చిత్తూరు

స్కావెంజర్స్ తరలింపును అడ్డుకున్న ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: స్థానిక స్కావెంజర్స్ కాలనీలోని యానాదులను అక్కడ నుంచి తరలించడానికి సోమవారం మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాన్ని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. స్కావెంజర్స్ కాలనీలో ముంబై తరహాలో బహుళ అంతస్థుల భవనం నిర్మాణానికి సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించి దీనిని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని మంత్రి నారాయణను ఆదేశించారు. దీంతో కొంత కాలంగా స్కావెంజర్స్ కాలనీలోని యానాదులకు ప్రత్యామ్నాయంగా మరో చోటికి తరలించి కాలనీలో బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం కాలనీలోని 145 కుటుంబాల వారితో దశలవారీగా చర్చలు జరుపుతున్నారు. వారిని ఒప్పించడానికి ప్రయత్నించి, అంగీకరించిన వారితో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించారు. ప్రభుత్వం దురద్దేశ పూర్వకంగానే స్కావెంజర్స్ కాలనీలోని యానాదులను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తోందంటూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వైకాపా నాయకులు దీనిని అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాము అక్కడ నుంచి వెళ్లేది లేదంటూ కొందరు యానాదులు కోర్టు నుంచి స్టేటస్‌కో తెచ్చుకున్నారు. అయినా సోమవారం పోలీసులు, సిఆర్‌పిఎఫ్ దళాలతో అక్కడకు చేరుకున్న మున్సిపల్ అధికారులు స్కావెంజర్స్‌ను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే అక్కడ నుంచి మున్సిపల్ అధికారులు చూపిన మరో ప్రాంతంలోని ఇళ్లకు తరలివెళ్లిన యానాదుల ఇళ్లను ప్రొక్లైనర్స్‌తో కూలగొట్టారు. మిగిలిన ఇళ్లను తొలగించడానికి ప్రయత్నించడంతో అక్కడ నివాసం ఉంటున్న వారు అధికారులకు ఎదురు తిరిగారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సిపిఎం నాయకుడు కందారపు మురళి, సిపిఐ నాయకుడు చిన్నం పెంచలయ్య, కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీదేవి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వీరి పోరాటానికి ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు సైతం మద్దతు తెలిపారు. అధికారులను కాలనీలోకి వెళ్లనీయకుండా రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ యానాది కాలనీ వాసులకు ప్రభుత్వం అన్యాయం చేయాలని చూడటం దారుణమన్నారు. వారున్న ఇళ్లకు పట్టాలిచ్చి, వారే సొంతంగా ఇళ్లు నిర్మించుకోవాలని వారు కోరుకుంటుంటే దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తామనడం సరికాదన్నారు. ఇందుకోసం వారు చేస్తున్న పోరాటానికి తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సిపిఎం రాష్ట్ర నాయకుడు కందారపుమురళి మాట్లాడుతూ కాలనీవాసులను అక్కడ నుంచి తరలించరాదని కోర్టు స్టేటస్‌కో ఇచ్చినా దానిని అతిక్రమించి అధికారులు యానాదులను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. గతంలోనే తాము అధికారులకు ఈవిషయాన్ని స్పష్టం చేశామని తెలిపారు. అయినా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తూ కాలనీ వాసులకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దీనిని తాము ఏమాత్రం సహించేదిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీదేవి మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న యానాదులను బలవంతంగా ఇక్కడ నుంచి తరలించాలని చూడటం ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఇక్కడున్న వారంతా నిరుపేదలు, నిరక్షరాస్యులని, వారున్న ప్రాంతంలోనే వారికి పట్టాలిచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా వారిని ఇక్కడ నుంచి తరలించి బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించి ఇస్తామని మోసం చేయాలని చూస్తే ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. తమకు బహుళ అంతస్థుల భవనాలు వద్దని స్కావెంజర్స్ చెబుతున్నా వారి గోడు పట్టించుకోకుండా తమకు నచ్చిన విధంగా చేయడానికే అధికారులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు స్కావెంజర్స్ కాలనీని దారాదత్తం చేయాలని చూడటం అన్యాయమన్నారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా ఇక్కడ నుంచి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారిని మాత్రం పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే మరో ప్రాంతానికి తరలివెళ్లినవారి ఇళ్లను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న స్కావెంజర్స్‌కు ఆధునిక వసతులతో కూడిన బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు ఎక్కువమంది స్కావెంజర్స్ తమ అంగీకారాన్ని కూడా తెలియజేశారని అన్నారు. ఈప్రాంతంలో భారీగా పోలీసులు, అధికారులు గుమికూడటంతో ఆప్రాంతంలో ఏం జరిగిందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. అదే సమయంలో వివిధ పార్టీల నాయకులు పోలీసులు, మున్సిపల్ అధికారులతో వాగ్వివాదానికి దిగడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.

ఇఓ పిలుపు స్వామి పిలుపుగా భావిస్తా: కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సహకారాన్ని అందించేందుకు టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ పిలుపును సాక్షాత్తు భగవంతుని పిలుపుగా భావించి పూర్తి సహకారం అందిస్తానని జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న స్పష్టం చేశారు. సోమవారం తిరుమల అన్నమయ్యభవనంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. టిటిడి ఇఓ, జెఇఓలు, సివిఎస్‌ఓలతోపాటు జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న, పోలీస్, ఆర్టీసీ, శ్రీవారి ప్రధాన అర్చకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని సుమారు రెండు గంటలపాటు ఏర్పాట్లపై లోతుగా చర్చలు జరిపారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడారు. ఉత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి టిటిడి యాజమాన్యం అన్ని విధాలా ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా తమ వంతు సహకారం కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు, తిరుపతి జెఇఓ పోలా భాస్కర్, సివిఎస్‌ఓ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, నరసింహదీక్షితులు, డాలర్ శేషాద్రి, ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు, టిటిడి సిఓ చంద్రశేఖర్, ఎఫ్ అండ్ సిఏఓ బాలాజీ, అదనపు సివిఎస్‌ఓ శివకుమార్ రెడ్డి, ఎస్‌ఇ -2 రామచంద్రారెడ్డి, విఎస్‌ఓ రవీంద్రారెడ్డి, ఎస్వీబిసి సిఇఓ నరసింహారావు, డిప్యూటీ ఇఓ కోదండరామారావు, వేణుగోపాల్‌రావు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల గోడ ప్రతిక ఆవిష్కరణ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలపై రూపొందించిన గోడపత్రికను తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ఇఓ, జెఇఓలు, కలెక్టర్, సివిఎస్‌ఓలు ఆవిష్కరించారు.

తెలుగు భాషా సాహిత్యం ప్రపంచ దేశాలకు విస్తరించాలి
* ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆకాంక్ష
శాంతీపురం: తెలుగు భాషలో ఎందరో కవులు, సాహితీవేత్తలు రచించిన సాహిత్య ప్రపంచ దేశాలకు విస్తరించినప్పుడే తెలుగుభాష గొప్పతనం బయటపడుతుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. కుప్పం ద్రవిడ యూనివర్శిటీల1 సోమవారం ఏర్పాటు చేసిన శంకరంబాడి సుందరాచారి జీవిత చరిత్ర ఆంగ్ల పుస్తకావిష్కర మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శంకరంబాడి సుందరాచారి రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం రాష్ట్ర గీతంగా ఎంపికై తెలుగువారి నోళ్లలో నానడం అయన అదృష్టమన్నారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్ర గీతాన్ని రచించాలని అప్పటి సాంస్కృతిక శాఖామంత్రిగా ఉన్న తమ తండ్రి మండలి కృష్ణారావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎందరో కవులు రచించిన గీతాల్లో శంకరంబాడి మా తెలుగు తల్లిని ఎంపిక చేయడం, అందులో అమరావతి గృహాలు అన్న పదంపై నార్ల వెంకటేశ్వరరావు అభ్యంతరం చేయగా టంగుటూరి సూర్యకుమారి అమరావతి నగర అపురూప శిల్పాలని మార్పు చేసి ఆలపించిందని తెలిపారు. శంకరంబాడి సుందరాచారితో అనుబంధం ఉన్న తాను ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడంలో ద్రవిడ వర్శిటీ కృషి ఎనలేనిదని కొనియాడారు. తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనుమతించబడి విస్తరించినప్పుడు తెలుగు భాష గొప్పతనం విశదమవుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను చాటుతూ ద్రవిడ భాషలో సాహిత్యాన్ని హిందీ, ఆంగ్ల భాషలోకి అనువదిస్తున్న ద్రవిడ వర్శిటీ అమోఘమన్నారు. ఇతరులకు ఉన్న భాషాభిమానం తెలుగు వారికి లేకపోవడం విచారకరమని, భాష విస్తరించినప్పుడు జాతి విస్తరిస్తుందని, భాష కనుమరుగైతే తెలుగు జాతి కనుమరుగు అవుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం కర్నాటక రాష్ట్ర శిల్ప కళామండలి ద్వారా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన శిల్పకళ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శంకరంబాడి సుందరాచారి పుస్తక రచయిత అనంత పద్మనాభరావు, ద్రవిడ వర్శిటీ ఉప కులపతి సత్యనారాయణ, రిజిస్ట్రార్ తిరుపతిరావు, శంకరంబాడి పీఠం సంచాలకులు మస్తానయ్య, రెక్టార్ బాలసుబ్రహ్మణ్యం, ప్రచురణ కేంద్ర సంచాలకులు శ్రవణ్‌కుమార్, పిఆర్‌ఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పేడు ఘటన ప్రధాన నిందితుడు లొంగుబాటు
* 4వ తేదీ వరకు రిమాండ్‌కు తరలింపు
* రహస్యంగా సబ్ జైలుకు తరలించిన పోలీసులు
శ్రీకాళహస్తి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏర్పేడు రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారకుడిగా ఆరోపించబడిన ధనంజయ నాయుడు సోమవారం శ్రీకాళహస్తి కోర్టులో లొంగిపోయాడు. ఇసుక మాఫియాలో ప్రధాన నిందితుడైన ధనంజయ నాయుడు కారణంగానే 2017, ఏప్రిల్ 21న మండల కేంద్రమైన ఏర్పేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందడం తెలిసిందే. ధనంజయులు నాయుడు మరో 12 మందిని నిందితులుగా పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తరువాత ధనంజయ నాయుడు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు అనుమానించారు. సోమవారం ఆయన తిరుపతికి చెందిన న్యాయవాది సత్యనారాయణతో కలసి శ్రీకాళహస్తిలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ ఎదుట లొంగిపోయారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆయనకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈసందర్భంగా ధనంజయ నాయుడు తరపున న్యాయవాది సత్యనారాయణ బెయిల్ పిటీషన్ వేశారు. అయితే న్యాయమూర్తి బెయిల్ పిటీషన్‌ను మంగళవారానికి వాయిదా వేశారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో ధనంజయ నాయుడుని పోలీసులు రహస్యంగా సబ్‌జైలుకు తరలించారు. కోర్టు వద్ద మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ధనంజయ నాయుడు కోసం ఎదురుచూశారు. పోలీసులు ఆయన కోర్టులోనే ఉన్నాడని నమ్మించి వెనుకదారి వైపున సబ్ జైలుకి తరలించారు. ఏర్పేడు ఘటనలో మునగల పాల్యెంకు చెందిన 15మంది, ఆంధ్రజ్యోతి విలేఖరి బాలమురళీకృష్ణారెడ్డి మృతి చెందగా, మరో 10 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమంగా తరలించడం వల్ల బావులు, బోర్లలో నీళ్లు ఎండిపోయాయని, ఇసుక మాఫియా వల్ల తాగడానికి కూడా నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి ఏప్రిల్ 21వ తేదీన గ్రామస్థులు వచ్చారు. తహశీల్దార్ హైదరాబాదుకు వెళ్లి ఉండటంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మికి సమస్యను వివరించారు. ఈ విషయం తమకు సంబంధంలేదని రెవెన్యూ అధికారులనే సంప్రదించాలని ఎస్పీ చెప్పడంతో పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్థులు చర్చించుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ గ్రామస్థులపైకి దూసుకెళ్లింది. లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం కింద పడి పలువురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇసుక మాఫియాను అరికట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి.

శ్రీవారి పుష్కరిణి హారతి పునఃప్రారంభం
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పుష్కరిణిలో సోమవారం నుంచి పుష్కరిణి హారతి నిర్వహించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో నెల రోజులు పాటు మరమ్మతులు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతిరోజూ స్వామివారికి నిర్వహించే పుష్కరిణి హారతిని రద్దుచేశారు. పుష్కరిణిలో మరమ్మతులు పూర్తికావడంతో సోమవారం నుంచి పుష్కరిణి హారతి నిర్వహించేందుకు అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణి మరమ్మతు పనులు సోమవారంతో పూర్తిచేసి పుష్కరిణిలో నీటిని నింపారు. సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీవారి చక్రస్నానం ఘట్టం నిర్వహిస్తున్నందున పుష్కరిణి హారతిని రద్దుచేశారు. నేటి నుంచి పుష్కరిణి హారతి తిరిగి ప్రారంభించనున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు వెలసిన పుణ్యక్షేత్రంలో నెలకొన్న కోనేరును శ్రీస్వామిపుష్కరిణి అంటారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు వైకుంఠం నుంచి కీలాద్రితో పాటు పుష్కరిణిని తెచ్చి గరుత్మంతుడు ఈ క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలలో పేర్కొన్నారు. ముల్లోకాల్లో ఉన్న అన్ని తీర్థాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్న ఈ తీర్థాన్ని సేవించినా, స్మరించినా, ఇందులో స్నానం చేసినా సమస్తపాపాలు హరించుకుపోతాయని భక్తులు విశ్వాసం. అసలు తిరుమల చేరుకున్న భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామిని దర్శించుకొని, అటు తరువాతా శ్రీవారిని దర్శించుకొని మహా ప్రసాదం స్వీకరణతో యాత్ర ముగిస్తే అంతామంచి జరుగుతుందని అంటారు పండితులు. శ్రీవారి ఆలయానికి ఈశాన్య మూలలో స్వామివారి పుష్కరిణి నెలకుని ఉంటుంది. 1.5 ఎకరాల వైశాల్యంలో ఉన్న శ్రీవారి పుష్కరిణిలో క్రీ.శ 1468లో సాళువ నరసింహరాయులు నీరాళి మండపాన్ని నిర్మించారు. అటు తరువాత 15వ శతాబ్ధంలో తాళ్లపాక వారు కోనేరుకు మెట్లను ఏర్పాటుచేయించారు. స్వామివారి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమికి ముగిసేలా ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజున బ్రహ్మోత్సవాలలో చివరిరోజు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారు. అంతటి పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో నిత్యం వేలసంఖ్యలో భక్తులు స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు. శ్రీవారి పుష్కరిణికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా 2007లో పుష్కరిణి హారతిని టిటిడి ప్రవేశపెట్టింది. నిత్యం స్వామివారి సహస్రదీపాలంకరణ సేవ ముగిసిన అనతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. అదే సమయంలో ఊరేగింపులో భాగంగా స్వామివారు తూర్పు మాడ వీధిలో ఉన్న పుష్కరిణికి చేరుకున్న సమయంలో ఆటంకాలు లేకుండా సాగే స్వామివారి పుష్కరిణి హారతికి ప్రతి ఏటా నెలరోజులు పాటు మాత్రం బ్రేకు పడుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు స్నానమాచరించే పుష్కరిణిలో నీటిని శుభ్రంగా ఉంచేందుకు టిటిడి 1972లో పుష్కరిణిలో వాటర్ ఫిల్టర్‌లు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వెంకన్న దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరిస్తున్న నేపథ్యంలో పుష్కరిణిని శుభ్రంగా ఉంచేందుకే కాదు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టిటిడి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో బ్రహ్మోత్సవాల నాటికి శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 23నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నెలరోజుల పాటు పుష్కరిణి మరమ్మతుల పనులకు టిటిడి శ్రీకారం చుట్టింది. పుష్కరిణిలో నీటిని తోడి వేయటం, ఇలా అంచెలంచెలుగా సాగే పనులకు నెల రోజులు నిర్వహించారు. ఆదివారం నాటికి ఈ పనులు అన్ని పూర్తికావడంతో సోమవారం నుంచి పుష్కరిణి హారతిని యధావిధి నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం టిటిడి అర్చకులు పుష్కరిణి హారతి నిర్వహించారు.

ఎస్వీయూ అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకుంటున్నా
* న్యాయం చేయండి
* విసికి దివ్యాంగుడైన బిటెక్ విద్యార్థి వినతి
తిరుపతి: ఎస్వీయూలో బిటెక్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సును 2010 నుంచి 2017 విద్యా సంవత్సరానికి గాను ఫెయిల్ అయిన సబ్జెక్టుల పరీక్షలు రాసినా అధికారులు సకాలంలో ఫలితాలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నానని, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరు గ్రామానికి చెందిన ఎం.సునీల్‌కుమార్ అనే దివ్యాంగుడైన విద్యార్థి ఎస్వీయూ విసి దామోదరంకు వినతి పత్రం అందించారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉనరు. తనకు 8 పేపర్లు పెండింగ్‌లోవున్నాయని, మూడో సెమిస్టర్, ఐదో సెమిస్టర్‌కు సంబంధించి జనవరి, 4, 6 సెమిస్టర్ల పేపర్లు మేలోను పరీక్షలకు హాజరై రాశానని తెలిపారు. ఆరు నెలలు పూర్తవుతున్నా అధికారులు ఫలితాలు విడుదల చేయలేదన్నారు. దీంతో జూలై 11న బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయానని, ఈనెల 5న జరిగిన పిఓ ఇంటర్వ్యూలకు హాజరయ్యానని, ఉద్యోగం రావాలంటే బిటెక్ పాస్ సర్ట్ఫికేట్ అందించాలని చెప్పడంతో తనకా ఉద్యోగం కూడా రాలేదన్నారు. గత రెండు నెలలుగా పరీక్ష ఫలితాలు విడుదల చేయాలంటూ తాను అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాను ఎస్‌బిఐ పిఓ ఉద్యోగానికి సర్ట్ఫికేట్లు కోల్పోతానని, ఒకసారి ఉద్యోగం కోల్పోతే తిరిగి రావడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. 99 శాతం దివ్యాంగుడైన తనవంటి విద్యార్థి పట్ల అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని, ఈ పరిస్థితి తనను ఎక్కడ ఆత్మహత్య వైపు పురికొల్పుతుందో చెప్పలేనన్నారు. మరో 20 రోజుల్లోనైనా పరీక్షా ఫలితాలు విడుదల చేయగలిగితే తనలాంటి దివ్యాంగులకు, ఇతర నిరుద్యోగులకు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కల్పించనవారవుతారని అన్నారు. మానవతా దృక్పథంతో అధికారులు తన సమస్యను అర్థం చేసుకోవాలని కోరారు.

టిటిడి అభివృద్ధికి పివిఆర్‌కె ప్రసాద్ విశేష కృషి
* కేంద్రమాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఘన నివాళి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: టిటిడి అభివృద్ధికి పివి ఆర్కే ప్రసాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి తీరనిలోటని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. దేవస్థానంలో భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు మేలు జరిగే సంస్కరణలు పివి ఆర్కేతో జరిగాయన్నారు. ఆయన చర్యలతో స్థానికులు కొంత నష్టపోయినా ఆలయ అభివృద్ధి మాత్రం చిరస్థాయిగా గుర్తుండిపోయేలా జరిగిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థించారు.

పారిశ్రామికవాడల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
* ఏపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు: జిల్లాలో పారిశ్రామికవాడల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఏపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రద్యుమ్న అధ్యక్షతన పారిశ్రామికవాడల అభివృద్ధిపై అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ ఇతర వౌలిక వసతులను సకాలంలో కల్పించాలని ఆదేశించారు. ఎంఎస్‌ఎం పార్కుల సర్వే పనులను త్వరగా పూర్తిచేసి భూములు కేటాయించాలన్నారు. తొట్టంబేడు మండలం తాడిపత్రిలో ఏర్పాటు కానున్న సిరామిక్ పార్కుకు గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలన్నారు. అనంతరం పలమనేరు మండలం గండ్రాజుపల్లిలో ఏర్పాటు కానున్న పారిశ్రామికవాడకు వౌలిక వసతులపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపిఐఐ జోనల్ అధికారి రామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మద్యం సేవించి తిరుమలకు వెళ్లే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం
* అలిపిరి వద్ద పలువురు తాగుబోతులను పట్టుకున్న సివిఎస్‌ఓ
తిరుపతి: మద్యం సేవించి తిరుమలకు వెళ్లాలనుకునే వారిని ఇక ఉపేక్షించమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి సివిఎస్‌ఓ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. సోమవారం మద్యం సేవించి వివిధ వాహనాల్లో తిరుమలకు వెళుతున్న దాదాపు 10 మందిని అలిపిరి తనిఖీ పాంత్రం వద్ద టిటిడి విజిలెన్స్, సిఆర్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. వారిని తిరుమలకు వెళ్లనీయకుండా ఆపేశారు. ఈసందర్భంగా సివిఎస్‌ఓ ఆకె రవికృష్ణ వారికి తిరుమల ప్రాధాన్యత, పవిత్రత గురించి తెలియజేశారు. ఇకపై ఎవరైనా మద్యం సేవించి తిరుమలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమలలో నిషేధిత వస్తువులైన మద్యం, మాంసం, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు తీసుకెళ్లకుండా ఇప్పటి వరకు నియంత్రిస్తూ వచ్చామన్నారు. ఇకపై మద్యం సేవించిన వారిని కూడా తిరుమల కొండపైకి వెళ్లనీయకుండా నియంత్రిస్తామని ఆయన స్పష్టం చేశారు.

భక్తులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోండి
* అధికారులకు ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశం
తిరుపతి: శ్రీవారి భక్తులు తమ మొక్కులు తర్చుకోవడంలో భాగంగా తలనీలాలు సమర్పించేటపుడు క్షురకులు వారి పట్ల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి భక్తులు ఫిర్యాదుచేస్తే తక్షణం చర్యలు తీసుకోవాలని ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జెఇఓ శ్రీనివాస రాజు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షురకులు పొరపాట్లు చేయకుండా వారిలో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనానికి సంబంధించి అమలుచేస్తున్న టైమ్ స్లాట్ విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ఇందులో భాగంగా శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాల్లో వివిధ భాషల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. నడకమార్గంలో సమస్యలను గుర్తించేందుకు శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి తగిన సలహాలు, సూచనలు తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేయాలని పిఆర్‌ఓ డాక్టర్ టి.రవిని ఆదేశించారు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పనులను సకాలంలో పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తిరుమలలో రోడ్డు ఆక్రమణలను తొలగించి భక్తుల సంచారానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వచ్చేనెల నుంచి 5 విభాగాల్లో ఈ- ఆఫీస్‌ను అమలుచేయాలన్నారు. దశలవారీగా ఇతర విభాగాలకు కూడా ఈ ఈ- ఆఫీస్‌ను విస్తరింపచేయాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖ నిపుణుల సహకారంతో ముందస్తు సర్వే నిర్వహించి తిరుమలలో బొద్దింకలు, ఈగల నివారణ చర్యలు చేపడుతామన్నారు. ఘన, వ్యర్థపదార్థాల తొలగింపునకు టెండర్‌ప్రక్రియను పూర్తిచేసేందుకు ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ విభాగాలు దృష్టిసారించాలన్నారు. ఈకార్యక్రమంలో తిరుపతి జెఇఓ పోలా భాస్కర్ , సివిఅండ్‌ఎస్‌ఓ రవికృష్ణ, టిటిడి సిఇ చంద్రశేఖర్ రెడ్డి, ఎఫ్ అండ్ సిఇఓ బాలాజి, అదనపు సివిఎస్‌ఓ శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యాపీఠాన్ని సందర్శించనున్న యుజిసి బృందం
తిరుపతి: యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ బృందం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సంస్కృత విద్యాపీఠంలో పర్యటించనున్నట్లు పిఆర్వో దక్షిణామూర్తిశర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా యుజిసి కమిటీ బృందం గుజరాత్‌లోని సోమ్‌నాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య అక్రాంత చౌదరి అధ్యక్షతన సభ్యులు ఉమా, శ్రీవిద్యా, ఆచార్య పూర్ణా బెనర్జీ, ఆచార్య జి.విశ్వనాథన్, కో ఆర్డినేటర్ దీక్ష రాజ్‌పుట్‌లు విద్యాపీఠాన్ని పరిశీలిస్తారన్నారు. యుజిసి బృందం పర్యటన నేపథ్యంలో విసి మురళీధర్ శర్మ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమై విద్యాపీఠం ప్రగతిపై సమీక్షించారు.