హైదరాబాద్

వినాయక మండపాలకు జియోటాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా గణేశ మండపాలకు నూతన టెక్నాలజీతో భద్రత నిమిత్తం జియోటాగ్ (యాప్)ను అనుసంధానం చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. సిటీ మ్యాప్‌లో గణేశ మండపాలు ఉంటాయని, ప్రతి కదలికపై నిఘా ఉంటుందని కమిషనర్ చెప్పారు. శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, పెట్రోలింగ్‌పై సీనియర్ పోలీస్ అధికారులు గట్టి నిఘా పెడతారని, జియో, సిసిటివి, క్యూఆర్‌కోడ్ కాంబినేషన్‌లో భద్రత ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దని, ఎవరైనా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గణేశ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన మండప నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం, అన్ని శాఖల సమన్వయంతో పోలీసులు పనిచేస్తారని, గతేడాది 20వేలు, ఈ సారి 24 వేల పోలీస్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్టు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఆర్‌ఏఎఫ్, సిఆర్‌పిఎఫ్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లతో భద్రత ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన చెప్పారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేకమై హెచ్చరికలు ఇప్పటి వరకు అందలేదని, ప్రజలు, నిర్వాహకులతో కలసి సమన్వయంతో వేడుకలను జరుపుకోవాలని సూచించారు. గత ఏడాది మాదిరిగానే ఒకే రోజులో నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.

గణేశ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష
గచ్చిబౌలి: గణేశ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పలువురు పోలీస్ అధికారులు, శాంతిసంఘం సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ అధికారులు, శాంతి సంఘం సభ్యులు, ప్రభుత్వ శాఖల అధికారులతో కమిషనర్లు సందీప్ శాండీల్య, మహేశ్ ఎం భగవత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవాలకు విద్యుత్, నీటి సరఫరా, గణేశ మండపాల వద్ద ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమాశంలో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు బద్దం బాల్‌రెడ్డి, మండపాల నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ, గణేశ మండపాల వద్ద సిసికెమెరాలు, అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నిమజ్జనానికి 2500 మంది అందుబాటులో ఉంటారని, ఈ ఏడాది సుమారు 7వేల గణేశ విగ్రహాలు నిమజ్జనం కాబోనున్నాయని సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డిసిపిలు ఏఆర్ శ్రీనివాస్, రమేశ్ నాయుడు, యాదాద్రి డిసిపి యాదగిరి, మల్కాజ్‌గిరి డిసిపి శర్మ, భువనగిరి జాయింట్ కలెక్టర్ రవి నాయక్, శ్రీనివాసరెడ్డి, జానకి శర్మిల, జానకి, అనురాధ, దివ్యచరణ్ తదితరులు పాల్గొన్నారు.
కోట్లు పెట్టి కొన్నాం కనీస వసతులు లేవు
హైదరాబాద్: కోట్ల రూపాయలు వెచ్చించి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు కొనుగోలు చేసిన తమకు నిర్మాణ సంస్థ కనీస వసతులు కల్పించలేదని ఫ్లాట్ల యజమానులు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. లోథా నిర్మాణ సంస్థ నగరంలోని కూకట్‌పల్లి సమీపంలో 2010 నుంచి నిర్మిస్తున్న బేలేజ, మెరిడియన్ బహుళ అంతస్తు భవనాలను జిహెచ్‌ఎంసి నిర్మాణ అనుమతుల నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని, తమకు కల్పించాల్సిన పార్కింగ్, గ్రీనర్, క్లబ్ వంటి సౌకర్యాలు కల్పించలేదంటూ కొందరు ఫ్లాట్ యజమానులు ఇదివరకే కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం కమిషనర్ జనార్దన్ రెడ్డి బేలేజ, మెరిడియన్ బ్లాకుల్లోని ఫ్లాటు యజమానులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. అయితే తాము జిహెచ్‌ఎంసి అనుమతిని అనుసరించే నిర్మాణాలను చేపట్టామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు వివరించగా, తమకు కల్పించాల్సిన కారు పార్కింగ్, గ్రీనరీ, క్లబ్ వంటి సౌకర్యాలను నిర్మాణ సంస్థ కల్పించటం లేదని ఫ్లాటు యజమానులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేగాక, తమకు చేసిన ఒప్పందం ప్రకారం పార్కింగ్, రిక్రియేషన్ స్థలాల్ని వదలటం లేదని కమిషనర్‌కు వివరించారు. అయితే తమకు జిహెచ్‌ఎంసి ఇచ్చిన అనుమతుల ప్రకారం ఈ భవనాలను నిర్మించారా? లేక ఎక్కడైనా నిబంధనలను ఉల్లంఘించారా? అన్న విషయంపై జిహెచ్‌ఎంసి అధికారులు విచారణ జరపాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే ఫ్లాటు యజమానులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వారు చెబుతున్న విధంగా సెట్‌బ్యాక్ వివరాలు, బేలేజ, మెరిడియన్ బ్లాకుల మధ్య నిర్మించిన ప్రహరీగోడ విషయంపై నిర్మాణ సంస్థను నివేదిక అడిగారు. దీంతో పక్షం రోజుల సమయం కావాలని నిర్మాణ సంస్థ కోరగా, పదిరోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషనర్ నిర్మాణ సంస్థ ప్రతినిధిని ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.
అవసరమైతే అధికారులపై చర్యలు: కమిషనర్
లోథా నిర్మాణ సంస్థ భవన నిర్మాణాల్లో ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే, అందుకు అవసరమనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి మంజూరు చేసిన అనుమతులు, వాటిల్లో పేర్కొన్న నిబంధనలను అనుసరించి ఫ్లాటు యజమానులకు పార్కింగ్, ఇతర సౌకర్యాలను కల్పించాలని నిర్మాణ సంస్థకు సూచించారు. మెరిడియన్ అపార్ట్‌మెంట వాసులు చేసిన ఫిర్యాదులపై న్యాయపరంగా, నిబంధనను అనుసరించి న్యాయం చేస్తామని వెల్లడించారు.

టిఎస్‌పిఎస్సీ సర్వేయర్ల పరీక్షకు ఏర్పాట్లు
హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించనున్న సర్వేయర్ల పరీక్ష ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు వీలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ ఎం.ప్రశాంతి వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ ఉదయం పది నుంచి పనె్నండున్నర గంటల వరకు నిర్వహించనున్న డిప్యూటీ సర్వేయర్ల రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఏర్పాట్లపై టిఎస్‌పిఎస్సీ అసిస్టెంటు సెక్రటరీ యశోధతో కలిసి చీఫ్ సూపరిండెంట్, లైజన్, అసిస్టెంటు లైజన్ అధికారులతో శుక్రవారం వనితా మహా విద్యాలయాల్లోని శంకర్‌జీ ఆడిటోరియంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేటట్లు చూసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో మంచినీరు, ఫర్నిచర్ వంటి కనీస సౌకర్యాలుండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసి బస్సులు పడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చీఫ్ సూపరిండెంట్లు, లైజన్ తదితర అధికారులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగానే సందర్శించాలన్నారు. డిఆర్వో సతీష్‌చంద్ర మాట్లాడుతూ అధికారులు రూట్‌మ్యాప్ తయారు చేసుకోవాలన్నారు. ఇన్విజిలేటర్లతో మీటింగ్ నిర్వహించి, వారి విధులను తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా ఓఎమ్‌ఆర్ షీట్‌లో హాల్ టికెట్ నెంబరు, కోడ్ నెంబరు, తదితర వివరాలను నమోదు చేయటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అభ్యర్థులకు వివరించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు,వాచీలు, టాబ్లెట్ పిసిలు, పెన్‌డ్రైవ్‌లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను వెంట తీసుకురావద్దని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఓ గంట ముందే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు బూట్లు, నగలు ధరించి రావద్దని, వ్యాలెట్, పర్సులు, నోట్స్, చార్టులు, వైట్‌షీట్స్ వంటివి తీసుకురావద్దని ఆమె తెలిపారు. పరీక్ష నిబంధనలను ఉల్లంఘించిన అభ్యర్థులు భవిష్యత్తులో టిఎస్‌పిఎస్సీ, యుపిపిఎస్సీ, ఇతర రాష్ట్రాల పిఎస్‌సిలు నిర్వహించే పరీక్షలు రాయకుంకడా డిబారు చేసే అవకాశముంటుందన్న విషయాన్ని గుర్తించి, అభ్యర్థులు నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పరీక్షల విభాగం ఆంటోనీ, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు పాల్గొన్నారు.

