తూర్పుగోదావరి

కొనసాగుతున్న బుజ్జగింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: పోటీలో ఉన్న రెబల్స్‌ను దారికి తెచ్చుకునే ప్రయత్నాలను అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి నేతలు ముమ్మరం చేశారు. ఓవైపు స్వతంత్రంగా పోటీ చేస్తున్న ఇరు పార్టీలకు చెందిన రెబల్స్ ప్రచారంలో కొనసాగుతున్నారు. మరోవైపు వీరిని బుజ్జగించేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మంత్రి యనమల సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ రెబల్స్ ప్రచారం నుండి తప్పుకుంటారన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బిజెపికి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మంత్రి యనమలను కలిసేందుకు టిడిపి కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపు రెబల్స్ విషయమై ఇరువురు మంత్రులు చర్చించారు. బిజెపి అభ్యర్ధులు పోటీ చేస్తున్న వివిధ డివిజన్లలో తెలుగుదేశానికి చెందిన రెబల్స్ బరిలో ఉన్న విషయాన్ని మంత్రి మాణిక్యాలరావు వివరించారు. ఇదిలావుంటే అధికార పార్టీ కావడంతో రెబల్స్‌కు తెలుగుదేశం వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నట్టు సమాచారం! కార్పొరేషన్ ఎన్నికల్లో అధిక స్థానాలు దక్కించుకుని, మేయర్ పీఠాన్ని అధిష్టించిన పక్షంలో అభివృద్ధి నిధులు, పనులను మీకే అప్పగిస్తామంటూ నేతలు బుజ్జగిస్తున్నారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. వీరంతా వివిధ డివిజన్లకు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎక్సైజ్ మంత్రి కెఎస్ జవహార్ కూడా ఆయా డివిజన్లలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బుజ్జగింపుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఆ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి, రాష్ట్ర నేత బొత్స సత్యనారాయణ, విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తదితరులు రెబల్స్‌ను ప్రసన్నం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇంకా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కాకినాడలో మకాం వేశారు. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే రికార్డ్ స్థాయిలో మెజారిటీ అవసరం కావడంతో, నగరంలో గ్రూపులకు తావులేకుండా సమిష్టిగా విజయం కోసం కృషి చేసే వ్యూహంతో సాగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నేతలు మాత్రం విజయంపై ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను సాధించి తీరుతామని, అలాగే కనీసం నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ పార్టీ తరఫున నియమితులవుతారని మంత్రి యనమల చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ స్థానిక సంస్థల మార్గదర్శకాలను అనుసరించి, ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
*నగరంలో 196 పోలింగ్ కేంద్రాలు
*రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్ధ ఎన్నికలు నిష్పక్షిపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ డాక్టర్ ఎన్ రమేష్‌కుమార్ సూచించారు. సోమవారం రమేష్‌కుమార్ జిల్లా కలెక్టరేట్‌లోని విధానగౌతమీ హాలులో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను కోరారు. జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఎన్నికల్లో హింసకు తావులేకుండా సజావుగా జరిపేందుకు ప్రజలు సహకరిస్తారని చెప్పారు. ఎక్కువ శాతం మంది ఎన్నికల్లో తమహక్కును వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ పోలింగ్ నిమిత్తం 196 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మొత్తం 2లక్షల 29 వేల 373 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నుట్లు కలెక్టర్ చెప్పారు. 