ఆంధ్రప్రదేశ్‌

భారంగా మారిన ‘పీకే’ టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్, అందుకోసం వివిధ రాష్ట్రాల్లో బిజెపి, ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిశోర్ (పీకే)ను కన్సల్టెంటుగా నియమించుకున్నారు. జగన్‌ను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న పీకే, ఆ మేరకు తన బృందాలను ఇప్పటికే జనక్షేత్రంలోకి పంపించారు. అయితే, కొన్ని జిల్లాల్లో పీకే బృందం వ్యవహారశైలిపై వైసీపీ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. కనీస అవగాహన లేని వారిని తీసుకువచ్చి తమపై రుద్దడమే కాకుండా వారితో కార్యకర్తలకు శిక్షణ ఇప్పిస్తున్నారని, పైగా తమకు ఫలానా హోటల్‌లో బస కావాలని అడుగుతున్నారని పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. వీరి తిండి, వసతి ఖర్చులు భరించలేకపోతున్నామని, ఏమైనా అంటే ఎక్కడ జగన్‌కు ఏం చెబుతారోనని వౌనంగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. నియోజకవర్గంలో కనీసం 200-230 పోలింగ్ బూత్‌లుండగా, అందులో ఒక్కో బూత్‌కు 10 మందిని ఎంపిక చేసి, నియోజకవర్గ స్థాయిలో ఈ బృందం శిక్షణ ఇస్తోంది. ఈ బృందంలో క్షేత్రస్థాయిలో పనిచేసే వారంతా పక్క జిల్లాలకు చెందిన వారు కాగా, ఉత్తరాదికి చెందిన ఒకరు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. వీరి ఖర్చులన్నీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇన్చార్జులే భరించాల్సి వస్తోంది. అయితే సమావేశాలకు వారిని మాత్రమే ఆహ్వానిస్తున్న పీకే బృందం, తమకు మాత్రం సమాచారం ఇవ్వకపోవడంపై జిల్లా, నియోజకవర్గ నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఈ బృందాలేమైనా కొత్త విషయాలేమైనా చెబుతున్నాయా అంటే అదీ లేదంటున్నారు. జగన్ తాము అధికారంలోకి వస్తే చేస్తామన్న నవరత్న హామీల గురించి వివరించి, వాటిని ఏవిధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలో చెబుతున్నారని పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఇక ఈ బృందాలు జనక్షేత్రంలో పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయసేకరణ చేయకుండా, స్థానిక-నియోజకవర్గ స్థాయి మీడియా ప్రతినిధులతో మాట్లాడి వారి సలహాలు తీసుకుని అవే జగన్‌కు పంపిస్తున్నారంటున్నారు. కాగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే పీకే బృందాల వ్యవహార శైలి వచ్చే ఎన్నికల్లో జగన్‌తో పనిలేకుండా మేము సిఫార్సు చేసిన వారికే జగన్ టికెట్లు ఇస్తారన్నట్లుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో జగన్ చుట్టూ తిరిగే బదులు ఈ బృందాన్ని మేనేజ్ చేసి అనుకూల నివేదికలిప్పించుకుంటే సరిపోతుందన్న భావన టికెట్లు ఆశిస్తున్న వారిలో పెరిగిపోయిందని అంటున్నారు. దీనితో పార్టీని గట్టెక్కించడానికి వచ్చిన ఈ బృందాల వల్ల కొత్త గందరగోళం మొదలయి నేతల మధ్య కొట్లాటలు పెరిగే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు. ఈ బృందాల పెత్తనాన్ని ఇక తాము భరించలేమని, వారిని ఎంత త్వరగా పీకేయిస్తే పార్టీకి అంత మంచిదని నాయకులు స్పష్టం చేస్తున్నారు. స్థానిక వ్యవహారాల గురించి కనీస అవగాహన లేని, పక్క రాష్ట్రానికి చెందిన సొంత సంస్థ ప్రముఖుల చేతుల్లో వ్యవహారాలు నడుస్తుంటే పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఎందుకు ఉంటుందని ఓ సీనియర్ నేత ప్రశ్నించారు. ‘ఈ బృందంలో ఉన్న వారికెవరికీ పూర్వానుభవం ఉన్నట్లు కనిపించడం లేదు. ఉపాధి హామీ పథకం మాదిరిగా ఏదో నిరుద్యోగులను గుత్తగా తీసుకువచ్చినట్లుంది. వీళ్లను, వీళ్లిచ్చే నివేదికలే నమ్ముకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళితే కచ్చితంగా మునిగిపోతాం. అసలు పార్టీ పరిస్థితి ఏమిటో స్థానికంగా ఉండే ఏ కార్యకర్తనైనా అడిగితే చెబుతాడు. దీని కోసం మా నాయకుడు కోట్లు పెట్టి పీకేను పెట్టుకోవటం అమాయకత్వం కాక మరేమిటి?’అని ఆ నేత వ్యాఖ్యానించారు.