ఆటాపోటీ

బిసిసిఐ ఓవరాక్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నది. ఓవరాక్షన్‌తో సుప్రీం కోర్టునే ఢీ కొంటున్నది. పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసినప్పటికీ, భారత క్రికెట్‌పై తన పట్టును కోల్పోకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేస్తే, భవిష్యత్తులో బోర్డుపై తన పెత్తనం కొనసాగే అవకాశం ఉండదని స్పష్టమైన నేపథ్యంలో కొంత మంది అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, అనుసరిస్తున్న వ్యూహాలు బెడిసికొట్టే ప్రమాదం కనిపిస్తున్నది. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా, ప్రధాన కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తదితరులు లోధా సిఫార్సులు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని, వారిని వెంటనే పదవుల నుంచి తొలిగిస్తే తప్ప తమ పనిని సజావుగా చేసుకోలేమని పాలనాధికారుల బృందం (సిఒఎ) ఇటీవలే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. లోధా సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోకుండా, కీలక అంశాలను మినహాయించి, మిగతా వాటిని అమలు చేస్తామంటూ బిసిసిఐ తీర్మానాన్ని అమోదించడాన్ని తప్పుపట్టింది. బోర్డులో కొంత మంది వ్యక్తుల పెత్తనాన్ని బహిర్గతం చేస్తూ, వాస్తవ పరిస్థితులను కోర్టు ముందు ఉంచింది. ఇప్పటికే వివిధ సందర్భాల్లో బోర్డు వైఖరిపై అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. లోధా సిఫార్సుల నేపథ్యంలోనే అధ్యక్ష, కార్యదర్శి పదవుల నుంచి అనురాగ్ ఠాకూర్, రాహుల్ జోహ్రిలను తొలగించిన సుప్రీం కోర్టు ఈసారి మొత్తం పాలక మండలినే రద్దు చేసి, అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు.
పాదర్శనకతకు ససేమిరా!
పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరగాలన్న సుప్రీం కోర్టు సూచనలను బిసిసిఐ అధికారులు పట్టించుకోవడం లేదు. లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, సిఫార్సుల్లోని కీలక అంశాలను పక్కకుపెట్టి, ఎలాంటి ప్రాధాన్యం లేని చిన్నచిన్న సూచనలు అమలు చేస్తామంటూ తీర్మానాన్ని ఆమోదించడంతో సుప్రీం కోర్టు ప్రత్యేకంగా నియమించిన సిఒఎ సహనాన్ని కోల్పోయింది. దశల వారీగా సిఫార్సుల అమలు ప్రక్రియ పూర్తవుతుందని ఆశించిన సిఒఎకు బిసిసిఐ ప్రత్యేక తీర్మానంతో సవాళ్లు విసిరింది. న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, ఇబ్రహీం ఖలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గతంలో చేసిన వ్యాఖ్యలను, జారీ చేసిన ఆదేశాలను బోర్డు పట్టించుకోవకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న సిఒఎ ఏకంగా ఎగ్జిక్యూటివ్‌ను రద్దు చేయాలని కోరుతున్నది.
సుప్రీం ఆగ్రహం!
బిసిసిఐ అధికారుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఉందనడానికి గతంలో చేసిన పలు కీలక వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల అవసరం ఏమిటని బిసిసిఐని నిలదీసింది. బోర్డు కార్యవర్గంలో మంత్రులకు చోటు కల్పించవద్దని లోధా కమిటీ చేసిన సూచనను అమలు చేసినందు వల్ల వచ్చే నష్టమేమిటో వివరించాలని ఆదేశించింది. కోట్ల రూపాయల లావాదేవీలను ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా చూసుకోవాలని ఆలోచిస్తున్నారా? అంటూ బోర్డు అధికారుల ఆంతర్యాన్ని బట్టబయలు చేసింది. లోధా కమిటీ సమర్పించిన నివేదికలోని పలు అంశాలు ఆచరణలో కష్టమని, వాటిని అమలు చేయడం అసాధ్యమని బిసిసిఐ పేర్కోవడాన్ని గతంలో చాలాసార్లు తప్పుపట్టింది. తాజా ప్రత్యేక వార్షిక సమావేశంలో ఇదే వాదన వినిపిస్తూ, కొన్ని తీర్మానాలకే ఆమోదం తెలపడం పట్ల సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. బోర్డు కార్యవర్గ సభ్యులకు గరిష్ట వయఃపరిమితిని విధించాలని లోధా కమిటీ చేసిన సిఫార్సును వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటని బిసిసిఐని ఇంతకు ముందే సుప్రీం కోర్టు నిలదీసింది. ఒక సంఘానికి ఒకే ఓటు వంటి సిఫార్సులను కూడా బోర్డు ఇప్పటికీ వ్యతిరేకించడం పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించే అవకాశాలున్నాయి.
