కృష్ణ

ఉపాధి హామీ పనుల్లో జిల్లా ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉపాధి హామీ పనుల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్ ఉపాధి హామీ ప్రగతికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఆదివారం 68,926 మంది ఉపాధి హామీ కూలీలతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా, 66,135 మందితో చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు. చివరి స్థానంలో గుంటూరు జిల్లా ఉందన్నారు. ఇదేవిధంగా పంట సంజీవని పనుల్లో కూడా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, ఉపాధి హామీకి సంబంధించి వివిధ పనుల్లో జిల్లా రాష్ట్రంలో మంచి ప్రగతిలో ఉందని కలెక్టర్ వివరించారు.
వ్యవసాయాధికారులకు ప్రశంస
సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంలో జిల్లా వ్యవసాయ అధికారులు 3 లక్షల హెక్టార్లలో నాట్లు వేయంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల కంటే కృష్ణా జిల్లా వ్యవసాయాధికారులు సరైన సమయంలో పంటల నాట్ల ప్రక్రియ పూర్తి చేశారని పేర్కొన్నారన్నారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడంలో వ్యవసాయ శాఖాధికారులను, జిల్లా రైతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

రాష్ట్ర సబ్ జూనియర్ బేస్‌బాల్ చాంప్ కృష్ణా
* బాలికల విభాగంలో ద్వితీయ స్థానం
విజయవాడ (స్పోర్ట్స్): వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఈ నెల 18 నుండి 20 వరకు జరిగిన రాష్టస్థ్రాయి సబ్ జూనియర్ బేస్‌బాల్ చాంపియన్‌షిప్‌లో కృష్ణా జిల్లా బాలుర జట్టు చాంపియన్‌గా నిలిచింది. బాలికల జట్టు ద్వితీయస్థానం కైవసం చేసుకున్నట్లు జిల్లా సంఘ కార్యదర్శి ఎంవి సత్యప్రసాద్ తెలిపారు. ఈసందర్భంగా విజేతలైన జట్టు సభ్యులను శాప్ ఒఎస్‌డి పి రామకృష్ణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా సంఘ చైర్మన్ కుర్రా నరేంద్ర, అధ్యక్షులు టి తులసీరావు, ఉపాధ్యక్షులు పి మురళి, రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి వై మురళి, తదితరులు అభినందించారు.
రేపటి నుండి స్కూల్‌గేమ్స్ జట్ల ఎంపికలు
జిల్లా స్కూల్‌గేమ్స్ సమాఖ్య అండర్-14, 17, 19ల ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి పలు క్రీడాంశాల్లో జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయా సమాఖ్య కార్యనిర్వహణ కార్యదర్శులు కె శకుంతలదేవి, శేషు సోమవారం విడివిడిగా ప్రకటనల్లో తెలిపారు. అండర్-14 విభాగంలో ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 26న ఉదయం 9గంటలకు వాలీబాల్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ జట్ల ఎంపికలు, అండర్-14, 17 విభాగాల్లో 23న విపి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో మధ్యాహ్నం 3గంటలకు జిమ్నాస్టిక్స్, 24న ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉదయం 9గంటలకు ఫుట్‌బాల్, 27న గోకరాజు గంగరాజు లైలా షూటింగ్ రేంజ్‌లో ఉదయం 6గంటలకు రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్-19 విభాగంలో 23న శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఉదయం 9గంటలకు టేబుల్ టెన్నిస్, చెస్, బాస్కెట్‌బాల్ ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికల్లో పాల్గొనే వారు ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో హాజరుకావాలని వారు సూచించారు.