216 ప్రిసైడింగ్ అధికారులు, 216 అసిస్టెంట్ అధికారులు, 723 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. ఫొటో ఓటర్ల స్లిప్‌లను సోమవారం నుంచి బుధవారం వరకు ఆయా బూత్ అధికారులు ఇంటింటా పంపిణీ చేస్తారన్నారు. ఈ నెల 29వ తేదీన ఎన్నికల ఓటింగ్ ఉదయం 8గంటల నుండి జరుగుతాయని, సెప్టెంబర్ 1న లెక్కింపు చేస్తామని చెప్పారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ 28పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మకంగాను, 52 సమస్యాత్మకంగాను గుర్తించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల కమీషన్ కార్యదర్శి ఎవి సత్యప్రకాష్, నగరపాలక సంస్ధ కమీషనర్ ఎస్ అలీంబాషా, డిఆర్‌ఓ ఎం జితేంద్ర, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల కమీషనర్ రమేష్‌కుమార్ గాంధీనగర్, రామారావుపేటల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
కేంద్రం నుండి అధిక నిధులు కోరతా
అరకు ఎంపి కొత్తపల్లి గీత
రంపచోడవరం: ప్రధాన మంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంకల్ప సిద్ధి - నవభారత నిర్మాణం కార్యక్రమానికి నాలుగు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలకోసం కేంద్ర ప్రభుత్వం నుండి అధిక నిధులు కోరతానని అరకు ఎంపి కొత్తపల్లి గీత అన్నారు. సోమవారం స్థానిక పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో సంకల్ప సిద్ధి - నవభారత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రత్నాబాయితో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపి గీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రానున్న అయిదేళ్లలో రెట్టింపు చేయడానికి ఏడు సూత్రాలు ప్రవేశపెట్టిందన్నారు. వాటిని కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో అందరూ కలసికట్టుగా వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయమన్నది మన దేశానికి వెనె్నముక వంటిదన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం గిరిజనుల అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు. ఎమ్మెల్సీ రత్నాబాయి మాట్లాడుతూ వర్క్‌షాపులు, సమావేశాల నిర్వహణ ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖలు గిరిజనుల అభివృద్ధికి పాటుపడటం సంతోషదాయకమన్నారు. గిరిజన ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు చాలా వరకు ఉన్నాయని, వాటిని రైతులు అందిపుచ్చుకుని వ్యవసాయంలో అభివృద్ధి సాధించాలన్నారు. వైఎస్సార్ ఉద్యా విశ్వవిద్యాలయం ఉప కులపతి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. బిందు, తుంపరల సేద్య పరికరాలకు నిధులు అధికమొత్తంలో మంజూరు చేసినట్టు చెప్పారు. ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన రైతులకు జీడిమామిడి పంట జీవనాడి అన్నారు. సుమారు 60 వేల ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి సాగు జరుగుతోందన్నారు. 23 ఎత్తిపోతల పథకాల ద్వారా 6 వేల ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరించబడిందని చెప్పారు. నీటి వనరులు ఉన్న చోట సాగును ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ భారతి, ఎంపిటిసి పూజ, కెవికె ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, సిహెచ్‌ఒ శ్రీనివాసులు, ఆత్మ పిడి పద్మ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో బిజెపితో టిడిపికి పొత్తు ఉందా లేదా?
*చంద్రబాబు రెండు నాలుకల ధోరణి
*నంద్యాల, కాకినాడల్లో గెలుపు మాదే
*వైసిపి నేత బొత్స
