చిత్తూరు

జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో రహదారుల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులను మలుపులు లేకుండా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేయాలన్నారు. చిత్తూరు-బెంగళూరు ఫోర్ లైన్, చిత్తూరు-నాయుడుపేట సిక్స్‌లైన్, మదనపల్లి-తిరుపతి ఫోర్‌లైన్ రోడ్లు పనులు త్వరగా అయ్యే విధంగా అధికారులు చొరవచూపాలన్నారు. భూసేకరణ పనులు పూర్తిచేసి, ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండి వాహనాలను నడపాలని తెలిపారు. ఈ సమావేశంలో జెసి గిరిషా, చిత్తూరు ఆర్‌డిఒ కొదండరామిరెడ్డి, తిరుపతి జాతీయ రహదారులు పిడి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
తిరుపతి: దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ వర్కర్స్‌గా పనిచేస్తున్న వారిని విద్యుత్ సంస్థలోనే విలీనం చేసుకుని వారిని శాశ్విత ఉద్యోగులుగా గుర్తించాలని ఏపి విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జెఏసి చైర్మన్ కాశీ మధుబాబు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో అత్యంత ప్రమాదకర ప్రదేశాలలో కాంట్రాక్ట్ కార్మికులు గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారని చెప్పారు. తమ ప్రాణాలను ఫణంగాపెట్టి విద్యుత్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో అకుంఠిత దీక్షతో 24 గంటల తాము పనిచేస్తున్నామన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తమ శాయశక్తులా పనిచేస్తున్నామన్నారు. విద్యుత్ రంగంలోని మూడవ పార్టీ కాంట్రాక్ట్ విధానంతో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్న చాలీ చాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకోలేక, తమ పిల్లలను చదవించుకోలేక, సరైన వైద్యం అందక దయనీయ స్థితిలో జీవితాలను అనుభవిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికులను శాశ్విత ఉద్యోగులుగా గుర్తించి మెరుగైన జీతాలు అందిస్తున్నారని, అలాగే ఏపిలోను తమను శాశ్విత ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో జెఏసి కన్వీనర్ ఎం.శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అవతారంలో భక్తులను మోసం చేసి దళారీ అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: పోలీస్ అవతారంలో భక్తులను నమ్మించి మోసం చేసిన ఓ దళారీని టిటిడి విజిలెన్స్ విభాగం శుక్రవారం తిరుమలలో అరెస్టు చేసింది. విజిఓ సదాశివ లక్ష్మి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులతో గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో తిరుపతికి చేరుకున్నాడు. ఈక్రమంలో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన హేమంత్ కుమార్ తాను వెంట తెచ్చుకున్న సిఫార్సు ఉత్తరంతో తిరుమల జెఇఓ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. వారాంతం కావడంతో సిఫార్సు ఉత్తరాలు స్వీకరించబడవని జెఇఓ కార్యాలయ సిబ్బంది హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో జెఇఓ కార్యాలయం వెలుపల చిత్తూరు చెందిన మధుశేఖర్ అనే దళారి అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ హడావుడి చేస్తూ కనిపించాడు. దీంతో మధుశేఖర్‌కు జెఇఓ కార్యాలయంలో పరపతి ఉంటుందని భావించిన హేమంత్ కుమార్ అతని వద్దకు వెళ్లి తనకు నాలుగు సుప్రభాతం టికెట్లు కావాలని తెలపడంతో రూ. 20 వేలు ఖర్చు అవుతుందని, తాను పోలీస్‌ను కనుక సుప్రభాతం టికెట్లు తీసివ్వగలనని నమ్మించాడు. దీంతో తన వద్ద ఉన్న రూ. 20 వేలు అతనికి ఇచ్చాడు. డబ్బు తీసుకున్న మధుశేఖర్ అక్కడ నుంచి పరారవడంతో బాధితుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం సిసి టివి ఫుటేజ్‌లను పరిశీలించి నిందితుడిని పట్టుకుని తిరుమల పోలీసులకు అప్పగించారు.

