మెయన్ ఫీచర్

‘ఉభయుల’ సేనల ఉపసంహరణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ పక్షాలను ప్రవేశవించవద్దని చెప్పిరా పోవయ్యా..’ అన్నది గ్రామాధికారి జారీ చేసిన ఆజ్ఞ! ఈ గ్రామాధికారి ‘పటేలు’ లేదా ‘రెడ్డి’ లేదా గ్రామ మునసబు! ఆజ్ఞను పొందినవాడు రెడ్డిగారి ఆధికారిక సేవకుడు. అంటే ‘కావలివాడు’ లేదా ‘తలవరి’.. ‘ఉభయ పక్షాలు ప్రవేశించకూడని దానికి, నేను తమరితో మొరపెట్టుకున్నందువల్ల నాకు కలిగిన లాభం ఏమిటి?’ అన్నది భూమి యజమాని అడిగిన ప్రశ్న! ఈ ‘సంవాదం’ లేదా ‘వివాదం’ ఇప్పటిది కాదు, బ్రిటన్ ‘దొరలు’ మన దేశంలో పెత్తనం చెలాయించిన నాటిది కావచ్చు! లేదా స్వతంత్ర భారతదేశంలో బ్రిటన్ పరిపాలన అవశేషాల వారసత్వం కొనసాగిన నాటిది కావచ్చు.. మొత్తానికి ‘రెడ్ల కరణాల’ వ్యవస్థ రద్దు కాక పూర్వం నాటి మాట ఇది! ఒక పల్లెలో ఒక యజమాని భూమిలో మరొకడు.. పొరుగువాడు చొరబడిపోయాడు. ‘దుమ్మక్కి’గా దున్నడం ప్రారంభించాడు! అందువల్ల నిజమైన యజమాని వెళ్లి ‘రెడ్డి’గారితో మొరపెట్టుకున్నాడు.. దౌర్జన్యంగా తన పొలంలో చొరబడి ఉండిన పొరుగువాడ్ని రెడ్డిగారు అదిలించి బెదిరించి తన పొలం నుండి వాడిని బయటికి వెళ్లగొడతాడని అసలు యజమాని ఆశించాడు! కానీ, ఉభయ పక్షాలు ఆ పొలంలో ప్రవేశించరాదన్నది రెడ్డిగారు చేసిన ‘పంచాయితీ’. అందువల్లనే ‘ఇదేం న్యాయం దేవరా?!’ అని నిజమైన యజమాని విస్మయ చకితుడయ్యాడు. ఇలాంటి ‘పంచాయితీ’లు, ‘పరిష్కారాలు’ ఆ పల్లెలో మాత్రమే కాదు.. ప్రతి పల్లెలోను జరిగాయి, జరుగుతునే వున్నాయి! ‘రెడ్డిగారు కరణం గారు’ ఆ పొలం దగ్గరికి వెళ్లి విచారించి లెక్కలు చూసి, కొలతలు వేసి నిజమైన ‘సొమ్ముకాపు’నకు పొలాన్ని అప్పగించాలి, చొరబడిన పొరుగువాడిని లేదా ఇతర దౌర్జన్యకారుడిని మందలించాలి! ‘ఆ భూమిలోకి ప్రవేశించవద్దని’ దౌర్జన్యకారుడిని మాత్రమే ఆదేశించి ఉండాలి! ‘ఉభయ పక్షాలు ఆ భూమిలోకి వెళ్లరాదని’ నిర్ధారించడం ఏమిటి? దౌర్జన్యకారుడు ఆ భూమి నుండి ఉపసంహరించుకోవాలి.. నిజమైన యజమాని ఎందుకని ఉపసంహరించుకోవాలి?
