హైదరాబాద్

నిమజ్జనానికి మరో 15 కొలనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వినాయక చవితిని పురస్కరించుకుని రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, నీటి కుంటల్లో నిమజ్జనం చేయకుండా, నిమజ్జనం కోసం ప్రత్యేకంగా జిహెచ్‌ఎంసి 15 కొలనులను సిద్దం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. వినాయక చవితి, నిమజ్జనం సమీపిస్తున్నందున ఆయన బుధవారం లేక్స్ విభాగం, ఇంజనీరింగ్ అధికారులతో కొలనుల నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలో బెంగుళూరు తరహాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకంగా నిమజ్జన కొలనులను నిర్మిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం పది కొలనులను నిర్మించగా, ప్రస్తుతం మరో 15 కొలనులను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిమజ్జన కొలను పనులన్నీ నిమజ్జనం జరిగే రోజుకి రెండు రోజుల ముందుగానే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. రోజువారీ పనుల పురోగతి ప్రణాళిక రూపొందించుకోవటంతో పాటు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి నిర్ణీత సమయంలో వీటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా వీటి నిర్మాణం నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులన్నీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కాలుష్య కాసారాలుగా మారిపోయాయని, ఈ దుస్థితి నుంచి గట్టెక్కేందుకే ప్రభుత్వం బెంగుళూరు తరహాలో నిమజ్జనం కోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు దాదాపు రూ. 95 కోట్ల రూపాయల వ్యయంతో 185 చెరువులు ఉండగా,వీటిలో 82 చెరువుల్లో గుర్రపుడెక్క సమస్య ఉందని, దీన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 180 చెరువులకు ఎఫ్‌టిఎల్ కూడా గుర్తించటం జరిగిందని వివరించారు. ఈ సమావేశణలో జిహెచ్‌ఎంసి నీటి పారుదల విభాగం ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరగాలి
హైదరాబాద్: వందశాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరగాలని, ఇందుకు ఎస్‌పిహెచ్‌వోలు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ యోగితారాణా వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె బుధవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాల శాతం, కెసిఆర్ కిట్, అంధత్వ నివారణ చర్యలు, ఎంఆర్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని బాగా పెంచాలని, అపుడే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ ప్రయోజనాలు పేద మహిళలకు అందుతాయని అభిప్రాయపడ్డారు. ఇందుకు మాతా శిశు మరణాలు తగ్గి, మదర్ చైల్డ్ సంరక్షణ మెరుగుపడుతుందన్నారు. నవజాత శిశువులకు సరైన సమయంలో చుక్కల మందు వంటి వేయటానికి, అప్పటికే ఇద్దరు పిల్లలు కల్గి ఉన్న వారికి ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లను ప్లాన్ చేయవచ్చునని వివరించారు. అంతేగాక, ఎస్‌పిహెచ్‌వోలు, సిహెచ్‌సి, పిహెచ్‌సిల వారీగా ఎక్సపడైట్ డేట్ ఆఫ్ డెలివరీ క్యాలెండర్‌ను రాబోయే 15 రోజుకు తయారు చేసుకోవాలని సూచించారు. ఈ క్యాలెండర్ వల్ల గర్భిణి వివరాలను ట్రాక్ చేయవచ్చునని తెలిపారు. ఈ వివరాలతో సంబంధిత మహిళా ఆరోగ్యాన్ని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం జరిగే వరకు సులువుగా పర్యవేక్షించేందుకు ఆస్కారమేర్పడుతుందన్నారు. ప్రధానంగా సిజేరియన్లను తగ్గించే అవకాశం కూడా పెరుగుతుందన్నారు. ఆసుపత్రుల్లో ఈడిడిని ఎలా తయారు చేసుకోవాలన్న అంశంపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌వో డా.పద్మజ, డిసిహెచ్‌ఎస్ డా.సుజాత, డిఐవో డా.జయమాల, డబ్ల్యుహెచ్‌వో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
ఘట్‌కేసర్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా అన్నారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని లక్ష్మినారాయణ చెరువును బుదవారం సందర్శించి పరిశీలించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేయనున్నందున నిమజ్జనం జరిగే స్థలాన్ని పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక మండలాలలతో పాటు జంట నగరాల నుండి వినాయక విగ్రహాలను వేల సంఖ్యలో నిమజ్జనం చేయనున్నందున అధికారులు చేస్తున్న ఏర్పాట్లను తెలుసుకున్నారు. లక్ష్మినారాయణ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన నిమిజ్జనం మంటపం వద్ద సరిపడ క్రేన్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. నవరాత్రులు పూర్తి అయి నిమజ్జనం ముగిసేవరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
నిమజ్జనం జరిగే చెరువుకట్టపై సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక మంటపాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎవరైనా అవాంఛనీయ సంఘటనలుకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. లక్ష్మినారాయణ చెరువును మినీట్యాంక్ బాండ్‌గా మార్చేందుకు చేస్తున్న కృషి పట్ల సర్పంచ్ మూసి శంకర్‌ను అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ సిపి తరుణ్‌జోస్, మల్కాజిగిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ, ఎసిపి గొనే సందీప్, ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ పాల్గొన్నారు.

