అనంతపురం

పాడి రైతులకు అండగా ఉంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ: ఊరూర పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటుచేసి పాడి రైతులకు అండగా ప్రభుత్వం వుంటుందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమం, సెర్ఫ్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గురువారం మంత్రి నివాసంలో డిఆర్‌డిఏ(వెలుగు), వ్యవసాయం, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో 5 ఎకరాలను గుర్తించి నీటి వసతి కలిగిన రైతులను గుర్తించి మహిళ సంఘాలకు ఎకరాకు 15వేలు లీజుకు ఇచ్చి మహిళా సంఘాల ద్వారా పశుగ్రాసాన్ని పెంచి కిలో 1 రూపాయి చొప్పున అవసరమున్న వారందరికీ అదే పంచాయతీ పరిధిలో అమ్మకాలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనివలన పా ల ఉత్పత్తి పెంచడంతోపాటు కరవులో పశువులను అమ్ముకోకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మిగ తా గుర్తించిన ఎకరాలకు సంబంధించిన రైతుల నుండి అగ్రిమెంటు తీసుకుని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో కార్యక్రమాన్ని అమలుచేయాలని డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లును మంత్రి ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు ప్రత్యేకంగా ఒక పశు వైద్యాధికారిని డిప్యూటేషన్‌పై తీసుకోవడం జరిగిందన్నారు. రాబోయే కాల ంలో అవకాశమున్న ప్రతిచోటా పశువులను పెంచుకునే రైతులకు చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశెనగ, ఇతర పంటలను సకాలంలో చేయలేకపోయిన రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు రైతుల వెసులుబాటు కోసం ప్రభుత్వం ఉచితంగా ప్రత్యామ్నాయంగా విత్తనాలు అందించుటకు అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి శ్రీరామ్మూర్తి, ఎస్‌ఇ హరేరామ్ నాయక్, ధర్మవరం హౌసింగ్ ఇఇ శేషుబాబు, డిఇ మహబూబ్ బాషా పాల్గొన్నారు.
అటవీ విస్తీర్ణం పెంచాలి
* కలెక్టర్ వీరపాండ్యన్
అనంతపురం సిటీ: 2019 నాటికి జిల్లాలో 50 శాతం అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా కలెక్టర్ జి.వీరపాండ్యన్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో వనం-మనం ఉద్యమ కార్యక్రమంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా వనం-మనం కింద 2029 నాటికి రాష్ట్ర భూ భాగంలో 50 శాతం అడవి, చెట్లను విస్తరింప చేయాలన్న ఉద్దేశ్యంతో జూలై 1వ తేదీ నుండి వన మహోత్సవ కార్యక్రమాన్ని సిఎం ప్రారంభిచారని, అది నవంబర్ మొదటి శనివారంతో ముగుస్తుందన్నారు. ఇందులో భాగంగా మొక్కల పెంపకం, ప్రకృతి పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 1,98,931 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉండగా, ఇది జిల్లా భూ భాగంలో 10.39 శాతం మాత్రమేనన్నారు. ఈ విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాల్సి వుందన్నారు. జిల్లాలో లక్ష్యాన్ని సాధించేందుకు ఏడాదికి 60 వేల హెక్టార్ల చొప్పున 6 లక్షల హెక్టార్లలో మొక్కల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఏడాదికి వెయ్యి హెక్టార్ల చొప్పున 1003 గ్రామ పంచాయతీల్లో పదేళ్లకు నూరు వేల హెక్టార్లలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాల్సిందిగా డిపిఓ సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. హార్టికల్చర్ శాఖ కింద 7500 హెక్టార్ల చొప్పున 75 వేలు, వ్యవసాయ శాఖ ద్వారా 4వేల హెక్టార్ల చొప్పున 40 వేల హెక్టార్లలో అటవీ భూములు విస్తీర్ణానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా ఆదేశించారు. అలాగే పిహెచ్‌సిల్లో, పాఠశాలల్లో, జూనియర్, డిగ్రీ కాలేజిల్లో, ఎస్సీ, బిసి, గిరిజన, మైనార్టీ హాస్టళ్లలో, పరిశ్రమల్లో, చెరువుగట్టు, దేవాలయాల్లో కచ్చితంగా మొక్కలు పెంపకాన్ని చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు కావాల్సిన మొక్కలను అటవీ శాఖ సరఫరా చేయాలన్నారు. వనం-మనంలో భాగంగా చైతన్యం పెంపొందించేందుకు ప్రకృతి పిలుస్తోంది పేరుతో ప్రతి శనివారం ర్యాలీలను నిర్వహించాలని మండల, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి టికె.రమామణి, జెసి-2 సయ్యద్‌ఖాజామొహిద్దీన్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్వర్, డిఎఫ్‌ఓ చంద్రశేఖర్, సోషల్ ఫారెస్ట్రీ, డిఎఫ్‌ఓ వెంకటరమణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
