చిత్తూరు

త్వరలోనే టిటిడి పాలక మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: టిటిడి ధర్మకర్తల మండలిని త్వరలోనే నియమిస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం ఆయన విరామ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అధికారులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ త్వరలోనే పాలక మండలిని నియమిస్తామన్నారు. గత 3 సంవత్సరాలుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాలు బాగా కురిసి రాష్టమ్రంతా సస్యశ్యామలంగా ఉండాలని, రైతుల పెదవులపై ఆనందం వెల్లివిరియాలని ఆ దేవుణ్ణి ప్రార్థించానన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 85 శాతం ఆలయాలకు పాలకమండళ్లను నియమించామని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మంత్రి వెంట బిజెపి నాయకులు కోలా ఆనంద్, గుండాల గోపీనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతి పద్మావతి అతిథి గృహంలోని విఐపి లాంజ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ సంయుక్తంగా ఆలయాలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో తిరుపతిలో ప్రాంతీయ కార్యాలయానికి భూమిపూజ చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తిరుపతి గణేష్ నిమజ్జనం కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని పూజించాలని గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ తిరుపతి భ్రమరాంబ, భానుప్రకాష్ రెడ్డి, కె. శ్రీనివాసులు, కోలా ఆనంద్, తదితర నాయకులు పాల్గొన్నారు.

యానాది కాలనీ వాసుల తరలింపులో మళ్లీ వివాదం
* ఇళ్లు కొట్టడాన్ని అడ్డుకున్న నిర్వాసితులు, అఖిలపక్ష నేతలు
* పోలీసు బలగాలతో 15 ఇళ్లు కూల్చిన నగర పాలక సిబ్బంది
* నగర పాలక సంస్థ చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: తిరుపతి నడిబొడ్డులో ఉన్న యానాది కాలనీ వాసుల తరలింపు మరోమారు వివాదానికి దారితీసింది. యానాది కాలనీలో ఉన్న సుమారు 350 కుటుంబాలను, చెత్తడంప్‌యార్డ్‌లను అవిలాల ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించిన విషయం పాఠకులకు విధితమే. ఈక్రమంలో యానాదికాలనీ వాసులతో మంత్రులు, నగర పాలక సంస్థ అధికారులు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మలు పలుమార్లు సమావేశమయ్యారు. ముందుగా తాము ఎక్కడికీ వెళ్లమని యానాది కాలనీ వాసులు భీష్మించారు. అటు తరువాత తాము వెళ్లడానికి సిద్ధమేనని కాలనీ వాసులు అంగీకరించినట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో అక్కడున్న వారిని అవిలాల, డంప్ యార్డ్ వద్ద నిర్మించిన ఇళ్లకు తరలిస్తున్నట్లు వారికి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈక్రమంలో బుధవారం రాత్రి ఇళ్లు కొట్టడానికి నగర పాలక సంస్థ అధికారులు సిద్ధం కావడంతో అఖిలపక్ష నేతలు అడ్డుకున్నారు. గురువారం నగర పాలక సిబ్బంది అక్కడున్న ఇళ్లను కొట్టడానికి గునపాలు, సుత్తి, కార్మికులను తీసుకొని వచ్చారు. దీంతో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అధికారులు పోలీసు బలగాలను మోహరింపచేశారు. సుమారు 15 ఇళ్లను కూల్చివేశారు. సమాచారం తెలుసుకున్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వైసిపి నేతలు అక్కడకు చేరుకొని స్థానికులకు అండగా నిలిచారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకచోట అన్నదమ్ముల్లా జీవిస్తున్న తమను వేరుచేస్తున్నారంటూ స్కావెంజర్స్ కాలనీలోని పలువురు మహిళలు భోరున విలపించారు. వెళ్లడానికి సిద్ధపడిన వారి ఇళ్లను మాత్రమే కొడుతున్నామని అధికారులు వివరించారు. తామెవరూ అంగీకరించలేదని అధికారులతో స్కావెంజర్స్ కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. సమావేశమని పిలిచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమవద్ద సంతకాలు తీసుకున్నారని, తమ ఇళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తమకు తెలియదన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి వైసిపి ఎంపి వరప్రసాద్ యానాది కాలనీ వాసులకు అండగా నిలిచి వారిచేత హైకోర్టులో ఫిల్ వేయించారు. ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, తమకెంతో సంతోషంగా ఉందని యానాది కాలనీ వాసులు అన్నారు. ఈ నేపధ్యంలో నగర పాలక సంస్థ అధికారులు ఎలా అడుగు ముందుకు వేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కందారపు మురళి, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సిపిఐ నాయకులు పెంచలయ్య, రాధాకృష్ణ, నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు శ్రీదేవి, వైసిపి నాయకులు రాజేంద్ర, శాంతి తదితరులు పాల్గొన్నారు.