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్ధ ఎన్నికల్లో బిజెపితో టిడిపి కలిసి ప్రచారం చేస్తోందని, నంద్యాలలో మాత్రం బిజెపి ఊసే లేకుండా టిడిపి ఎందుకు ప్రచారం చేసిందో ప్రజలకు బహిర్గతం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ టిడిపి నాయకులను ప్రశ్నించారు. ఇదే నా మీ పవిత్రమైన పొత్తా అని దేశం పార్టీని దుయ్యబడుతూ ఈవిషయంలో బిజెపి నేతలు ఎందుకు వౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం చంద్రబాబు మరోసారి ఈ విషయంలో రెండు నాల్కుల ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని వైకాపా ఎన్నికల కార్యాలయంలో సోమవారం బొత్స విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అధికార పార్టీ మోసాలు, ఆగడాలు నంద్యాలలో ముగిస్తున్నాయని, తిరిగి కాకినాడలో ప్రారంభించారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ గడచిన మూడేళ్ళ కాలంలో కాకినాడ నగరాభివృద్ధికి ఏం చేశారో చెప్పకుండా ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడం వారి కుత్సిత నీతికి నిదర్శనమన్నారు. కాకినాడ స్మార్ట్‌సిటీగా కేంద్రం ఎంపిక చేసి దశల వారీగా 1900 కోట్లను కేటాయించిందని, ఇక్కడి దేశం నాయకుల అవినీతి కారణంగా కేవలం 5కోట్ల లోపు మాత్రమే పనులను చేశారని ఆరోపించారు. దేశం నాయకుల అవినీతి కారణంగా కేంద్రం నిధులను విడుదల చేయడం మానేసిందని బొత్స అన్నారు. అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు కాకినాడతో పాటు జిల్లాలో పెట్రోకారిడార్, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను, కోస్తా కారిడార్, ఎలక్ట్రానిక్స్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తానని చెప్పారని అవి ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ నగర అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే జరిగిందని బొత్స అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను చేస్తానంటే ఆయన్ను గృహ నిర్భందం చేయడం సరికాదన్నారు. ఉద్యమాల పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాదయాత్ర చేసినా, పొర్లు దండాల యాత్రలను చేసినా అనుమతి తప్పనిసరి అంటూ హేళనగా మాట్లాడడం ఉద్యమ కారులను అవమాన పరచడమేనని తెలిపారు. విశాఖ తర్వాత అందమైన నగరంగా పేరుగాంచిన కాకినాడలో భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖలో హుద్‌హుద్ తుపాన్ పేరిట భూములు దోచుకున్న టిడిపి నేతలు కాకినాడ నగరంపై కనే్నశారని, ఈవిషయంలో కాకినాడ ప్రజలు అప్రమత్తంగా ఉండి వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నగరంలో ప్రచారం చేస్తున్న మంత్రులను ఏమి అభివృద్ధిచేశారో నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, కొప్పన మోహనరావు, ఎమ్మెల్యేలు ఎం ప్రసాదరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ఆర్డ్డీవో గణేష్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం: విద్యతోపాటు క్రీడల పట్ల ఆశక్తి పెంచుకొని విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించగలిగితే వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ, రజిత, కాంశ్య పతకాలు సాధించిన అమలాపురంనకు చెందిన ఏడుగురు విద్యార్థులకు సోమవారం అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియంలో పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆర్డీవో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోలర్ స్కేటింగ్ జాతీయస్థాయిలో పతకాలు సాధించి కోనసీమ కీర్తి ప్రతిష్టలను జాతీయస్థాయిలో విద్యార్థులు ఇనుమడింప జేసారని ఇదే స్పూర్తితో భవిష్యత్‌లో మరిన్ని పతకాలు కైవసం చేసుకుని కోనసీమ కీర్తిని వ్యాపింప చేయాలన్నారు. అమలాపురం డిఎస్పీ ఎవిఎల్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రోలర్ స్కేటింగ్‌లో స్వర్ణ, రజిత, కాంస్య పతకాలు విద్యార్థులు సాధించడం కోనసీమ ప్రాంతానికి గర్వకారణం అని చెప్పారు. ఉత్తమ క్రీడాకారులను ఆదర్శవంతులుగా తీసుకొని భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో విద్యార్థులు రాణించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మా ఛైర్మన్ లింగోలు పెదకాపు, అమలాపురం జడ్పీటిసి అధికారి జయవెంకటలక్ష్మి, జనిపెల్ల సర్పంచ్ చుట్టుగుళ్ళ జ్యోతి, ఎంపిటిసి సత్యవతి, అల్లవరం డిసి చైర్మన్ నిమ్మకాయల చల్లయ్యనాయుడు, పట్టణ సిఐ వైఆర్‌కె శ్రీనివాస్, పలువురు పిఇటిలు పాల్గొన్నారు.
