నిజామాబాద్

ప్రతి విద్యార్థి టీకాలు వేయించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి: మూడు నెలల పాప నుండి 15 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి విద్యార్థి టీకాలు వేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ అన్నారు. కేంద్రంలో బ్రిలియంట్ పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెలూన్‌ను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాణాంతకమైన తట్టు వ్యాధి మిజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్‌లతో పూర్తిగా వ్యాధిని నివారించవచ్చని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ నెల 25 వరకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా ఎంఆర్ టీకాలను వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి సత్తయ్య, జిల్లా వైద్యాధికారి మధుశ్రీ, లయన్స్ క్లబ్ ప్రతినిదులు రమేశ్, కార్యదర్శి నిమ్మ దామోదర్‌రెడ్డి, గంగాధర్, సంతోష్‌కుమార్, రాజు, రాజన్న, శ్యాంగోపాల్‌రావ్, హరిదర్, హరికిషన్‌గౌడ్, పంపరి శ్రీనివాస్, మహేశ్‌గుప్తా, సునీల్‌కుమార్, రమేశ్, రాంరెడ్డి, చాట్ల రాజేశ్వర్, గంగాదర్ , బ్రిలియంట్ స్కూల్ యాజమాన్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులను కాపాడేందుకే ఎబివిపిపై ఎంపి కవిత బురద జల్లే ప్రయత్నం
కంఠేశ్వర్: నందిపేట మండలం ఐలాపూర్ జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో తన అనుచరులను కాపాడుకునేందుకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎబివిపిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విద్యార్థి పరిషత్ జాతీయ కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు రాఘవేందర్ ఆక్షేపించారు. పంద్రాగస్టు సందర్భంగా ఐలాపూర్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ యకీనుద్దీన్ షూ వేసుకుని జెండా ఎగురవేయడాన్ని తప్పుబడుతూ కొంతమంది యువకులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పూనుకున్న విషయం విధితమే. ఈ సంఘటనకు సంబంధించి ముస్లిం మైనార్టీ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇప్పటికే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రిన్సిపాల్ కావడం వల్ల ఆయన పట్ల ఎబివిపి కార్యకర్తలు కక్షతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఎబివిపి తీవ్రంగా ఖండించింది. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ, ఐలాపూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. యకీనుద్దీన్‌పై జరిగిన దాడితో ఎబివిపికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ జెండాకు వందనం చేయడం, ఎగురవేయడం, జాతీయ గీతం ఆలపించడం అనేవి భారతీయ పౌరులుగా మన కర్తవ్యమని గుర్తు చేశారు. డ్రెస్ కోడ్, పాదరక్షలు ధరించడం, ధరించకపోవడం అనేది అప్రాధాన్యమని, ప్రగతిశీల భావాలు కలిగిన ఎబివిపి ఈ అంశాలకు ఎంతమాత్రం ప్రాధాన్యత ఇవ్వదని అన్నారు. అయితే ఐలాపూర్ సంఘటననకు ఎంఐఎం మతం రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మరోవైపు వాస్తవాలను కప్పిపుచ్చి అసలైన నేరస్తులను కాపాడేందుకు ఎంపి కవిత ఎబివిపిపై నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ తరహా స్వార్ధ రాజకీయ చర్యలను ఎంతమాత్రం సహించబోమని అన్నారు. ఇప్పటికైనా ఎంపి కవిత కుట్రపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని, లేనిపక్షంలో కలెక్షన్ల పేరుతో ఆమె నడిపించే తతంగాలను బయటపెడతామని హెచ్చరించారు. విద్యారంగ సమస్యలపై కెసిఆర్ ప్రభుత్వం ఫ్లాప్‌షో నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత అలమటిస్తుంటే, సమస్యలను పక్కదారి పట్టించేందుకు తెరాస ప్రభుత్వం లేని సమస్యలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. ఐలాపూర్ సంఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించి నిజనిజాలను నిగ్గు తేల్చాలని, అసత్య కథనాలు ప్రసారం చేసిన ఛానెల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో ఎబివిపి జిల్లా కన్వీనర్ ఎ.రాకేష్, నగర ప్రముఖ్ జగన్మోహన్‌గౌడ్, జోనల్ ఇన్‌చార్జి ప్రవీణ్, శ్రీకాంత్, మల్లికార్జున్, సతీష్, చంటి తదితరులు పాల్గొన్నారు.

నిజంసాగర్‌లో స్వల్పంగా ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం నీరు లేక వెల వెల పోయింది. జలాశయం అంతానీరు లేక పోవడంతో పచ్చగడ్డితోదర్శనమిస్తుంది. మృగశిర కార్తే ప్రారంభమనప్పటి నుంచి సంమృద్థిగా వర్షాలు కురువక పోవడంతోపెద్దమొత్తంలోనీరు చేరక పోవడంతోరైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వరప్రదాయనిగా ఉన్న ప్రాజెక్ట్ ఆయకట్టుకింద , అడపా దడపా కురిసిన వర్షాలకు రైతులు వరి నారుమళ్లు వేసుకున్నారు. ప్రతి నిత్యం రైతులు ఆకాశం వైపు చూస్తు వరణ దేవున్ని ప్రార్థిస్తున్నారు. గత సంవత్సరం ఇదే తేదీన నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీరు లేక వెలవెల పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు లేక బండరాళ్ళ, పచ్చగడ్డితోప్రాజెక్ట్ దర్శన మిస్తోంది. వర్షాలు కురిస్తేనే తప్ప ఆయకట్టుకింద వేసిన పంటలు గట్టేకే అవకాశాలున్నాయని, వర్షంపైనే ఆదారపడి ఉన్నారు. ఈపాటికే వర్షాలు కురిస్తే వేసిన పంటలు చేతికి వస్తాయని, రైతులు వర్షం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1504.00 అడుగులు కాగా 1380.58 అడుగుల నీరు నిల్వఉంది. 17.802 టిఎంసిలకు గాను 1.410 టిఎంసిల నీరు నిల్వ ఉంది. మొన్నటి వరకు 600 క్యూసెక్‌ల నీరు ఇన్‌ఫ్లొరాగా, రెండు రోజులుగా వర్షాలు కరవక పోవడంతో, శుక్రవారం 60 క్యూసెక్‌ల ఇన్‌ఫ్లోమాత్రమే వచ్చి చేరుతోందని, ప్రాజెక్ట్ డీఈఈ దాత్తత్రి తెలిపారు.

సమన్వయంతో ఉత్సవాలను జరుపుకోవాలి
గణేష్ మండళ్ల నిర్వాహకులకు సిపి సూచన
ఇందూర్: వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండళ్ల నిర్వాహకులు విగ్రహాల వద్ద పలు జాగ్రత్తలు పాటించాలని, మండలి సభ్యులు సమన్వయంతో ఉత్సవాలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సిపి కార్తికేయ సూచించారు. శుక్రవారం నగరంలోని బస్వా గార్డెన్‌లో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని అన్ని గణేష్ మండళ్ల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, పండుగలను పురస్కరించుకుని వాట్స్‌ప్, ఫేజ్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతిమల ఏర్పాటు విషయంలో షెడ్డు నిర్మాణం, విద్యుత్ సరఫరా, వర్షం కురిస్తే నీరు లోనికి రాకుండా ఉండేలా, మంటపాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయంలో ఖచ్చితంగా కనీసం ఇద్దరు వ్యక్తులు మంటపాల పడుకునే విధంగా చూసుకోవాలని, రాత్రి 10గంటలు దాటిన తర్వాత మైక్‌సెట్‌లను ఆప్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం గణేష్ మంటపాల నిర్వాహకుల సలహాలు, సూచనలు, సమస్యలను విన్న సిపి కార్తికేయ, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తానని పేర్కొన్నారు. శాంతి కమిటీ సమావేశంలో ఎసిపిలు ఆనంద్‌కుమార్, శివకుమార్, కె.మోహన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ సిహెచ్.వెంకన్నతో పాటు సిఐలు, ఎస్‌ఐలు, గణేష్ మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