నాలుగేళ్లుగా అదే తీరు..
సుమారు నాలుగేళ్లుగా బిసిసిఐ తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో బయటపడిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుతో ఇరుకున పడిన బిసిసిఐ ఆత్మరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ చేస్తునే ఉంది. ఫిక్సింగ్, బెట్టింగ్‌పై అంతర్గత విచారణ జరిపించామని, సాక్ష్యాధారాలు లభించలేదు కాబట్టి వివాదానికి తెరపడినట్టేనని అప్పట్లో బిసిసిఐ ప్రకటించింది. అయితే, బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆదిత్య వర్మ ముంబయి హైకోర్టును ఆశ్రయించడంతో బోర్డు కంగారు పడింది. అక్కడ తీర్పు వర్మకు అనుకూలంగా రావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్నతర్వాత, నిజానిజాలు తేల్చడానికి విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నాయకత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు విడతలుగా సమర్పించిన నివేదికల ఆధారంగా, దోషులను సుప్రీం కోర్టు గుర్తించింది. వారికి శిక్షలను ఖరా చేసేందుకు లోధా నాయకత్వంలో అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీకి అప్పగించింది. అంతేగాక, భారత క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు అవసరమైన చర్యలను సూచించాలని కోరింది. బోర్డు అధికారులతో 38 పర్యాయాలు సమావేశమైన లోధా కమిటీ 159 పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అందులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు, వాటిని తు.చ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే, సిఫార్సులను అమలు చేయడం ఎందుకు సాధ్యం కాదని బోర్డు వాదిస్తునే ఉంది. కోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా, ప్రతిసారీ ఏదో ఒక సాకు చూపి తప్పించుకుంటూ వస్తున్న బిసిసిఐ ఈసారి ఏమని సమాధానం చెప్తుందో చూడాలి.
బోర్డుకు భయమెందుకు?
లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి బిసిసిఐ ఎందుకు భయపడుతున్నదో తెలుసుకోవాలంటే, ముందుగా ఆ కమిటీ చేసిన సూచనలను ఒకసారి పరిశీలించాలి. క్రికెట్ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై లోధా కమిటీ దృష్టి సారించింది. క్రికెట్‌తో సంబంధం లేనివారే క్రికెట్ బోర్డు, సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగానే సమస్యలు తలెత్తుతున్నాయని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. రాజకీయ నేతలను క్రికెట్‌కు దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మంత్రలు ఎవరూ బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల పాలక మండళ్లలో సభ్యులుగా ఉండరాదని స్పష్టం చేసింది. దశాబ్దాలుగా బిసిసిఐని శాసిస్తున్నది రాజకీయ నాయకులు లేదా వ్యాపారవేత్తలేనన్నది జగమెరిగిన సత్యం. అందుకే, వారంతా లోధా సూచనలను వ్యతిరేకిస్తున్నారు. వారి చెప్పుచేతల్లో ఉంది కాబట్టి, ఆ వాదనే బోర్డు వాదనగా మారింపోయింది. కాగా, లోధా కమిటీ చేసిన మరో కీలక సూచన కూడా చాలా మందికి మింగుడు పడడం లేదు. బిసిసిఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి వంటి పోస్టులను నిర్వహించే వారికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలన్న షరతును అంగీకరించడమంటే, తమ ఉద్వాసనకు తామే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుందని బోర్డు పెద్దలకు అర్థమైంది. ఈ పోస్టుల్లో సేవలు అందించేవారు తప్పనిసరిగా భారతీయులై ఉండాలని, వారి