వరంగల్

సమ్మెతో స్తంభించిన పోస్టల్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న తపాల ఉద్యోగుల సమ్మెతో తపాల సదుపాయాలు నిలచిపోయి గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు. ఇప్పటికే కొరియర్ సర్వీసుల ప్రభావంతో నగర ప్రాంతాల్లో పోస్ట్ఫాసు కల్పిస్తున్న సదుపాయాలను పెద్దగా పట్టించుకోకుండా కొరియర్ సర్వీసులపైన ప్రజలు ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ తపాల ఉద్యోగుల సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ప్రత్యామ్నాయ సదుపాయాల గురించి ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ పోస్ట్ఫాసులలో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కింద రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ పోస్ట్ఫాస్ ఉద్యోగులకు వేతనం చెల్లించాలని, బోనస్, ఇతర సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16వ తేదీనుంచి దేశవ్యాప్తంగా అఖిల భారత గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు.
ఫలితంగా అన్ని గ్రామాల్లో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. సామాన్య ప్రజలకు సమాచారాన్ని అందించే పోస్టల్ కార్డులు, ఇన్‌లాండ్ లెటర్లు, కవర్లు బట్వాడా చేసే సిబ్బంది లేక ఎక్కడి పోస్టల్ బ్యాగులు అక్కడే ఉండిపోతున్నాయి. గ్రామీణ పోస్ట్ఫాసులలో పొదుపు ఖాతాలు తెరిచిన వినియోగదారులకు సమ్మె కారణంగా లావాదేవీలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. పోస్ట్ఫాసుల నుంచి లెటర్లు, కవర్లు బయటకు పోలేక, బయటి నుంచి వచ్చిన రిజిస్టర్ కవర్లు, స్పీడ్, సాధారణ పోస్టులను ప్రజలకు అందించలేని పరిస్థితి ఏర్పడింది.
వారం రోజులుగా గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు సమ్మె చేస్తుండటం, సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కొరియర్ సర్వీసుల వారికి డిమాండ్ బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇప్పటి వరకు పోస్ట్ఫాసుల ద్వారా పంపించే కవర్లు, ఇతర పార్శిళ్లను సమీప పట్టణాల్లోని కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తున్నారు. పోస్ట్ఫాసులతో పోలిస్తే కొరియర్ సర్వీసు చార్జీలు ఎక్కువగా ఉన్నా సమ్మె కారణంగా పోస్టల్ సర్వీసులు నిలచిపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొరియర్ సర్వీసులను ఆశ్రయించక తప్పటం లేదని ప్రజలు చెబుతున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ ఉద్యోగుల సమ్మె కారణంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిజిష్టర్ కవర్లను, ఇతర పార్శిళ్లను సంబంధిత వ్యక్తులు తమ ఐడెంటిటీ కార్డులను చూపించి సమీప సబ్ పోస్ట్ఫాసుల నుంచి తీసుకోవాలని పోస్టల్ ఉన్నతాధికారులు తెలిపారు. అదే విధంగా పోస్టల్ సేవింగ్ ఖాతాలను సబ్ పోస్ట్ఫాసుల ద్వారా యధావిధిగా నిర్వహించవచ్చని అన్నారు. సిబ్బంది అందరూ పనిచేస్తున్న సమయంలోనే పట్టణ, మండల కేంద్రాలలోని పోస్ట్ఫాసులలో సరైన సేవలు అందని పరిస్థితి ఉండగా, గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల సమ్మె కారణంగా వారు అందించవలసిన సేవలు సబ్‌పోస్ట్ఫాసులలో ఏమేరకు లభిస్తాయోనని ప్రజలు వాపోతున్నారు.