ఇప్పుడు నిజమైన యజమానులు తమంత తాముగా తమ భూభాగం నుండి ఉపసంహరించుకుంటుండడం ఈ పల్లెటూరి కథకు దేశ సరిహద్దులలో జరుగుతున్న విచిత్రమైన పునరావృత్తి! ఈ పునరావృత్తికి ప్రస్తుత పాలకులు కారకులు కాదు. గతంలో క్రూరమైన నిర్లక్ష్యం వహించి, చైనా ముష్కర మూకల చొరబాట్లను దశాబ్దులపాటు సహించిన జవహర్‌లాల్ నెహ్రూ విదేశాంగ, రక్షణ విధాన వైపరీత్య వారసత్వాన్ని మూడేళ్ల క్రితం వరకు కొనసాగించిన మన పాలకులు! డోక్‌లా పచ్చిక మైదానం నుంచి మన సైనికులను కూడ మనం ఉపసంహరించుకోవలసిన రీతిలో చైనాకు, మనకు మధ్య సయోధ్య కుదరడం మనకు లభించిన తాత్కాలిక విజయం కావచ్చు.. కానీ ఈ విజయం వెనుకనుంచి దశాబ్దులు కొనసాగిన మన వైఫల్యం, నిర్లక్ష్యం తొంగి చూస్తున్నాయి! ఈ వైఫల్యం క్రీస్తుశకం 1964 వరకు మన దేశానికి ఫ్రధానమంత్రిత్వం వహించిన జవహర్‌లాల్ నెహ్రూది. 1962 నుంచి మన ప్రభుత్వాలు మరిచిపోయిన ఈ విధాన వైపరీత్యాన్ని 1988-1989లో పునుద్ధరించిన నెహ్రూగారి మనుమనిది, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీది! జవహర్‌లాల్ నెహ్రూ దేశ భద్రతను, ప్రాదేశిక సమగ్రత- టెర్రిటోరియల్ ఇంటిగ్రిటీ- ని పట్టించుకుని ఉండినట్టయితే చైనా సువిశాలమైన టిబెట్ స్వతంత్ర దేశానికి ఆవలివైపున పడి వుండేది, మన దేశానికీ చైనాకు మధ్య స్వతంత్ర టిబెట్ దేశం నెలకొని వుండేది. డోక్‌లా-డోక్‌లామ్-పచ్చిక మైదానం ఉందన్న, అది భూటాన్‌లోను, సిక్కింలోను వ్యాపించి వుందన్న ధ్యాస సైతం చైనా నియంతలకు కలిగి వుండేది కాదు! అందువల్ల డోక్‌లాలోకి లడక్‌లోకి, ఉత్తరఖండ్‌లోకి, సిక్కింలోకి, నేపాల్‌లోకి, భూటాన్‌లోకి, అరుణాచల్‌లోకి చైనా ముష్కరులు చొరబడడం అన్న దశాబ్దుల సమస్య ఉత్పన్నమయి ఉండేది కాదు. ఎందుకంటే మనకు ఉత్తరాన వున్న స్వతంత్ర దేశం అనాదిగా మన సంస్కృతిలో భాగమైన టిబెట్-త్రివిష్టపం! చైనా స్పర్శ కూడా ‘్భరత- టిబెట్’ సరిహద్దునకు లేకపోవడం క్రీస్తుశకం 1949 వరకు కొనసాగిన అనాది చారిత్రక వాస్తవం! కురువంశం వాడైన ‘రూపతి’ అన్న రాజకుమారుడు కలియుగం ఆరంభంలో టిబెట్ పరిపాలకుడు. ఈ చరిత్రను నెహ్రూ చెఱచి పోయాడు, టిబెట్‌ను అన్యాయంగా చైనాకు అప్పగించాడు. టిబెట్‌లోకి చొరబడిన చైనా దళాలు క్రమక్రమంగా డోక్‌లా వరకు దురాక్రమణను సాగించడం చరిత్ర! ఈ దురాక్రమణను వర్తమానంలోని మన ప్రభుత్వం దౌత్యనీతితో తిప్పికొట్టడం మన తాత్కాలిక విజయం కావచ్చు గాక! కానీ శాశ్వత విజయం కోసం కృషి చేయడం మన వర్తమాన ప్రభుత్వానికి, భవిష్యత్ ప్రభుత్వాలకు కర్తవ్యం.. టిబెట్ మళ్లీ సర్వ స్వతంత్ర దేశంగా అవతరించడం మాత్రమే చైనా చొరబాట్లకు శాశ్వత పరిష్కారం.
