విజయవాడ

సైన్స్ ఎందుకు రాస్తున్నాం? (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో రాయటమనేదే ఒక ఎత్తు. అందులో సైన్స్‌కు సంబంధించిన అంశాలపై రాయటమనేది మరో ఎత్తు. ఎందుకంటే, అందరికీ అర్థమయ్యేలా వైజ్ఞానిక అంశాల గురించి రాయటం ఆషామాషీ వ్యవహారం కాదు. తెలుగులో రాసేవారున్నా చదివేవారు క్రమంగా తగ్గిపోతున్నారనేది ఒక విషయమైతే, సైన్స్ వ్యాసాలు, కథలు రాసేవారింకా తగ్గిపోతున్నారనేది మరో వాస్తవం, ఆందోళన పరిచే అంశం కూడా. కానీ, నిజానికి సైన్స్ విషయాలు రాయమని అడగాలే కానీ రాసేవారెందరో ఉన్నారు. దానికి ఈ వ్యాస సంపుటే సాక్ష్యం. సరైన ప్రోత్సాహం లభించాలే గానీ ఎనె్నన్నో ఆసక్తికరమైన వ్యాసాలను వీరు అందించగలరని ఈ వ్యాస సంపుటి చదివితే మనకు బోధపడుతుంది.
సాధారణ రచనలకు, రచయిత(త్రు)లకు ప్రోత్సాహం కరవైపోతోందనే తరుణంలో, అందులోనూ సైన్స్ అంశాలకు సంబంధించి ఎందుకు? ఏమిటి? ఎలా రాస్తున్నారనే అంశాలతో ఈ వ్యాస సంపుటిని తేవాలని ప్రయత్నించిన ప్రచురణకర్తల ధైర్యాన్ని, విశ్వాసాన్ని మెచ్చుకోవాలి. నిజానికి సైన్స్ వ్యాసాలను చదివేటపుడు ఈ రచయితకిలాంటి విషయాలెలా తెలిశాయి? వాటి వెనుక సంగతులేమిటి?, ఎవరి వల్ల, ఎందువల్ల రాశారని తెలుసుకోవాలనే తపన కొందరికి ఉంటుంది. దాన్ని తీర్చటానికే అన్నట్టు, దాదాపు 32 మంది సైన్స్ వ్యాసాలు రాసే రచయిత(త్రు)లను వారి వారి అనుభవాలు, జ్ఞాపకాలను గుదిగుచ్చి ఇమ్మని కోరి మరీ ఈ సంకలనాన్ని తెచ్చారు ప్రచురణకర్తలు. ఐతే, దీన్ని కేవలం ఏదో ఒక సాధారణ పత్రికా వ్యాసాల సంకలనంలా మొక్కుబడిగా ప్రచురించకుండా, శాస్త్ర ప్రచారోద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా వెలువరించారు. ఇందుకు విజ్ఞాన శాస్త్ర ప్రచురణలు, ప్రజాసైన్సు వేదిక- నెల్లూరు వారిని అభినందించాలి.
ఈ సంకలనంలో అనేక మంది రచయిత(త్రు)లు తాము సైన్స్ వ్యాసాలను ఎందుకు రాశారు? ఏమి రాశారు? ఎలా రాశారు? ఎన్ని రాశారు? వ్యాస రచనకు పరిమితులు విధించినపుడు ఎలా ఇబ్బంది పడ్డారు.. అనే విషయాలపై ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో స్పందించారు. ప్రతి వ్యాసం కూడా విభిన్నంగా వుండి మనలను ఆలోచింపజేస్తుంది. మొత్తం 31 వ్యాసాలు, 4 అనుబంధ వ్యాసాలు, వెరశి 35 వ్యాసాలు ఇందులో ప్రచురితమయ్యాయి.
ఒకరిద్దరు ఇప్పటిదాకా రాసిన రచనల జాబితానూ ఇందులో ఇచ్చారు. అనుబంధంలోని నాలుగో వ్యాసం తప్ప, దాదాపు అన్నీ అలరిస్తాయి. ఆ నాలుగో వ్యాసం ఎవరిని ఉద్దేశించి రాశారో కానీ, అది వారి అనుభవమో, ఉద్దేశ్యమో అయితే మనకు గొడవ లేదు. మన దేశం పుణ్యభూమి. అలాంటిదానికి శాస్ర్తియ సైన్స్ పరిశోధన అందని చందమామ కాదు. రాజకీయ జోక్యం లేకుండా పనిచేసే వాతావరణం, ప్రోత్సాహం వుంటే ఎంతో చేయవచ్చు. ఆ సంగతికీ, సైన్స్ వ్యాసాలు రాయటానికీ సంబంధం లేదు. నేడు ఆనాటి ఉపాధ్యాయులు, విద్యార్థుల్లాంటి వారు లేరు. అందరూ మెకాలే మనవ(రా)ళ్లూ, మునిమనవ(రా)ళ్లే! వారికి సహేతుకంగా చెప్పినా నమ్మకపోవచ్చు. అందరికీ ‘గూగుల’మ్మ చెప్పిందే వేదం. అమావాస్య నాడు చంద్రుడిని చూపించే ప్రయత్నమే వారిది. ఏం చేద్దాం! ఈ సంపుటి తెలుగు సైన్స్ రచనల మీదా, రచయిత(త్రు)ల మీదా పరిశోధన చేయాలనుకునేవారికి బాగా ఉపకరిస్తుంది. అన్నట్టు, ఈ సంపుటిలో ముద్రారాక్షసాలు దాదాపు లేవనే చెప్పాలి. ఐతే, రచయిత(త్రు)ల ఫొటో, వారి పరిచయం కూడా సంపుటిలో చోటుచేసుకొని వుంటే ఎంతో ఉపయుక్తంగా ఉండేది. నిజానికి సైన్స్ వ్యాసాలు తెలుగులో ఇప్పటిదాకా ఎన్ని వచ్చాయి? ఎలాంటి అంశాలపై వచ్చాయి? రచయిత(త్రు)లెవరు?- అనే అంశాలపై దృష్టి సారించి, వాటిని వర్గీకరించి అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ పనిని కూడా త్వరలో ప్రజాసైన్సు వేదిక చేపడుతుందని ఆశిద్దాం.
వ్యాసమాలిక : సైన్స్ ఎందుకు రాస్తున్నాం?
పేజీలు : 224, వెల : రూ. 120
సంపాదకులు : డా. నాగసూరి వేణుగోపాల్, మాల్యాద్రి
ప్రతులకు : విజ్ఞాన శాస్త్ర ప్రచురణలు, ప్రజాసైన్సు వేదిక, 162, విజయలక్ష్మీ నగర్, నెల్లూరు - 524004.
చరవాణి : 9440503061

- డా. వివివి రమణ, విజయవాడ. చరవాణి : 9441234429