‘స్వచ్ఛ గాడి’లో భాగంగా రైళ్ల బోగీలు శుభ్రం
విజయవాడ (రైల్వేస్టేషన్): స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్వేలో భాగంగా సోమవారం రైలు బోగీలకు పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ జంక్షన్‌గా పేరొందిన విజయవాడ డివిజన్ నుంచి ఒక రోజులో 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 30 ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు బయలుదేరి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రైళ్లు విజయవాడ కోచింగ్ డిపోలోకి చేరగానే అక్కడ ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది ఆ బోగీలను వారి విధుల ప్రకారం పర్యవేక్షిస్తుంటారు. ఇవి కాకుండా విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ, చెన్నై సెంట్రల్ - విజయవాడ - చెన్నై సెంట్రల్ జనశతాబ్ది వంటి ఎక్స్‌ప్రెస్‌లు ప్లాట్‌ఫారం మీదకు వచ్చి అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోతుంటాయి. ఇటువంటి రైళ్లకు అధికారులు ఇక్కడే క్లీనింగ్ వంటి పనులు చేపడుతుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రత్యేక పిలుపు మేరకు సోమవారం విజయవాడ నుంచి బయలుదేరే రైళ్లను స్వచ్ఛ గాడి పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు బయలుదేరే రైళ్లలన్నింటిని పరిశుభ్రంగా రైలు బోగీలకు బయట, లోన వైపు చేపట్టే కార్యక్రమాన్ని కోచింగ్ యార్డులో ప్రతి రైలులోని ప్రతి బోగీలో చేపట్టారు. అలాగే ప్లాట్‌ఫారంపై నిలిచి ఇక్కడ నుంచి తిరిగి బయలుదేరే జనశతాబ్ది, విజయవాడ - సికింద్రాబాద్ స్పెషల్, రైళ్ల పరిశుభ్రత విషయంలో స్టేషన్ గెజిటెడ్ మేనేజర్ సిహెచ్ సురేష్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌లోని చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు, సి అండ్ డబ్ల్యు విభాగానికి చెందిన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎం రత్నకిషోర్‌లు దగ్గరుండి పరిశుభ్రతపై పర్యవేక్షించారు. అలాగే 21న సోమవారం, 22న మంగళవారం 2రోజులు దూర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫారం మీదకు రాగానే బోగీలను శుభ్రపరచడంతో పాటు ఆ బోగీలో ఉన్న అపరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఆ బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వచ్ఛ రైల్వే, స్వచ్ఛ గాడి గురించి అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే రైల్వేస్టేషన్‌లోని మైక్ ప్రచారం ద్వారా రైళ్ల రాకపోకలు తెలిపే సమాచారంతోపాటు మధ్య మధ్యలో స్వచ్ఛ రైల్వే, స్వచ్ఛ గాడిపై ప్రత్యేక ప్రకటనలు ద్వారా ప్రయాణికులకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ ధనుంజయులు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు అవగాహన కలిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు, ప్రచారం వంటివి చేపట్టినట్లు స్టేషన్ గెజిటెడ్ మేనేజర్ సిహెచ్ సురేష్ తెలిపారు.

‘ప్రజావాణి’ అర్జీలపై తక్షణం స్పందిస్తున్నాం

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం: సాయం కోసం వచ్చే వారి పట్ల ప్రేమాభిమానాలు చూపి వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ట త్రిపాఠీ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజావాణి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎవరు ఏ సమస్యపై వచ్చినా తక్షణమే స్పందిస్తున్నామన్నారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.
మట్టి వినాయకుడినే పూజిద్దాం
మచిలీపట్నం (కల్చరల్) : మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఎస్పీ త్రిపాఠి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలిగించే రసాయనిక పదార్ధాలతో తయారు చేసే విగ్రహాల జోలికి వెళ్లవద్దని కోరారు. కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేసి పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ నరసింహమూర్తి, కీ రిసెప్షనిస్ట్ లక్ష్మి, పిఆర్‌ఓ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

