Others

..‘ఆస్కార’ం లేనట్టేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్ అవార్డు అంటే పెరటిలో పువ్వు కోసినంత సులభం కాదు. బజారుకెళ్లి బేరమాడి కొని సంచిలో వేసుకున్నంత సులువు కాదు. మన టాలీవుడ్ మాత్రం ‘ఆస్కార్’ కలలు కంటునే వుంది. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేకపోతోంది. మన దేశం తరఫున ఫలానా నటీనటులు ఎర్రతివాచీపై సందడి చేయబోతున్నారు, అదరగొట్టే కాస్ట్యూమ్స్‌తో మెరుపులు మెరిపించబోతున్నారు, ఆస్కార్ ఆవార్డును ప్రదానం చేసే అవకాశం దక్కించుకున్నారంటూ డబ్బా కొట్టడం చూస్తునే ఉన్నాం. ఫలానా నటి లేదా నటుడు లేదా సాంకేతిక నిపుణుడు ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యాడు, అందుకోబోతున్నారంటే గర్వపడవచ్చు. ఏమీ లేని దానికి డబ్బా కొట్టడం దండగే!

లక్షలు విలువ చేసే వింత దుస్తులు ధరించడంవల్ల, ఎర్ర తివాచీపై క్యాట్ వాక్‌తో సందడి చేయడంవల్ల, నటనతో పాత్రలో జీవించిన వారికి ‘ఆస్కార్’ అందచేయడంవల్ల మనకు ఆస్కార్ అందినట్లా? వచ్చినట్లా? అంత చిన్న విషయానికే అంత డబ్బా అవసరమా? విదేశీ మహానుభావులు (కళాకారులు) నిర్మించిన చిత్రాలతో (లైఫ్ ఆఫ్ పై, స్లమ్ డాగ్ మిలియనీర్) మన వారికి ఆస్కార్ అవార్డు రావడం గొప్ప కాదు? ఆ క్రెడిటంతా విదేశీయ కళాకారులదే. అలా ఎవరివల్లో అవార్డు వస్తే డబ్బా కొట్టుకోవడం ఆత్మవంచన కాదా? దాన్ని గుర్తింపు గౌరవం అనుకోవాలా? మన ప్రేక్షకులు- టాలీవుడ్ రంగం ‘బాహుబలి’ చిత్రానికి ఆస్కార్ రావాలి, వస్తుందంటూ పగటి కలలు కంటున్నారు. దేశంలో వసూళ్ల రికార్డు వుండవచ్చు. గొప్ప చిత్రమని పొగడవచ్చు.
హాలీవుడ్ చిత్రాలు చూడని వారికి మన బాహుబలిలాంటి చిత్రాలు గొప్పవే. హాలీవుడ్ చిత్రాలతో పోల్చుకుంటే మాత్రం అలాంటివి సాదా సీదా సినిమాలగానే కనిపిస్తాయ. గ్రాఫిక్ మాయా చిత్రాలను కనీసం పరిశీలనకు కూడా ఆస్కార్ కమిటీ తీసుకోదు. పరిశీలించదు. గ్రాఫిక్ మాయాజాలంతో హాలీవుడ్‌లో నిర్మించిన ‘అవతార్, జురాసిక్ పార్క్, కింగ్‌కాంగ్’ లాంటి చిత్రాల్లో సహజత్వం కనువిందు కలిగించాయి కనుకనే అలాంటి చిత్రాలు ఆస్కార్ అందుకున్నాయి. అలాంటి కనువిందు కలిగించే చిత్రాలు లేవు కనుకనే ఆస్కార్ అవార్డు పరిశీలనకు బాహుబలి యోగ్యత పొందలేదని మనం గ్రహించాల్సి ఉంటుంది. వసూళ్లు, చరిత్ర తిరిగి వ్రాయడం, రికార్డులు, ఫస్ట్‌లుక్స్, టీజర్లు, వ్యూస్, ఫేస్‌బుక్, క్రేజ్, ట్విట్టర్, యుట్యూబ్, వాట్సప్, ఆడియో ఫంక్షన్స్ డబ్బా కొట్టించడం ద్వారా ఆస్కార్ రాదని మన టాలీవుడ్ గ్రహించలేదనుకుంటాను. మస్తుగా పైసలొస్తే చాలు ఆస్కార్ గీస్కార్ మనకెందుకనే కళాకారులున్నంతవరకు మనకు అవార్డు వచ్చే ఆస్కారమే ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన టాలీవుడ్ చిత్రంలో యుగళ గీతం వచ్చిందనుకోండి, మొదటి చరణం న్యూయార్క్ గగన సౌధంపై, రెండో చరణం పారిస్ ఈఫిల్ టవర్ వద్ద, మూడవ చరణం రోం నగర శిల్ప శిథిలాల వద్ద, నాలుగవ చరణం స్విట్జర్లాండ్ పచ్చిక బయల్లో, అయదవ చరణం దుబాయ్ పబ్లిక్ రోడ్స్‌పై, ఆరవ చరణం సహారా ఎడారిలో పిచ్చి గెంతులు వేయిస్తే ఆస్కార్ వస్తుందా? బట్టలు నలగకుండా క్రాఫ్ చెదరకుండా పది పదిహేను మంది వస్తాదుల్లాంటి విలన్ అనుచరులను దెబ్బకొకర్ని పడగొడితే వస్తుందా ఆస్కార్? చిత్రమంతా హీరోయిజం చూపిస్తే వస్తుందా ఆస్కార్? సంభాషణల్లో చెత్త గీతాలలో ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు ‘కన్నుకొడితే’ వస్తుందా ఆస్కార్?