19 నుంచి సత్యసాయి జాతీయ వైద్య సమ్మేళనం
* హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు
పుట్టపర్తి: సత్యసాయి సన్నిధి ప్రశాంతి నిలయంలో ఈ నెల 19, 20వ తేదీల్లో జాతీయ వైద్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ట్రస్టు వర్గాలు వెల్లడించారు. 4 వేల మందికి పైగా వైద్యులు, పారా మెడికల్ సిబ్బ ంది, సేవా సభ్యులు పేదలకు, రోగులకు విశేష సేవలు అందించినట్లు తెలిపారు. దేశంలో 20 రాష్ట్రాల్లో 20 లక్షల మందికి పైగా వైద్యసేవలందించామన్నారు. 20,951 మెడికల్ క్యాంపులు, 7464 సింగిల్ డాక్టర్ల మెడికల్ సర్వీసులు, 982 వెటర్నరీ వైద్యసేవలు, 22,36,201 మంది రోగులకు చికిత్సలు, వైద్యసేవలు అందించడం జరిగిందన్నారు. 5 లక్షల మందికి పైగా సేవాదళ్ వలంటీర్లు సమాజ సేవలు అందించడం జరుగుతోందన్నారు. సత్యసాయి సేవా సంస్థలు 5 ఖండాల్లో మొత్తం 120 దేశాల్లో వ్యక్తిగత, సామాజిక సేవలను నిర్వహిస్తున్నాయన్నారు. సోషియోకేర్, మెడికేర్, ఎడ్యుకేర్ సత్యసాయి బాబా స్ఫూర్తితో లక్షలాది మందికి దాహార్తిని తీర్చడం, అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఖరీదైన ఉచిత వైద్యం, కేజి నుండి పిజి వరకు విలువలతో కూడిన ఉచిత విద్యను అందించడం వంటి విశిష్ట సేవలను సత్యసాయి సంస్థలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా జాతీయ వైద్య సమ్మేళనంలో వివిధ విభాగాలకు చెందిన 1500మంది వైద్య నిపుణులు పాల్గొని వారివారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ సి.వేణుగోపాల్, పద్మశ్రీ డాక్టర్ వి.మోహన్, డాక్టర్ అజిత్ మల్లాధరి, డాక్టర్ జెఎన్‌ఎన్.మూర్తి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విభాగ ం సైంటిస్ట్ శ్రీమతి కవితా నారాయణ్, భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ మహేంద్రసింహ చౌహాన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ ఏవి.శ్రీనివాసన్, పేరెన్నికగన్న వైద్య నిపుణులు సమ్మేళనంలో పాల్గొంటారన్నారు.
ప్రత్యామ్నాయ పంటల విత్తన పంపిణీకి ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం : జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ జెడిఎ శ్రీరామమూర్తి తెలిపారు. గురువారం స్థానిక జెడిఎ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యామ్నాయ విత్తనాలు చేరగానే పంపిణీ చేపట్టేందుకు వీలుగా డివిజన్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, బయో మెట్రిక్ ఆధారంగా పారదర్శకంగా అర్హులైన, అవసరమైన ప్రతి రైతుకూ విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు భారీ సబ్సిడీతో పాటు ఉచితంగా మొత్తం 11 రకాల విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందని, ఇందుకోసం రూ.86.51 కోట్లు రాష్ట్రంలో ఏ జిల్లాకు ఖర్చు చేయనంత మొత్తం నిధుల్ని కేటాయించిందని తెలిపారు. కనుక అత్యంత జాగ్రత్తగా పంపిణీ ప్రక్రియ కొనసాగించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, నాణ్యత లేని వాటిని వెనక్కు పంపే ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. ఈ సమావేశంలో డిడిఎ (అగ్రానమి) శ్రీనివాసరావు, ఎపి సీడ్స్ మేనేజర్ రెడ్డప్పరెడ్డి, ఎడి ఎ (పిపి) జి.విద్యావతి, జెడిఎ కార్యాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ (టెక్నికల్) పి.వెంకటేశ్వరరావు, జిల్లాలోని విత్తన కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మెడికో ఆత్మహత్య
* ఒత్తిడి జయించలేకే అఘాయిత్యం..
