తరువాత నామినేటెడ్ పదవుల పందారం పూర్తిస్థాయిలో జిల్లావ్యాప్తంగా జరిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.

తండ్రి హత్య కేసులో తనయుడు అరెస్ట్
కందుకూరు: లింగసముద్రం మండలం ముత్తంవారిపాలెంలో ఈనెల 6వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ కె ప్రకాష్‌రావు విలేఖర్ల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ముత్తంవారిపాలెంకు చెందిన సుధాకర్‌కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి, కొడుకులు బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారని ఆయన తెలిపారు. కాగా 6 సంవత్సరాల క్రితం సుధాకర్ కుమారుడు మోహన్‌రావుకు గుడ్లూరుకు చెందిన నవ్యతో వివాహం జరిగిందని ఆయన తెలిపారు. అయితే మోహన్‌రావు తండ్రి సుధాకర్‌కు నవ్యను పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదని, దీంతో తరచూ మద్యం సేవించి కోడలితో గొడవలు పడుతుండేవాడని, దీంతో నవ్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో అత్త, మామలకు నచ్చజెప్పి తిరిగి నవ్యను కాపురానికి తీసుకురావడం పరిపాటిగా మారిందన్నారు. ఈక్రమంలో ఈనెల 6వ తేదీన మోహన్‌రావు మద్యం సేవించి ఇంట్లో ఉన్న సమయంలో తండ్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి కోడలు నవ్యతో గొడవపడి అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆయన తెలిపారు. దీంతో తన భార్యతో దుర్భాషలాడుతున్న సమయంలో తన భార్యను ఎందుకు తిడుతున్నావంటూ పక్కనే గల రోకలితో మోహన్‌రావు తండ్రి సుధాకర్ తలపై మోదడంతో సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కావలి ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లగా సుధాకర్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని ఆయన తెలిపారు. మృతుడు అన్న ముసలయ్య ఫిర్యాదు మేరకు గుడ్లూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తుండగా గురువారం ఉదయం నర్సాపురం అడ్డరోడ్డు వద్ద నిందితుడిని అరెస్ట్‌చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ నరసింహారావు, గుడ్లూరు ఎస్‌ఐ ఉన్నం వేమన, రైటర్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కంభం చెరువును సందర్శించిన కలెక్టర్
కంభం: కంభం చెరువును జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ గురువారం సందర్శించారు. చెరువును చూసి ఎన్ని గ్రామాలకు నీరు అందుతుంది, తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు నిండా నీరు ఉంటే 12వేల ఎకరాలు సాగులో ఉంటాయని, 60 గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. అయితే రాచర్ల మండలం చినగానిపల్లి వద్ద రామన్నకతువ ఏర్పాటు చేయడంతో గుండ్లకమ్మ ద్వారా ప్రవహించే నీరు కంభం చెరువుకు రావడం లేదని సర్పంచ్ స్టార్ బాషా, న్యాయవాది ఉదయగిరి మల్లికార్జున్ వివరించారు. వెలుగొండ ప్రాజెక్టు పూరె్తైన అనంతరం రామన్నకతువ నిర్మించాల్సి ఉందని, అయితే ముందుగానే ఏర్పాటు చేయడంతో ఈప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పలువురు ఆయనకు విజ్ఞప్తి చేశారు.