క్యాన్సర్ సోకిన బాలుడుకి రూ. 4లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన సిఎం
* రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడుకి ఘన స్వాగతం పలికిన టిడిపి నేతలు
రేణిగుంట: క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి ముఖ్యమంత్రి సహాయ నిధికింద రూ. 4లక్షలు నిధులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శుక్రవారం ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులను ఆయన పేరుపేరున పలుకరించారు. ఈసందర్భంగా ఓ మహిళ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కుమారుడికి ఆర్థిక సాయం అందించాలని ప్రార్థించింది. దీనిపై స్పందించిన ఆయన వెంటనే నాలుగు లక్షలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు అందించారు. అంతకుముందు విమానాశ్రయం వద్ద సిఎంను కలవడానికి వెళ్లిన తమపై డిఎస్పీ నంజుడప్ప అనుచితంగా ప్రవర్తించి బయటకు నెట్టేశారని టిడిపి సీనియర్ నాయకులు విలేఖరుల ముందు వాపోయారు. అలాగే జర్నలిస్టులను సైతం ఆయన పక్కకు నెట్టేయడంతో ఇబ్బందులు పాలయ్యారు. సిఎం అక్కడ నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనవడు వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోడ్డు మార్గాన వెళ్లారు. సిఎంకు స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే సుగుణమ్మ, తలారి ఆదిత్య, సత్యప్రభ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్, టిడిపి నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ నరసింహయాదవ్, నాయకులు డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో మార్పులు తెస్తాం
* త్వరలో శ్రీవారి ఆలయంలో ఆలయ స్వచ్ఛ సేవ
* జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడి
తిరుపతి: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత ఉన్నతమైన ప్రమాణాలతో అత్యుత్తమ సేవలు అందించేందుకు శ్రీవారి సేవ విభాగాల్లో నూతన మార్పులు తీసుకురాన్నుట్లు టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన శ్రీవారి సేవ విభాగంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ సంవత్సరం పొడవునా శ్రీవారి సేవకులు తమ తోటి భక్తులకు ఇతోధిక సేవలందిస్తున్నారని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 1500 మంది, విశేష పర్వదినాల సమయంలో 3వేల మందికిపైగా సేవకులు టిటిడిలోని వివిధ విభాగాల్లో వివిధ విభాగాల్లో విశేష సేవలు చేస్తున్నారని వివరించారు. పది మందికి తక్కువ కాకుండా బృందంగా ఏర్పడి ఆన్‌లైన్ ద్వారాగాని, ఉత్తరాల ద్వారాగాని సేవకు నమోదు చేసుకోవచ్చన్నారు. శ్రీవారి సేవకు అనుబంధంగా 2012, ఆగస్టు 17న పరకామణి సేవ, 2013 జనవరి 13న లడ్డూ ప్రసాద సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోను శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నట్లు చెప్పారు. టిటిడి అవసరాలకు తగ్గుట్లుగా సేవకులు రావాల్సి ఉందని, భవిష్యత్తులో శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని జెఇఓ శ్రీనివాసరాజు అన్నారు. ఆయా విభాగాల్లో శ్రీవారి సేవకులు ఎంతమంది అవసరమో గుర్తించి ఆమేరకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు త్వరలోనే శ్రీవారి ఆలయంలో ఆలయ స్వచ్ఛ సేవను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవకుల నుంచి ముందుగా అంగీకారం తీసుకుని ఈ సేవకు వినియోగిస్తామని, ఆరోగ్య శాఖాధికారిణి ప్రత్యక్ష పర్యవేక్షణలో వీరు ఆలయంలో సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. మరో మూడు నెలల్లో నూతన శ్రీవారి సేవాసదన్ భవనాన్ని ప్రారంభించి, సేవకులకు మరింత మెరుగైన బస కల్పిస్తామని, శిక్షణ కార్యక్రమాలు మెరుగుపరుస్తామని వివరించారు. ఈ సమావేశంలో టిటిడి డిప్యూటి ఇఓలు కోదండరామారావు, వేణుగోపాల్, వెంకటయ్య, ఝాన్సీ, హరీంద్రనాథ్, పిఆర్వో డాక్టర్ టి.రవి, విజిఓ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్ శాస్ర్తీ, గార్డన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవకుల నమోదు ప్రక్రియ ప్రారంభం
తిరుపతి: స్థానిక విష్ణు నివాసంలోని శ్రీవారి సేవ కార్యాలయంలో శుక్రవారం నుంచి కంప్యూటర్ ద్వారా శ్రీవారి సేవకుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు శ్రీవారి సేవకుల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేసేవారు. తిరుపతిలో సేవలందించిన తరువాత శ్రీవారి సేవకులు తిరుమలకు వెళ్లిన తరువాత తిరిగి నమోదు చేసుకునే అవసరం లేకుండా ఈ మేరకు టిటిడి కంప్యూటర్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