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం : ‘ఈ ప్రపంచాన్ని జయించలేక పోతున్నా.. అమ్మానాన్నా నన్ను చదువుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించారు.. కానీ రాణించలేక పోతున్నా.. ఇక ఈ సమాజంలో నేను మనుగడ సాగించలేను.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు..’ అంటూ ఓ వైద్య విద్యార్థి సూసైడ్ నోట్ రాసి మెడికో విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతున్న యశ్వంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చంద్రశేఖర్ టీచర్, తల్లి సుమతి పాలిటెక్నిక్ లెక్చరర్. వీరికి యశ్వంత్‌తోపాటు కుమార్తె ఉన్నారు. హిందూపురానికి వీరు పిల్లలిద్దరినీ ఎంబిబిఎస్ చదివించాలని ఆశ పడ్డారు. ఈమేరకు యశ్వంత్ ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడంతో ఎంసెట్ రాయించారు. మంచి మార్కులతో అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ ఫ్రీ సీటు లభించింది. కుమార్తెను విజయవాడలో లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు పంపారు. ఈనేపథ్యంలో యశ్వంత్‌కు ఈనెల 8 నుంచి ఎంబిబిఎస్ ప్రథమ సంవత్సరం థియరీ పరీక్షలు మొదలయ్యాయి. బయోకెమిస్ట్రీ, అనాటమి పేపర్ 1, పేపర్ 2, ఫిజియాలజీ పేపర్ 1 పరీక్షలు పూర్తయ్యాయి. వీటిలో అనాటమీ పేపర్ 2 సరిగా రాయలేదని యశ్వంత్ మనస్తాపానికి గురయ్యాడు. విషయం తెలిసి తండ్రి చంద్రశేఖర్ రెండు రోజుల క్రితం కళాశాలకు వచ్చి కుమారుడికి ధైర్యం చెప్పాడు. గురువారం ఫిజియాలజీ పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంది. అయితే అనాటమీ పరీక్ష సరిగా రాయలేదని యశ్వంత్ కుంగిపోయాడు. దీంతో తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చలేనన్న ఆవేదన చెందాడు. ఈనేపథ్యంలో ఆత్మకూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెడికల్ కళాశాలలోని బాయ్స్ హాస్టల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, హాస్టల్ కేర్ టేకర్‌కు చెప్పి బైకులో బయటకు వచ్చాడు. అయితే గురువారం ఉదయం నగరంలోని రహమత్‌నగర్ సమీపంలోని రైలు పట్టాలపై పడి శవమై తేలాడు. స్థానికుల సమాచారంలో విచారణ చేసిన పోలీసులు మృతుడు ఎంబిబిఎస్ విద్యార్థి యశ్వంత్ అని గుర్తించారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన అనంతరం బైకును లక్ష్మీనగర్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓచోట పార్క్ చేసి, దగ్గర్లోని రహమత్ నగర్ వద్ద రైల్వే పట్టాలపైకి వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బైకులో ఉన్న బ్యాగులోని మెడికల్ పుస్తకాల ఆధారంగా మృతుడు యశ్వంత్ అని పోలీసులు నిర్ధారించారు. అలాగే అతను రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు విగత జీవుడైన కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘చదువుకోలేక పోయినా పర్వాలేదు.. ఎందుకు ఇంత పని చేసుకున్నావు నాన్నా..’ అంటూ తల్లిదండ్రులు కొడుకు మృతదేహంపై పడి రోదించిన తీరు కలచివేసింది. ‘నిన్ను ఎంతో ఉన్నతంగా చూడాలనుకున్నామే.. ఇలా మాకు దూరమవుతావని ఊహించలేదంటూ’ గుండెలవిసేలా రోదించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదాలు నివారించండి..
