విజయవాడ

మరబొమ్మ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాబాయ్ జానకి ఎలా ఉంది? దాన్ని చూసి చాలా కాలం అయింది. ఇక్కడికి వస్తూ ఉంటుందా?’’ జానకి తండ్రి శంకరం గారిని అడిగాను సంక్రాంతి పండగకి మా వాళ్లింటికి వచ్చిన నేను.
జానకీ, నేనూ డిగ్రీ వరకూ కలసి చదువుకున్నాం. ఇద్దరం ఒకే కంచంలో తిని, ఒకే మంచం మీద పడుకోకపోయినా మేమిద్దరం మంచి స్నేహితులం. మామధ్య మంచి స్నేహమే ఉంది. డిగ్రీ అయిన తరువాత జానకి చదువు మానేసి పెళ్ళిపీట ఎక్కింది. నేను మాత్రం ఆంధ్రా యూనివర్శిటీలో పిజి చేసాను. ఆ తరువాత రెండు మూడు సంవత్సరాలు ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేసి ఆ తరువాత మూడుముళ్లు వేయించుకున్నాను. నా పెళ్ళి సమయానికే జానకికి ఇద్దరు పిల్లలు కూడా.
నా ప్రశ్నకి శంకరంగారు గాఢంగా నిట్టూర్పు విడిచారు. అతని తీరు చూసి జానకి జీవితం సంతోషకరంగా లేదనిపించించి నాకు.
‘‘ఏం బాబాయ్ దానికి ఏమైనా సమస్యలా?’’ అడిగాను.
‘‘ప్చ్.... ! సమస్యలంటే సమస్యలేనమ్మా. పెళ్లిరోజున నీవు నాతో అన్నమాటలు ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకమున్నాయి. పెళ్ళి చేసి దాన్ని అత్తవారింటికి పంపడం కాదమ్మా పులినోట్లో పడేశానా నేను చేచేతులా, అని నాకు అనిపించి బాధ కలుగుతుంది’’
ఆ మాటలు వినగానే నాలో అసహనం పెరిగింది. అత్తవారింటిలో జానకి ఎదుర్కొంటున్న పరిస్థితులు అక్కడ వాతావరణంలోగంగిరెద్దులా తల ఊపుతూ అన్ని పనులూ చేసుకుపోతూ జీవితంతో రాజీపడి బ్రతికేస్తున్న జానకి మీద అసహనం, కోపం. పేరుకు తగ్గట్టుగానే జానకికి ఎన్ని కష్టాలు? రామాయణ కాలంలో సీతాదేవి పడ్డ కష్టాలు ఈ కలికాలంలో సీతకి మరో పేరయిన జానకికి వచ్చిపడ్డాయి. చిన్నప్పుడు ఎంత అపురూపంగా పెరిగింది కన్నవారింటిలో. పెళ్ళయిన తరువాత అత్తవారింటిలో జానకికి ఇన్ని కష్టాలా? ప్చ్.....! అంటూ నిట్టూర్పు విడిచాను. కూతుర్ని అంత శాడిస్టు మెంటాల్టీ గల ఇంటికి కోడలిగా పంపినందుకు జానకి తండ్రి మీద నాకు అసహనం. నేటి సమాజంలో జానకి అత్తగారిలాంటి వాళ్ల మీద అసహనం. సమాజంలో ఇలాంటి వ్యవస్థ ఉన్నందుకు సమాజం మీద నాకు అసహనం.
శంకరం గారయినా తన కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు ఆ ఇంటి గురించి బాగా వాకబు చేయద్దూ? వాళ్ల మంచి చెడ్డలు కనుక్కోవద్దూ - ఇలా భావోద్వేగంతో ఆలోచిస్తున్నాను.
తిరిగి జానకి తండ్రి మీద జాలి లాంటి భావం కలిగింది నాకు. పాపం అతడు ఏం చేయగలడు? ఆ సమయంలో అందరూ మంచి వాళ్లలాగే కనిపిస్తారు. ఆ సమయంలో అది ఓ నాటకమని అనిపించదు.
మానవ జీవితమే ఓ నాటకం. మధ్యతరగతి మనుష్యుల జీవితాల్లో క్షణ క్షణం నటన ఉంటుంది. పెళ్ళి తంతులో పెళ్ళికొడుక్కి, పెళ్లి కూతురికీ పురోహితుడు అరుంధతీ నక్షత్రం చూపించడం నటనే. అది కనిపించినట్టు వారు తలూపడం నటనే. పురోహితుడికి కూడా కనిపించని ఆ నక్షత్రం పెళ్లికొడుక్కీ పెళ్లికూతురుకీ చూపించడం నటనే. అతను ఖగోళ శాస్తవ్రేత్త కాదుకదా! ఎవరి పాత్ర వాళ్లు పోషిస్తేనే పెళ్లితంతు ముగుస్తుంది. ఇది నిజమో అబద్ధమో మనకూ తెలియదు.