అప్పుల తెలంగాణ చేస్తున్న కెసిఆర్
వనస్థలిపురం: బంగారు తెలంగాణ నెపంతో ఆర్భాటాల కోసం కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారని రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. బుధవారం బిఎన్‌రెడ్డి నగర్ డివిజన్ టిడిపి అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ 2003-04 సంవత్సరంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నగరానికి మంచినీటిని అందించడానికి మెదటి విడతగా కృష్ణ ఫేస్-1 పనులను మూడు వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిందని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరును అందించడానికి 2013లో హడ్కో నుండి రూ.1700కోట్లు అప్పు తీసుకొచ్చారని తెలిపారు. ఆ పథకానికి అర్బన్ మిషన్ భగీరథ పేరు పెట్టుకుని టిఆర్‌ఎస్ ప్రభుత్వం తామే చేసినట్లు ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతుందని రంగారెడ్డి ఆరోపించారు. వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన మంచి నీటి ట్యాంక్‌ల నిర్మాణంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాత్ర పూర్తిగా శూన్యమని చెప్పారు. ప్రభుత్వం బ్యాంక్ రుణాలతో మంచి నీటి పనులను చేపడుతూ ఇంటి యజమానుల వద్ద నల్లా కనెక్షన్‌లు, బిల్లుల పేరిట డబ్బులు వసూలు చేస్తుందని అన్నారు. ఎన్నికల ముందు ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పి, వాటిని పూర్తిగా మర్చిపోయారని చెప్పారు. ఉపయోగం లేని ప్రాంతాలలో కమీషన్‌ల కోసం అనవసరంగా నాసిరకమయిన పైపులను ఏర్పాటు చేశారని రంగారెడ్డి విమర్శించారు. ఎల్బీనగర్‌లో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నారని, అందరకీ ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు కొప్పుల నర్సింహా రెడ్డి మాట్లాడుతూ శివారు ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచి నీటి పైపుల కోసం తమకు కమీషన్‌లు కావాలని కొంతమంది కార్పొరేటర్లు.. కాలనీ సంక్షేమ సంఘాల వద్ద లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నాంపల్లి శంకరయ్య, గాంధీ, కృష్ణంరాజు,విజయ్ కుమార్, రవిశంకర్, లక్ష్మణ్, కరుణ్ దీప్, నరేష్ యదవ్ పాల్గొన్నారు.

పార్కు స్థలంలో గణేష్ మండపం కూల్చివేత
ఉప్పల్: పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని పర్వతాపూర్ సాయి ఐశ్వర్య కాలనీలో గల పార్కు స్థలంలో కాలనీ ప్రజలు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇది సహించని కొందరు భూకబ్జాదారులు మంగళవారం రాత్రి మండపాన్ని కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీ ప్రజలు ఆగ్రహంతో ఆందోళన చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కూల్చివేత ఘటనపై నిరసన తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇదే స్థలంలో తిరిగి మండపాన్ని నిర్మించకపోతే ఆందోళన చేపట్టగలమని హెచ్చరించారు. బుధవారం కాలనీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి, ఎం.రాజేందర్ రెడ్డి, ఆరోగ్య స్వామి, ఆర్‌ఆర్ శేఖర్, అశోక్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మధుకుమార్, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణ, సంపూర్ణ, స్వరూప, లక్ష్మీ, కల్పన, లిల్లీ, లలిత, రాధిక, శైలజ, వసంత, అనీత, రత్నమాల మాట్లాడుతూ సర్వే నెంబర్ 16, 17లో మొత్తం 80 ఎకరాల లేఔట్‌లో ఎనిమిది ఎకరాల స్థలాన్ని ప్రజాప్రయోజనాల కోసం పార్కుకు కేటాయించారని పేర్కొన్నారు. కొందరు కబ్జాదారులు మాజీ ప్రజాప్రతినిధుల సహకారంతో లేఔట్లు మార్చి పార్కు స్థలంలో బై నెంబర్లు వేసి నకిలీ ప్లాట్ల డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. ఈ విషయాన్ని గతంలో జిల్లా కలెక్టర్, డిపిఓకు ఫిర్యాదు చేస్తే వారి ఆదేశాల ప్రకారం అప్పటి పంచాయతీ కార్యదర్శి స్పందించి పార్కు స్థలాన్ని సర్వే చేసి హద్దులు గుర్తించి కబ్జా చేయకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది జీర్ణించుకోలేని కబ్జాదారులు కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇదే స్థలంలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశామని, గణేష్ నవరాత్రి వేడుకలను నిర్వహించేందుకు డబ్బులు జమ చేసుకుని మండపాన్ని నిర్మించుకుంటే రాత్రికి రాత్రే కబ్జాదారులు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల విలువైన పార్కు స్థలాన్ని రక్షించుకోవడమే లక్ష్యంగా సిద్ధంగా ఉన్న కాలనీ ప్రజలపై బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. ప్రాణాలను తెగించైనా పార్కు స్థలాలను రక్షించుకుంటామని పేర్కొన్నారు. అధికారులు కబ్జాదారులు, కూల్చివేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపట్టగలమని హెచ్చరించారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోం
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కమిటీ సభ్యుడు రేవెల్లి రాజు, మేడిపల్లి కన్వీనర్ చిత్తరంజన్‌రెడ్డి, బిజెపి పీర్జాదిగూడ పురపాలక సంఘం కమిటీ అధ్యక్షుడు ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, నాయకులు మిట్ట నర్సయ్య గౌడ్, పవన్‌రెడ్డి, రాజు, వరికుప్పుల వెంకటేశ్, బండారు రాజమణి, గీత, మరియమ్మ, కిష్టమ్మ హెచ్చరించారు. బుధవారం కూల్చివేసిన గణేష్ మండపాన్ని పరిశీలించారు.
దుండగుల దుశ్ఛర్యను తీవ్రంగా ఖండించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి అవసరం లేదని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఖాళీ ప్రదేశాలలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. హిందువుల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న అసాంఘిక శక్తుల ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే హిందువులు ఏకమై ఆందోళన కార్యక్రమాలను చేపట్టగలమని హెచ్చరించారు. తక్షణమే పార్కు స్థలానికి హద్దురాళ్లు పెట్టి ప్రహారీని నిర్మించాలని డిమాండ్ చేశారు.

సంతకం ఫోర్జరీ చేశారని వైద్యుడి ఫిర్యాదు

గచ్చిబౌలి: అవయవ దానానికి సంబంధించిన కేసులో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పోలీసులకు వైద్యుడు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలింనగర్‌కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. గత నెలలో బంగ్లాదేశ్‌కు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు తన బంధువును తీసుకుని కాంటినెంటల్‌కు వచ్చాడు. సదరు బంగ్లా దేశీయుడికి కిడ్నీలు పాడైపోవడంతో తప్పనిసరిగా కిడ్నీ మార్చాల్సి వచ్చింది.
అవయవాన్ని మార్చాలంటే ఆసుపత్రి కమిటీ ఆమోదం తెలపాలి. కాంటినెంటల్ అసుపత్రి కమిటీలో ప్రవీణ్ కుమార్‌తో పాటు డాక్టర్ రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు. బంగ్లా దేశీయుని కిడ్నీ మార్పును వ్యతిరేకించానని, దాంతో తనని ఆసుపత్రి విధుల నుండి తొలగించారని ఫిర్యాదు తెలిపారు. అనంతరం తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కిడ్నీ మార్చారని ప్రవీణ్ కుమార్ ఫిర్యాదులో వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ చంద్రకాంత్ తెలిపారు.