శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నంద్యాల ఉప పోరులో నెల్లూరు నేతల కీలకపాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక సమరంలో నెల్లూరు రాజకీయం కనిపిస్తోంది. నందుల కోటలో జరుగుతున్న ఉప ఎన్నిక పర్వంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన నేతలే ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ పోరులో ప్రత్యేక బాధ్యతలు భుజానికెత్తుకుని సొంత పార్టీకి అండగా నిలిచేందుకు ఎవరికి వారు విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈనేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికపై మన జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రాప్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ ఆధిపత్యం కొనసాగుతుండగా నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష వర్గాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలోనూ భాగస్వామ్యం వహించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం, వైకాపా ముఖ్యనేతలు నంద్యాలలో తిష్ట వేశారు. 20 రోజులుగా అక్కడే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల నుంచి నిరసనల వరకు అనేక అంశాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక పర్వంలో నెల్లూరు నేతలు తమదైన శైలిలో వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యలు ఇలా అనేకమంది ఉప పోరులో భాగస్వామ్యం వహిస్తున్నారు. బంధు, మిత్రుల ద్వారా ప్రచారంలో పాల్గొంటున్నారు. నంద్యాల ఎమ్మెలేగా ఉన్న భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఆ శాసనసభ స్థానం ఖాళీ కావడంతో ప్రస్తుతం ఆ కుర్చీ కోసం ఇరుపార్టీలు పోటీ పడుతుండడం తెలిసిందే. టిడిపి నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైకాపా నుంచి శిల్పా మోహనరెడ్డి వర్గాలు బరిలో నిలిచాయి. ప్రస్తుతం ఇక్కడ అభ్యర్ధుల మధ్య పోరు కంటే, పార్టీల మధ్య సంగ్రామమే కనిపిస్తోంది. ప్రస్తుతం నంద్యాల పోరుతో రాష్టవ్య్రాప్తంగా సత్తా చాటాలని వైకాపా ఆరాటపడుతోంది. పట్టు కోసం తెలుగుదేశం వర్గాలు పోరాడుతున్నాయి. ప్రస్తుతం ప్రతిపక్షానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన చాలామంది నేతల నంద్యాలలోనే దర్శనమిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా అక్కడే పాగా వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. వైకాపా నుంచి నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, జెడ్‌పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళితోపాటు మరికొందరు మండల స్థాయి నేతలు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇరు పార్టీలకు కీలక సంగ్రామం కావడంతో నేతలవారీగా కొన్ని ముఖ్య బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అధికార పక్షం నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాకు చెందిన మరో మంత్రి నారాయణ పార్టీ బాధ్యతలు తదితర విషయాల్లో భాగస్వాములయ్యారు. కడపలో రచించిన వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి సోమిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో శిబిర రాజకీయాలు నిర్వహించడం దగ్గర నుంచి అన్నీ తానై నడిపిస్తున్నారు. మొత్తమీద నంద్యాల ఉప సంగ్రామంలో జిల్లాకు చెందిన రెండు ప్రధాన పార్టీల నేతలు గెలుపు కోసం పోరాడుతున్నారు.

నేటి నుంచి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
* ముస్తాబైన గొలగమూడి
వెంకటాచలం : మండలంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 35వ ఆరాధనోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గొలగమూడి ఆశ్రమాన్ని ముస్తాబు చేశారు. దక్షిణ భారతదేశంలోనే అవదూత వెంకయ్యస్వామి ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా ఆగస్టు 18 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న వెంకయ్యస్వామి ఆరాధనకు ఏటా లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఆరాధనోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ఆశ్రమ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు గతంలో నాలుగురోజులపాటు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఏడు రోజులకు పెంచారు. ఈ ఏడాది జరిగే ఆరాధనోత్సవాలకు సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆశ్రమ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరాధనోత్సవం చివరి రోజున 24వ తేదీన సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా, ఈ ఏడాది వచ్చే భక్తులకు ఆశ్రమ నిర్వాహకులు రూ.17 లక్షలతో వసతులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు నిరంతరం తాగునీరు, సుమారు 150పైగా వసతిగృహాలు, సేదతిరేందుకు ప్రత్యేక డెర్మెంటరీలు, కల్యాణ మండపాలు సిద్దం చేయగా, నాలుగు చోట్ల మరుగుదొడ్లు, పార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆశ్రమం తరపున, బయట వ్యక్తులు అన్నదాన కార్యక్రమాలు, ఆర్టీసీ వారి ప్రత్యేక బస్సులు, వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్ డిఎస్సీ రాఘవరెడ్డి, నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాసులురెడ్డి, వెంకటాచలం ఎస్‌ఐ జగన్‌మోహన్‌రావు అధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరాధనోత్సవాల్లో భాగంగా..
వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహన సేవ, రాత్రి కల్ప వృక్ష సేవ, 19న ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 20న ఉదయం చిన్న శేషవాహన సేవ, రాత్రి హంస వాహన సేవ, 21న ఉదయం సూర్య ప్రభ వాహనసేవ, రాత్రి గజవాహన సేవ, 22న ఉదయం అశ్వ వాహన సేవ, రాత్రి పెద్దశేషవాహన సేవ, 23న ఉదయం సింహ వాహన సేవ, రాత్రి గరుడ సేవ, 24న ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి రోజు పూజా కార్యక్రమాలతోపాటు రాత్రి సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. చివరి రోజున 24వ తేదీన ఉదయం 9 గంటలకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి దంపతులు వెంకయ్యస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆరాధన ఉత్సవాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొనే అవకాశముంది. ఆశ్రమ ఇవో బాలసుబ్రహ్మణ్యం భక్తుల వసతి సౌకర్యాలను పర్యవేక్షించనున్నారు.