హత్యకేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
పీలేరు: పీలేరు మండల పరిధిలోని బసిరెడ్డిగారిపల్లె తాండాలో మూడే రెడ్డి నాయక్ (30) ఈనెల 11వ తేదీన గ్రామ సమీపంలో అతి దారుణంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సిఐ నాగరాజు వెల్లడించారు. గురువారం ఉదయం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిఐ నాగరాజు మాట్లాడుతూ రెడ్డి నాయక్‌ను హత్యచేసిన అదే గ్రామానికి చెందిన నాగేంద్ర నాయక్, కిషోర్ నాయక్, బాలకృష్ణ నాయక్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గురైన రెడ్డినాయక్ గతంలో అదే గ్రామానికి చెందిన నాగేంద్ర నాయక్ భార్య రెడ్డెమ్మ తన కామవాంఛ తీర్చలేదని గ్రామ సమీపంలో ఉన్న మామిడితోటలో ఆవులకు కట్టే తాడుతో ఉరివేసి అత్యంత కిరాతకంగా 2015లో హత్యచేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలో నిందితుడైన రెడ్డినాయక్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపగా గత కొద్దిరోజుల క్రితం అతడు బెయిలుపై విడుదలై కలకడ మండలం వెనుగొండపల్లె గ్రామంలో కాపురం ఉంటూ కోర్టు వాయిదాలకు హాజరయ్యేవాడని తెలిపారు. అక్కడ కూడా పశువులు, మేకలు, చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవాడని, అక్కడ కూడా బతకలేక తన స్వగ్రామమైన బసిరెడ్డిగారిపల్లి తాండ గ్రామానికి గత కొద్దిరోజుల క్రితం కాపురాన్ని మార్చాడని పేర్కొన్నారు. తన భార్యను హతమార్చిన రెడ్డినాయక్‌ను ఒక పథకం ప్రకారం ఈనెల 11వ తేదీ ఉదయం నాగేంద్రనాయక్ తన బంధువులైన కిషోర్‌నాయక్, బాలకృష్ణ నాయక్‌లతో కలిసి బండరాయి, రోకలిబండతో కొట్టి అత్యంత దారుణంగా హత్యచేశారని సిఐ వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించగా, న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించినట్లు సిఐ నాగరాజు, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