నెహ్రూ చేసిన ‘హిమాలయ మహాపరాధాన్ని’ మన పాలకులు తొలగించ గలిగిన నాడు మాత్రమే మనకు తుది విజయం లభిస్తుంది. ఆ హిమాలయ అపరాధం ‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయిందని’ జవహర్‌లాల్ నెహ్రూ 1950లో అప్పటి మన ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఉత్తరం రాయడం.. 1950 తరువాత మరో ఐదేళ్లు సర్దార్ పటేల్ జీవించి ఉండినట్టయితే టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయి ఉండేది కాదు, చైనా నియంతల మెప్పును పొందాలన్న తపనతో నెహ్రూ టిబెట్ స్వాతంత్య్రాన్ని చంపగలిగి ఉండేవాడు కాడు. టిబెట్‌లో- టిబెట్ ప్రభుత్వం వారి అభీష్టం మేరకు దశాబ్దుల తరబడి నెలకొని ఉండిన మన సైనిక దళాలను, ఇతర వౌలిక వ్యవస్థలను మన ప్రభుత్వం ఉపసంహరించి ఉండేదికాదు, అప్పుడు- క్రీస్తు శకం 1950వ దశకంలో-మన సైనికులను టిబెట్ నుంచి ఉపసంహరించకపోయి ఉండినట్టయితే ఇప్పుడు డోక్‌లా మైదానం నుంచి మన సైనికులను ఉపసంహరించవలసిన అవసరం ఏర్పడి ఉండేది కాదు. కానీ 1950 తరువాత పటేల్ జీవించలేదు. టిబెట్ నుంచి మన సైనికులను మన ప్రభుత్వం వెనక్కి రప్పించడంతో ‘నిస్సహాయ’మైన టిబెట్‌ను చైనా 1959 వరకు దశలవారీగా దిగమింగింది. 1959లో హత్యకు గురి కాకుండా చైనా బారినుంచి తప్పించుకున్న టిబెట్ అధినేత దలైలామా మన దేశానికి వచ్చి చేరడంతో టిబెట్ స్వాతంత్య్ర సూర్యుడు అస్తమించాడు! చీకటి ముసిరిన హిమాలయాలలో చైనా మూకలు తిష్ఠవేయడం సులభమైపోయింది. ‘జవహర్‌లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదుల తొత్తు, అతగాడు సామ్రాజ్యవాదుల వీపుపై ఎక్కి కూర్చుని ఉన్నాడు...’ అని 1950వ దశకంలో చైనా కమ్యూనిస్టు నియంతలు ప్రచారం చేసారు. ఇలా ‘సామ్యవాద’ ప్రవర్ధకులు తనను అపార్థం చేసుకున్నందుకు మన దేశంలోని ‘మొదటి సామ్యవాది’ జవహర్‌లాల్ నెహ్రూ తీవ్రమైన మానసిక వ్యథకు గురి కావడం చరిత్ర. అందువల్ల తాను బ్రిటన్, అమెరికా వంటి ‘సామాజ్య్రవాదుల‘ వీపుపై ఎక్కి కూర్చోలేదని చైనా నియంతలకు రుజువు చేయడానికై నెహ్రూ ఆజీవనం కృషి చేశాడు. ఈ కృషిలో భాగం టిబెట్‌ను చైనా దురాక్రమణకు అప్పగించడం..
జవహర్‌లాల్ నెహ్రూ ఇలా రుజువు చేసుకొనడం మాత్రమే కాదు, చైనా నియంతలను తన వీపునకెత్తుకుని మోసాడు. ఐక్యరాజ్యసమితి నుంచి చిన్నదైన జాతీయ చైనాను బహిష్కరించి పెద్దదైన-టిబెట్‌ను దిగమింగిన తరువాత మరింత పెద్దదైన -ఈ కమ్యూనిస్టు ‘నవ’ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని నెహ్రూ అంతర్జాతీయ వేదికలెక్కి అహోరాత్రులు ఆర్భాటించడం 1962 వరకు నడిచిన విచిత్ర ప్రహసనం! 