నెల్లూరు

నన్ను క్షమించు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం పదిగంటలయిందంటే అతడి కళ్లు ఆమె కోసం ఎదురుచూస్తుంటాయి.
వేచి ఉండడం వల్ల అతనిలో ఒకింత అసహనం కనబడుతున్నా కళ్లల్లో కదులుతున్న తృష్ణ ఆమె కోసం అతను ఎంతసేపైనా ఎదురుచూడగలడు అని చెప్తున్నది.
ఆమె తూర్పువైపున్న సందులో నుండి మెయిన్‌రోడ్ మీదకు వస్తుంది. బస్‌లో కానీ, ఆటోలో కానీ ఎక్కి వెళ్లిపోతుంది. రోజూ ఆమె మెయిన్‌రోడ్డు మీదకి రావడం, ఓ పది, పదిహేను నిమిషాలు బస్ కోసమో, ఆటోకోసమో వేచి చూడడం, రాగానే వెళ్లిపోవడం.. మళ్లీ రాత్రి ఎనిమిది లేదా తొమ్మిది గంటలకి తిరిగి వస్తుంది.
ఇదంతా అతను కొన్ని నెలల నుండి గమనిస్తూనే వున్నాడు. ఏదో నాటకాల కంపెనీలోను, అప్పుడప్పుడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగాను పనిచేస్తుందనే వివరాలు సేకరించాడు.
అంతేకాకుండా కొంతమంది పిల్లలకు వాళ్ల ఇళ్లకి వెళ్లి డాన్స్ నేర్పిస్తుందని కూడా తెలుసుకున్నాడు.
సాధారణంగా ఇంటి నుండి బయటకు వచ్చి ఉద్యోగం చేసే ఆడవాళ్లపైన చాలామందికి సదభిప్రాయం ఉండదు.
కొంచెం ఆలస్యంగా ఇల్లు చేరితే ఎవడితోనో తిరిగి వస్తున్నట్లే ఆలోచిస్తారు. కట్టుకున్న భర్తక్కూడా ఉద్యోగం చేసే భార్యపైన ఎంతోకొంత అనుమానం వుంటుంది. ఇక బయటవాళ్ల మాటలకి లెక్కే వుండదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి దూలతీర్చుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద నగరాల్లో అయినా ఈ అభిప్రాయాల్లో పెద్ద తేదా ఉండదు.
అతను ఆమెను గత నాలుగైదు నెలల నుండీ గమనిస్తున్నాడు. పెదాలకు లిప్‌స్టిక్, ఎత్తు మడుమ చెప్పులు, జడలో వేలాడుతూ రెండుమూరల పూలు, శ్రద్ధగా వేసుకున్న మేకప్, ఒంపు సొంపులు కనబడే విధంగా చీరకట్టు, మొత్తంమీద ఒకసారి చూస్తే మళ్లీ చూడాలి అనిపించేటంత అందగత్తె. వయసు పాతిక, ముప్పయి మధ్య వుంటుందేమో!
పెళ్లయిందని తెలుస్తున్నది. కాకపోతే విడాకుల కేసై వుంటుంది. మరీ మంచిది. ఇట్లాంటి వాళ్లయితే త్వరలోనే వల్లో పడతారని అనుకున్నాడు.
ఇలా చాలాసార్లు అతని ప్రయత్నాలు అతను చేస్తూనే వున్నాడు. ఆమె అతన్ని దూరం పెడుతున్నకొద్దీ అతడికి ఆమె మీద పిచ్చి వ్యామోహం పెరిగిపోతున్నది.
***
ఈరోజు ఎలా అయినా ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్లాలి. బయట మాట్లాడాలంటే అందరూ చూస్తారని భయపడుతున్నదేమో? అందుకే ఇంటికి వెళ్లేందుకు ఆమెను ఫాలో అవ్వాలి! అనుకున్నాడు గట్టిగా.
రాత్రి ఎనిమిదిగంటలకల్లా రోజూ నిలబడే చోటుకే వచ్చి నిలబడ్డాడు. అతను వంటికి కొట్టుకున్న స్ప్రే వాసన అక్కడంతా వ్యాపించింది.
గంటసేపు గడిచిపోయింది. సమయం తొమ్మిది అయింది. ఆమె వస్తున్న ఆటో మెయిన్‌రోడ్డు మీద నుండి సందు తిరిగింది. అతను ఆటో వెనకాలే బైక్ మీద అనుసరించాడు.
చీకట్లో వెనె్నలలా మెరిసిపోతున్నది ఆమె.
హడావిడిగా ఇంటి ముందు ఆటో ఆగింది. గబగబా నడుస్తూ వెళ్లి తాళం తీసి లోపలికి నడిచింది.
‘‘బహుశా డబ్బులు తేవడానికి వెళ్లిందేమో! చిల్లర వుండి వుండదు’’ అనుకున్నాడు అతను.
ఆటో అతను ఇంజన్ ఆపేసి కూర్చున్నాడు.
ఆటో అతని దగ్గరకు వచ్చి ‘‘డబ్బుల కోసమా వెయిటింగ్’’ అని అడిగాడు అతను.
‘‘కాదండీ: ఆటోలో వస్తుంటే ఎవరికో బాగాలేదని ఫోన్ వచ్చిందండీ. అప్పట్నించి ఆవిడ చాలా కంగారు పడుతున్నారండీ. హాస్పిటల్‌కి వెళ్లాలని నన్ను వుండి పొమ్మని చెప్పారండీ’’ అన్నాడు ఆటో అతను.
