తూర్పుగోదావరి

గెలుపుపై ఎవరి ధీమా వారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు దేనికవే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ, ప్రచారంలో నువ్వా.. నేనా..? అన్నట్టు దూసుకుపోతున్నాయి. కార్పొరేషన్‌లో మెజారిటీ స్థానాలను కైవశం చేసుకుని, మేయర్ పీఠాన్ని అధిష్టించి తీరుతామని తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో ఏకరువు పెడుతున్నారు. ఓవైపు పోలింగ్ తేదీ సమీపిస్తుండగా (ఆగస్టు 29), మరోవైపు ఇరు పార్టీల నేతలూ రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టిడిపి జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రెబల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు గల అన్ని రకాల మార్గాలపైనా వీరు చర్చలు జరిపారు. ఆయా డివిజన్లలో ప్రచారం నుండి తప్పుకుని, పార్టీ బలపరచిన అభ్యర్ధితో కలసి ప్రచారానికి వెళ్ళేలా చూడాలని, ఇందుకు ఎమ్మెల్యేలు, ఆయా డివిజన్లకు చెందిన సీనియర్ పార్టీ నేతలు తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. అలాగే కార్పొరేషన్‌లో విజయంపై తెలుగుదేశం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌లో 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా డివిజన్లలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య పోరు గట్టిగానే జరుగుతోంది. టిడిపి మిత్రపక్షమైన బిజెపి 9 స్ధానాల్లో పోటీ చేస్తోంది. అయితే కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే వైసిపికి భారీ సంఖ్యలో స్థానాలు లభించాల్సివుంది. అధికార తెలుగుదేశానికి దాదాపు 8మంది వరకు ఎక్స్ అఫీషియో సభ్యుల అదనపు బలం వచ్చిపడే అవకాశం ఉండటం ఓ విధంగా వైసిపికి శిరోభారమనే చెప్పాలి! ఈ కారణంగానే వైసిపి నేతలు కాకినాడలో మకాం వేసి, గెలుపును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, ఎంపి విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు అందుబాటులో ఉండి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉన్న అన్ని అవకాశాలపై సమీక్షిస్తున్నారు. అలాగే రెబల్స్‌ను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇక టిడిపి మిత్రపక్షం బిజెపి అభ్యర్ధుల విజయం కోసం ఆ పార్టీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య తదితరులు తాము పోటీ చేస్తున్న డివిజన్లలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే గడువుండటంతో రాజకీయ పార్టీల అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా డివిజన్లలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.