* కలెక్టర్ జి.వీరపాండ్యన్
అనంతపురం సిటీ: జిల్లాలో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్సు హాల్‌లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతలో భాగంగా ఆ రోడ్డును నిర్మించే అవసరమైన రహదారుల సూచనలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌హెచ్-44 జాతీయ రహదారిలో కల్లూరు, ఇల్లూరు మధ్యన, గార్లదినె్న, అమ్మవారిపల్లె, పాలసముద్రం, కోడూ రు జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి మధ్యనున్న డివైడర్లను పగలగొట్టి తాత్కాలికంగా రోడ్డును క్రాస్ చేసే చర్యలను అరికట్టాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పెట్రోల్‌బంకుల వద్ద వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆటో డ్రైవర్ కుడివైపు గ్రిల్ ఏర్పాటుచేయడంతోపాటు వెనుకవైపు ఎవరూ కూర్చోకుండా మూసివేయడం ద్వారా ఓవర్‌లోడ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని డిటిసి సుందర్ కలెక్టర్‌కు విన్నవించగా ఒక నెల రోజులు డ్రైవర్లకు పూర్తి అవగాహన కల్పించి అనంతరం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య కొంతమేర పెరిగిందని, మృతుల సంఖ్య బాగా తగ్గిందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా మోటార్ బైకు నడిపే విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారి తల్లిదండ్రులను ఇటువంటి సమావేశాలకు ఆహ్వానించాలన్నారు. రాత్రివేళ్లలో వాహనాలను ఆపి ముఖం కడుక్కొని వెళ్లాలని అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్‌పి కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌ఒ డా.వెంకటరమణ, డిఎస్‌పిలు, ఆర్ అండ్ బి అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన
* అగ్నిమాపక శాఖ అధికారి పివి.రమణ
అనంతపురం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మాత్తుగా జరిగే అగ్నిమాపక ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని అగ్నిమాపక అదనపు డైరెక్టర్ పివి రమణ పేర్కొన్నారు. గురువారం స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో జిల్లా అగ్నిమాపక అధికారి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు జిల్లాలోని అన్ని ఫైర్ స్టేషన్ల ఆఫీసర్లుతో ఆయన ప్రమాదాలపై జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, ఫైర్ స్టేషన్లకు సంబందించిన బిల్డింగ్స్, ప్రమాదాలపై స్పందించే విధానాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫైర్ స్టేషన్ల పరిధిలో అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, బోరు బావిల్లో, గుంతల్లో, ఇళ్లల్లో జరిగే గ్యాస్ లీకేజీ ప్రమాదాలు జరిగినప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలనే విధానాన్ని సిబ్బందితో అన్ని గ్రామాలు, స్కూల్స్‌లోను అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఫైర్ స్టేషన్‌కు ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటుచేసి వారికి నూతన టెక్నాలజీతో శిక్షణను ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ టాస్క్ఫోర్సులో ఉన్న వారు బోరు బావిల్లోను, రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్న, ఇతర అత్యంత సమస్యాత్మక ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడే విధంగా శిక్షణను ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3వేల మంది సిబ్బందిలో వెయ్యి మందికి ఈ శిక్షణను ఇస్తున్నామని తెలిపారు. ర్యాపిడ్ డిఫెన్స్ ఫోర్సును అడ్వాన్స్ టెక్నాలజీపై శిక్షణను ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాపిడ్ డిఫెన్స్ ఫోర్సు ద్వారా ఎలాంటి ప్రమాదాన్ని అయినా వీరు టెక్నాలజితో త్వరితగతిన ప్రజలను కాపాడేందుకు రిస్క్ చేసే విధంగా తయారుచేస్తున్నామని తెలిపారు. అలాగే ఫైర్ స్టేషన్లును ఆధునీకరణ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలియజేసారు. 2016లో జిల్లాలో 902 ఫోను కాల్స్ వచ్చాయని, 2017 సంవత్సరంలో ఇప్పటివరకు 494 ఫోన్ కాల్స్ అందాయని, దీంతో అవగాహన కార్యక్రమాలతో ప్రజలు తమను తాము కాపాడుకుంటున్నారని తెలిపారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోను మరింతగా విస్తృతం చేసి ప్రజలకు అవగాహన పెంపొందిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ, డిప్యూటి ఫైర్ ఆఫీసర్ శ్రీ్ధర్, ఇతర ఫైర్ స్టేషన్ల అధికారులు, ఎస్‌ఎఫ్‌ఓలు, మెన్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘పురం’ మున్సిపల్ కమిషనర్ బదిలీ
హిందూపురం టౌన్ : హిందూపురం మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ బదిలీ అయినట్లు సమాచారం. కొంతకాలంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్‌ల నడుమ తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మూడు, నాలుగు నెలలుగా అదిగో, ఇదిగో అంటూ బదిలీ ఉత్తర్వులు అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్‌ను తిరుమల, తిరుపతి డిప్యూటీ ఇఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే తిరుపతి నగర పాలక సంస్థలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మిని హిందూపురం మున్సిపల్ కమిషనర్‌గా నియమించినట్లు సమాచారం. గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథ్ 11 నెలల పాటు ఇక్కడ పనిచేశారు.