గిరిజన యూనివర్సిటీని తరలిస్తే ఊరుకోం
మహబూబాబాద్: మానకోట జిల్లాకు మంజూరైన గిరిజన యూనివర్సిటిని ములుగు మండలానికి తరలించడాన్ని నిరసిస్తూ బిజెవైయం ఆధ్వర్యంలో సోమవారం ఎంపి సీతారాంనాయక్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాఘవులు మాట్లాడుతూ.. స్థానిక ఎంపి, ఎమ్మెల్యేల అసమర్థ వల్లే మానుకోట జిల్లాకు వచ్చిన గిరిజన యూనివర్సిటి ములుగు తరలివెళ్లి పొతుందని ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మానుకోట ఎంపి సీతారాంనాయక్‌కు మానుకోటలో తిరిగే హక్కు లేదని మూట,ముళ్లే సర్దుకొని ములుగుకు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఎంపిని మానుకోట జిల్లాలో అడుగుపెట్టనివ్వమని బిజెవైయం జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ అన్నారు. గిరిజన యూనివర్సిటిని మానుకోట జిల్లాలో నిర్మాణం చేపట్టే వరకు ఉద్యమాలు ఆపమన్నారు.
అవసరమైన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకైనా సిద్దమని, ఎంపి, ఎమ్మెల్యే ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ, రాధబాయిపటేల్, చుక్కల నరేష్, శ్రీకాంత్, పల్లె సందీప్, రమేష్‌నాయక్, అకిల్, మహేష్, లక్ష్మణ్, రవిశంకర్, సాయి, విష్ణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలి

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబాబాద్: విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజల అభ్యున్నతికి అధికారులు విధిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకొని దరఖాస్తు దారులకు అభ్యర్థనలు రాతపూర్వకంగా పంపుతూ తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా వివిధ శాఖల అధికారులు చొరువ తీసుకోవాలన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తూ ప్రజల శ్రేయస్సును మన ధ్యేయంగా భావించినప్పుడే జిల్లాలో అభివృద్ధి వికసిస్తుందని అన్నారు. జిల్లాలో ఒడిఎఫ్ సాధించుటలో 21శాతం వెనుకంజలో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామపంచాయతీ ఒడిఎఫ్ సాధించేలా మండల ప్రత్యేక అధికారులు బాధ్యత వహించాలన్నారు. అక్టోబర్ మాసం వరకు నిర్వహించేహరితహారం కార్యక్రమాల ద్వారా నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయ్యాలని, హరిత దళాలను ఏర్పరుచుకొని రక్షణ కల్పిస్తూ 100మొక్కలకు పైగా పెంచుతున్నన వారికి నిర్వహణ బాధ్యత ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీజిల్స్ రుబెల్లా టీకా కార్యక్రమం 100శాతం పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో వ్యాపించు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. నేటి ప్రజవాణికి మొత్తం 133 దరఖాస్తులు రాగా అందులో మున్సిపల్ కార్మికుల సమస్యలు, నిరుద్యోగుల ఉద్యోగభృతి కోరుతూ, రైతురుణమాఫీ, కార్పొరేషన్ లోన్స్, పింఛన్, భూ వివాదాలు, ఇందిరమ్మ పాత బిల్లులు మొదలగు వాటిపై దరఖాస్తులు వచ్చాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి దామోదర్‌రెడ్డి, డిఆర్‌వో రాంబాబు, డిఆర్‌డివో వై వి గణేష్, ఎల్‌డియం రాఘవేంద్రరావు, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రాయపర్తి: చేసిన అప్పులు తీర్చలేక ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై శ్రీ్ధర్ కథనం ప్రకారం కొత్తూరు గ్రామానికి చెందిన సిహెచ్ రాజు(30) అనే రైతు తనకు ఉన్న మూడు ఎకరాలతోపాటు మరో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది వ్యవసాయంలో పెట్టుబడి రాక అప్పులు ఎక్కువయ్యాయి. దానికితోడు ఈ ఏడాది వ్యవసాయం కోసం తెచ్చిన అప్పులు తోడవటంతో అప్పులు తీర్చలేని స్థితిలో నిరాశకు గురైన రాజు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసామని ఎస్సై తెలిపారు.
పంటపొలాల మధ్య రసాయన వ్యర్థాల డ్రమ్ములు
గుండాల: మండలంలోని వెల్మజాల గ్రామ శివారు పంట పొలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలుగల 57డ్రమ్ములను గుట్టు చప్పుడు కాకుండా పడివేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి అధికారులు చేరుకొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం నిఘా పెంచడంతో రసాయన కంపెనీలకు చెందిన వ్యక్తులు మారుమూల ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. వెల్మజాల గ్రామం పారిశ్రామిక ప్రాంతాలకు దూరంగా ఉండడంతో కావాలనే మారుమూలప్రదేశాలను ఎంచుకొని వెళుతున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. పడివేసిన రసాయన వ్యర్థాల వల్ల సమీప ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతున్నట్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనకు పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేందర్‌భట్ తెలిపారు.
రైల్వేస్టేషన్‌లో బెల్లం పట్టివేత
నెక్కొండ: గుడుంబా తయారు చేసేందుకు రైలులో అక్రమంగా తరలిస్తున్న బెల్లం, పటికను పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మిథున్ సోమవారం తెలిపారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలులో నెక్కొండలో దిగుమతి చేస్తుండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని అన్నారు. క్వింటాల్ బెల్లం, అర క్వింటాలు పటికను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బెల్లం రవాణాదారులు పరారయ్యారని, వస్తువులను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామని చెప్పారు.
పోలీసుల ఆధ్వర్యంలో చెక్‌పోస్టుల ఏర్పాటు
తొర్రూరు: త్వరలో రానున్న వినాయకచవితి, బక్రీద్ పర్వదినాల సందర్భంగా గ్రామాల్లోకి అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా నిర్వహించేందుకు గాను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, తొర్రూరు డిఎస్పి రాజారత్నం, సిఐ చేరాలు ఆదేశాల మేరకు తొర్రూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చెక్‌పొస్టులను ఏర్పాటు చేసినట్టు తొర్రూరు ఎస్సై డి.రమణమూర్తి తెలిపారు. మరికొద్ది రోజుల్లో వినాయకచవితి, బక్రీద్ పండుగలు వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు ఈప్రత్యేక చెక్‌పొస్టుల వద్ద ప్రత్యేక పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించినున్నట్టు ఎస్సై వివరించారు. తొర్రూరు డివిజన్ కేంద్రం శివారు పాలకేంద్రం సమీపంలో ఈ ప్రత్యేక చెక్‌పొస్టును ఏర్పాటు చేసినట్టు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో వినాయక నిమజ్జనం కార్యక్రమాలు పూర్తి అయ్యేంత వరకు ఈ చెక్‌పొస్టులను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు 2వ ఎస్సై తాహెర్‌బాబా, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాసమస్యలను పట్టించుకోని కేంద్రప్రభుత్వం

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్: కేంద్రంలో అధికారం కోసం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన బిజెపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో హామీల అమలు సంగతి అటుంచి ప్రజాసమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవటం లేదని సిపిఎం అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి విమర్శించారు. జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యకర్తలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. హన్మకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటినుంచి దళితులు, మైనారిటీలు, ఇతర బడుగువర్గాలపై దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో గోమాంసం తింటున్నారనే ఆరోపణతో అమాయకులను హత్య చేసారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అక్కడి ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన హిందూ యువవాహిని కార్యకర్తలు హిందు యువతి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంగా ఆ యువకుడిని హత్య చేసారని అన్నారు. మనువాద శక్తులు దళిత, బహుజన, మైనారిటీల ఆచారాలు, అలవాట్లపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. పేరుకు బిజెపి ప్రభుత్వమే అయినా శాసిస్తున్నది ఆర్‌ఎస్‌ఎస్ ఇతర హిందువాద సంస్థలని ఆరోపించారు. మహిళలను గౌరవించటం తమ పార్టీ సంప్రదాయమని ప్రధానమంత్రి మోదీ పదేపదే చెబుతున్నారని, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చట్టబద్ధత కల్పించి నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జిఎస్‌టి విధానం బహుళజాతి సంస్థలకు, దేశీయ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడానికని, ఈ విధానంతో దేశంలోని సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన బిజెపి మూడేళ్ల అధికారంలో రెండులక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. వెల్‌కం ఇండియా, డిజిటల్ ఇండియా పేర్లతో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు, ప్రైవేటు పెట్టుబడులను ఇష్టారాజ్యంగా కుమ్మరించేందుకు సహకరించి దేశ పరిశ్రమలు మూతపడేలా వ్యవహరిస్తోందని, అన్నారు. కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు అందరూ ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఉప్పలయ్య, రాగుల రమేష్, జిల్లా నాయకులు గొడుగు వెంకట్, సారంగపాణి, భానునాయక్, అరుణ, జ్యోతి, అనిత పాల్గొన్నారు.