ముద్రడగకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన
ముమ్మిడివరం: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దతుగా ముమ్మిడివరం మండలం సిహెచ్ గునే్నపల్లిలో సోమవారం రాత్రి కాపు యువత కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాపులకు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గోలకోటి సాయిబాబు, జి వెంకటేశ్వరరావు, గాలిదేవర లక్ష్మణరావు, వెన్నా శ్రీనివాసరావు, గణేశుల బ్రహ్మానందం, బొర్రా విష్ణు తదితరులు పాల్గొన్నారు.
అలసత్వాన్ని వీడండి
రామచంద్రపురం ఆర్డీవో సుబ్బారావు
రామచంద్రపురం: రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లోని గ్రామాలు ఒడిఎఫ్ పథకం అమలు విషయంలో ముందంజలో ఉన్నాయని, రామచంద్రపురం నియోజకవర్గం బాగా వెనుకబడి ఉందని ఆర్డీవో కె సుబ్బారావు పేర్కొన్నారు. మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు అలసత్వాన్ని వీడి కార్యోన్ముఖులు కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను, కలెక్టర్ ఆదేశాలను తుచ తప్పక పాటించాలని స్పష్టం చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఎంపిడిఒలు, ఎంఇఒలు, వ్యవసాయ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, విఆర్వోలు, విఆర్‌ఎలు, అంగన్‌వాడీలు, ఉపాధి హామీ ఎపిఒలు, ఫీల్డు అసిస్టెంట్లు, ఇవోపిఆర్డీలు, పంచాయితీ కార్యదర్శులతో ఆర్డీవో సుబ్బారావు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. గత మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో కొంత గడువు ఇచ్చారని, అయితే గడువు కూడ పూర్తయిందన్నారు. ప్రభుత్వం 15 వేల రూపాయలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అందిస్తున్నందున మరుగుదొడ్లు లేని లబ్ధిదారులను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. సొంతంగా స్థలం లేకపోయిన వారికి పంచాయితీ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి ఎవరి పేరునైతే మరుగుదొడ్డి నిర్మించారో వారికి తాళాలు అందచేయాలన్నారు. నిర్మాణాలకు సంబంధించి నిధుల కొరత లేదని, జూలై 31 వరకు ఉన్న పెండింగ్ బిల్లులన్నిటికీ చెల్లింపులు జరిగాయన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి తాను, కలెక్టర్ రామచంద్రపురం మండలానికి ఏడు లక్షలు, కె గంగవరం మండలానికి తొమ్మిది లక్షలు, కాజులూరు మండలానికి పది లక్షలు అడ్వాన్సు సొమ్ముగా ఎంపిడిఒలకు అందించినట్టు చెప్పారు. మహిళా సమాఖ్య సభ్యులకు డిఆర్‌డిఎ ద్వారా నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి సొమ్ము అందించే కృషి జరుగుతోందన్నారు. మరుగుదొడ్డి నిర్మాణం ఇష్టం లేదనే మాట గృహ యజమాని నుండి వినపడరాదని, అందుకు అవసరమైన విధానాలను వైద్య అధికారులు, సిబ్బంది అమలు చేయాలన్నారు. మరుగుదొడ్డి నిర్మాణ ఆవశ్యకత, బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనారోగ్య పరిస్థితులను వారికి వివరించాలన్నారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు, గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు మండల స్థాయి అధికారికి పర్యవేక్షకునిగా, గ్రామస్థాయి అధికారులను నిర్వాహక బాధ్యులుగా నియమించినట్టు ఆర్డీవో సుబ్బారావు తెలిపారు. వంద లోపు నిర్మాణాలు చేపట్టాల్సిన గ్రామాలు అగస్డు 31లోగా నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. 250 మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి సెప్టెంబరు 30 వరకు గడువు ఉందన్నారు. 250కి మించి గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 31 నాటికి రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ఒడిఎఫ్ డివిజన్‌గా ప్రకటించేందుకు ప్రతి అధికారి కృషిచేయాలని ఆర్డీవో కోరారు. వారం వారం సమీక్షలు నిర్వహించడమే కాకుండా ప్రతి శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రగతిని స్వయంగా పరిశీలిస్తామని ఆర్డీవో స్పష్టం చేశారు.