నిజం, అబద్ధం ఒక దానితో మరొకటి విడదీయలేనంతగా కలిసి ఉంటాయి. అబద్ధాన్ని, నిజాన్ని విడదీసే ప్రయత్నం చేసేకన్నా నిజమేనని నమ్మినట్టు నటిస్తేనే జీవితం హాయిగా గడిచిపోతుంది. జానకి జీవితం బాగుంది అనేది అబద్ధం. బాగులేదు అన్నది నిజం. ప్రస్తుతం జానకి గురించి ఇలా ఆలోచనలు చోటుచేసుకున్నాయి. జానకి తండ్రి వెళ్లిపోయి ఎంతసేపయిందో గమనించలేదు.
పెళ్ళి పందిరిలో నలుగురైదుగురు ఆడవాళ్లు ఒక దగ్గర కూర్చుని ముచ్చటించుకుంటున్న మాటలు నా చెవిలో పడ్డాయి.
‘‘పెద్దకోడలు వీళ్లతో కలవదుట. అంటీ ముట్టనట్టు ఎలా తిరుగుతుందో చూశావా?’’ ఒకామె అంది.
‘‘అలా ఎందుకు తిరగదూ? పాపం అమ్మాయిని ఎంత సతాయించేరు వీళ్లు. పాపం చాలా బాధలు పడింది మొదట్లో. వీళ్లేం అంత మంచివాళ్లు కారు. వీళ్లకి బంధు వర్గంలో కూడా అంత మంచి పేరు లేదు. ఆ ఇంట్లో ఆడవాళ్లదే పెత్తనం. మగ పిల్లలు దద్దమ్మలనుకో. ఆ ఇంటి ఆడపిల్లలు మొగుళ్లని కొంగున కట్టుకుని తిరుగుతారు. ఇంటికి వచ్చిన కోడళ్లు మాత్రం రాత్రి సమయంలోనే మొగుడితో గడపడానికి అవకాశం కలుగుతుంది. అలా అని ఆ ఇంటి ఆడపిల్లలు చదువులేని వారా అంటే అదీ కాదు. బాగా చదువుకున్న వాళ్లే. సంస్కారం లేని మూర్ఖులు. పైపెచ్చు ఎదుటి వాళ్లకి సంస్కారం లేదంటారు’’ మరో ఆమె అంది.
‘‘మరేంటి అనుకుంటున్నావు? పెళ్లయిన కొత్తలో పెద్దకోడలు చేత ఆడపడుచులు వాళ్ల బట్టలుతికించేవారట. సరిగా తిండి పెట్టేవారు కాదుట. సహనానికీ ఓ హద్దు ఉంటుంది. పిల్లి పిరికిదని నాలుగు గోడల మధ్య బంధించి కొట్టడానికి ప్రయత్నిస్తే తిరగబడుతుంది. పిల్లి కూడా పులిలా మారుతుంది. అలాగే అయింది. సహనం కోల్పోయిన పెద్దకోడలు తిరగబడింది. మొగుడ్ని తీసుకుని వేరే వెళ్లిపోయింది. ఎప్పుడో ఇలాంటి శుభకార్యాలకి, మాత్రం వస్తుంది’’ మరో ఆమె అంది. వాళ్ల మాటలు వింటున్న నాలో అలజడి. ఏదో తెలియని బాధ. ‘‘ఏమమ్మా శాంతీ.. అలా ఒక్కదానివే నిలబడిపోయావు? జానకి దగ్గర ఉండమ్మా. అసలే దిగులుగా ఉంది. నీవు దగ్గరుంటే దానికి ధైర్యం వస్తుంది’’ జానకి నాన్నగారు నాతో అన్నారు.
‘అలాగే’ అన్నట్టు తలూపాను. ముందుకు వెళ్లబోతున్న అతడ్ని ఆపి నా బాధని తెలియజేయాలనిపించింది.
‘‘బాబాయ్!’’
‘‘ఏంటమ్మా?
‘‘జానకి పెళ్లి విషయంలో మీరు తప్పు చేస్తున్నారనిపిస్తోంది.’’
‘‘అలా నీకెందుకనిపిస్తోంది? నేను వాకబు చేస్తే మగ పెళ్లివారు మంచివాళ్లని బంధువర్గంలో ఇద్దరు, ముగ్గురు చెప్పారు’’ అన్నారాయన. నేను వెంటనే పెళ్లి పందిరిలో ఆడవాళ్లు మగపెళ్ళివారి గురించి అనుకుంటున్న మాటలు చెప్పాను.
ఆయన చిన్నగా నవ్వారు. ‘‘అంతా నీ భ్రమమ్మా! అదంతా నీ ఊహ మాత్రమే. జానకికి ఏం జరగదు. అలా అంటున్న వాళ్లు వాళ్ల ఎదురుగా వాళ్ల లోపాల్ని తెలియజేయగలరా? మాట్లాడగలరా? ఉహూ....! అలా ఎప్పటికీ చేయలేరు. అందుకే అంటారు
నాలుకకి నరం లేదని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని’’
ఇలా అతను నా మాటల్ని కొట్టి పారేసారు.
అది నా భ్రమ కావచ్చు. ఊహ కావచ్చు. ఆలోచన కావచ్చు. అనుమానం అంతకన్నా కావచ్చు వీటి అన్నిటి సారాంశం ఒక్కటే జానకి అత్తవారు అంత మంచి వాళ్లు కాదు అని. అయితే నేనేం చేయలేకపోయాను.
ఇది చాలా సంవత్సరాల క్రితం విషయం. ఇప్పుడు జానకి తండ్రి దాని సంసారం సాఫీగా సాగటంలేదు. సంతోషకరంగా లేదని బాధగా చెప్పిన మీదట గత జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. గతం ఆలోచనల నుండి వర్తమానంలోకి అడుగుపెట్టిన నేను జానకిని చూడ్డానికి వాళ్లింటికి బయలుదేరాను.
జానకి ఇంటి వాతావరణం కేరింతలు, నవ్వుల్తో గోల గోలగా ఉంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నేను అవాక్కయ్యాను. ఆ ఇంటి సభ్యులు అంటే జానకి ఆడబడుచులు, వాళ్ల మొగుళ్లు పేకాటలో మునిగి తేలుతుంటే భర్తలకి హుషారు కలిగిస్తూ కేకలు పెడుతున్నారు. వాళ్ల కేరింతలు చూసి జానకి అత్తగారూ, మామగారూ ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్లవేపు చూస్తున్నారు.
పాపం జానకి జిడ్డోడుతున్న ముఖంతో రేగిన జుట్టుతో ఆ పేకాటలో కూర్చున్న వాళ్లకి, ఆ ఆట చూసి వినోదిస్తున్న వాళ్లకి టిఫిన్లు తయారు చేసి ప్లేట్లలో సర్దుతోంది. జానకి ఇద్దరు పిల్లలూ తీసుకెళ్లి ఆ టిఫిను ప్లేట్లు ఆడుతున్న వాళ్లకి, వినోదిస్తున్నవాళ్లకి అందిస్తున్నారు. ఈ దృశ్యం నాకు వెగటు అనిపించింది.
‘్ఛ....్ఛ! ఏం మనుషులు? వాళ్లకి బుద్ధి లేకపోతే జానకి అత్తమామలకి బుద్ధి ఉండొద్దు?.. పండక్కి మనవళ్లను ఎత్తుకునే వయసులో ఉన్న కూతుళ్లను పిలిచారు బాగానే ఉంది. కూతుళ్లకన్నా చాలా చిన్న వయస్సులో ఉన్న కోడలిచేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. పోనీ పండగ సమయంలో అందరూ కలిసి సంతోషంగా గడపాలన్న ఆలోచన ఉంటే వంట మనిషిని ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే కేటరింగ్‌కి ఆర్డరు ఇవ్వాలి. అదీకాదు, ఇదీ కాదంటే నలుగురూ నాలుగు పనులు సర్దుకుని చేసుకుపోవాలి. అలా కాకుండా జానకి ఒక్క దాని చేత ఇంటి చాకిరీ చేయించడం నాకు నచ్చలేదు.
ఇది కూడా ఒక విధంగా గృహ హింసే. ఆడదాన్ని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఆర్థికపరంగా భర్త కాని, అత్తింటివారు కాని మాటల్తో, చేతల్తో హింసిస్తే అది గృహిహింసే. ఇంటా బయటా స్ర్తిలకు భద్రత కల్పించే చట్టాలున్నాయి. జాతీయ మహిళా విధానం ప్రత్యేకంగా ఉన్నా స్ర్తిలకి భద్రత పెను సమస్యగా ఉంది. ఒక విధంగా చూస్తే జానకి పరిస్థితి గృహహింస కింద లెక్కకు వస్తుంది అనుకుంటున్నాను నేను.
పాపం ఆ ముక్కు పచ్చలారని ఆ పసిపిల్లల్ని కూడా వాళ్లు వదల్లేదు. మన ఇంటికి వచ్చిన వాళ్లు మనకి అతిథులు. మనం వాళ్లని ఆదరించాలి. వాళ్లకి మీరు టిఫిను ప్లేట్లు అందించాలి అని జానకి అత్తగారు ఆ పసి వెధవలకి ఆజ్ఞ జారీ చేస్తే ఆ పిల్లలు అందరికీ టిఫిను ప్లేట్లు అందిస్తున్నారు. ఇలా వాళ్లు బాల కార్మికులయ్యారు. బాలల చేత పని చేయించడం నేరం అని చట్టమున్నా ఆ ఇంట్లో ఆ చట్టం ఎందుకూ పనికి రాకుండా పోయింది.
అక్కడి వాతావరణం చూసి గగుర్పాటు కలిగింది నాకు.
అందరూ కాకపోయినా కొంతమంది ఇళ్లలో కూతుళ్లని ఓలాగ, కోడళ్లను మరోలా వివక్షతో చూసే గుణం ఉంది. కోడలు కూడా కూతురులాంటిదే అన్న భావం గలవాళ్లు కూడా ఉన్నారు.
అదంతా ఎందుకు? తన విషయమే తీసుకుంటే తన అత్తగారు కూతుళ్లని ఎంత అపురూపంగా చూసుకుంటుందో తనని కూడా అంతే అపురూపంగా చూసుకుంటుంది. శాంతీ... శాంతీ... అంటూ అత్తగారు, తన భర్తా తనని పిలుస్తూ తిరుగుతూ ఉంటే ఒక్కొక్క పర్యాయం సంతోషం కలిగేది. మరో పర్యాయం విసుగనిపించేది. వాళ్ల మీద తను విసుక్కున్నా పట్టించుకునే వారు కాదు. జానకి అత్తవారింటితో పోల్చుకుంది. తను ఎంత అదృష్టవంతురాలో తెలుస్తోంది. నా దృష్టి జానకి భర్త వేపు మళ్లింది. అతను కేరింతలు కొడ్తూ బావలకి హుషారిస్తున్నారు. గట్టిగా నవ్వుతున్నాడు. నాకు అతనిమీద అసహ్యం వేసింది. కోపం, అసహ్యం అన్న మనో వికారాలు నాలో కలిగాయి. జానకి మీద కరుణ, జాలి కలిగితే ఆ కుటుంబ సభ్యుల మీద కోపం, అసహ్య భావాలు కలిగాయి. జానకి భర్త ఏం మనిషి? పెళ్లినాడు కష్టాల్లో, సుఖాల్లో నీకు అండగా ఉంటాను. నీ బాగోగులే నా బాగోగులు అని ప్రమాణం చేసిన తను తనలో సగ భాగం తన అర్ధాంగి. అలాంటి భార్యను బానిస కన్నా హీనంగా చూస్తున్నారు. ఛీత్కారంగా అతని వేపు చూస్తూ అనుకున్నాను. నా భావాల్ని కనిపెట్టింది జానకి.
‘‘శాంతీ అలా నిలబడి పోయావేం? రా... రా’’ అంటూ నవ్వుతూ నన్ను ఆహ్వానించింది. దాని నవ్వులో జీవం లేదు. నేను నా భావోద్వేగాల్ని అణచుకుంటూ ‘‘ఏంటే మరబొమ్మా ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావో నీ అవతారం చూస్తూ ఉంటే అవగతమవుతోందిలే. అలాంటప్పుడు ఎలా ఉన్నావు అని అడగడం నా తెలివితక్కువ తనమే’’ అన్నాను వ్యంగ్యంగా.
‘‘నీ వ్యంగ్యం నేను గమనించలేదా శాంతీ! అయితే నేను మరబొమ్మను కాను ప్రాణం ఉన్న మనిషినే. నాకూ సుఖదు:ఖాలకి స్పందించే మనస్సు ఉంది. కష్టాలకి కన్నీరు కార్చే కళ్లున్నాయి. ఏదో సినిమా పాటలా మానూ మాకును కాను. అయితే మా ఇంటి పరిస్థితులు నన్ను మరబొమ్మలా మార్చేసాయి’’ అంది జానకి బాధగా.
‘దాని మాటలు వింటున్నాను నేను. జానకి అత్తవారి లాంటి మనుషుల్లో మార్పు వస్తుందా? వస్తే జానకి అదృష్టవంతురాలే. ఒకవేళ రాకపోతే దానంత దురదృష్టవంతురాలు లేదు’ అనుకుంటూ గాఢంగా నిట్టూర్పు విడిచాను నేను.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి, చరవాణి: 7382445284