1949లో కమ్యూనిస్టులు ‘తుపాకీ గొట్టం’ ద్వారా చైనాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు చైనాలో అంతవరకు అధికారంలో వుండిన ప్రజాస్వామ్య జాతీయవాదులు తైవాన్ ద్వీపానికి పారిపోయి అక్కడ ‘జాతీయ చైనా’ను స్థాపించుకున్నారు. ఈ జాతీయ చైనాకే 1971 వరకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉండేది. కమ్యూనిస్టుల హస్తగతమైన చైనా ప్రధాన భూభాగం ‘నవ చైనా’గా అవతరించింది! ఇలా నవ చైనా నాయకులు నెహ్రూ వీపుమీదకి ఎక్కి, 1962లో మన సరిహద్దుల వెన్నున పొడిచారు! ఈ వెన్నుపోటు తరువాత 1988 వరకు మన ప్రభుత్వాలు ఇరవై ఆరేండ్లపాటు ఈ కమ్యూనిస్టు చైనాను శత్రుదేశంగానే భావించాయి. ఈ సమయంలో చైనా మన దేశంలోకి మళ్లీ చొరబడలేదు. కానీ 1984లో ఫ్రధాన మంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ తాతగారి విధాన వైపరీత్యాన్ని పునరుద్ధరించాడు! రాజీవ్ గాంధీ ప్రభుత్వం నాటి మెతక విధానం కారణంగానే 1986లో చైనా దళాలు దొంగతనంగా అరుణాచల్‌లోకి చొరబడి అనేకరోజులు ‘వంటా వార్పు’ నిర్వహించాయి. కానీ దీని తరువాత మన ప్రభుత్వాలు 2014 మే 26వ తేదీ వరకు రాజీవ్‌గాంధీ రచించిన ‘పథభగ్న’ విధానాన్ని అనుసరించాయి. చైనా ‘చొరబాట్ల పట్ల గట్టిగా నిరసన తెలపడం, ప్రతిఘటించకపోవడం’ ఈ పథభగ్న విధానం! సరిహద్దుల భద్రతతో నిమిత్తం లేకుండా చైనాతో వాణిజ్య సంబంధాలను పెంచుకొనడం కూడ రాజీవ్‌గాంధీ హయాంలో రూపొందిన పథభగ్న విధానం! శత్రుదేశమైన చైనా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రపంచంలో మరెక్కడా సంభవించని, సంభవించకూడని వికృత విష పరిణామం ఇది!
మన ‘మోకరిల్లే విధానం’ కారణంగానే 1990వ దశకం నుంచి చైనా చొరబాట్లు దాదాపు ప్రతిదినం జరిగాయి. లడక్‌లో 1962 తరువాత ఏర్పడిన ‘వాస్తవ అధీన రేఖ’ను చైనా కొంచెం కొంచెంగా మన వైపునకు జరుపుకుని వచ్చింది. ఫలితంగా 1962లో వాస్తవ అధీనరేఖకు ఇటువైపున అధీనంలో వుండిన కొన్ని కొండవాగులు, మైదానాలు, కొండలు, గ్రామాలు ఇప్పుడు ‘రేఖ’కు అటువైపునకు జరిగి చైనా అక్రమ అధీనంలోకి చేరిపోయాయి. 2011లో ఇలా రేఖపైకి చేరిన ఒక గ్రామంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను జరిపిన గ్రామీణులను చైనా దళాలు అడ్డగించడం సంచలనం సృష్టించింది! మన దళాలు వాస్తవ అధీన రేఖ సమీపంలో కాక కొంత దూరంగా మన వైపున గస్తీ తిరగడం దశాబ్దుల విచిత్రం! అందువల్ల వాస్తవ అధీనరేఖ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-మన వైపున ‘వాస్తవ భద్రతా రేఖ’-లైన్ ఆఫ్ యాక్చువల్ పెట్రోలింగ్-ఎల్‌ఏపి- ఏర్పడిపోయింది! చైనా దళాలు ఎల్‌ఏసిని ముందుకు నెట్టడం మన దళాలు ఎల్‌ఏపిని వెనక్కు లాగడం మూడేళ్ల క్రితం వరకు నడిచిన వైపరీత్యం..
మన మోకరిల్లే విధానపు రుచి మరిగిన చైనాకు గత మూడేళ్లుగా మన ఫ్రభుత్వం లడక్‌లో చొరబాట్లను ప్రతిఘటిస్తుండం, తిప్పి కొడుతుండడం ఊహించని పరిణామం! అందువల్లనే లడక్ నుంచి దృష్టి మరల్చడానికే మన డోక్‌లాలోని-లడక్‌కు దూరంగా ఉన్న సిక్కిం-్భటాన్‌ల సంగమ ప్రదేశంలోకి-చైనా చొరబడింది! కానీ, చొరబడిన వెంటనే మన సైనికులు తమతో తలపడడం, తమ కలాపాలను నిరోధించడం చైనాకు ‘అశనిపాతం’.. కోలుకున్న చైనా తోక ముడిచి డోక్‌లా నుంచి ఈ నెల 28వ తేదీన పలాయనం చిత్తగించడానికి ఈ మన ‘మారిన విధానం’ కారణం! మన దేశాన్ని ఓడించడం చైనాకు అసాధ్యం. కానీ డోక్‌లా నుంచి మన భూమినుంచి మన దళాలు ఎందుకు వెనక్కి రావాలి?

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352