ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలలో ఎవరికి మొగ్గు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక మంగళవారం సాయంత్రంతో ముగిసింది. సహజంగా ఉప ఎన్నికల పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. అయితే నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం భారీగా పోలింగ్ నమోదు కావటంతో ఫలితం కూడా అనూహ్యంగా మారింది. అధికార తెలుగుదేశం-ప్రధాన ప్రతిపక్షమైన వైస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఈ పోలింగ్ ప్రతిష్ఠాత్మకంగా మారింది. తాజా పోలింగ్ సరళిని గమనించినప్పుడు పట్టణ పరిధిలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కుల నాయకుల మనోగతం, మహిళలు, యువకుల అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపింది. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 3నుంచి 6వేల వరకూ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నంద్యాల పట్టణంలో ముస్లిం, వైశ్య వర్గాలకు చెందిన ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద ఎక్కువ సంఖ్యలో కనిపించడంతో మెజార్టీ మరింత పెరుగుతుందన్న నమ్మకం ఆ పార్టీలో పెరిగింది. అదే సమయంలో అటు వైసిపి కూడా గెలుపు గుర్రాన్ని వదిలిపెట్ట లేదు. నంద్యాల గ్రామీణ ప్రాంతాలు, గోసుపాడు మండలాల్లో వైసీపీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పట్టణంలో బలిజలు కూడా సగం వరకూ తమకే మద్దతునివ్వడంతోపాటు, మహిళలు, యువకులు తమ వైపే మొగ్గు చూపినందున తమకు 17వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. గత ఎన్నికలో అప్పటి వైసీపీ అభ్యర్థి కేవలం 3600 ఓట్లతోనే విజయం సాధించారు. ఇప్పుడు పట్టణ ప్రాంతంలో టిడిపికి కొంచెం మెరుగైన వాతావరణం కనిపించింది. గతానికంటే మెజారిటీ స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికపై ఇప్పటికి రెండు నివేదికలిచ్చిన ఓ సర్వే సంస్థ కూడా టిడిపికి పట్టణంలో వచ్చే ఓట్లతో 3వేల వరకూ మెజారిటీ తెచ్చుకుంటుందని, అదే సమయంలో రూరల్-గోసుపాడు మండలాల్లో టిడిపి కంటే వైసీపీకే ఎక్కువ మొగ్గు ఉందని తాజాగా పేర్కొంది. ఈ ఎన్నికలో డబ్బు కీలక ప్రభావం చూపింది. పోలింగ్ రోజు సాయంత్రం వరకూ పార్టీల నేతలు ఓటరుకు డబ్బులిచ్చి పోలింగ్‌బూత్‌లకు తీసుకువచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు కూడా తమకు ఇంత ఇవ్వాలని డబ్బు డిమాండ్ చేసి, డబ్బు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ బూత్‌లకు వెళ్లడం ప్రస్తావనార్హం.
* నంద్యాల పట్టణంలో మహిళలు ఎక్కువగా పోలింగుకు రావడం టిడిపికి అనుకూలిస్తుంది.
* రెండు మండలాల్లో పురుషులే ఎక్కువగా హాజరయ్యారు. ఇక్కడ యువకులు, మహిళలు వైసీపీకే జై కొట్టినట్లు కనిపించింది.
* గోసుపాడులో వైసీపీకి గణనీయమైన మొగ్గు కనిపించాలి. కానీ ఇక్కడ మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి టిడిపిలో చేరిన ప్రభావం టిడిపికి అనుకూలించినా మెజారిటీ వైసీపీ వైపే ఉంది.
* పట్టణంలో పోలింగ్ చివరి మూడు గంటల ముందు, టిడిపి పోల్ మేనేజ్‌మెంట్ ప్రదర్శించింది. ఆ పార్టీకి చెందిన ముస్లిం నేతలు తమ వర్గానికి చెందిన వారిని పోలింగ్ బూత్‌లకు వాహనాల్లో తీసుకురాగా, వైశ్య వర్గానికి చెందిన నేతలు, కౌన్సిలర్లు కూడా అదే పద్ధతి పాటించారు. దానితో పోలింగ్ శాతం ఆఖరులో అనూహ్యంగా పెరిగింది.
* పట్టణంలోని క్రైస్తవ, మాల వర్గం; రెండు మండలాల్లోని మాల వర్గం వైసీపీకే మద్దతు పలికినట్లు కనిపించింది.
* పోలింగుకు ముందు బలిజలపై టిడిపి పట్టు ప్రదర్శించగా, పోలింగ్‌లో ఆ వర్గం అటు వైసీపీకి సరిసమానంగా మొగ్గు చూపినట్లు కనిపించింది.