వయసు 70 సంవత్సరాలకు దాటరాదని లోధా కమిటీ స్పష్టం చేయడం ఈ వయసును ఏనాడో దాటేసి, ఇంకా బోర్డు పదవులను పట్టుకొని వేళ్లాడుతున్న వారికి రుచించలేదు. చివరికి సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, సస్పెండ్ చేసే వరకూ చాలా మంది తమ పదవుల్లోనే కొనసాగారు. కార్యవర్గ సభ్యుల పదవీకాలంపై సీలింగ్ విధించాలని కూడా లోధా కమిటీ ప్రతిపాదించింది. బిసిసిఐ పాలక మండలికి ఒక వ్యక్తి వరుసగా రెండు, మొత్తం మీద గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చని పేర్కొంది. అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉండకూడదని తేల్చిచెప్పింది. ఇది కూడా బోర్డు అధికారులకు ఏమాత్రం నచ్చని అంశమే. దశాబ్దాలకు దశాబ్దాలు అధికారంలో కొనసాగుతూ, భారత క్రికెట్‌పై పెత్తనం చెలాయిస్తూ, కోట్లాది రూపాయలను విచ్చలవిడగా ఖర్చు చేసే వారంతా ఈ సూచనను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో బోర్డు వ్యతిరేకించిన సిఫార్సుల్లో ఇది కూడా ఒకటి. బోర్డులో 30 యూనిట్లకు సభ్యత్వం ఉందని, అయితే, సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేవన్న విషయాన్ని లోధా కమిటీ ప్రస్తావించింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వం ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. ఇలాంటి అసమానతలను తొలగించి, ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో సంఘానికి మాత్రమే బిసిసిఐలో సభ్యత్వం ఉండాలని స్పష్టం చేసింది. ఇది కూడా బోర్డు పెద్దలకు నచ్చని అంశమే. క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండి, ప్రతి మ్యాచ్‌కీ స్టేడియాలు నిండిపోయే రాష్ట్రాలను, అసలు క్రికెట్ పట్ల ఏమాత్రం ఆసక్తి చూపని రాష్ట్రాలను ఒకే రీతిలోచూడడం ఏ విధంగా సాధ్యమవుతుందంటూ బోర్డు అధికారులు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇక, బోర్డు అధ్యక్షుడికి మూడు ఓట్లు వేసే హక్కును తీసివేయాలని లోధా కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి చొప్పున రెండు ఓట్లు ఉంటాయి. ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు, ఓట్లు సమానంగా వస్తే, కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది. అంటే, అధ్యక్షుడిగా మూడు ఓట్లు ఉంటాయి. కానీ, ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఎందుకని లోధా కమిటీ ప్రశ్నించింది. అతనికి ఒక ఓటు ఉంటే సరిపోతుందని తెలిపింది. బోర్డు అధ్యక్షులు ఉన్నావారు, భవిష్యత్తులో ఆ పీఠాన్ని అధిష్టించాలని కోరుకుంటున్న వారు ఈ సిఫార్సును బుట్టదాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే, ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో దీనిని అమలు చేయరాదన్న తీర్మానానికి ఆమోద ముద్ర పడేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాపారేతర సంస్థగా నమోదైంది కాబట్టి ఎవరికీ జవాబుదారి వహించాల్సిన అవసరం లేదని బిసిసిఐ చేస్తున్న వాదనను లోధా కమిటీ తోసిపుచ్చింది. బోర్డు కూడా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది. బోర్డు కార్యకలాపాల్లో ప్రజలతో పాత్ర కీలకం కాబట్టి, ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ సిఫార్సుకు అటు నేతలు, ఇటు బడా పారిశ్రామేక వేత్తలు గండికొట్టారు. ఇది కూడా అమలుకు నోచుకోకుండా అడ్డుపడుతున్నారు. ఈ పరిస్థితి ఎటుపోయ టు వస్తుందో మరో వారం రోజుల్లో తేలుతుంది.

- శ్రీహరి