మల్బరీ సాగుచేసే రైతులకు ఉపాధిహామీ పథకం ద్వారా సబ్సిడీ
అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో 22వేల హెక్టార్లలో పంటలు సాగుచేశారని, నీరు-ప్రగతి కింద 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. మల్బరీ సాగుచేసే రైతులకు ఉపాధిహామీ పథకం ద్వారా సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 800 కిలోమీటర్ల మేర సిసిరోడ్లు నిర్మించేందుకు అనుమతులు ఇచ్చామని, వీటిని గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తాండల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు అన్ని మండలాల్లో త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కరవు పరిస్థితులు ఉన్న గ్రామాల్లో పశుగ్రాసం సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 55వేల ఎన్టీఆర్ నివాసగృహాలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చామని, గతంలో పాత ఇళ్లు నిర్మించుకున్నవారికి 25వేల రూపాయలు మరమ్మతుల కోసం అందచేయడం జరిగిందన్నారు. నూతనంగా పశువుల కోసం నీరు-చెట్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో నీటితొట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వెలుగొండ, గుండ్లకమ్మ, కొరిశపాడు భూసేకరణలో నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. అనంతరం చిన్నకంభంలో అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. పెద్దనల్లకాలువలో మామిడితోటను పరిశీలించారు. అనంతరం తురిమెళ్ళలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం అక్కడ గృహాలు నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో పెంచలకిశోర్, ఇరిగేషన్ డిఇ నాగార్జున, ఎస్‌ఇ వెంకటరమణ, తహశీల్దార్ ఉషారాణి, బేస్తవారపేట తహశీల్దార్ రాజకుమార్, పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘పథకాలు రైతులకు చేరువయ్యేలా చూడాలి’
చీరాల : వ్యవసాయశాఖ ద్వారా అమలు జరుగుతున్న పలు రకాల పథకాలను రైతులకు చేరువయ్యేలా సిబ్బంది చూడాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు జె మురళీకృష్ణ అన్నారు. స్థానిక వ్యవసాయ కార్యాలయ సమీపంలో ఉన్న షాదీఖానాలో గురువారం ఏర్పాటు చేసిన చీరాల, పర్చూరు సబ్ డివిజన్ వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షా ఫలితాల విశే్లషణ, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా నూరుశాతం రాయితీపై జింక్, జిప్సం, బోరాన్‌లను రైతులకు సకాలం అందచేయాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో చీరాల వ్యవసాయ సంచాలకురాలు కె రాజకుమారి, చీరాల, పర్చూరు డివిజన్‌ల పరిధిలోని వేటపాలెం, నాగులుప్పలపాడు, చినగంజాం, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి మండలాల ఎఓలు, ఎంపిఇఓలు పాల్గొన్నారు.
ఓగేరు వాగుకు నీటి ప్రవాహం
సంతమాగులూరు : గత పది నెలల నుంచి ఒట్టిపోయిన ఓగేరు వాగు ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం జాలువారడం ప్రారంభమైంది. ఎన్నడూ ఎండిపోని ఓగేరు వాగు ఈ సంవత్సరం చుక్క నీరు లేకపోవడంతో ఎండిపోయింది. అలాంటిది గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగు నీటి ప్రవాహం మొదలైంది. మండలంలోని చవటపాలెం, గురుజేపల్లి మధ్య గల ఓగేరు వాగు వంతెన వద్ద గురువారం 50 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ వాగు నీటి ప్రవాహం మరింత పెరిగితే వాగు పరివాహక ప్రాంతంలో ఎగువ నుంచి దిగువ వరకు 50 వేల ఎకరాలకు పైగా పంట పొలాలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇంగ్లీష్ మీడియం రద్దుతో రోడ్డెక్కిన వెల్లల చెరువు విద్యార్థులు
సంతమాగులూరు : మండలంలోని వెల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు తగ్గారంటూ ఇంగ్లీష్ మీడియంను రద్దు చేసి ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో తమ భవిష్యత్తు ఏమిటంటూ గురువారం ఆ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 48 మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మంది కన్నా విద్యార్థులు తగ్గితే ఆ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను రద్దు చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు తగ్గారన్న సాకుతో ఇంగ్లీష్ మీడియంను రద్దు చేసి ఇంగ్లీష్ బోధించే నలుగురు ఉపాధ్యాయులను ఇటీవల కౌనె్సలింగ్‌లో బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంను రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ఏమిటంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల గదులకు తాళం వేసి గంట పాటు ధర్నా చేశారు. మండల విద్యా కార్యాలయానికి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు దారా బాలయ్య హుటాహుటిన పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో చర్చించారు. శుక్రవారం ఉదయం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సామూహికంగా వెళ్లి తమ సమస్యను తెలియజేద్దామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

