శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు డిమాండ్ చేశారు. నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం రజక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దుర్గంపాటి పద్మజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు. గ్రామాలలో రజకులపై దాడులు, గ్రామ బహిష్కరణలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా టిడిపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రజక కులానికి సంబంధించిన వారు దాదాపు 45 లక్షలకు పైగా ఉన్నారన్నారు. వారిలో ఓటుహక్కు కలిగినవారు 35 లక్షలు మంది ఉన్నారని తెలిపారు. రజకుల సంక్షేమం కోసం సామాజిక చట్టాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. రజకులు అభివృద్ధిలోకి రావాలంటే బ్యాంకుకు సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు అందించినప్పుడే వారు అభివృద్ధి చెందుతారని చెప్పారు. బిసిలందరికి రూ.2 లక్షలు వరకు రుణాలు ఇప్పిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలిపోయాయని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 10వేల రజక సొసైటీలు ఉన్నాయని, ఇప్పటివరకు సొసైటీల ద్వారా 50వేల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా కనీసం వారిలో 10వేల మందికి కూడా రుణాలు మంజూరు కాలేదని ధ్వజమెత్తారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న రజకుల పిల్లలకు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ ప్రకారం ధోబీ ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల ప్రకారం రజకులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి రాష్ట్రంలో ఆ కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్లు నిధులను మంజూరు చేస్తామన్న చంద్రబాబునాయుడు ఇప్పటివరకు రాష్టవ్య్రాప్తంగా రజకులకు రూ.4 కోట్లనే ఖర్చు చేయడం దారుణమన్నారు. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని రజకులందరూ కలిసికట్టుగా పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సిద్ధమవుతామని తీవ్రస్థాయిలో ఆయన హెచ్చరించారు. ఈ సభలో జిల్లా అధ్యక్షుడు కె.రమణయ్య, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బిఎన్ ప్రకాష్, నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.నాగరాజు, ఆ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేరగాళ్లకు దడ పుట్టించాలి
నెల్లూరు: నేరం చేయాలంటే నిందితులు భయపడేలా పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని, ఈ విషయంలో జిల్లా ఎస్పీ రామకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని గుంటూరు రేంజ్ డిఐజి కెవివి వేణుగోపాల్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆయన పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను సత్వరమే పూర్తిచేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టేలా పనిచేయాలని, క్రికెట్ బెట్టింగ్ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసిన జిల్లా ఎస్పీని మార్గదర్శిగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ రామకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 205 మందిని అరెస్ట్ చేసి, రూ.50 లక్షల మేర నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు తమ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా ఎవరూ లేని ఇళ్లలో దొంగతనాలను నివారించేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ వ్యవస్థను నెల్లూరు నగరంలో ప్రవేశపెట్టామని, దీనికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. యువత కూడా వ్యసనాలకు బానిసలై చెడుమార్గంలోకి వెళ్లవద్దని హితవు పలికారు. శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ అధికారులు సమర్ధవంతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మహాలక్ష్మీ యాగం
నెల్లూరు కల్చరల్: ముక్కోటి పర్వదినం సందర్భంగా మహాలక్ష్మీ యాగాన్ని స్థానిక విఆర్‌సి మైదానంలో ఆదివారం జ్ఞానపీఠం నిర్వాహకులు లలితాశివకుమారస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత హోమం, కలశారాధన నిర్వహించారు. అర్చకుల బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా మహాలక్ష్మీ యాగాన్ని జరిపారు. అనంతరం శ్రీ కొల్హాపురి మహాలక్ష్మీ అమ్మవారి కుభేర కలశపూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కార్యదర్శి పివికెఆర్‌ఎస్ శర్మ, నిత్యాగ్నిహోత్రులు, అమ్మవారి ఉపాసకులు శివకుమార స్వామి ఆధ్వర్యంలో అర్చకుల బృందం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, లక్ష్మీహోమం, పురుషసూక్త హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. యాగాలను వీక్షించేందుకు పురప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలను నిర్వాహకులు వితరణ చేశారు.

యువత చూపు బిజెపి వైపు
నెల్లూరుటౌన్ : దేశ ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పరిపాలనను చూసి నేటి యువత భారతీయ జనతాపార్టీ వైపు చూస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి అన్నారు. నగరంలోని బిజెపి కార్యాలయంలో నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో శెట్టిగుంట రోడ్డు అరుంధతీయ ప్రాంతానికి చెందిన 30 మంది యువకులు బిజెపిలో చేరారు. ఈసందర్భంగా సురేంద్రరెడ్డి వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో సినీ గ్లామర్ వైపు ఎంతోమంది ఆకర్షితులవుతున్నారని, దానిని తలపించేవిధంగా మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి యువత ఆకర్షితులవుతున్నారన్నారు. యువత ఆయననే ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. కష్టపడి పనిచేస్తే బిజేపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని అందుకు నిదర్శనం ఉప రాష్టప్రతిగా వెంకయ్యనాయుడు ఎన్నిక కావడమేనన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కె.సుధాకర్‌రెడ్డి, ఎం.్భస్కర్, కె.మధు, జయచంద్ర, వై.శ్రీనివాసులు, వెంకటరమణయ్య, అరుణ్‌కుమార్, రవి, మధు, వినయ్ పాల్గొన్నారు.