విజయ్ హనుమాన్ సిసిపై రోహిత్ ఎలెవన్ గెలుపు
ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్
చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో అకాష్ శర్మ బౌలింగ్‌లో రాణించడంతో రోహిత్ ఎలెవన్ జట్టు 281 పరుగుల తేడాతో విజయ్‌హనుమాన్ సిసిపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ ఎలెవన్ జట్టు 67.5 ఓవర్లలో 380 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విజయ్‌హనుమాన్ సిసి 29.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమి పాలైంది. రోహిత్ ఎలెవన్ బౌలర్ అకాష్‌శర్మ 8.2 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌బిసిసి జట్టు 129 పరవుగుల తేడాతో శ్రీశ్యామ్ సిసిపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హెచ్‌బిబిసి 81.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన శ్రీచక్ర జట్టు 50.5 ఓవర్లలో 173 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మూడో మ్యాచ్‌లో శ్రీచక్ర సిసి జట్టు ఆరు వికెట్ల తేడాతో గౌడ్స్ ఎలెవన్‌పై గెలుపొందింది. గౌడ్స్ ఎలెవన్ జట్టు 55.2 ఓవర్లలో 175 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లీగ్ టోర్నమెంట్‌లో గెలుపొందిన శ్రీచక్ర, హెచ్‌బిసిసి, రోహిత్ ఎలెవన్ జట్లకు చేరి ఐదు పాయింట్లు లభించాయి. ఇతర మ్యాచ్‌లో పాషా బిడీ సిసి జట్టు ఆరు వికెట్ల తేడాతో పోస్టల్ సిసిపై, రాకేష్ ఎలెవన్ సిసి 52 పరుగుల తేడాతో గ్రీన్ టర్ఫ్ సిసిపై, సలీంనగర్ జట్టు 78 పరుగుల తేడాతో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్‌పై, చీర్‌పుల్ చూమ్స్ సిసి 19 పరుగుల తేడాతో మహమూద్ క్రికెట్ క్లబ్‌పై విజయం సాధించింది.
స్టేట్ ర్యాంకింగ్ టిటి చాంపియన్‌షిప్ ప్రారంభం
సెయింట్ పాల్స్ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాకింగ్ టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. హిమయత్‌నగర్‌లోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌ను శాట్స్ విసి, ఎండి ఎ.దినకర్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నరసింహారెడ్డి, ప్రకాష్‌రాజు, కోశాధికారి మహ్మద్ ఇబ్రహీంఖాన్, పాఠశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ రాయప్పరెడ్డి, టిటి కోచ్ కె.రామకృష్ణ, నిర్వహణ కార్యదర్శి లక్ష్మికాంతరావు, కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌విఎస్ సుందరానికి పురస్కారం
కాచిగూడ: జ్యోత్స్నా కళాపీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఆర్‌విఎస్ సుందరానికి ఎస్.సుగుణమణి సాహితీ సాంస్కృతిక పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్స్‌లర్ డా. ఆవుల మంజులత పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. ఆర్‌విఎస్ సుందరం తెలుగులోనే కాకుండా వివిధ భాషాలలో రచనలను అధ్యాయనం చేశారని తెలిపారు. రచనలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి.గౌరీశంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రముఖ కవి డా.తిరునగరి, ప్రముఖ రచయిత్రి డా.తెనే్నటి సుధాదేవి పాల్గొన్నారు.

అంటరానితనం వ్యక్తులు కల్పించినదే
కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారాం
హైదరాబాద్: మానవ సమాజంలో కులాలు మనిషి సృష్టించుకున్నవేనని.. భగవంతుడు ప్రమేయం ఏమీ లేదని కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారాం అన్నారు. హిందూ ధర్మంలో అంటరానితనం లేదని.. ఇది కూడా వ్యక్తులు కల్పించుకున్మదేనని ఆయన అన్నారు. శ్రీ సాయ చంద్ర ఎడ్యుకేషనల్, కల్చరల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన జాతీయ బిసి కమిషన్ సభ్యులు రాములుకు జరిగిన అభినందన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిసిలకు అంబేద్కర్ చేసిన కృషి రుణం తీర్చుకోలేనిదని.. ఆయన దళితులకు మాత్రమే కాదని.. అందరివాడని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ మార్గదర్శనీయమని అన్నారు. గొప్ప దేశభక్తుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి హంసరాజ్.. రాములును శాలువాతో సత్కరించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, గద్దర్ పాల్గొన్నారు.

‘మన చరిత్ర - మన సంస్కృతి’ పుస్తకావిష్కరణ
కాచిగూడ: ప్రముఖ రచియిత్రి శైలజ బండారి రచించిన ‘మన చరిత్ర - సంస్కృతి’ భిన్న కోణాలు పుస్తకావిష్కరణ సభ శుక్రవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో జెవివి రమేష్, శిలాలోలిత, కొండవీటి సత్యవతి, కాసుల ప్రతాప్‌రెడ్డి పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. మన చరిత్రను భిన్నకోణాల్లో పుస్తకంలో తెలియజేశారని కొనియాడారు. పుస్తకం నేటి యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నేడు పాశ్యాత్య సంస్కృతిపై యువత మగ్గుచూపుతున్నారని, తెలుగు సంస్కృతిని వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కార్పొరేట్ విద్య
జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: పేదవారికి ఒకరకంగా.. ధనికులకు మరో రకంగా విద్య ఉండకూడదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. విద్య నేర్పించడంలో పేద, గొప్ప వ్యత్యాసం చూపకూడదని చెబుతూ.. కార్పొరేట్ విద్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. బిసి విద్యార్థి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్ఞానానికి, కులాలకు సంబంధం లేదు.. రాజ్యాధికారంలో నీతివంతులు ఉంటే.. అవినీతికి అవకాశం ఉండదని అన్నారు. విద్యార్థులు విద్యను అశ్రద్ధ చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బిసిలు ఆత్మ గౌరవంతో నిలబడాలన్నారు. వృత్తులపై ఆధారపడిన బిసిలను ప్రోత్సహిస్తూ.. వృత్తులను ఆధునీకరణ చేయడంలో చేయూతనిస్తామని అన్నారు. విద్యార్థులందరికీ ఒకేరకమైన ఫీజులు ఉండాలని.. సంక్షేమ భవనం నిర్మించాలని బిసి యువత స్థిరపడేందుకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బిసి సంఘం నాయకుడు పూసల కిషన్, ప్రధాన కార్యదర్శి రమేష్, గణపతిలతో పాటు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

మస్కిటో యాప్ రెడీ
హైదరాబాద్: దోమలే కదా..అని లైట్‌గా తీసుకుంటారు. కానీ అవి ఎంత ప్రమాదమో, వాటితో ప్రజారోగ్యానికి ఎంతటి ముప్పు పొంచి ఉందో ఎవరికీ తెలియదు. అంతెందుకు దోమల గురించి ప్రపంచంలో పూర్తిగా తెలిసిన వారే లేరని, ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా దోమల నివారణపై మహానగర ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు జిహెచ్‌ఎంసి మరో యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఒక చోట నిల్చుండే నీటిలో అతివేగంగా వృద్ధి చెందే దోమల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం, అజాగ్రత్త వహించినా, అవి మన జనాభా కన్నా వేగంగా పెరుగుతాయన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా మస్కిటో యాప్‌ను రూపొందించింది. ఈ నెల 20వ తేదీన ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యాప్‌ను శనివారం అధికారికంగా ప్రారంభించనున్నట్లు, ఆదివారం నుంచి మహానగరవాసులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. మహానగరంలోని సుమారు 1500 కిలోమీటర్ల పొడువున ఉన్న డ్రెయిన్లలో ప్రజల నిర్లక్ష్యం కారణంగా ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం, భవన నిర్మాణ వ్యర్థాలు వేయటం వల్ల నీరు ఆగి, దోమలు వృద్ధి చెందుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో దోమలకు సంబంధించి 16 ప్రశ్నలుంటాయి. అయితే వీటికి సరిగ్గా సమాధానమిచ్చిన వారిని, కొన్నింటికి తప్పుగా సమాధానం చెప్పిన వారితో కలిపి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారందరికి నెలకోసారి డ్రా నిర్వహించి, విజేతలను ఎంపిక చేసి వారికి లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని జిహెచ్‌ఎంసి అందజేయనుంది. అయితే వీలైనంత ఎక్కువ మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తాము పొందుపర్చిన 16 ప్రశ్నలను చదివి, దోమల గురించి తెల్సుకోవాలన్నదే తమ ప్రధాన సంకల్పమని, అందుకే తప్పుగా జవాబు ఇచ్చిన వారిని సైతం లక్కీ డ్రాకు అర్హులను చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. 20వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఈ యాప్‌కు సంబంధించి మొట్టమొదటి లక్కీ డ్రాను వచ్చే నెల 1వ తేదీన నిర్వహిస్తామని, ఆ తర్వాత నెలకోసారి డ్రాలను ఏడాది పొడువున నిర్వహిస్తారు.
యాప్‌లోని ప్రశ్నలు
* దోమ జీవితకాలం సుమారు నెలరోజులు మాత్రమే-ఆవును/కాదు * ఆడ దోమ తన నెలరోజుల జీవిత కాలంలో వెయ్యి గుడ్లను పెడుతోంది- అవును/కాదు * కేవలం ఒక దోమల సంవత్సర కాలంలో కోట్లాది దోమల ఉత్పత్తికి, అంటే మానవ జనాభా కంటే అధికంగా దోమల వృద్ధికి కారణమవుతుంది-అవును/కాదు * గుడ్డుస్థాయి నుంచి దోమ స్థాయికి రావడానికి దోమల జీవన చక్రం 8 నుంచి పదిజులు పడుతోంది-అవును/కాదు * నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టవు-అవును/కాదు * పారుతున్న నీటిలో దోమలు గుడ్లు పెట్టడం ద్వారా డెంగీ, మలేరియా వ్యాధులకు కారణమవుతున్నాయి-అవును/కాదు * కుండలు, కూలర్లు, డ్రమ్ములు, సిమెంట్ ట్యాంక్‌లు, నల్లాగుంతలు, మూతల్లేని సంపులు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లలో దోమలు ఉత్పత్తి కారణంగా డెంగీ సోకుతుంది-అవును/కాదు * ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించటం, నీటి నిల్వలను తొలగించటం ద్వారా డెంగీ, మలేరియా కారక దోమలను నియంత్రించవచ్చు-అవును/కాదు * ఇళ్లపరిసర ప్రాంతాలు, పై కప్పులో వృథాగా ఉండి ఉపయోగించని వస్తువుల తొలగింపు ద్వారా డెంగీ కారక దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చు-అవును/కాదు * లార్వా దశలో నిర్మూలించటం ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చు-అవును/కాదు * గుంబూజియా చేపల ద్వారా దోమల గుడ్లు, లార్వాల అభివృద్ధితో పాటు దోమల వ్యాప్తి పెరుగుతోంది-అవును/కాదు * సెప్టిక్ ట్యాంక్‌లపై ఉన్న చినీ పైప్‌లను మెష్ ద్వారా కప్పకపోవటంతో దోమల వ్యాప్తి పెరుగుతుంది-అవును/కాదు * మలేరియ ప్యారాసైట్‌ను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత సర్ రోనాల్డ్ రాస్ సికిందరాబాద్‌లో పనిచేశారు-అవును/కాదు * డ్రెయిన్‌లు, చెరువుల్లో ప్లాస్టిక్, వ్యర్థపదార్థాలు వేయటం ద్వారా మరుగునీరు నిలిచి దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి-అవును/కాదు * ఆడ, మగ దోమలు రెండు కూడా అంటువ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి-అవును/కాదు * దోమ తెరలు వాడడం ద్వారా దోమకాటు నుంచి, దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు-అవును/కాదు

గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
ఖైరతాబాద్: గల్ఫ్ దేశాల్లో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్‌లోని జైపూర్ చెందిన యాసిన్ ఖాన్ ఘోరి సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లో గల్ఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో కార్యాలయాన్ని తెరిచాడు. వివిధ మాద్యమాలలో గల్ఫ్‌దేశాల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటనలు గుప్పించాడు. వీటికి స్పందించి ఖాన్‌ను సంప్రదించిన వారిని కార్యాలయానికి రప్పించుకొని ఉద్యోగం తప్పనిసరిగా పొందవచ్చునంటూ అందుకు కొంత ఖర్చు అవుతుందని నమ్మబలికాడు. ఇతని మాటలు నమ్మి భారీ స్థాయిలో ముట్టచెప్పారు. సుమారు 200 మంది వద్ద ఈ తరహా వసూలు చేశాడు. వీరిలో చాలా మందిని ఈనెల 21న గల్ఫ్‌కు పంపుతానని చెప్పిన ఖాన్ గత కొన్ని రోజులుగా ఫోన్ బంద్ చేసుకొని పెట్టుకోవడంతో భయాందోళనకు గురయ్యారు.
కార్యాలయానికి వచ్చి వాకబు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాము మోసపోయామని గమనించిన బాధితులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజినీరింగ్ సీట్ ఇప్పిస్తానని మోసం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు
నార్సింగి: ఇంజినీరింగ్ సీట్ ఇప్పిస్తానని మోసం చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ నాగిరెడ్డి కథనం ప్రకారం.. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన డాక్టర్ అబ్బుబాకర్ కుమారుడు మహ్మాద్ సుల్తాన్ అబ్దుల్‌కు గండిపేట సిబిఐటి కాలేజీలో బయెటెక్నాలజీ కోర్స్‌లో సీట్ వచ్చింది. అబ్దుల్‌కు ఈ కోర్స్‌లో ఇష్టం లేకపోవడంతో సిఎస్‌సి కోర్స్‌లో సీట్ ఇప్పిస్తానని, అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆశలత మూడు లక్షల 94వేల రూపాయాలు తీసుకుంది. పలుమార్లు అబ్దుల్ ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీసింది. చివరికి సీట్ మాత్రం ఇప్పించ లేకపోయింది. దీంతో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో అబ్దుల్ ఫిర్యాదు చేశాడు. నెల రోజుల క్రితమే ఆమె వెళ్లిపోయినట్లు కాలేజీ వర్గాలు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం ఆశాలతను రిమాండ్‌కు తరలించారు.

సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన అవసరం

కెపిహెచ్‌బికాలనీ: పిల్లలకు దేశ సంస్కృతి, సాంప్రదాయలపై అవగాహన కల్పించాలని హట్టి గోల్డ్‌మైన్స్ కంపెనీ లిమిటెడ్ విశ్రాంత సీనియర్ మేనేజర్, బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత జంగం శ్రీనివాసులు అన్నారు.
శుక్రవారం కెపిహెచ్‌బికాలనీ టెంపుల్ బస్టాప్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రజ్ఞ వికాస తరంగిణి ఆధ్వర్యంలో సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన 3వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింభించే పోటీలు నిర్వహించారు. భగవద్గీత పఠనం, శ్లోకాలు చదవడం, పద్యాలు చెప్పడం వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి జంగం శ్రీనివాసులు, రామిరెడ్డి, శ్రీనివాసులు, వసంతరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
జంగం శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నారులు వాట్సప్, మెసెంజర్ వంటి వాటిల్లో బిజీ జీవితం గడపడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో బందా వెంకట రమణయ్య, శేషకుమారి, కళావతి, ప్రకాష్‌రావు, ప్రజ్ఞ వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు.