సబ్ ఫీచర్

అక్షర యోధుడు రామానుజరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి వరంగల్‌లో ఓ సాహిత్య సభలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రసంగిస్తున్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి విశ్వనాథను పరిచయం చేస్తూ, ‘వీరు మహా కవులు, మృదు మధురంగా వుండే వీరి కవిత్వం అంతరికీ సులభంగా అర్థం అవుతుంది’ అని అంటుండగా ఒక్కసారి విశ్వనాథ వారు కోపంగా లేచి ‘నీకు నా కవిత్వం గురించి తెలియదు, నా గ్రంథాలు మీరు చదవలేదు. నా కవిత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఇక్కడ ఒక్కరే ఉన్నార’ని అన్నారు. ఆ ఒక్కరు ఎవరో అన్నది సభికులు వెంటనే గ్రహించారు. ఆయనే- దేవులపల్లి రామానుజరావు. ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ను పరిపుష్టం చేసి, మాతృభాషలో విద్యాబోధన జరగాలని అవిరళ కృషి చేసిన అక్షర యోధుడు రామానుజరావు.
వరంగల్‌లో 1917 ఆగస్టు 17న జన్మించిన రామానుజరావు హన్మకొండలో మెట్రిక్, హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. బిఏ పూర్తి చేసాక రెండేళ్లు గ్రంథాలయోద్యమంలో, మరో రెండేళ్లు యువజన కాంగ్రెస్‌లో పని చేసారు. ప్రజాసేవ చేయాలంటే న్యాయవాద వృత్తిని చేపట్టాలన్న కోరికతో నాగపూర్ వెళ్లి ఎల్‌ఎల్‌బి చదివారు. కొన్నాళ్లు న్యాయవాదిగా పని చేసారు. న్యాయవాద వృత్తికన్నా గ్రంథాలయోద్యమం ఆయనను అమితంగా ఆకర్షించింది. ప్రజారంగంలో వున్న సుప్రసిద్ధ నాయకులతో ఆయనకు పరిచయం కలిగింది. రామానుజరావు కార్యదర్శిగా ఉన్న ‘శబ్దానుశాసన గ్రంథాలయం’ రజతోత్సవాలు 1946లో వరంగల్‌లో జరిగాయి. అప్పటి హైదరాబాద్ సంస్థానం ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్‌ని వరంగల్ పర్యటనకు వచ్చినపుడు ఆయనకు తన గ్రంథాలయాన్ని చూపించాలని కోరిక రామానుజరావుకు కలిగింది. అయితే ముందుగా అనుమతి లేదన్న కారణంగా గ్రంథాలయానికి మీర్జా ఇస్మాయిల్ రాలేరని జిల్లా అధికారులు స్పష్టం చేసారు. మీర్జా ఇస్మాయిల్ హైదరాబాద్‌కు తిరుగుముఖం పడుతుండగా ఆయన కాన్వాయిని రామానుజరావు ఆపివేయడంతో ప్రధాని కిందికి దిగక తప్పలేదు. ఇక విధిలేక మీర్జా ఇస్మాయిల్ గ్రంథాలయాన్ని సందర్శించి వెళ్లారు. ఇది జరిగిన రెండు రోజులకు జిల్లా కలెక్టర్, ఎస్‌పి రామానుజరావు వద్దకు వచ్చి ప్రధాని పంపిన 116 రూపాయల చెక్కును బహుకరించి వెళ్లారు. ఈ సంఘటన రామానుజరావుకు గ్రంథాలయ ఉద్యమం పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియ జేస్తుంది. 1949లో తూప్రాన్‌లో సారస్వత పరిషత్తు సభలు నిర్వహించగా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న తీర్మానాన్ని ఆయన ఆమోదింపచేసారు.
హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య జరిగింది. ప్రజల భాషలకు సంకెళ్లు తెగిపోయే రోజు వచ్చింది. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని అందరూ ఆందోళన చేస్తున్నారు. రామానుజరావు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం అప్పటి విద్యా శాఖ మంత్రిని కలుసుకుని సమస్య తీవ్రతను వివరించారు. ఫలితంగా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని మంత్రివర్యుడు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విజయంతో రామానుజరావులో మరింత ఉత్సాహం పెరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, అకడమిక్ కౌన్సిల్‌లో పోరాడి తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో బిఏ వరకు మాతృభాషలకు ద్వితీయ భాష స్థానం కలిగించే వరకూ ఆయన నిద్రపోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పట్లో బోధనా భాష ఉర్దు కావడం అక్కడి పారిభాష పద రచన శాఖ అద్వితీయంగా ఉండడం ఢిల్లీ వారి నోట నీరూరేట్టు చేసాయి. పారశీ లిపిని దేవనాగరి లిపిగా మార్చి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి పూనుకున్నారు. దీంతో తెలంగాణ అంతటా ఆందోళన చెలరేగింది. దేవులపల్లి వారిని కార్యనిర్వాహకుడిగా ఓ ప్రతిఘటన సంఘం ఆవిర్భవించింది. జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు దేవులపల్లి నేతృత్వంలో ఆందోళనకారులు కలిసి దేశానికి స్వాతంత్య్రం లభించగానే ఉస్మానియా వర్సిటీని లాక్కోవడం తగదని నిలదీసారు. దీంతో నెహ్రూ ఢిల్లీకి వెళ్లగానే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు వాళ్ల కోసం ‘శోభ’ పేరిట ఓ మాసపత్రికను వరంగల్ నుంచి నడిపించిన ఘనత రామానుజరావుదే. ఆ తరువాత ఆయన గోలకొండ పత్రికలో చేరి సంపాదకుడుగా చాలాకాలంపాటు సేవలందించారు. మొలకగా ఉన్న ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ బాధ్యతను తీసుకుని దాన్ని మహావృక్షంగా మార్చిన ఘనత ఆయనదే. ‘పరిషత్తు’ కృషి ఫలితంగా తెలుగులో మెట్రిక్ వరకు విద్యాబోధన జరిపాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో తెలుగులో బోధన, పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయులకు తర్ఫీదు వంటి విషయాల్లో ఫ్రభుత్వానికి ఆంధ్ర సారస్వత పరుషత్తు తోడ్పాటునందించింది. బొంబాయి, బెంగళూరు, మైసూరు, షోలాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ‘పరిషత్తు’ పరీక్షలను నిర్వహించింది. పండిత శిక్షణ కళాశాలను నిర్వహించే బాధ్యత కూడా ప్రభుత్వం ‘పరిషత్తు’కు అప్పగించింది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర వంటి గ్రంథాలను ప్రచురించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
దేవులపల్లి వారు ‘పచ్చతోరణం’ వంటి కవితా సంపుటాలను ప్రచురించారు. తెలుగు జాతీయోద్యమాలు, తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనాలు వంటి గ్రంథాలను అందించారు. అఖిలభారత గ్రంథాలయ సంఘం, భారతీయ భాషా సంఘం, తెలుగు భాషా సమితి తదితర సంస్థలకు ఆయన సేవలందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మూడుసార్లు యాక్టింగ్ వైస్ చాన్సలర్‌గా పనిచేసారు. రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన ఆయనను తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. స్వాతి చినుకుకన్నా స్వచ్ఛమైన మనసున్న ఆయన ఎవరినీ నొప్పించలేదు, ఎవరితోనూ విభేదం పెట్టుకోలేదు. తెలుగు భాష ఉన్నతి కోసం పరితపించిన ఆయన 1993 జూన్ 8న తుదిశ్వాస విడిచారు.
(నేడు దేవులపల్లి రామానుజరావు శతజయంత్యుత్సవం సందర్భంగా)

-జి. వెంకట రామారావు