టిటిడి ఇఓ తీరుకు నిరసనగా నేడు భారీ ఆందోళన
* సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: టిటిడి పాలన గాడితప్పిందని, ఇందుకు నిరసనగా శుక్రవారం తిరుపతి టిటిడి పరిపాలనాభవనం ముందు భారీ ఎత్తున నిరసన తెలియచేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి స్పష్టం చేశారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టిటిడి సంస్థలో ముగ్గురు ఐఎఎస్‌లు, ఒక ఐపిఎస్‌తో పాటు పలువురు మేధావులైన సీనియర్ అధికారులు ఉన్నా, సంస్థలో పాలన తీరు మాత్రం గాడితప్పుతోందన్నారు. ఇందుకు కారణం పాలకుల మెప్పు పొందేందుకు టిటిడికి డిప్యుటేషన్‌పై వచ్చే అధికారులు తీసుకునే నిర్ణయాలేనని ఆరోపించారు. భక్తులు ఎంతో భక్తి విశ్వాసాలతో సమర్పించిన సొమ్ముద్వారా టిటిడి సిబ్బంది జీతభత్యాలు పొందుతున్నారన్నారు. అయితే భక్తుల సొమ్ము తింటున్నామన్న ఆలోచనగానీ, ఉద్యోగులు, కార్మికులు కష్టపడితే టిటిడికి ప్రతిష్ఠ పెరుగుతుందన్న వాస్తవాన్ని గుర్తెరగని రీతిలో టిటిడి ఉందన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల నుంచి విమర్శలు వచ్చిన వెంటనే తిరిగి తమ నిర్ణయాలను ఉపసంహరించుకోవడం టిటిడిలో పరిపాటిగా మారిందన్నారు.ఇటీవల వెండివాకిలి వద్ద 50లక్షల వ్యయంతో ఇనుప మెట్ల ఏర్పాటు చేసి భక్తులనుంచి విమర్శలు రావడంతో ఉపసంహరించుకున్నారన్నారు. భక్తులు హుండీలో సమర్పించిన రూ.25 కోట్ల పాత నోట్లను మార్చుకోకుండా గాలికొదిలేశారన్నారు. తిరుమలలో మఠాలు ఒక మాఫియాలా తయారైనా పట్టించుకునే నాథుడే కరవయ్యాడన్నారు. దర్శన విధానాలు కూడా అస్తవ్యస్తంగా తయారుచేశారని, నడకదారి భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు రద్దుచేయాలని భావించారని విమర్శలు రావడంతో భక్తుల సంఖ్యను కుదించారన్నారు. దీంతో ముందు వచ్చిన భక్తులకు మాత్రమే దివ్యదర్శనం లభిస్తుందన్నారు. వికలాంగులు, నడవలేని వారికి సులభ దర్శనం కల్పించాల్సిన టిటిడి అధికారులు వారికి దర్శనం కల్పించే మార్గాలను దూరంగా ఏర్పాటుచేయడం ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు. అందులోనూ కేవలం 750 మందికి మాత్రమే టిక్కెట్లు కేటాయించడం దారుణమన్నారు. సామాన్యులు స్వామి దర్శనం కోసం నానా కష్టాలు పడుతూంటే విఐపిలకు 1500 మందిని అనుమతించడం ఏమేరకు సబబన్నారు. అందుకే విఐపిలకు కూడా ఆన్‌లైన్ విధానం ఎందుకు ప్రవేశపెట్టకూడదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిఐటియు నేత సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు
తిరుపతి: తిరుపతిలో గురువారం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలు నిఘా నీడలో ప్రశాంతంగా ముగిసాయి. ఈ పరీక్షలకు 810 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 1 గంటల వరకు జరిగిన పరీక్షలకు హాజరుకావడానికి అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షాకేంద్రానికి వచ్చారు. సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన వారు కొంత ఇబ్బంది పడ్డారు. ఎపిపిఎస్‌పి విధించిన నిబంధనల ప్రకారం పరీక్షలు రాయడానికి వచ్చిన అభ్యర్థులు ఎలాంటి వస్తువులు పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లకుండా పోలీసులు నిలువరించారు. ఈ పరీక్షలను ఎపిపిఎస్‌పి అదనపుకార్యదర్శి సుబ్రహ్మణ్యం శర్మ, రామ్‌గోపాల్, సెక్షన్ అధికారి మూర్తిలు పర్యవేక్షించారు. డిఆర్‌ఓ రజియాబేగం ప్రతి పరీక్షా కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

విఐపి టిక్కెటు తీయిస్తానని రూ.20వేలతో ఉడాయించిన దళారి
* సిసి పుటేజ్‌ని పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని విఐపి దర్శనంలో దర్శించుకునేందుకు జెఇఓ కార్యాలయంలో అనుమతి తీయిస్తానని కరీంగనగర్‌కు చెందిన హేమంత్‌కుమార్ గుప్తా అనే భక్తుడిని నమ్మించి ఓ దళారి రూ.20వేలు తీసుకొని ఉడాయించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈసందర్భంగా గుప్తా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదుచేశారు. జెఇఓ కార్యాలయం వద్ద ఉన్న సిసి కెమెరాల పుటేజ్‌లను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. జెఇఓ కార్యాలయం వద్దే ఇలాంటి ఘరానా మోసం జరగడంపై పలువురు విస్మయం చెందుతున్నారు.

వైభవంగా కల్యాణోత్సవం
శ్రీకాళహస్తి: ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీకాళహస్తిలో శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని విజ్ఞానగిరిపై ఉన్న కుమారస్వామి ఆలయం వద్ద ఉన్న వినాయక మండపంలో కల్యాణోత్సవం జరిగింది. అలంకరించిన ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యులు, ఇఓ భ్రమరాంబ, భక్తులు పాల్గొన్నారు.

రైతులు పంట కుంటలపై మక్కువ చూపాలి
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచన
బంగారుపాళ్యం: రైతులు భూగర్భ జలాలు పెంపు కోసం నిర్దేశించిన పంట కుంటల తవ్వకం పట్ల మక్కువ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న రైతులకు సూచించారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని 170-గొల్లపల్లి, గౌరీశంకరపురం వద్ద ఎక్స్‌ప్రెస్ హైవే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి, గౌరీశంకరపురం రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ పంటల సాగుపై ఆరా తీసారు. ఈసందర్భంగా పలువురు వరి పంటను సాగు చేస్తున్నామని కలెక్టర్‌కు వివరించారు. అయితే తక్కువ నీటితో ఎక్కువ లాభాలు వచ్చే పంటల పట్ల రైతులు దృష్టి సారించాలన్నారు. కరవును జయించాలంటే భూగర్భ జలాలు పెంచుకునేలా అందరూ చర్యలు తీసుకోవాలని ఇందుకు ప్రభుత్వం నిర్దేశించిన పంట కుంటలను నిర్మించుకోవాలన్నారు. అలా తవ్వుకోవడం వల్ల నీటి మట్టం పెరగడంతో పాటు కరవును అధిగమించి పంటలు ఎండిపోకుండా కాపాడుకొనే అవకాశం ఉందన్నారు. తదుపరి ఎక్స్‌ప్రెస్ హైవే పనుల తీరుతెనె్నలను అధికారులు సమీక్షించారు. అనంతరం శ్రీ మొగిలీశ్వరాలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జెసి గిరిషాలకు పట్టు వస్త్రాలు కప్పి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ మురళి, డిప్యూటీ సర్వేయర్ రామ్మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

699 జిఓపై వెంకన్న భక్తుల విజయం
* తుడాకు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు స్టే
* అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలుచేసిన నవీన్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: వెంకన్నకు సంబంధించిన రూ.10కోట్ల నిధులను తుడాకు అందించాలని ప్రభుత్వం జారీచేసిన 699 జిఓ సమంజసం కాదంటూ హైకోర్టు జిఓను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని హర్షిస్తూ రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అలిపిరి వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వెంకన్న భక్తుల విజయమన్నారు. శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టిందన్నారు. బుధవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాని జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం టిటిడి నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకునే అధికారం, హక్కు దేవాదాయ శాఖకు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలిపారు. అందుకే వెంకన్నకు అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశామన్నారు. గత 5 నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి సొమ్ముకు సంబంధించి 3 జిఓలను విడుదల చేసిందన్నారు. హిందూ ధర్మరక్షణ అనే పేరుతో ఉన్న ప్రైవేటు ట్రస్టుకు యేడాదికి రూ.6కోట్లు, అనకాపల్లిలో ఓ ప్రైవేటు ఆలయ స్థల కొనుగోలుకు రూ.5కోట్లు, హైవేరోడ్డు పనులకు రూ.10 కోట్లు ఇవ్వాలని జిఓను విడుదలచేసిందన్నారు. శ్రీవారి సొమ్ము దుర్వినియోగంపై హైకోర్టు అక్షింతలు వేయడం హర్షణీయమన్నారు. ఇప్పటికైనా టిటిడి అధికారులు శ్రీవారి సొమ్మును పరిరక్షించడానికి కంకణ బద్దులు కావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చిన్న, నందగోపాల్, రాజగోపాల్, కేశవ, అమర్, అన్సర్, కృష్ణారెడ్డి, బాబు, కిరణ్‌కుమార్, ఉమాశంకర్, ప్రసన్న, వెంకట తదితరులు పాల్గొన్నారు.

కోదండరామస్వామి ఆలయంలో ఉట్లోత్సవం
తిరుపతి: తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం కృష్ణస్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి బంగారు పల్లకిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా ఈనెల 19న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని కోదండరామ ఆలయంలో సీతారామ కల్యాణాన్ని ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు టిటిడి పిఆర్వో డాక్డర్ తలారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 చెల్లించిన గృహస్తులను కల్యాణానికి అనుమతిస్తారని చెప్పారు.