ప్రాణాలర్పించైనా తోళ్ల పరిశ్రమను అడ్డుకుంటాం
* తోళ్ల పరిశ్రమ వ్యతిరేక కమిటీ హెచ్చరిక
కోట: ప్రాణాలర్పించైనా తోళ్ల పరిశ్రమను అడ్డుకుంటామని తోళ్ల పరిశ్రమ వ్యతిరేక కమిటీ నాయకుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం కోటలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని కొత్తపట్నం వద్ద తోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపితే జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, మండల ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుచేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి, తొమ్మిది గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకోవడమే కాకుండా అనేక వ్యాధులు సోకుతాయని ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, అదే జరిగితే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రాణాలైన అర్పించి పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామన్నారు. సమావేశంలో జడ్పీటిసి ఉప్పల ప్రసాద్‌గౌడ్, తోళ్లపరిశ్రమ వ్యతిరేక కమిటీ సభ్యులు పాదర్తి రాధాక్రిష్ణారెడ్డి, పి మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
* జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సూచన
వేదాయపాళెం: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో కౌమారదశలో ఉన్న బాలికలకు ఆరోగ్యం, ఆత్మస్థైర్యం అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎంపవర్‌మెంట్ ఆఫ్ అడాల్‌సెంట్స్ గార్ల్స్‌పై వివిధ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కౌమారదశ బాలికలకు నిర్దేశించిన లక్ష్యాలపై అవగాహన కల్పించడానికి సమగ్రమైన పుస్తకాన్ని ముద్రించాలన్నారు. ముద్రించిన పుస్తకాలను సంబంధిత మహిళా టీచరుకు ఇచ్చి వారికి బోధించేలా చూడాలన్నారు. రిసోర్స్‌పర్సన్లను గుర్తించడంతోపాటు వారికి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం కౌమారదశలో వసతిగృహాలలో ఉన్న బాలికలకు పేర్కొన్న అంశాలలో సాధికారత పెంపొందించేలా చూడాలన్నారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ వసతిగృహాలలో ఉన్న బాలికలకు వ్యక్తిగత ఆరోగ్యం, ఆత్మసంరక్షణపై వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవగాహన కల్పించవలసి ఉందన్నారు. దీనికోసం రిసోర్స్ పర్సన్స్ ఎంపిక వారి శిక్షణా కార్యక్రమాలు వంటివి చేపట్టవలసి ఉందన్నారు. దానికి సమాధానంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌమారదశ బాలికలకు వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు వారికి వివిధ పోటీ పరీక్షల గురించి తెలియచేయాలన్నారు. అలాగే బాల్యవివాహాల వల్ల కలిగే అరిష్టాలను వారికి తెలియచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వరసుందరం, రాజీవ్ విద్యామిషన్ పిఓ రమణ, డిడి సాంఘిక సంక్షేమశాఖ మధుసూదన్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం, ఐటిడిఏ పిఓ కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు
జిల్లా ఎస్పీ రామకృష్ణ స్పష్టం
వేదాయపాళెం: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గత నెల 17వ తేది నుంచి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ తెలిపారు. గురువారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, రవాణాశాఖ ఉప కమిషనర్ ఎన్.శివరామ్‌ప్రసాద్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవివర్మ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు రూట్లలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మోటారు వెహికల్ యాక్ట్ కింద 19,369 కేసులు నమోదు చేసి సుమారు రూ.56 లక్షల 28 వేల 460 అపరాధ రుసం వసూలు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా లైసెన్స్‌లు లేని వాహనదారులపై 1657 కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. దీని ఫలితంగా రహదారులపై రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. గణాంకాల ప్రకారం పరిశీలించగా ఏప్రిల్ నెలలో 64 రోడ్డు ప్రమాద మరణాలు జరగగా, మే నెలలో 44, జూన్‌లో 51 జరిగాయన్నారు. అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కారణంగా జూలై నెలలో 30 రోడ్డు ప్రమాద మరణాలు మాత్రమే జరిగాయని తెలిపారు. ఆగస్టు నెలలో ఇప్పటి వరకు 14 ప్రమాదాలు జరిగాయని వివరించారు. పోలీసు, రవాణాశాఖ, ఆర్టీసీ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ టీం సభ్యులు ఎస్‌ఐలు, మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్లు, డిపో మేనేజర్ల పనితీరును ఆయన ప్రశంసించారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ ఇంకా కొంతకాలంపాటు నిర్వహించాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.శివరామ్‌ప్రసాద్, ట్రాఫిక్ డిఎస్పీ రామారావు, రోడ్ సేఫ్టీ నోడల్ ఆఫీసరైన డిఎస్పీ సుధాకర్, టౌన్ ఇన్‌చార్జి డిఎస్పీ బాలసుందరం, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కోటారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ మాణిక్యాలరావుతోపాటు మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

చాలీచాలని భోజనం
ఆందోళనకు దిగిన విద్యార్థులు
మనుబోలు: తమకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అరకొరగా పెడుతున్నారంటూ గురువారం విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా గత నెల రోజులకు పైగా మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. అయితే చాలా రోజులుగా భోజనం సరిపడా సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈక్రమంలో గురువారం భోజనం చాలామంది విద్యార్థులకు సరిపడా సరఫరా చేయకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు అక్షయ పాత్ర వాహనాన్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఇకనైనా భోజనం నాణ్యతగా విద్యార్థులందరికీ సరిపడా అందించాలని డిమాండ్ చేశారు.

విధి నిర్వహణలో చిత్తశుద్ధి అవసరం
* జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు స్పష్టం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు: ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో చిత్తశుద్ధి ఎంతో అవసరమని, అంకితభావంతో పనిచేస్తే ప్రజాభిమానం పొందగలుగుతారని జిల్లా కలెక్టరు ఆర్ ముత్యాలరాజు అన్నారు. గురువారం వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో నూతనంగా ఉద్యోగాలు పొందిన కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ, చట్టాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తగినంత ఉంటే పోలీసు శాఖలో సిబ్బంది మరింత రాణించవచ్చని అన్నారు. విలువలతో కూడిన మానవ సంబంధాల వల్ల పోలీసు శాఖ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయని ఆయన తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న నేర సంస్కృతిని అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని కలెక్టరు సూచించారు. వైట్‌కాలర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో సైబర్ చట్టాల ప్రాధాన్యం పెరిగిందని కలెక్టరు అభిప్రాయపడ్డారు. 2004లో తాను ఐపిఎస్ శిక్షణ పొందానని అంతకుముందు రైల్వేలో, అనంతరం ఐఎఎస్ శిక్షణ పొందానని, శిక్షణలో రాణించకపోతే అనంతరం ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. జిల్లా ఎస్‌పి పిహెచ్‌డి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం చిత్తూరు, కర్నూలు జిల్లాలకు చెందిన 196 మంది కానిస్టేబుళ్లకు గురువారం నుండి శిక్షణ ప్రారంభమవుతుందని అన్నారు. 9 నెలలపాటు కొనసాగే ఈ శిక్షణలో కానిస్టేబుళ్లు ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ యాక్ట్, పోలీసు మాన్యువల్ పట్ల అవగాహనతోపాటు, దేహదారుఢ్య శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతిఒక్కరూ పోలీసు శాఖ వైపే చూస్తారని, వారికి తగిన సహాయ సహకారాలు అందించడంలో పోలీసు త్యాగాలకు కూడా సిద్ధమవవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో పిటిసి ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్, ఎఎస్‌పి శరత్‌బాబు, శిక్షణా సంస్థ డిఎస్‌పి కె శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు.

ఎర్రచందనంపై అవగాహన సదస్సు
రాపూరు: తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న టాస్క్ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అవగాహన సదస్సు గురువారం మండలంలోని వెలుగొండ కొండ కింద గ్రామమైన తెగచర్ల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోనుపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి శేఖర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రచందనం మన జిల్లాతోపాటు పొరుగు జిల్లాలైన కడప, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే ఉందన్నారు. ఈ అరుదైన వృక్షసంపద స్మగ్లర్ల బారిన పడకుండా కాపాడుకొనేందుకు ప్రతిఒక్కరూ తమ శాఖకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారి ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, అరుదుగా లభించే వృక్ష జాతి సంపదైన ఎర్రచందనం వృక్షాలను కాపాడుకొనేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు 655 గ్రామాల్లో 26 వేల కిలోమీటర్లు ప్రయాణించి మాటలు, పాటలు, లఘు చిత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఈ వృక్షాలను రక్షించే అంశాల గురించి సమగ్రంగా వివరించినట్లు ఆయన తెలిపారు. ఏ ప్రాంతంలోనైనా ఎర్రచందనంతోపాటు అటవీ ఉత్పత్తులు, అటవీ సంపద అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఈ సమాచారాన్ని 180042500425 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ అవగాహన సదస్సులో తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారులు సిహెచ్ రమేష్, ఎస్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి
వాకాడు: మండలంలోని పూడిరాయిదొరువు పంచాయతీ పరిధిలోని ఆనకట్ట గ్రామానికి చెందిన మునిస్వామి (52) పిడుగుపాటుకు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. ఆ సమయంలో మునిస్వామి బహిర్భూమికి వెళ్లగా, ఆకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.