‘మాదిగలను మోసం చేసిన బిజెపి’
ఒంగోలు: ఎస్సీ రిజర్వేషన్ న్యాయమైన డిమాండ్ అని, బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినప్పటికి ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మభ్య పెడుతూ మోసం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరివీధి బాబు మాదిగ, ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి అట్లూరి వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమవేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో బలం ఉన్నప్పటికి కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ మంత్రి విజయ్‌సంప్లా రాజ్యసభలో రాజ్యాంగ నియమాలు ఎస్సీ వర్గీకరణకు అనుమతించవంటూ చెప్పడం బిజెపి రాష్ట్రంలోని మాదిగలను మోసం చేయడమే అన్నారు. మాదిగలను మోసం చేస్తే రాష్ట్రంలో బిజెపికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఆ నాడు యుపిఎ ప్రభుత్వం మాదిగల డిమాండ్లను పరిశీలన చేసినందుకు జస్టీస్ ఉషామెహ్ర కమిషన్‌ను నియమించి వర్గీకరణ డిమాండ్ సహేతుకమైనదేనని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ 2008 మే నెలలో కేంద్రానికి సిఫార్సు చేసినట్లు వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఫైల్ కేంద్రప్రభుత్వం దగ్గర ఉన్న విషయం బిజెపి అగ్రనాయకులకు తెలియదా అని వారు ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పార్టీల మద్దతు కూడగట్టి కాంగ్రెస్, బిజెపి సహా 21 పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు.

‘మరుగుదొడ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపాలి’
వేటపాలెం : మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించడంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకున్న అర్హులను ప్రోత్సహించి నిర్మాణం ప్రారంభించాలని ఎంపిడిఓ కె నేతాజి గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం గ్రామ కార్యదర్శులు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ సిబ్బంది, పంచాయతీరాజ్ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న ఎంపిపి బండ్ల తిరుమలాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీ భవన నిర్మాణాలు ఇతర అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇఓ ఆర్‌డి సుబ్రహ్మణ్యం గ్రామ కార్యదర్శులు కె శ్రీనివాసరావు, గౌస్‌మొహిద్దిన్, మస్తాన్‌రావు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

పర్చూరు ఎఎంసిలో త్వరలో మిర్చి కొనుగోలు ప్రారంభం
పర్చూరు : స్థానిక ఎఎంసిలో ఈ నెలాఖరు నుంచి మిర్చి కోనుగోళ్లు ప్రారంభిస్తామని ఎఎంసి కార్యదర్శి ఎం వరలక్ష్మి తెలిపారు. గురువారం ఎఎంసిలో విలేఖర్ల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. లైసెన్సు ఉన్న మిర్చి వ్యాపారులు కొనుగోళ్లు చేయాలని సూచించారు. అందుకుగాను వ్యాపారులు ఎఎంసి నుంచి లైసెన్సులు పొందాలని అన్నారు. పర్చూరు ప్రాంతంలోని మిర్చి పంట నాణ్యంగా ఉంటుంది కాబట్టి మిర్చి రైతులకు మంచి ధరే లభిస్తుందన్నారు. ఏ రోజుకారోజు మార్కెట్ ధర ప్రకారం మిర్చి కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు. రైతులు ఎంత మిర్చి పంట అయినా అమ్ముకోవచ్చని, దానికి పరిమితి ఏమీ లేదని అన్నారు. మంచి నాణ్యత ఉంటే మంచి ధర వస్తుందని అన్నారు. స్థానిక ఎఎంసిలో రైతుబంధు పథకం అమల్లో ఉందన్నారు. ధాన్యం పండించిన రైతులు తమకు గిట్టుబాటు ధరలు లభించే వరకు ఎఎంసిలో ఉన్న గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. నిల్వ ఉంచిన ధాన్యంపై ఎఎంసి రుణాలు మంజూరు చేస్తుందన్నారు. రైతులు ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా తమ సరకుపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చని తెలిపారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించాలని అన్నారు. రుణ చెల్లింపు 6 నెలలు దాటితే 4 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అన్నారు. రైతుబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.