తాగునీటి ప్లాంట్ ప్రారంభం
తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆర్‌వో తాగునీటి ప్లాంట్‌ను ఉపకులపతి ఆచార్య వి.దుర్గ్భావానీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆర్‌ఓ సిస్టమ్ 1000 లీటర్లను గంటకి శుద్దిచేసి విశ్వవిద్యాలయానికి మినరల్ వాటర్‌ను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో రెక్టార్ ఉమ, రిజిస్ట్రార్ మమత, ఇంజనీరింగ్ విభాగం, రాజు, విఘ్నేష్, ఫౌండేషన్ తరపున రాజశేఖర్‌రెడ్డి, ప్రదీప్ పాల్గొన్నారు.

మతి స్థిమితం లేని యువతి ఆటోలో తరలింపు
* పోలీసులకు పట్టించిన విలేఖరి
రేణిగుంట: మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ యువతిని మద్యం సేవించిన ఇద్దరు యువకులు ఆటోలో ఎక్కించుకొని తరలిస్తుండగా గుర్తించిన ఓ విలేఖరి పోలీసులకు సమాచారం అందించి, ఆ ఇద్దరు యువకులను పట్టించిన సంఘటన గురువారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఆటోస్టాండ్ వద్ద మతి స్థిమితం లేని 24 సంవత్సరాల ఓ యువతి యాచకురాలుగా తిరుగుతుండగా జ్యోతినగర్‌కు చెందిన ఇద్దరు యువకులు మద్యం సేవించిన మత్తులో ఆ యువతికి మాయమాటలు చెప్పి బస్టాండ్‌వైపుకు తీసుకెళ్లి, అక్కడ నిలిపి ఉన్న ఆటోలో ఎక్కించి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ తంతును గమనించిన ఓ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదుచేశారు. ఎంతకూ పోలీసులు రాకపోవడంతో తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కానిస్టేబుళ్లను వెంటపెట్టుకొని సంఘటనా స్థలానికి తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, మతిస్థిమితం లేని యువతిని స్థానిక అభయక్షేత్రానికి తీసుకువెళ్లి వదలిపెట్టారు. మహిళల పట్ల ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా తరచూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడం హీనమైన చర్యగా, మతి స్థిమితం లేని ఓ యువతిపై అత్యాచారం జరగకుండా కాపాడిన విలేఖరిని రేణిగుంటలోని మహిళా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు అభినందించారు.

నేడు తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల రేడియాలజిస్టుల సదస్సు
తిరుపతి: దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రేడియాలజిస్టుల సదస్సు శని, ఆదివారం రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌ఐఏ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రేడియాలజిస్టులు హాజరవుతున్నట్లు తెలిపారు. అమెరికా, యుకె దేశాలకు చెందిన ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి ప్రముఖ రేడియాలజిస్టులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు.