తూర్పుగోదావరి

ప్రజాసేవకులుగా కానిస్టేబుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలీసు కానిస్టేబుళ్లను ప్రజాసేవకులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని అర్బన్ ఎస్పీ బి రాజకుమారి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 181 మంది మహిళా కానిస్టేబుళ్లకు 9నెలల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ పోలీసుల బాధ్యత అన్నారు. ఈఅంశాలపై కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు, చట్టాలపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే కానిస్టేబుళ్ల సౌకర్యార్థం లైబ్రరీని కూడా ఏర్పాటు చేశామన్నారు. 5ఏళ్లు ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసిన వారిని సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపిక చేస్తామన్నారు. శిక్షణా కేంద్రంలో ఇబ్బందులను తన దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్‌కూలర్‌ను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం డిటిసిలో మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో ఏఎస్పీలు ఆర్ గంగాధర్, రజనీకాంత్‌రెడ్డి, డిఎస్పీలు సత్యానందం, కె రామకృష్ణ, జి శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్!
*29న పోలింగ్‌కు ఏర్పాట్లు*వేడెక్కిన రాజకీయం!*టిడిపి, వైసిపిలకు శిరోభారంగా రెబల్స్!
కాకినాడ: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గురువారం హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికలపై ఆయా వర్గాల్లో నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడింది. స్థానిక నేతల భ్రమలన్నీ తొలగిపోయాయి. దాదాపు 5 లక్షల జనాభా ఉన్న కార్పొరేషన్‌లో 50 డివిజన్లుండాలన్న నిబంధనలను తుంగలోకి తొక్కుతూ ఈ సంఖ్యను 48కి తగ్గించారని, ఇది కుట్రపూరితమైన చర్య అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఐతే నోటిఫికేషన్‌ను వెలువడిన తర్వాత ఎన్నికలను వాయిదా వేసేది లేదని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 29వ తేదీన కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమం అయ్యింది. పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రథాన రాజకీయ పార్టీల ప్రచారం గురువారం నుండి జోరందుకుంది. 241 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టిడిపి-బిజెపి నుండి 48మంది, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుండి 48 మంది అభ్యర్ధులు మొత్తం 96 పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి 17 మంది, సిపిఐ నుండి ఇద్దరు, సిపిఎం నుండి ఇద్దరు, శివసేన నుండి ఒకరు పోటీలో నిలవగా అధిక సంఖ్యలో రెబల్స్, స్వతంత్య్ర అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 70 వరకు, తెలుగుదేశానికి 40 వరకు ఆయా వార్డుల్లో రెబల్స్, స్వతంత్రులు బరిలో నిలిచారు. దీంతో ఇరు పార్టీలకూ ఈ వ్యవహారం శిరోభారంగా మారింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు హవా చాటే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా అభ్యర్ధుల ఎంపిక విషయంలో తెలుగుదేశం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సంవత్సరాలుగా పార్టీ జెండాను భుజనా మోసిన వారిని కాదని, ముక్కూ మొహం తెలియని వారికి టిక్కెట్లు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరి నిముషంలో అభ్యర్ధుల ఎంపిక జిల్లాకు ఓ మంత్రి కారణంగా తప్పుదారి పట్టిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కారణంగానే రెబల్స్‌గా పలువురు బరిలోకి దిగినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బిజెపికి కేటాయించిన 9 డివిజన్లపై విమర్శలు రాజ్యమేలుతున్నాయి. తెలుగుదేశం పోటీ చేస్తే ఓటమి చెందే అవకాశం గల డివిజన్లను కమలానికి కేటాయించారని, పైగా కమలనాథులు పోటీ చేస్తున్న పలు వార్డుల్లో బలమైన వైసిపి అభ్యర్ధులున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలోనూ నేతల మధ్య సమన్వయం లోపించినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో ఎవరికి వారే నగర ఇన్‌ఛార్జ్‌లుగా అవతరించడంతో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారినట్టు స్పష్టమవుతోంది. అభ్యర్ధుల జాబితాను రాష్ట్ర నేతలే ప్రకటించినప్పటికీ, అంతకు ముందు జరిగిన కసరత్తుపై స్థానికంగా అసమ్మతి చోటుచేసుకుంది.
బిందు సేధ్యంతో పంటల లక్ష్యాల సాధన
రాజమండ్రి సబ్‌కలెక్టర్ విజయరామరాజు
కాకినాడ సిటీ: ఈసంవత్సరం జిల్లాలో బిందు సేధ్యం ద్వారా అవకాసం ఉన్నంత వరకు పంటలువేసి లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమండ్రి సబ్‌కలెక్టర్ విజయరామరాజు అన్నారు. కలెక్టరేట్ విధానగోతమీ సమావేశ మందిరంలో ఉద్యానవనశాఖ, ఏపి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులు గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో ఇరిగేషన్ కంపెనీలు, సంబంధిత శాఖల అధికారులు, ఆర్డీఒల సమన్వయంతో పనిచేసి జిల్లాలో 18వేల హెక్టార్లలో ఉద్యానవన, ఆయిల్ ఫామ్, వ్యవసాయం, చెరుకు, పట్టు తదితర పంటలు పండించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్దంచేసి క్షేత్ర సిబ్బందిని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ వారీ ప్రణాళికను సిద్ధంచేసి బిందు సేద్యం క్రింద సంబంధిత పంటలు పండించడానికి నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. చెరుకు, పామాయిల్ తదితర కంపెనీల వారు సంబంధిత పంటలు పండిస్తున్న రైతుల డేటాను అందజేయాలని సూచించారు. ఐదు ఎకరాల వరకు బిందు సేద్యం చేస్తున్న రైతులకు 90శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుందని సబ్‌కెలక్టర్ విజయరామరాజు ప్రకటించారు. సంబంధిత కంపెనీలువారు క్షేత్ర సిబ్బందిని గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి నియమించాలన్నారు. బింద సేద్యం ద్వారా ఏవిధంగా పంటలు పండించాలో అవగాహన కల్పించి ప్రయోగాత్మకంగా చూపించాలని చెప్పారు. ఆర్డీఒలు కంపెనీల వారితో రైతులకు సమావేశాలను ఏర్పాటుచేసి అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని కోరారు. నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి సంబంధిత కంపెనీ వారు ఖచ్చితంగా సమన్వయమై రైతుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్‌చేసి వారిని బిందు సేద్యం, పంట దిగుబడులపై అవగాహన పెంచాలని సూచించారు. రెవెన్యూసాగు డేటా, కెంపెనీ డేటా సరిపోల్చి రైతుల డేటాను తయారుచేసి వచ్చే సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయలని సబ్‌కలెక్టర్ విజయరామరాజు తెలియజేశారు. సమావేశంలో పాల్గొన్న జెసి-2 జె రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో లక్షా 62వేల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగుచేసే అవకాసం ఉందన్నారు. చెరుకు, మొక్కజొన్న, ఆయిల్‌ఫామ్, ప్రత్తి, పట్టు తదితర పంటలు సాగుచేయవచ్చన్నారు. ప్రత్తి 12వేల 743హెక్టార్లు, మొక్కజొన్న 9వేల 237, చెరుకు 9వేల 644 హెక్టార్లు, పట్టు 420హెక్టార్లలో బిందు సేద్యం ద్వారా పంట దిగుబడి చేయడం జరుగుతోందని వివరించారు. బిందు సేద్యంలో నిర్ణయించిన లక్ష్యాలు సాదించడానికి సంబంధిత కంపెనీలు, అధికారులు కృషి చేయాలని కోరారు. బిందు సేద్యంలో 130మంది ఎంపిఒలను నియమించామని, వీరిని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలలో ఉపయోగించడం జరుగుతుందని వివరించారు. జైన్, ఫినోలెక్స్, నెఫ్ట్, ఎన్‌ఎఫ్‌సిఎల్, ప్రిమియర్, వెంట్ కంపెనీల వారు సిబ్బందిని ఎక్కువ మందిని నియమించి శిక్షణ ఇచ్చి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో ట్రైనీ కలెక్టర్ ఆనంద్, ఎపిఎంఐపి పిడి సుబ్బారావు, ఆర్డీఒలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో లింగంపర్తి విఆర్వో
రూ.4వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్వో) వై రాజేంద్రప్రసాద్‌ను ఎసిబి అధికారులు రూ.4వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించి రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పీ ఎం సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లింగంపర్తి గ్రామానికి చెందిన రైతు సోదరులు పితాని శ్రీను, వీర్రాజులు తమ 3 ఎకరాల పంట భూమికి ఉచిత విద్యుత్ మోటార్ కనెక్షన్ మంజూరు చేయాలంటూ గత మే 12న తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తు నిమిత్తం విఆర్వో రాజేంద్రప్రసాద్‌ను విచారణ చేసి నివేదిక సమర్పించాలని తహసీల్దార్ ఆదేశించారు. అయితే విఆర్వో భూమి పన్ను బకాయి ఉందని కొంతకాలం, భూమి పన్ను బకాయి తీర్చిన తర్వాత కొంత కాలం కాలయాపన చేస్తూ వచ్చారు. తదనంతరం విఆర్వో రూ.5వేలు రైతులను లంచం అడిగారని, దీనిపై సదరు రైతు రూ.4వేలకు విఆర్వోతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు డిఎస్పీ సుధాకర్ తెలిపారు. అనంతరం బాధిత రైతులు తమని ఆశ్రయించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు రైతులు పితాని శ్రీను, వీర్రాజులు విఆర్వో రాజేంద్రప్రసాద్‌కు మండల రెవెన్యూ కార్యాలయంలో రూ.4వేలు లంచం ఇస్తుండగా తాము దాడిచేసి, విఆర్వోను అదుపులోనికి తీసుకున్నట్టు చెప్పారు. రైతులిచ్చిన రూ.4వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. విజయవాడ ఎసిబి కోర్టులో శుక్రవారం హాజరుపర్చనున్నట్టు ఎసిబి డిఎస్పీ సుధాకర్ తెలిపారు. ఈ దాడిలో ఎసిబి సిఐ పుల్లారావు, ఎస్సై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం దుకాణం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
చింతూరు: మద్యం దుకాణం వల్ల తమకు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించి గురువారం వైన్‌షాపు ప్రారంభోత్సవాన్ని చట్టీ గ్రామస్థులు అడ్డుకుని షాపునకు తాళం వేశారు. చట్టీ-కుమ్మూరు రహదారిలో బ్రాందీషాపు దక్కించుకున్న యజమానులు షాపు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో చట్టీ గ్రామస్థులు బ్రాందీషాపు నిర్మించవద్దని, మరోచోట స్థలాన్ని చూపిస్తామని, అక్కడ నిర్మించుకోవాలని సూచించారు. అయినా గ్రామస్థుల మాట లెక్కచేయకుండా ఆ ప్రదేశంలోనే మద్యం షాపు నిర్మాణం చేపట్టారు. మద్యం షాపు నిర్మించిన రహదారి గుండా నిత్యం కళాశాల విద్యార్థినులు, మహిళలు తిరుగుతూ ఉంటారని, వారిపై ఏమైనా అఘాయిత్యం జరగవచ్చునని గ్రామస్థులు భావిస్తున్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రానికి దగ్గరగా వైన్‌షాపు ఉందని, విద్యార్థులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. వైన్‌షాపు పక్కన పంట భూములు ఉండటంతో మద్యం సేవించిన మందుబాబులు మద్యం సీసాలను పొలాల్లో పగలగొట్టే అవకాశముందని, దాంతో రైతులు ఇబ్బందులుపడతారని గ్రామస్థులు చెబుతున్నారు. వైన్‌షాపు నిర్మాణం చేపట్టి గురువారం ప్రారంభోత్సవ సమయంలో చట్టీ గ్రామస్థులు ఆ షాపు వద్దకు వెళ్లి తమగోడును మరోమారు వెళ్లగక్కారు. అయినా మాట వినని వైన్‌షాపు యజమానులు షాపు ప్రారంభోత్సవానికి ప్రయత్నించగా చిర్రెత్తిన గ్రామస్థులు షాపు షట్టర్ దించి తాళం వేశారు. తమ బాధను అర్ధం చేసుకోవాలంటూ షాపు యజమానులపై ఆగ్రహించారు. బ్రాందీ షాపునకు తాళం వేయడంతో యజమానులు నివ్వెరపోయారు.
కస్తూరిబా ప్రత్యేకాధికారిణి సస్పెన్షన్
అడ్డతీగల: వై రామవరం మండలం చవిటిదిబ్బలు (తోటకూరపాలెం) గ్రామంలోని కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పాఠశాల ప్రత్యేకాధికారిణి విజయకుమారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎస్‌ఎస్‌ఎ పిఒ శేషగిరిరావు తెలిపారు. గురువారం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆయన పరామర్శించారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సంఘటనకు దారితీసిన కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన సిబ్బంది అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఉన్నతాధికారులను కోరారు. ఆమె గురువారం వై రామవరం మండలంలోని కస్తూరిబా ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసుశాఖ ద్వారా కూడా సంఘటనకు కారణాలపై పూర్తిస్థాయి విచారణకు రంపచోడవరం సిఐ బిహెచ్ వెంకటేశ్వర్లును నియమించినట్టు సమాచారం.
19న బంద్ విజయవంతం చేయాలి
కూనవరం: ఈ నెల 19న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. గురువారం టేకులబోరు గ్రామంలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చాకే ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టి ఈ బంద్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కొమరం పెంటయ్య, వైసిపి, సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

కాపుల వినూత్న నిరసనలు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం: కాపు రిజర్వేషన్ కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా అమలాపురంలో గురువారం కాపు ఉద్యమ నేతలు వినూత్న తరహాలో నిరసనలు తెలిపారు. కోనసీమ టిబికె జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో కాపు యువకులు నాగళ్లతో దుక్కిదున్ని నిరసన వ్యక్తం చేశారు. కాపు రైతుకూలీలు పడుతున్న ఇబ్బందులు చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిరంకుశ వైఖరి విడనాడకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తాతాజీతోపాటు మానే కృష్ణ, కొమ్మూరి త్రిమూర్తులు, యేడిద శ్రీను, వర్రే శేషు, అర్లపల్లి ముత్యం, సలాది చక్రి, పినిశెట్టి బాను, కల్వకొలను బాబి, సలాది శ్రీను, నల్లా సాయి, బండారు దొరబాబు, కల్వకొలను నాయుడు, వాకపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో కాపు యువత, కాపు మహిళలు గురువారం రాత్రి స్థానిక గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్లా విష్ణు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకుండా కాపు యువతలో అశాంతిని రేపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో కాపు యువత సరైన గుణపాఠం చెపుతుందని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముద్రగడ పాదయాత్ర నిర్వహించి తీరుతారని, ముద్రగడ పిలుపుకోసమే కాపు యువత, మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. ముద్రగడ వెంటే కాపు యువత ఉన్నారని విష్ణుమూర్తి స్పష్టం చేసారు. కార్యక్రమంలో నల్లా పవన్‌కుమార్, మిండగుదుటి మోహన్, కొల్నాటి దుర్గ్భాయి, గోకరకొండ గంగన్నస్వామి, మండేల బుజ్జి, కర్రి రాఘవ, దేశనీడి కిరణ్, కురసా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రావులపాలెం: కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మండలంలోని గోపాలపురంలో కాపు జెఎసి నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కొబ్బరికాయల ఒలుపు నిర్వహించి తమ నిరసన తెలిపారు. ముద్రగడ పద్మనాభం, ఆకుల రామకృష్ణలకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో జెఎసి నాయకులు యాళ్ల మునీశ్వరరావు, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురం: కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రను 23 రోజులుగా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కాపు జెఎసి నాయకులు గుండా వెంకటరమణ, కలిశెట్టి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబి, బాలిపల్లి రాంబాబు, కొండేపూడి శంకర్రావు, బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అమలాపురం ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు అన్నారు. అత్మ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన లింగోలు వెంకన్న (పెదకాపు), కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపిపి బొర్రా ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే ఆనందరావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఆత్మా కమిటీ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సదుపాయాల గురించి రైతులకు వివరించడమే కాకుండా వారికి ఆపథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎంపిపి బొర్రా ఈశ్వరరావుమట్లాడుతూ ఆత్మా కమిటీ రైతులకు నూతన సాంకేతిక యాజమాన్య పద్ధతులను అందించేందుకు కృషి చేయాలన్నారు. అంతకుముందు ఆత్మాకమిటీ ఛైర్మన్ లింగోలు పెదకాపు, కమిటీ సభ్యులు భారీ ఊరేగింపుగా ఎంపిడిఒ కార్యాలయానికి చేరుకున్నారు. సభ్యుల చేత అమలాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు కెఎఎస్‌ఎస్ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పెదకాపు మాట్లాడుతూ రైతులకు తాము నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఆనందరావుతోపాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి అధికారి జయవెంకటలక్ష్మి, గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, ఎఎంసి ఛైర్మన్ గునిశెట్టి లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఛైర్మన్ చిక్కాల గణేష్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగదీశ్వరి, నాయకులు పెచ్చెట్టి చంద్రవౌళి, తిక్కిరెడ్డి నేతాజీ, దాట్ల గోపిరాజు, నిమ్మకాయల సూరిబాబు, నిమ్మకాయల చల్లయ్యనాయుడు, నల్లా స్వామి, జంపన రామరాజు, నడింపల్లి ఉదయ్‌బాబు, గునిశెట్టి చినబాబు,అల్లాడి సోముబాబు, మల్లుల పోలయ్య, పొలమూరి ధర్మపాల్ తదితరులు పాల్గొన్నారు.