మూడు రోజులుగా కరెంట్ కోత..
* స్పందించని విద్యుత్ అధికారులు
* తిప్పయ్యగారిపల్లి వాసుల ఆగ్రహం
నల్లమాడ: గ్రామంలో అందరూ కలిసికట్టుగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటున్నాము. గత మూడు రోజులుగా విద్యుత్ సప్లై సరిగ్గా లేదు. ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అంటూ కరెంటోళ్లు కాలయాపన చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఊరిలో ఏ ఒక్క ఇంటిలో కూడా వంట చేయకూడదు. అందరూ ఆలయం వద్దకే వచ్చి భోం చేయాలని చాటింపు వేశాము. అందరి ఇళ్లకూ బంధువులూ వచ్చారు. విద్యుత్ సప్లై లేకపోతే ఎలా అంటూ మండలంలోని తిప్పయ్యగారిపల్లివాసులు నల్లశింగయ్యగారిపల్లి సబ్ స్టేషన్ వద్దకు వచ్చి గురువారం రాత్రి 9గంటల సమయంలో నిరసన వ్యక్తం చేశారు. సుమారు 2 గంటలపాటు సబ్ స్టేషన్ వద్దే పడిగాపులుగాసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఇలాగైనా అధికారుల్లో చలనం వస్తుందేమోనని ఇబ్బందైనా ఆ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా లేకుండా చేశారు. జిల్లా అధికారులకూ ఫోన్ ద్వారా సమస్యను వివరిస్తే అప్పుడు మండల విద్యుత్ అధికారులు పరుగులు తీస్తూవచ్చి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించారు. దీంతో తిప్పయ్యగారిపల్లి వాసులు ఆనందంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను సజావుగా చేసుకున్నారు.

పాముకాటుతో వ్యక్తి మృతి
రామగిరి: మండలంలోని ఏడుగుర్రాలపల్లి గ్రామంలో మాదిగ ముత్యాలు(42) పాముకాటుతో గురువారం ఉదయం మృతి చెందాడు. బుధవారం రాత్రి తన పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లి తన కొడుకు హేమంత్‌తో కలిసి అక్కడే నిద్రించాడు. ఆ సమయంలో ఏదో కాలికి కుట్టినట్లు కావడంతో వెంటనే కళ్యాణదుర్గం ఆర్‌డిటి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చూసి వెంటనే అనంతపురంకు తీసుకెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ మోహన్‌నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రిపై కేసు నమోదు చేయాలి
* ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంఎస్.రాజు
అనంతపురం కల్చరల్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంఎస్.రాజు డిమాండ్ చేశారు. గురువారం డిఎస్పీ మల్లికార్జున వర్మను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ దళితులపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీని విషయమై బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. మంత్రిపై కేసు నమోదు చేయాలని డిఎస్పీని కోరారు. మంత్రి దళితులకు క్షమాపణ చెప్పాలని అంతవరకు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా నేడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నపెద్దన్న, చిరంజీవి, నరసింహులు, రామాంజినేయులు, నాగరాజు పాల్గొన్నారు.
22న అడ్వైజరీ బోర్డు సమావేశం
అనంతపురం సిటీ: ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించబడుతుందని ఐఏబి ఛైర్మెన్, కలెక్టర్ జి.వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18 సంవత్సరానికి టిబిపిహెచ్‌ఎల్‌సి ద్వారా జిల్లా తాగునీటి అవసరాలు, సిబిఆర్‌కు నీటి విడుదల, మిడ్ పెన్నార్ డ్యాంలో నీటిని నింపడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
అనంతపురం సిటీ: జిల్లాలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఇఓ పి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయునిగా కనీసం 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలని, దరఖాస్తుతోపాటు వారు విద్యారంగానికి చేసిన కృషిని ప్రతిబింబించు రుజువులను సమగ్ర చిత్రాలు కూడా జత చేయాలని తెలిపారు. ఆసక్తి ఉండి జిల్లాలో ప్రస్తుతం పనిచేయుచున్న, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల నుండి ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.