భూ సర్వేలను పారదర్శకంగా నిర్వహించాలి

వడ్డేపల్లి:జిల్లాలోని గ్రామాలలో నిర్వహిస్తున్న మొదటి విడత రెవెన్యూ సర్వేను 15 రోజులలో పూర్తి చేయాలని, సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దార్లతో పహానీ ఫ్యూరిఫికేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి వెళ్లి ఇంటి సర్వేతోపాటు భూముల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించి పారదర్శకంగా పహానీలను పరిశీలించి వెబ్‌ల్యాండ్లలో పొందుపరచాలని అన్నారు. ఈ మేరకు గతంలో ఉన్న లింక్ డాక్యుమెంట్లను పరిశీలించాలని పేర్కొన్నారు. సర్వే పూర్తి చేసిన మండలాలలో తుది గ్రామసభలను నిర్వహించి రైతుల సమక్షంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ముందుగా రెవెన్యూ గ్రామాల వారీగా సర్వేను నిర్వహించి, 20 నుండి 30 సంవత్సరాల క్రితం రికార్డులను పరిశీలించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ సర్వేను నిర్వహించాలని తెలిపారు. పహానీలలో ఉండే తప్పొప్పులు సరిచేసి వెబ్‌ల్యాండ్ రికార్డులలో పొందుపరచాలని అధికారులను కోరారు.
అమర వీరుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి
పరకాల: రజాకర్లను ఎదిరించి స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన అమర వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలో పెట్టాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పరకాల పట్టణంలో బిజెపి పట్టణ, మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2న అమరవీరులను స్మరించుకోవడానికి వారికి నివాళి అర్పించుటకు స్థానిక అమరధామంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ప్రతి గ్రామంలో ప్రతి బూత్‌లో కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఇన్‌చార్జ్ కట్ట సుధాకర్, డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, గుజ్జ సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్, ఆర్‌పి జయంతిలాల్, మేకల రాజవీరు, కాచం గురుప్రసాద్, గండ్ర జయపాల్‌రెడ్డి, కానుగుల గోపినాధ్, కుక్కల విజయ్, ఆర్‌పి సంగీత తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ధర్నా
నర్సంపేట: భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో సోమవారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈసందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ క్లయిమ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం సరి కాదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూంలను భవన నిర్మాణ కార్మికులకు కేటాయించి, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 1996 చట్టంలోని అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు మూడు వేల రూపాయల పింఛన్, వారి పిల్లలకు స్కాలర్ షిప్‌లు అందించి చేయూతనివ్వాలని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ఇసుకను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని ఆర్డీవో నెమురుగొమ్ముల రవికి నాయకులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆసంఘం మండల, పట్టణ నాయకులు కాటబోయిన సాంబయ్య పాల్గొన్నారు.

గుడిసెవాసుల దీక్ష
నర్సంపేట: పట్టణంలోని ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలకు ఇంటి నంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నర్సంపేట నగర పంచాయతీ కార్యాలయం ఎదుట గుడిసెవాసులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సిపిఎం రూరల్ జిల్లా ఇన్‌చార్జి చింతమళ్ల రంగయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా రంగయ్య మాట్లాడుతూ పట్టణంలోని 204, 318 సర్వే నంబర్లలో గుడిసెలలో నివసిస్తున్న పేదలకు గత మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలిచ్చిందన్నారు. అయితే గుడిసెలకు ఇంటి నంబర్ల కేటాయించడంలో నగర పంచాయతీ అధికారులు, పాలకవర్గ సభ్యులు చిత్తశుద్ధి చూపించడం లేదని వాపోయారు. తక్షణమే గుడిసెలకు ఇంటి నంబర్లు కేటాయించి, అంతర్గత సిసి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సైడ్ డ్రైనేజీ కాల్వలను నిర్మించాలని కోరారు. గుడిసె వాసుల సమస్యలను పరిష్కరించేంత వరకు రిలే నిరాహారదీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, హన్మకొండ సంజీవ, వంగాల రాగసుధ, ఎండి.ఘనీ, హన్మకొండ శ్రీ్ధర్, బుర్రి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.