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
కాకినాడ సిటీ: ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలు, ప్రైవేటీకరణను నిరసిస్తు మంగళవారం ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ కె ఆదినారాయణమూర్తి తెలియజేశారు. దేశంలో లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడంతోపాటు ప్రైవేటీకరణవైపు అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తల నుండి రాని బాకీలను వసూలుచేయడంలో కేంద్రప్రభుత్వం నిరాసక్త వైఖరి అవలంబిస్తున్న కారణంగా ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టాల్సి వచ్చిందన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని 600బ్యాంకు బ్రాంచీలలో పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈకారణంగా మంగళవారం జిల్లాలో బ్యాంకులు మూతబడతాయని, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచిల వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపడతారని కన్వీనర్ ఆదినారాయణమూర్తి తెలియజేశారు.
మద్యం దుకాణాలు తొలగించాలని రిలేదీక్షలు
మండపేట: మండపేట మండలం మారేడుబాక శ్రీనివాస కాలనీలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు తొలగించాలని స్థానికులు చేస్తున్న రిలే దీక్షలు సోమవారం నాటికి 18వ రోజుకు చేరింది. ఇప్పటికైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మద్యం షాపు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీక్షల్లో పోతంశెట్టి భవాని, సిహెచ్ సూర్యకళ, సానబోయిన భవాని, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.
వాహనాల తనిఖీలు
కాకినాడ సిటీ: కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పోలీసులు సోమవారం రాత్రి కాకినాడ నగరంలోకి ప్రవేశించే ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. యానాం నుండి కాకినాడ నగరానికి వచ్చే ప్రాంతంలో ఎంఎస్‌ఎన్ ఛార్టీస్, జగన్నాధపురం, భానుగుడి, సర్పవరం జంక్షన్, కల్పనాసెంటర్, ఇంద్రపాలెం జంక్షన్ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో పలువురు సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. వాహనాలను తనిఖీ చేయడంతోపాటు, వాహనాల రికార్డులు, లైసెన్స్‌లు, తదితరవి పోలీస్ సిబ్బంది పరిశీలించారు. ఈతనిఖీల్లో ఎటువంటి నగదు లభ్యం కానట్లు తెలిసింది.
కాకినాడ డివైఇవోగా గణేష్‌బాబు
కాకినాడ రూరల్: కాకినాడ ఉప విద్యాశాఖాధికారిగా(డివైఇవో) గణేష్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ రూరల్ మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఆయన తాత్కాలిక బాధ్యతగా డివైఇవోగా సోమవారం చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గణేష్‌బాబును పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు, పైవేటు స్కూల్ కరస్పాండెంట్‌లు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆర్ధిక మంత్రి యనమల
కాకినాడ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల కరువు బత్యం మంజూరు, ఉపాధ్యాయుల ఆఫ్‌పే లీవు ఉత్తర్వులు తదితరాలు ఇవ్వడంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడుని కలిసి పిఆర్‌టియు సంఘ నాయకులు ఆభినందనలు తెలియజేశారు. తిమ్మాపురం గ్రామంలోని యనమల అతిధి గృహంలో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు విఎన్‌వివి సత్యనారాయణ, చింతాడ ప్రదీప్‌లు యనమలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న 398 వేతనంపై పనిచేసిన ఉపాధ్యాయులకు మోషనల్ ఇంక్లీమెంట్‌లు, డిఎస్సీ 2008లో నియామకమైన ఉపాధ్యాయులకు పిఆర్‌సి 2003 ప్రకారం వేతన వ్యత్యాసాలను సరిచూడాలని కోరారు. అదేవిధంగా సిపిఎస్ విధానం రద్దు గురించి మంత్రిని కోరగా త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎజివి సుబ్బారావు, కామేశ్వరరావు, శ్రీనిసాస్, సునీల్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.