ఇంతలో ఆమె హడావిడిగా, కంగారుగా బయటకు వచ్చింది ‘‘బాబూ! ఒకసారి లోపలికి వస్తావా! మా వారికి ఫిట్స్ వస్తున్నాయి త్వరగా రా! సాయంపట్టు’’ అంటూ ఆటో అతన్ని అడిగింది.
ఇదంతా చూస్తున్న అతనూ, ఆటో అతనితో పాటు లోపలికి వెళ్లాడు. రెండు గదుల ఇల్లు. వంటగది, ఒక హాలు. హాల్లో మంచంమీద గడ్డం బాగా పెరిగిపోయి, మంచానికి అతుక్కుపోయిన ఆరడగుల మనిషి. ప్రక్కనే చిన్నబల్ల మీద మందు, మంచినీళ్లు, సెల్‌ఫోన్ వున్నాయి.
అతను కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నాడు. నోట్లోంచి కొద్దిగా నురగ కూడా వస్తున్నది.
ఆమె అలవాటయినట్లుగా అతని గుప్పిట్లో తాళం చెవులగుత్తితో గట్టిగా, వేగంగా రుద్దుతున్నది.
‘‘ఏమ్మా! ఎన్నాళ్లనుండీ ఇలా!’’ అన్నాడు ఆటో అతను.
‘‘గత రెండు మూడు నెలల నుండీ ఇలానే బాధపడుతున్నాడు. యాక్సిడెంట్ అయి రెండు సంవత్సరాలయింది. బాగా దెబ్బలు తగిలాయి. వెనె్నముక దెబ్బతింది. డాక్టర్లు మంచంలోనే వుండాలన్నారు. దీనికి తోడు ఈమధ్య ఫిట్స్ కూడా వస్తున్నాయి’’ అంటూ ఏదో మందుతీసి రెండు స్ఫూన్లు తాగించింది.
‘‘ఇంట్లో ఇతన్ని చూసుకునేందుకు ఎవరు లేరా’’ అన్నాడు ఆటో అతను.
‘‘వుంటే నాకీ అవస్థులు ఎందుకు బాబూ! నన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా పెళ్లికి ఇద్దరివైపు పెద్దవాళ్లెవ్వరూ ఒప్పుకోలేదు. అయినా మంచిమనిషి, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడని ధైర్యంగా ఒప్పుకున్నాను. రెండేళ్లు సంతోషంగానే వున్నాం. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఇదిగో ఇప్పుడిలా అయిపోయాడు. నన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమించే ఇతన్ని నేను ఎలా అయినా కాపాడుకుంటాను. ఎంత డబ్బయినా ఖర్చుపెడతాను’’ అంటూ కళ్లు తుడుచుకుంది.
ఆ అసహాయస్థితిలో ఆమె మనసులోని బాధంతా అనుకోకుండానే బయటకు మాటల రూపంలో బయటపడింది. ఒక చిన్న పలకరింపునకు కళ్లనీళ్ల పర్యంతమయింది.
‘‘ఆటో డ్రైవర్ ఆమె భర్తను లేవదీసి, భుజం క్రిందగా చేయి పోనిచ్చి పట్టుకుని నడిపించాడు’’
ఆమె కూడా భర్త బరువుని శాయశక్తులా భరిస్తూ నడిచింది.
అతను కూడా సాయం చెయ్యాలి అన్నట్లుగా ఒక్కడుగు ముందుకేసి ఆమె భర్తని పట్టుకోబోయాడు.
ఒక్కసారిగా దెబ్బతిన్న పాములా అతని వైపు చూసింది ఆమె. అంతే! అప్రయత్నంగా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.
బయటకు వచ్చాక భర్తని ఆటోలో కూర్చోబెట్టి, తాళం వేసి వచ్చి, తనూ అతని పక్కన కూర్చుంది.
‘‘త్వరగా పోనీయ్ బాబూ!’’ అంటూ భర్తని పొదివిపట్టుకుంది. అతని తలను భుజం మీద ఆనించుకుంది.
ఆటో కదిలి వెళ్లిపోయింది.
ఇప్పుడు ఆమె పరిస్థితి పూర్తిగా అతనికి అర్థమైంది. ఆమె చూసిన చూపులో తనపై కనిపించిన అసహ్యం మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదులుతున్నది.
ఆమె తన భర్తను బతికించుకోవడానికి, పొట్ట పోషించుకోవడానికి బయటకు వచ్చి తనకు వచ్చిన పనులు చేసుకుంటున్నది. దానికి తగ్గట్లు ఆమె ముఖానికి రంగులు పులుముకుంటున్నది. అలంకరించుకుంటున్నది. ఆమె చేసే పనులకు అవన్నీ అవసరం. కానీ మనసునిండా బాధ, అలజడి. ఒకరకంగా చెప్పాలంటే ఒంటరిగా జీవనపోరాటం చేస్తున్నది.
ఎందుకో తెలీదు గానీ అతని కళ్లల్లో కన్నీటితెర కదిలింది. బహుశా పశ్చాత్తాపం వల్లనేమో....
‘నన్ను క్షమించు’ అంటూ లోలోపల అనుకున్నాడు వౌనంగా...

- పాతూరి అన్నపూర్ణ, చరవాణి : 9490230939