భయపడొద్దు
తోట్లవల్లూరు: పాములలంక గ్రామంలోని జ్వరం బాధితులు భయపడాల్సిన పనిలేదని డిఎంఅండ్‌హెచ్‌ఓ టివిఎస్‌ఎన్ శాస్ర్తీ చెప్పారు. అన్ని వైరల్ జ్వరాలేనన్నారు. సబ్‌సెంటర్‌లో పూర్తిస్థాయి వైద్య చికిత్స అందించడానికి ఏర్పాటు చేశామన్నారు. పాములలంకలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. రోగులను స్వయంగా పరామర్శించి ఆరోగ్యంపై వాకబు చేశారు. డాక్టర్ గోపాలనాయక్, తహశీల్దార్ జి భద్రు, సర్పంచ్ పాముల శ్రీనివాసరావులతో మాట్లాడి గ్రామంలో పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామం మొత్తం పారిశుద్ధ్య చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడా మురుగు లేకుండా చేశామన్నారు. రోడ్లపై మట్టిని తొలగించామని, దోమల నివారణ మందును ప్రతి ఇంటిలో స్ప్రే చేయించామని సర్పంచ్ డిఎంఅండ్‌హెచ్‌ఓకి తెలిపారు. గ్రామంలో జ్వరాల పెరుగుదల తగ్గిందని డాక్టర్ గోపాలనాయక్ చెప్పారు. అనంతరం శాస్ర్తీ విలేఖరులతో మాట్లాడుతూ పాములలంకలో జ్వరాల బాధితులకు వైద్య సేవలు అందించటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. నలుగురు డాక్టర్లను ఏర్పాటు చేశామని, బయట నుంచి వైద్య సిబ్బందని తీసుకు వచ్చామని తెలిపారు. జిల్లా మలేరియా ఆఫీసర్ ఆదినారాయణ గ్రామంలో ఉండి శానిటేషన్‌ను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సోమవారం సబ్‌సెంటర్‌లో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, వీరిలో కొత్తగా జ్వరం వచ్చిన వారు ఐదుగురు మాత్రమే ఉన్నారన్నారు. మిగతావారు పాతవారని చెప్పారు. ఎనిమిది మందిని అంబులెన్స్ ద్వారా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. చినఓగిరాల డాక్టర్ మనోజ్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ సీతమ్మ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. జ్వరాల తీవ్రత తగ్గిందని అన్నారు. గ్రామంలో పూర్తిగా జ్వరాలు తగ్గే వరకు ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు.

నూతన ఎక్సైజ్ పాలసీని రద్దు చేయాలి

మచిలీపట్నం (కోనేరుసెంటర్): నూతన ఎక్సైజ్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్ర్తి విముక్తి సంఘటన ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తెరలేపుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పాలసీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని స్ర్తి విముక్తి సంఘటన నాయకురాలు పామర్తి అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఉత్పత్తులను, వ్యాపారాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. రేషన్ డిపోల ద్వారా నిలిపి వేసిన కిరోసిన్, పంచదార పంపిణీని పునరుద్ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముచ్చు సుధాకర్, కొప్పినేని ఉమా, ఈపూరి రాంబాబు, గంజాల కుమారి, రాణి, దుర్గ, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.

‘మీకోసం’ అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం: ‘మీకోసం’ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి చంద్రుడు మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అలసత్వంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో వచ్చిన వారే మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఒకటికి పది సార్లు అర్జీదార్లను తిప్పించుకోవడం భావ్యం కాదన్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు చందన సూర్య కాంతమ్మ తన కుమారిడి సాయంతో అర్జీ ఇచ్చేందుకు మీకోసంకు వచ్చారు. దీనిపై స్పందించిన జెసి చంద్రుడు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా వీల్ చైర్‌ను అప్పటికప్పుడు ఇప్పించారు. దీంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ - 2 బి మార్కండేయులు, ఆర్డీవో సాయిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ సుధాకర్, జెడ్పీ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖాధికారి దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

29న మైలవరంలో 3కె రన్
మైలవరం: ఈనెల 29న జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని మైలవరంలో 3కె రన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు మైలవరం అథ్లెటిక్ అసోసియేషన్(మా) అధ్యక్షులు జి సాంబశివారెడ్డి, కార్యదర్శి ఎం రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్-14, ఆండర్-17, ఓపెన్ కేటగిరీ విభాగాలలో బాలబాలికలకు ఈపోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి ఈపోటీలు జరుగుతాయన్నారు. అండర్-14 విభాగంలో పాల్గొనేవారు 1-1-2004 తర్వాత జన్మించి ఉండాలని, అండర్-17 విభాగాలలో పాల్గొనేవారు 1-1-2001 తర్వాత జన్మించి ఉండాలని సూచించారు. ఆసక్తిగలవారు ఈనెల 29న ఉదయం 7గంటలకు లకిరెడ్డి హనిమిరెడ్డి జడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చి తగిన ధృవపత్రాలతో వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు

మచిలీపట్నం (కోనేరుసెంటర్): సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉందని పట్టణ 2వ అదనపు జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్ శివశంకరరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బుద్ధాలపాలెం గ్రామంలో సోమవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు అందుకోవాలన్నారు.
ఈ విషయంలో ఏ అధికారైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. ఈ సమావేశంలో పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోగంటి సాయిమోహనరావు, న్యాయవాది చీలి ముసలయ్య, పిఎసిఎస్ అధ్యక్షుడు వాలిశెట్టి నాగేంద్రరావు, ఎంపిటిసి కాగిత దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్): పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో శానిటేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడకముందే పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు. కాచి చల్లార్చిన నీటిని తాగే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు భాను వర ప్రసాద్, రఘు, ఉదయ్ పాల్గొన్నారు.

వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి

మచిలీపట్నం (కల్చరల్): బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు ధర్నా చేశారు. సర్వశిక్షాభియాన్ ద్వారా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పిఇటీలను 2017-18 మే 3తవ తేదీ నుండి రీ ఎంగేజ్ చేసుకోమని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గత మే 3వతేదీన అన్ని జిల్లాల పిఓలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆ ఆదేశాలను అమలు చేయడంలో జిల్లా సర్వశిక్షాభియాన్ అధికారులు విఫలమయ్యారన్నారు.
తక్షణమే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలను అమలు చేసి వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రెండు నెలలకు ఒకసారి యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్, వర్క్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ పార్ట్‌టైమ్ కాంట్రాక్ట్ ఇన్‌స్ట్రక్టర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు సిహెచ్‌ఎన్ దేవేంద్రరావు, ఎస్‌పి మల్లిఖార్జునరావు, ఎన్ పద్మావతి, శ్రీనివాసరావు, కవిత, లత, ఎమ్ కోటేశ్వరరావు, ఏసుబాబు, హరికృష్ణ పాల్గొన్నారు.
మచిలీపట్నం ఉద్యోగులకు 20శాతం హెచ్‌ఆర్‌ఎ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఎ 20శాతం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎంతో కాలంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు 20 శాతం హెచ్‌ఆర్‌ఎ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 20శాతం హెచ్‌ఆర్‌ఎ ఫైల్‌పై సోమవారం ఆమోదముద్ర వేశారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 20 శాతం హెచ్‌ఆర్‌ఎ సాధనలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎన్‌జిఓ) కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు నేతృత్వంలో తూర్పు కృష్ణా ఎన్‌జిఓ నాయకులు అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రాలు ఇవ్వటంతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎట్టకేలకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి మచిలీపట్నంతో పాటు శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 20 శాతం హెచ్‌ఆర్‌ఎ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. సంబంధిత ఫైల్‌పై సిఎం చంద్రబాబు సంతకం చేశారు. ఆమోద ముద్ర పడిన ఫైల్‌ను త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో నామమాత్రంగా చర్చించి జివో జారీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా 20 శాతం హెచ్‌ఆర్‌ఎ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తూర్పు కృష్ణా ఎన్‌జిఓ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వుల్లి కృష్ణ, దారపు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎన్‌జిఓస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి అశోక్ బాబు, చంద్రశేఖరరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
హర్షం
విజయవాడ : మచిలీపట్నం పట్టణ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్‌ను 14.5 శాతం నుండి 20 శాతానికి పెంచుతూ సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి సోమవారం సంతకం చేయడం పట్ల ఉద్యోగ సంఘాల జెఎసి జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. 14.5 శాతం నుండి 20 శాతానికి పెంచుతూ రేపోమాపో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా మచిలీపట్నం పరిధిలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 15వేల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. కారుణ్య నియామకాలకు విద్యార్హత సడలింపు, ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 60 సంవత్సరాల వయోపరిమితిని 2014 జూన్ నుంచి అమలు, ప్రభుత్వ లెక్చరర్ల ప్రమోషన్లు, ఫిట్‌మెంట్ అమలు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించటం వంటి ఉత్తర్వులు ఈ మాసంలోనే విడుదల చేసినందుకు ఉద్యోగుల పక్షాన ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఎపి ఎన్జీవోల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు విద్యాసాగర్ ప్రకటనలో వివరించారు.