మనం చిన్నప్పటినుండి నేటి వరకు ఫోటో దిగాలంటే చిరునవ్వు ముఖంతో కెమెరా వైపు చూస్తూ ఫోటో దిగుతాం అవునా. మనం టాలీవుడ్ చిత్రాలు చూస్తుంటే నటీనటులు పాత్రల్లో నటస్తున్నాం అన్నది మరిచిపోయి, ఫోటో దిగుతున్నామన్న భావంతో తమ తమ దృష్టంతా కెమెరా వైపు పెడుతున్నారే తప్ప చిత్రంలో నటిస్తున్నామని మరిచిపోతున్నారు. దాదాపు చిత్ర ప్రతి దృశ్యంలో, చిత్రీకరణలో మనం గమనిస్తే ఈ ఫోటో నిజం తెలుస్తుంది. సంభాషిస్తున్నా, గీతంలో గెంతుతున్నా, ఘోర ఫైట్లు చేస్తున్నా ప్రతి సీన్లో కెమెరావైపు చూస్తూ ఉంటారే తప్ప నటిస్తున్నామన్న భావం వారిలో కనిపించదు. కెమెరాను మరిచిపోలేని సహజత్వ నటనను వెలికి తీయలేని మన టాలీవుడ్ వర్గాలకు వస్తుందా ఆస్కార్? అభిమానులచే హంగామా చేయించి, ఈలలు, కేకలు వేయిస్తే వస్తుందా ఆస్కార్? చిత్రం విడుదలై ఇరవై రోజుల ఫ్రదర్శన జరిగీ జరగక ముందే ‘బంపర్ హిట్, సూపర్ హిట్, సెనె్సషన్ హిట్, బ్లాక్ బస్టర్’ అని డబ్బా కొడితే వస్తుందా ఆస్కార్? ‘‘పులులు- సింహాలు, స్టార్లు- కింగ్‌లు, బొంగులు- రాజాలు’’ అలా పెట్టుడు బిరుదులు పెట్టించుకుని పొంగిపోయి నటిస్తే వస్తుందా ఆస్కార్? చింపిరి దుస్తులు, పీలికల దుస్తులు వేసుకుని హీరోయన్లు నాలుగు గీతాలలో కనిపించి అంగాంగ ప్రదర్శన చేస్తే వస్తుందా ఆస్కార్? మేము నటించినా, నటించకపోయినా, చిత్రం హిట్ అయినా, ఫట్ అయినా మాకేం ఇబ్బందిలేదు, మా తెలుగు టీవీ చానల్స్ వున్నవి, కుటుంబాల వారీగా, వారసత్వం ప్రకారం అందరికీ సమానంగా అవార్డులు ఇస్తున్నవి, మాకీ అవార్డులు చాలు, ఆస్కార్‌తో మాకేం పని అంటరా ఆస్కార్ విషయమే మరిచిపోదాం. లేదా ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర అవార్డులు సృష్టించి అందుకున్నట్టు మన టాలీవుడ్ ‘కింగ్స్ అవార్డ్, పులి అవార్డ్, సింహం అవార్డ్, స్టార్ట్ అవార్డ్’ లాంటివి లేదా ‘్భరతీయ గ్రేట్ ఆస్కార్ అవార్డు’ అని టాలీవుడ్ ఏకమై నిర్ణయించుకుని అవార్డులు ప్రకటించుకుని ఇచ్చుకుంటే పోలా?
ఇతర దేశ సినీ కళాకారులు కెమెరా ముందు నటిస్తున్నామని మరిచిపోయి, పాత్రలో పరకాయ ప్రవేశం చేసి జీవిస్తున్నారు కాబట్టి వారి నటనలో సహజత్వం కనిపిస్తుంది. కెమెరా వారిని చూస్తుందే తప్ప, వారంతా కెమెరావైపు చూడరు. అదీ నటనంటే. వారంతా సహజ నటులే కాబట్టి వారు ఆస్కార్లందుకుంటున్నారు. కోట్ల ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నారు. మనం బుల్లితెరపై ఎర్రతివాచీ కార్యక్రమాలు నోరెళ్లబెట్టి చూస్తున్నాం సిగ్గు లేకుండా. నేటి టాలీవుడ్ సినీరంగ వారసుల ‘మలితర వారసు’లైనా ‘ఆస్కార్’ అందుకుంటారని ఆశిద్దాం!

-మురహరి ఆనందరావు