హిందువుల పట్ల వివక్షత
బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి
ఆర్మూర్: హిందువుల పట్ల, హిందు పండుగల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వినాయక ఉత్సవాలకు ఎలక్ట్రిసిటీ అనుమతి తీసుకోవాలని, మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని, డిజెలు పెట్టవద్దని, రాత్రి పూట మండపాల వద్ద నిద్రించాలంటూ ఇలా ఎన్నో ఆంక్షలు విధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ పండుగలను ప్రభుత్వమే నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని అన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు బట్టల పంపిణీ, విందులు, లైటింగ్, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తోందని, హిందువుల పండుగ అయిన వినాయక ఉత్సవాలకు ఆంక్షలు విధించడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే వినాయక ఉత్సవాలపై విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నందిపేట్ మండలం అయిలాపూర్ గ్రామంలో జరిగిన సంఘటనకు బిజెపి, ఇతర సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఎంఐఎం నేత ఆదేశాలపై స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు ఈ సంఘటనలో అమాయకులపై కేసులు పెట్టారని అన్నారు. రెంజల్ మండలం నీలాలో జరిగిన సంఘటనలో హిందువులపై కత్తితో దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్‌లో శనివారం నిర్వహిస్తున్న జాబ్‌మేళాలను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, నాయకులు నూతుల శ్రీనివాస్‌రెడ్డి, ద్యాగ ఉదయ్, ఆకుల శ్రీనివాస్, పూజ నరేందర్, ఆకుల రాజు, మందుల వీరబద్రీ, మందుల బాలకృష్ణ, బ్రాహ్మణ్‌పల్లి లింగన్న, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
కాంగ్రెస్ నాయకులు
ఆర్మూర్: అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చ పెడతారో టిఆర్‌ఎస్ నాయకులు తేది, సమయం చెప్తే వస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగామోహన్ చకృ, నర్మే నవీన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహమూద్‌అలీ, మండల అధ్యక్షుడు జీవన్‌లు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు, అతని సోదరుడికి లేదని అన్నారు. చోటా మోటా నాయకులు సురేష్‌రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు. లక్కంపల్లి సెజ్‌కు 120 కోట్ల రూపాయలను మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ద్వారా మంజూరు చేయించారని చెప్పారు. ఆర్మూర్ పట్టణ తాగునీటి పథకానికి 114 కోట్ల రూపాయలను మంజూరు చేయించారని, ఎర్రజొన్న రైతులను ఆదుకునేందుకు కృషి చేశారని, గుత్ప ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర అనేక ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయించిన ఘనత మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే కేవలం మాటలకే పరిమితం అయ్యాడని ఆరోపించారు. సిఎం కెసిఆర్ ఆర్మూర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేరలేదని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ఎర్రజొన్న రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఆర్మూర్ తాగునీటి పథకాన్ని సంవత్సరంలో పూర్తి చేసి నల్లాల నీళ్లిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించి మూడేళ్లు గడిచినా ఇంకా నల్లాల ద్వారా నీళ్లు రావడం లేదని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కమీషన్ల కోసమే డివైడర్లు నిర్మించారని ఆరోపించారు. మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారో తాము చర్చకు సిద్ధమని అన్నారు.

రూపన్‌వాలా కమిటీ రిపోర్టును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన
ఇందూర్: రోహిత్ వేముల మృతిపై ప్రభుత్వం నియమించిన ఎకె.రూపన్‌వాలా కమిటీ విచారణ జరిపి వెల్లడించిన నివేదికను వ్యతిరేకిస్తూ మానవ హక్కుల సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మానవ హక్కుల సంఘంతో పాటు పిడిఎస్‌యు, పివైఎల్, ఐఎఫ్‌టియు, ఎఐకెఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఫులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలను ప్రదర్శిస్తూ నిరసన చాటారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ, ఎకె.రూపన్‌వాలా రిపోర్టును తిరస్కరించాలని పిలుపునిచ్చారు. హెచ్‌సియులో పరిశోధక విద్యార్థిగా ఉన్న రోహిత్ వేముల గతేడాది ఆత్మహత్య చేసుకుంటే, రూపన్‌వాలా కమిటీ నివేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయనను మరోమారు హత్య చేసిందన్నారు. ఈ కమిటీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే నివేదిక తయారు చేసి అందించిందని ఆరోపించారు. రోహిత్ వేముల కులాన్ని కమిటీ తన పరిధిలోని అంశం కానప్పటికీ, కులాన్ని ప్రస్తావించిందని ఆక్షేపించారు. హెచ్‌సియు వి.సి అప్పారావును, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కాపాడేందుకే కమిటీ రిపోర్టును వారికి అనుకూలంగా రూపొందింపజేశారని ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ మేధావులు, ప్రజాస్వామికవాదులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కృష్ణగోపాల్‌రావు, జెవివి నాయకులు వివి.ప్రసాద్‌రావు, రాంమ్మోహన్‌రావు, ఎఐకెఎంఎస్ నాయకులు ఆకుల పాపయ్య, సరిత తదితరులు పాల్గొన్నారు.

నీటి మడుగులో పడి చిన్నారి మృతి
కామారెడ్డి రూరల్: మండలంలోని గర్గుల్ గ్రామానికి చెందిన శివరాత్రి సౌమ్య (2) అనే చిన్నారి నీటిమడుగులో పడి మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గర్గుల్ గ్రామానికి చెందిన సుజాత-లక్ష్మన్‌ల కుమార్తె సౌమ్య చిన్న పిల్లలతో ఆడుకుంటూ వెళ్ళి తమ అమ్మమ్మవాళ్ళ ఇంటికి మద్యలో ఉన్న నీటి మడుగులో పడి సౌమ్య మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మన్ దుబాయ్‌లో ఉంటున్నాడని తెలిపారు. శుక్రవారం ఉదయం నీటి మడుగులో కనిపించగా తల్లి సుజాత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.