ఎడిట్ పేజీ

భోజన బీభత్సం.. లైంగిక ‘ఉన్మాదం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిలాభద్రుడు అన్నవాడు మతాచార్యుడుగా చెలామణి అయిన భోజన బీభత్సకారుడు! సంన్యాసులు రోజుకు ‘ఒకేసారి’ భోజనం చేయాలి, ఆరోగ్యవంతులైన గృహస్థులు రోజుకు ‘రెండుసార్లు మాత్రమే’ భోజనం చేయాలి. పిల్లలు, వృద్ధులు, నిరంతర శారీరక శ్రమ చేసేవారు, రోగులు ఎక్కువసార్లు తినవచ్చు. ఇదీ జీవన నియమం కావడం సనాతన భారత జాతీయ తత్త్వం! ఈ నియమాన్ని ఉల్లంఘిస్తున్నవారు భోజన బీభత్సకారులు! సామాన్యులైన గృహస్థులు ఈ నియమాన్ని ఉల్లంఘించినప్పటికీ వారికి మాత్రమే నష్టం, సమాజానికి పెద్ద నష్టం లేదు. కానీ, ఆదర్శమూర్తులైన ప్రభావితం చేయగల సన్న్యాసులు ఈ భోజన నియమాన్ని ఉల్లంఘించడం ప్రమాదకరం. భోజన నియమాన్ని, నిద్రా నియమాన్ని ఉల్లంఘించడం వంటివి క్రమంగా లైంగిక బీభత్సకాండకు దారి తీస్తున్నాయి. ‘యుక్తాహార విహారములు’ జీవన నియమాలు. ఆహార నియమాలను తప్పడం మొదటి పతనం. ‘విహార’ నియమాలను తప్పడం చివరి పతనం! ‘విహార’ నియమాన్ని నీరుగార్చిన నీచుడు గుర్‌మీత్ రామ్హ్రీమ్ సింగ్ అనే లైంగిక బీభత్సకారుడు. ‘డేరా సచ్ఛా సౌదా’ మతాచార్యుని ముసుగును వేసుకున్న ఈ నీచుడు భయంకరమైన లైంగిక బీభత్సకారుడన్నది న్యాయస్థానంలో ధ్రువపడిన వాస్తవం! ఇలాంటి నర రూప రాక్షసుడు ఇంతకాలం ఇన్ని లక్షల మందికి ‘ఆరాధ్యుడు’ కావడం జాతీయ వైపరీత్యం.. పదేళ్ల కాలవ్యవధిలో ఇరవై నలుగురు యువతులను, మహిళలను ఈ దుర్జనుడు లైంగిక బీభత్సకాండకు బలి చేసాడన్నది జరిగిన ప్రచారం. వీరందరూ అతగాడి ఆర్భాటపు ఆశ్రమంలోని సాధ్వీమణులు, భక్తురాండ్రు! ఇంతమంది మోసపోవడం సమాజ సమష్టి వైఫల్యం! ఇద్దరు ‘బాధిత మహిళలు’ మాత్రమే ఇతగాడిని న్యాయస్థానానికి ఈడ్వగలిగారు. హర్యానాలోని ‘సిర్సా’లోని ఇతగాడి ఆశ్రమం ‘అక్రమ వాటిక’! ఇలాంటి అక్రమవాటికలు దేశమంతటా విస్తరించడం క్రమానుగత సమాజ సమష్టి పతనంలో భాగం! వీడికి న్యాయస్థానం విధించిన ఇరవై ఏళ్ల నిర్బంధ కారాగృహవాసం ఈ ‘సమష్టి పతనం’ నుంచి సమజాన్ని విముక్తం చేయడానికి దోహదం చేయవచ్చు! కానీ ఇలాంటి వాడికి ఇన్నివేల,లక్షల అనుచరగణం ఉండడమే విస్మయకరం! ఇదీ సమష్టి పతనం! సనాతన జీవన నియమాలను అధికాధిక సంఖ్యలోని జనం క్రమంగా ఉల్లంఘిస్తుండడం ఈ సమష్టి పతనం! ‘ఇంద్రియ నిగ్రహం’ అన్న నియమం అంటే కేవలం లైంగిక అక్రమాలకు పాల్పడకపోవడమేనా? లేక భోజనం విషయంలో, ఆర్జన విషయంలో, నిద్ర విషయంలో ఇంకా అనేక విషయాలలో కూడ నియమాలను పాటించడమా?
శిలాభద్రుడు క్రీస్తునకు పూర్వం తొమ్మిదవ నాలుగవ శతాబ్దుల మధ్య కాలం నాటి నకిలీ మతాచార్యులకు ప్రతీక! ‘శిలాభద్రునికొక అలవాటు కలదు..ప్రొద్దుటిపూట.. స్నానము చేసిన వెంటనే పది శేర్ల పచ్చిపాలు త్రచ్చి, దానిలోని వెన్నను ఆతడారగించును. అతని యాహారము సూర్యోదయము నుండి రాత్రి జాము పొద్దు పోవువరకు, మూడు గడియలు మూడు గడియలు ఎడమగా చిత్ర చిత్రములుగా నుండును. అతడు మేల్కొని యుండునది ముప్పది ఆరు గడియలు. పండ్రెండుసార్లతడు విలక్షణమైన ఆహారములు తీసుకొనును. మొదటిసారి వెన్న, రెండవసారి శేరు పచ్చిద్రాక్ష పళ్ల రసము, మూడవసారి అంజూర ఫలములు, నాల్గవసారి పాలలో నానవేసిన ప్రాసంగు అటుకులు, ఐదవసారి రొట్టె.. ఇట్లు నిదురపోవువరకు అతడు తినుచునే ఉండును. వాడు వట్టి శిలాభద్రుడు కాదు..’- తోడేలు వంటి పొట్ట కలిగిన ఈ శిలాభద్రుడు అలా తినేవాడని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘నాగసేనుడు’ అన్న తమ చారిత్రక నవలలో వివరించి ఉన్నాడు. ‘ఏడ్చెడిదాని మగడు వచ్చినచో నా మగడు కూడ వచ్చునన్నట్టుగా శిష్యులకు కూడ ఈ ఆరగింపులు సాగుచుండును! ‘తపో అనశనాత్..’ అన్నది నిజమైన ధర్మాచార్యుని జీవనం. ‘్భజనం చేయకపోవడం తపస్సు’లో భాగం! కానీ అలా ఉపవశించి తపించి యోగ సాధన చేయడం ధ్యాన సమాధిమగ్నులు కావడం ‘మతగురువులు’గా చెలామణి అవుతున్న శిలాభద్రుని వంటి నకిలీలకు తెలియని విద్య! వేల ఏళ్ల తరువాత ‘శిలాభద్రుడు’ అనే ‘తొండ’లు ముదిరి గుర్‌మీత్ రామ్హ్రీమ్ సింగ్ వంటి విషమృగాలుగా మారి ఉన్నాయి...
క్రీస్తునకు పూర్వం ఎనిమిది వందల ముప్పయి మూడవ సంవత్సరం నుంచి క్రీస్తునకు పూర్వం మూడు వందల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ‘ఆంధ్ర శాతన వంశం’ పాలకులు మొత్తం భారతదేశానికి సమ్రాట్టులు. ‘గిరివ్రజం’ వారి రాజధాని! ఇది భారతీయులు వ్రాసిన భారత చరిత్ర వివరించే వాస్తవం! ఈ ఐదు వందల ఆరేళ్లలో మన దేశం విదేశీయుల దురాక్రమణలకు ప్రధానంగా ‘పారశీకుల’ లేదా ‘శకు’ల దురాక్రమణకు గురి అయింది! భారతీయులు భావదాస్యానికి గురి అయ్యారు! ‘మతం’ సహా అన్ని జీవన రంగాలు కూడ వికృత విదేశీయ ప్రభావానికి గురి కావడం అప్పటి పరిణామ క్రమం.. మతం పేరుతో ఉన్మాదం విస్తరించింది! క్రీస్తునకు పూర్వం ఐదు వందల తొమ్మిదవ సంవత్సరంలో జన్మించిన ఆది శంకరాచార్యుడు ఇలాంటి ఉన్మాదాన్ని తొలగించి, నిజమైన మతాల మధ్య అనాదిగా ఉండిన సనాతన సమన్వయాన్ని మళ్లీ నెలకొల్పవలసి వచ్చింది! ఈ సమన్వయం విదేశీయ భావ దాస్యం నుంచి, విజాతీయ వికృతుల నుంచి స్వజాతీయ హైందవ సమాజాన్ని విముక్తం చేసింది. క్రీస్తునకు పూర్వం మూడు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో భారత సమ్రాట్టులయిన గుప్తవంశం రాజులు అలెగ్జాండర్ వంటి భౌతిక దురాక్రమణదారులను, గ్రీసు బీభత్సకారులను తిప్పికొట్టారు. క్రీస్తునకు పూర్వం ఎనబయి రెండవ సంవత్సరంలో భారత సమ్రాట్ అయిన ప్రమర వంశపు విక్రముడు, ఆయన ముని మనుమడైన శాలివాహనుడు విదేశీయ భావదాస్యం నుండి స్వజాతిని విముక్తం చేయగలిగారు. ఇదంతా చరిత్ర.. ఈ చరిత్రను చెరచిన బ్రిటన్ దుర్మార్గులు మన జీవన స్వభావాన్ని సైతం చెరచిపోయారు. జాతీయ జన జీవన సమష్టి స్వభావం వికృతమయి ఉండడం ప్రస్తుత సమస్య! విదేశాల నుంచి వచ్చి పడిన మతాలు అధికాధిక ప్రజల వ్యక్తిగత ఆలోచనా రీతిని వికృతం చేసాయి. ఫలితంగా అనాదిగా ఈ దేశంలో వికసించిన మతాల వౌలిక తత్త్వం మరుగున పడింది, ఈ వౌలిక తత్వం కర్మయోగం! సులభంగా, కష్టపడకుండా, శరీరానికి, మనస్సునకు, బుద్ధికి ఎలాంటి శ్రమ కాని శిక్షణ కాని అవసరం లేకుండా భౌతిక ప్రగతిని ఆధ్యాత్మిక సుగతిని సాధించవచ్చునన్న భ్రాంతికి గురి అవుతున్న వారు మతతత్త్వాన్ని వదిలిపెట్టేశారు, ఆకర్షణీయమైన మహిమలను, మాయలను ప్రదర్శిస్తున్న ఆడంబర ఆర్భాటపు ‘నకిలీ’ మతాచార్యులను ఆశ్రయిస్తున్నారు! సనాతన నియమాలను పాటించాలని పదేపదే చెబుతున్న జాతీయ ధర్మాచార్యుల కంటే, నియమ రహితమైన మతాలను, మహిమలను ప్రచారం చేస్తున్న ఆర్భాటపు విన్యాసాల వారు ప్రసిద్ధులు కావడానికి ఇదీ కారణం!
వౌలిక తత్త్వాన్ని వదలని శ్రమజీవులు, పల్లెలలో వనసీమలలో నివశిస్తున్న జానపదులు ‘కోడి కూత‘తో తెల్లవారుజామున నిద్రలేస్తారు. సూర్యోదయం కంటే ముందు సంధ్యావందనం చేసి వివిధ వృత్తులవారు తమ పనులలో నిమగ్నం కావడం ఈ దేశపు వౌలిక తత్త్వంలోని ప్రధాన అంశం! అన్నిమతాల వారు, అన్ని కులాల వారు, సంధ్యావందనం చేయాలన్నది సనాతనమైన శాశ్వతమైన వౌలిక తత్త్వం! కానీ, కొన్ని కులాలవారు మాత్రం చేయాలని మిగతావారు చేయనక్కరలేదని ‘భ్రాంతి’ వ్యాపించడం జాతీయ సంస్కృతికి దాపురించిన వికృతి! ఈ వికృతి విదేశీయ భావదాస్య ఫలితం.. చేయవలసిన కథాకథిత కులాలవారు సంధ్యావందనం చేయడం మానివేయడం వికృతికి మరింత పరాకాష్ఠ! కోడి కూయదు. బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవరు! ‘సంధ్యావందనం..’ అని అంటే ఏమిటి? అని అడుగుతున్నారు. ‘సంధ్యావందనం’ సమయ పాలన నియమానికి మాధ్యమం! అందువల్ల తెల్లవారు జామున నిద్రలేవడం మరిచిపోయినవారు, ఉదయం ఎనిమిది గంటల వరకూ నిద్రిస్తున్నవారు తమ సమస్యల పరిష్కారానికి ‘నకిలీ’ బాబాలను, ఆర్భాటానంద స్వాములను ఆశ్రయిస్తున్నారు! ‘త్రేతాయుగం నాటి రఘురాముడు అరణ్య వాసంలో సైతం ఒక్క పూట కూడ సంధ్యావందనం మానలేదు..’ అని ప్రసిద్ధ పౌరాణిక పండితుడు మల్లాది చంద్రశేఖరశాస్ర్తీ తమ ప్రవచనాలలో పదే పదే చెప్పడం నడుస్తున్న వాస్తవం. వౌలిక తత్వ్వం ఇది! జగద్గురు పీఠాలకు చెందిన శంకరాచార్యులు, మాధ్వ గురువులు, వైష్ణవ ఆచార్యులు ముక్త కంఠంతో ‘సంధ్యావందనం చేయండి, మానకండి..’ అని ప్రబోధిస్తునే ఉన్నారు! కానీ సంధ్యావందన శ్రమ చేయడం, సూర్యుని కంటే ముందు నిద్రలేవడం చాలామందికి చాలా కష్టమైపోయింది! ఇలాంటి వారందరు సులభ పద్ధతిలో స్వర్గం ఇప్పించగల ‘నకిలీ’ గురువులను ఆశ్రయిస్తున్నారు!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ద్వితీయ సర్ సంఘ్ చాలక్-రెండవ అధ్యక్షుడు-మాధవ సదాశివ గోళ్వల్కర్ దశాబ్దుల పాటు రోజునకు ఒకసారి మాత్రమే భుజించేవారు. ‘గురూజీ’గా ప్రసిద్ధికెక్కిన స్వర్గీయ గోళ్వల్కర్ బ్రహ్మచారి. భోజనం విషయంలో సన్న్యాసుల నియమాన్ని పాటించిన కర్మయోగి గురూజీ.. ‘తపో అనశనాత్!’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది రోజులపాటు కేవలం వేడినీరు తాగి శరత్ నవరాత్రి దీక్షను పాటిస్తున్న రాజర్షి.. వసంత నవరాత్రుల్లో సైతం ఆయన ఈ దీక్షను పాటిస్తు ఉండవచ్చు! మురార్జీ దేశాయ్ ‘ఏకాదశి’ నాడు మంచి నీరు తప్ప ఏమీ భుజించలేదు. 1978వ- 1979వ సంవత్సరాల మధ్య ప్రధానిగా ఉండిన దేశాయ్ అభినవ అంబరీషుడు! ధర్మవ్యాదుడు ‘కటిక’ వృత్తి చేసాడు. సంధ్యావందనం మానలేదు! అంబరీషుని ఏకాదశ వ్రతం కథ పురాణ ప్రసిద్ధం! కానీ, ఇప్పుడు దృశ్య మాధ్యమాలలో ‘్ధర్మం’ బోధిస్తున్న కొందరు ‘ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఏమీ తినకుండా ఉండరాదు.. ఎక్కువగాను తినరాదు.. ఇదిగో ఇంత తినాలి!’ అని తినవలసిన పదార్ధాల ప్రమాణాన్ని చేతిలో నిర్దేశించి చూపుతున్నారు! ఇలాంటి దుర్మార్గపు నకిలీ ధర్మ ప్రచారకులు శాస్త్ర ప్రమాణంగా కాక తమ‘ప్రజ్ఞ’ ప్రాతిపదికగా బోధిస్తున్న వారిని ఎవరు నిలదీయాలి! ఎవ్వరూ నిలదీయరు. ఎందుకంటే ఏమీ తినకుండా రోజంతా గడపడం కష్టమైన వారికి ఇలాంటి ప్రవచనాలు ఎంతో ఇష్టం! ఎంతో కొంత తినవచ్చు! ‘అంబరీషుడు’ అలా ఏకాదశి నాడు ‘ఇంత తిన్నాడా?’
అందువల్ల డబ్బులు బలిసిన ‘్భక్తాదులు’ అవధూతలు గాను, బాబాలగాను, ఇంకా రకరకాల బిరుదులున్న గురువులుగాను చెలామణి అవుతున్నవారి ‘ఆశ్రమాలకు’ వెళ్లి వారాల తరబడి ఉండి వస్తున్నారు. నాలుగు పూటలా మెక్కి సులభమైన ఆధ్యాత్మిక భ్రాంతిని అనుభవిస్తున్నారు! భక్తులే కాదు ఈ నకిలీ ‘అవధూతలు’ సైతం నాలుగు పూటలా తనివి తీరా తినడం మతం పేరుతో కొనసాగుతున్న భోజన బీభత్సం! అందువల్లనే ‘తినకుండా ఉండలేని’ రోగుల సంఖ్య పెరిగిపోతోంది! ‘్భజన బీభత్సం’ ముదిరి ‘లైంగిక బీభత్సం’గా విరుచుని పడింది. గుర్‌మీత్ బాబా ఇందుకు సరికొత్త ఉదాహరణ..

-హెబ్బార్ నాగేశ్వరరావు