డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు అడుగులు వేయంగానే ఎదురుగా హిందూ మ్యాగజైన్ బిజినెస్ సెక్షన్ కృష్ణమోహన్‌గారు ఎదురుగా వచ్చారు. ఆయన ఏదో పనిమీద ఢిల్లీ వెళ్లి ఆ రోజూ వస్తున్నాడట.
‘‘నమస్తే మేడమ్’’ అన్నాడు.
‘‘నమస్తే’’ అన్నాను.
‘‘ఏమిటి మేడమ్ మీ దగ్గరనుంచి ఏమీ ఆర్టికల్స్ రావడంలేదని అందరూ కంప్లైంట్ చేస్తున్నారు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘లేదండి, వూళ్లో లేను. యుఎస్‌లో మా అబ్బాయి దగ్గరకు వెళ్ళాను’’ అన్నాను నసుగుతూ.
‘‘విన్నాను మేడమ్. మీ కాలేజీకి ఫోన్ చేశాను. వారు చెప్పారు’’.
‘‘కొంచెం సెటిల్ అవంగానే మళ్లీ రాస్తూ వుండండి’’.
తల ఊగించాను, అంగీకారంగా. ‘‘ఈసారి వచ్చే ఆర్టికల్స్‌లో వెస్ట్రన్ ఎకానమీ గురించి రాయండి. నాకు తెలుసు మీరు ఏ పనిమీద వెళ్లినా మీ దృష్టికి లోకల్ ఎకనమిక్స్ మీదే వుంటుందని’’.
నవ్వాను.
ఆయన సెలవు తీసుకుని వెళ్లిపోయారు.
ఈ ఆరు వారాల్లో ఒక్కసారి కూడా పెన్ను, కాగితం పట్టుకోలేదు.
నేను తరచుగా వ్యాసాలు వ్రాస్తాను. అవి బిజినెస్ సెక్షన్‌లో తరచుగా ప్రచురితవౌతుంటాయి. అవి కేవలం ఆర్థిక సిద్ధాంతాలమీదే! మన దేశంలో బ్రిటీష్ ప్రభావంతో మొదలైన మన పరిపాలనా పద్ధతులు, దేశ పురోభివృద్ధికి ఎలా అడ్డుతగులుతున్నాయో వ్రాస్తాను. పూర్తిగా వ్యాపార దృష్టిలోనే గవర్నమెంటు కంట్రోల్, నల్లధనం అన్ని పెద్ద సబ్జెక్ట్స్ కాని చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా రాస్తాను.
క్యాపిటలిజంలో తొంగి చూసే స్వార్థం, సోషలిజంలో కృంగదీసే ఇన్‌సెండంటీవ్స్ రుూ రెండింటిని బ్యాలెన్సు చెయ్యాలనుకుని ముందుకొచ్చి గవర్నమెంట్ చేతకానితనం ఒకటేమిటి అన్ని విషయాలమీద.
అవి చాలామందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా యువతరాన్ని, ఒక కాలేజీలో అయితే నేను రాసిన ఆర్టికల్స్‌ని విశే్లషణ చేయమన్నారుట ఒక ప్రాజెక్టుగా.
కాని చాలామందికి ఆ ఆర్టికల్ రాసేదెవరో తెలియదు. ఎందుకంటే నా స్వంత పేరు మీద రాయను.
మన దేశంలో కొన్ని తమాషా అయిన చిక్కులున్నాయి. అవి పేరు పదిమందికి తెలిస్తే వచ్చే చిక్కులు, ఒకసారి పేరు బయటికి వచ్చిందంటే ఎటువంటి సందర్భంలోనైనా దాన్ని మర్చిపోనివ్వరు. సోషల్ మీటింగ్స్ అయినా సరే, ప్రొఫెషనల్ అయినా సరే! అవసరం మించిన కాంటాక్ట్స్, అనవసరమయిన అసూయలు.
నేను ఆర్టికల్స్ రాస్తానని, నా కాలేజీలోనే ఎవరికీ తెలియదు. కాని ఆశ్చర్యం అమెరికాలో ఒకరికి తెలుసు. వౌళి పెళ్లిలో కలిశాడు. రిసెప్షన్‌కి వచ్చాడు. పార్టీ అంతా అయ్యాక వెళ్ళే ముందు వచ్చి పలకరించాడు.
నా పేరు గోపాల్రావు, నేను హిందూ పేపర్ ఫేవరేట్ రీడర్‌ని. అమెరికా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా హిందు పేపర్ మాత్రం చదవకుండా రోజు పూర్తి చెయ్యను. మీ వ్యాసాలు చాలా విమర్శనాత్మకంగా వుంటాయి.
‘‘కృష్ణమోహన్, నేను క్లాస్‌మేట్స్. ‘‘ఒకసారి వాడు చెప్పాడు. టివి అన్న పేరుతో రాస్తారని. అసలు పేరు కల్యాణి అని. కాని ఎందుకో ఇవాళ మిమ్మల్ని పరిచయం చెయ్యంగానే మీరే అనిపించింది. కృష్ణమోహన్ చెప్పిన మాటలను బట్టి అన్నాడు. నేను కరెక్టుగానే ఊహించాను కదా’’ అన్నాడు.
తల వూగించాను చిరునవ్వుతో! కొంచెం దూరంలో నుంచుని ఉన్న మూర్తిగారు ఆశ్చర్యంగా చూశారు. గోపాల్రావు అన్నాడు ‘‘ఈవిడ చాలా చక్కని ఆర్టికల్స్ వ్రాస్తారు. అంతా ఆర్థిక పరిస్థితి, వ్యాపార పెరుగుదలమీద, తప్పకుండా చదవాలి.’’
‘‘తప్పకుండా’’ అన్నారు మూర్తిగారు గోపాల్రావుతో. ‘‘మిమ్మల్ని గురించి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. మా తేజాకి కూడా తెలుసనుకోను’’ అన్నాడు.
చిరునవ్వుతో వారించాను. ‘‘వదిలేయండి. నాకు పెద్దగా ఇవి ఎవ్వరితోను పంచుకోవడం యిష్టం లేదు’’ అన్నాను. ఒక్కసారి నా మొహంలోకి చూశాడు. ఏమనుకున్నాడో ఏమో అక్కడితో ఆగిపోయింది మా సంభాషణ.
నా అభిప్రాయాలు చాలా చాలా పెద్ద పెద్ద ఎకానమిస్ట్ అభిప్రాయాలకు భిన్నంగా వుంటాయి. చాలా విమర్శలు కూడా వచ్చాయి. అందుకే నేను ఎవరితోనూ నా ఐడెంటిటీ తెలుపుకోను. ఒక్కొక్కసారి గుప్తంగా వుంటే అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడించడం సులువు. అవసరమయిన ప్రొఫెషనల్ భేదాభిప్రాయాలకు చోటు ఉండదు.
‘‘అరే! కృష్ణమోహన్‌కి చెప్పాల్సింది ఆయన స్నేహితుడిని కలిశానని’’ అనుకున్నాను. ట్యాక్సీ వచ్చింది. అన్నయ్య సరాసరి హోటల్‌కి తీసుకువెళ్లాడు. హాయిగా స్నానం చేయకుండానే సగం బడలిక తీరింది. దాదాపు 12 గంటలు అవుతుంటే పి.సుశీలగారింటికి ఫోన్ చేశాను.
‘‘నేను ఇవాళే యుఎస్ నుంచి వచ్చాను. మూర్తిగారు మీకు ఒక ప్యాకెట్ ఇవ్వమన్నారు’’ అని చెప్పి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
ఆవిడ ఆ మాట చెప్పంగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి మధ్యాహ్నం రమ్మని ఆహ్వానించింది.
మా వదిన మా సంభాషణ వింటూ చాలా ఉత్సాహపడిపోయింది. సాక్షాత్తు పి.సుశీల గారింటికి వెళుతున్నామంటే- మైగాడ్ ఆవిడ పాటే పాట, గొంతే గొంతు. ఎంత మాధుర్యం, ఆయన ఎవరో ఆవిడని తెల్ల కోకిల అని పిలిచాడు. అది మాత్రం అతిశయోక్తి కాదు. మరొకరు ఆవిడ గళం పంచామృతం అన్నారు.
ఆవిడ కారు పంపుతామన్నారు. నేనే వద్దన్నాను. మేము రైల్వే స్టేషన్‌కి వెళ్ళే ముందు వస్తామని అన్నాను.
సాయంత్రం పి.సుశీల గారింటికి వెళ్లాం. ఆవిడ వరండాలోనే ఉన్నారు. మిమ్మల్ని చూడగానే సాదరంగా ఆహ్వానించింది. తెల్లటి కాటన్ చీరలో సాక్షాత్కరించిన సరస్వతిదేవిలా కనిపించింది. నా మనసులో భావమే వదినకు వచ్చింది. అదేమాట మా వదిన నమస్కారం చేస్తూ అంది.
రండి, రండి- అంటూ లోపలకు దారితీసింది. అలాంటి పొగడ్తలు అలవాటైపోయి ఉంటాయి.
మూర్తిగారితో మా సంబంధం తెలపగానే చాలా సంతోషించింది. ఆవిడకు తేజ చిన్నప్పటినుంచి తెలుసు.
మూర్తిగారు అందించిన బహుమతులు ఆవిడకు ఇచ్చాను. ఆవిడ మా ముందే తెరిచి చూచారు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి