ఖమ్మం

రైతు సమన్వయ సమితుల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు సమన్వయ సమితులను ఖరారు చేశారు. గ్రామ, మండలాల వారిగా ఎంపిక చేసిన సభ్యులను, జిల్లా సమితి సభ్యులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి ఆ జాబితాను వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మికుమారికి శుక్రవారం అందించారు. గ్రామ స్థాయి సమితికి 15మంది, మండలానికి 24మంది, జిల్లా సమితికి 24మందిని ఎంపిక చేశారు. ప్రతి సమితిలోను మూడోవ వంతు మహిళలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీరందరికి త్వరలోనే ప్రత్యేకంగా శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి సమితికి హైదరాబాద్‌లోను, మండల స్థాయి సమితికి జిల్లా కేంద్రంలోను, గ్రామ స్థాయి సమితికి మండల కేంద్రంలోను శిక్షణ ఇవ్వనున్నారు. రైతులకు సంబందించిన అన్ని కార్యక్రమాలను ఈ సమితిలే పర్యవేక్షించనున్నాయి. ఈ సమితిల కూర్పులో అధికార టిఆర్‌ఎస్ పార్టీ సభ్యులకే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని ఆరోపణలు వచ్చిన పట్టించుకోకుండా నిర్ణీత గడువులోగా జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు.

సంపూర్ణ అక్షరాస్యతే అభివృద్ధికి మూలం
* జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత
కామేపల్లి, సెప్టెంబర్ 8: సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ద్వారా ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. శుక్రవారం 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ఊట్కూరు గ్రామంలోని సామాజిక సేవాకేంద్రంలో జరిగిన సదస్సులో ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ఆ ప్రాంతవాసులు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అవి అమలయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యులై ఉండాలన్నారు. కుటుంబం నుంచి మండల, జిల్లాస్థాయి వరకు మహిళలు సాధికారత సాధించాలంటే అక్షరమే మూలమని ఆమె అన్నారు. అక్షర ఖమ్మంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దీనిలో రాజకీయ, సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలు విధిగా పాల్గొనవల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ అక్షరజ్ఞానం కలిగి ఉండాల్సిందిగా ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ మహిళలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ధన్‌రాజ్, రాష్ట్ర వయోజన విద్యాధికారి కాత్సాయని, జడ్పీటిసి మేకల మల్లిబాబుయాదవ్, ఎంపిపి సరిరాంనాయక్, ఎంపిడిఓ విజయ, డిప్యూటీ తహశీల్దార్ నర్సింహరావు, సర్పంచ్ రామోజీనాయక్, ఎంపిటిసి పార్వతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సామినేని రాఘవులు, ఎంఇఓ ప్రసాద్, జడ్పీ సిఇఓ మారుపాక నగేష్, ఎంసిఓ చినుముల రమేష్ పాల్గొన్నారు. సభకు ముందు అక్షర బోణాలతో, గిరిజన సాంప్రదాయ నృత్యాలతోనూ మహా ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది వయోజనులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కామేపల్లి, రఘునాధపాలెం, ఏన్కూరు, వివిధ మండలాల నుంచి ఎంసిఓలు, విసిఓలు హాజరయ్యారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు ముందుకు సాగాలి
* సంకల్పసిద్ధి సభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కొత్తగూడెం, సెప్టెంబర్ 8: వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యురాలు, ఐకార్ ప్రతినిధి గారపాటి రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో సంకల్పసిద్ది అవగాహ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రైతులు పండించే పంటలపై మరింత అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు రైతుల ఆర్ధిక ప్రగతికి మరింత దోహదపడాలని అన్నారు. పంటల సేధ్యంపై రైతులు నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించుకోవటం ద్వారా అధిక దిగుబడులను సాధించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాల మంజూరీలో అధికారులు సమన్వయంలో వ్యవహరించాలన్నారు. వ్యవసాయరంగంలో నూతనంగా వస్తున్న ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బంతిపూల సాగు ద్వారా రైతులు ఆర్ధికాభివృద్ధి సాధించవచ్చని అన్నారు. వ్యవసాయ సేధ్యంలో మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయశాఖ అధికారులు, రైతులు సమన్వయంతో పనిచేయాలన్నారు.బ్రెజిల్ వంటి దేశాలు సేంద్రియ ఎరువుల వాడకం వలన అధిక దిగుబడులు సాధించి ఆర్ధిక ప్రగతి సాధిస్తున్నారని తెలిపారు. రైతు కుటుంబాల్లోని విద్యాధికులు సేధ్యం చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. పంటలు వేసే సమయంలో భూసారం, వాతావరణ పరిస్థితులు, విత్తనాలు, ఎరువుల వాడకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరులను అభివృద్ధి చేయటం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత విస్తరింప చేయవచ్చన్నారు. సింగభూపాలెం చెరువు ద్వారా 2400 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే విధంగా విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై కృషి విజ్ఞాన కేంద్రం దృష్టి సారించి రాజశ్రీ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ సేద్యంలో ఖర్చును తగ్గించుకుంటూ భూసారాన్నిబట్టి పంటలను ఎంపిక చేసుకోవటం, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ పులి గీత, ఎంపిపి బానోతు కేస్లీ, కృషి విజ్ఞాన కేంద్రం కన్వీనర్ శ్రీనివాస్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ప్రతాప్, ఎడిఎలు కరుణశ్రీ, రాంమ్మూర్తి, ఉధ్యానవన శాఖ జిల్లా అధికారి జినుగు మరియన్న, ఆత్మ కమిటీ ఛైర్మన్‌లు, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.

సమరశీల ఉద్యమాలు భవిషత్ తెలంగాణకు దిక్సూచి
* రామకృష్ట వర్ధంతి సభలో పొన్నం, సోమయ్య పిలుపు
ఖమ్మం(కల్చరల్), సెప్టెంబర్ 8: విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో నిర్వహించే సమరశీల ఉద్యమాలు భవిషత్ తెలంగాణకు దిక్సూచి కావాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, పి సోమయ్యలు పిలుపునిచ్చారు. శుక్రవారం అమరజీవి విద్యుత్ పోరాట యోధుడు సతైనపల్లి రామకృష్ణ 17వ వర్ధంతి సభ స్ధానిక వైరా రోడ్‌లోని ఆయన స్థూపం వద్ద పార్టీ వన్‌టౌన్ కార్యదర్శి ఎంఎ జబ్బార్ అధ్యక్షతన జరిగింది. ఆనాడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రజలు అధోగతిపాలయ్యారని, నేడు కెసిఆర్ సైతం అదే బాటలో నడుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూన్నాడని వారు విమర్శించారు. ప్రజా సమస్యలను వ్యక్తపరిచేందుకు అడ్డాగా ఉన్న ధర్నాచౌక్‌ను ఎత్తివేసి ఆప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నాడని, బంగారు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వారు విమర్శించారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, ఎంబిసిలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ముందుగా సతైనపల్లి స్థూపం వద్ద పార్టీ జెండాను ఎగరవేసి, రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ భార్య మంగ, పార్టీ నాయకులు నున్నా నాగేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, ఎఎస్ కుమార్, వై విక్రమ్, బండి రమేష్, కె నర్సయ్య, నందిపాటి మనోహర్, మోటమర్రి జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం విఫలం
* రైతులను దోచుకుంటున్న వ్యాపారులు
* సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని అపరాల యార్డును సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించారు. మార్కెట్‌లోని పెసర రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం పెసరకు ప్రభుత్వం మద్దతు ధర 5,575ప్రకటించినప్పటికి మార్కెట్‌లో వ్యాపారులు పంట బాగాలేదని కుంటి సాకులతో 1,000నుండి 2వేల లోపే కొనుగోళ్ళు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికి కాలయాపన చేస్తూ రైతన్నలను దగా చేస్తున్నారన్నారు. రైతు వద్ద నుండి పంట చేయిదాటిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికి ఫలితం ఉండదన్నారు. ఇది కేవలం వ్యాపారులకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. గత ఎడాది మిర్చికి, కందులకు సరైన గిట్టుబాటు ధర లేక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఈ ఎడాది తొలి పంటైన పెసరకు కూడా సరైన ధర లేక కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందన్నారు. ఈనామ్ ద్వారా కూడా రైతులకు న్యాయం జరగటం లేదని, వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పాడి వారి ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఆన్‌లైన్‌లో 100రూపాయలకు కూడా బిడ్డింగ్ వేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరను రైతులకు అందేలా చేయాలన్నారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న మార్కెట్ చైర్మన్ కృష్ణ యార్డులకు వచ్చిన సిపిఐ బృందంతో మాట్లాడారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం నుండి మార్కెట్‌లో మార్క్‌ఫెడ్, పిఎసిఎస్ ద్వారా కొనుగోళ్ళు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అడపా రామకోటయ్య, ఎస్‌కె జానిమియా, తాటి వెంకటేశ్వరరావు, మిడకంటి వెంకటరెడ్డి, రామకోటి తదితరులు పాల్గొన్నారు.
దసరాకు అర్‌టిసి ప్రత్యేక బస్‌లు
* 50శాతం అదనపు చార్జి
* డివిజనల్ మేనేజరు జగన్ వెల్లడి
ఖానాపురంహవేలి, సెప్టెంబర్ 8: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 19 నుండి 29 వరకు హైదరాబాద్ నుండి ఖమ్మం రీజియన్‌కు 505అర్‌టిసి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజనల్ మేనేజర్ జి జగన్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బస్‌లను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుండి రిజర్వేషన్ డిమాండ్‌ను బట్టి బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ ఎల్‌బి నగర్‌లో తనతో పాటు మరో 19మంది సిబ్బందితో పర్యవేక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు. రద్దీని బట్టి ఎల్‌బి నగర్ సమీపంలోని బస్‌డిపోల నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో ఖమ్మం నుండి హైదరాబాద్‌కు గత సంవత్సరం 234బస్సులు ఏర్పాటు చేయగా, ప్రయాణికుల సౌకర్యం కోసం 300బస్సులు నడపనున్నట్లు తెలిపారు. బస్సులు, సిబ్బంది తదితర అంశాల ప్లానింగ్‌పై రెండు జిల్లాల పరిధిలోని డిఎంలు, అసిస్టెంట్ మేనేజర్లు, ఇంజనీర్లకు అవగాహన కల్పించామన్నారు. విలేఖరుల సమావేశంలో కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ శ్రీకృష్ణ, ఇరు జిల్లాల డిఫోల మేనేజర్లు డి సూర్యనారాయణ, నాగేశ్వరరావు, జెడి బాబు, శ్రీహర్ష, బిఎల్ స్వామి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 8: ఐటిడిఏ నుండి రుణాలు పొందేందుకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడిఓ ఎన్ వెంకటపతిరాజు తెలిపారు. శనివారం ఆయన తన ఛాంబర్‌లో మాట్లాడుతూ ఎస్టీ కులస్తులు ఐటిడిఏ నుండి రుణాలు పొందేందుకు 21నుంచి 55సంవత్సరాల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవాలని, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఒక సెట్ ఫారాన్ని కార్యాలయంలో సమర్పించాలని, వివరాలకు ఇఓపిఆర్‌డి భవానిని సంప్రదించాలని ఆయన వివరించారు.
ఉచితంగా ఇంటింటికి కొబ్బరి మొక్కలు పంపిణీ
ఏన్కూరు, సెప్టెంబర్ 8: ఖమ్మంలోని ప్రముఖ వైద్యులు, గ్యాస్టోఎంట్రాలజిస్టు శెట్టిపల్లి నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన నారాయణ భసవమ్మ మెమోరియల్ ట్రస్టు ఆద్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి శుక్రవారం ఉచితంగా కొబ్బరి మొక్కలు అందజేశారు. తన సొంత ఖర్చులతో పాలకొల్లు నుండి తెప్పించిన సుమారు 7వేల మొక్కలు మండల పరిదిలోని టిఎల్‌పేట, కేసుపల్లి, రాఘవాపురం, రేపల్లెవాడ, రాజలింగాల, తిమ్మారావుపేట, గార్లఒడ్డు, ఏన్కూరు, తదితర గ్రామాలలో మొక్కలు పంపిణి చేశారు. ట్రస్టు ఆద్వర్యంలో గతంలో కూడ ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తు మండల ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈకార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కొండపల్లి నాగేశ్వరరావు, కడియాల కోటేశ్వరరావు, శెట్టిపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు యువకుని మృతి
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 8: మండల పరిధిలోని గుంటుపల్లి గోపవరం గ్రామంలోని చెరువు కట్టవద్ద మర్రిచెట్టు కింద నిల్చున్న వ్యక్తిపై శక్రవారం పిడుగు పడి గ్రామానికి చెందిన పిట్ల మురళి 36 మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు మురళి పొలం పనుల నిమిత్తం వెళ్ళి వర్షం వస్తుండంతో ఇంటికి వచ్చే క్రమంలో మర్రిచెట్టు క్రిందకు వెళ్ళగా పిడుగు పడి మృతి చెందాడు. మండల కాంగ్రెసు అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి,బండారు నరిశింహరావు,సర్పంచ్ హనుమంతరావు మృతదేహన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.మృతునికి బార్య ,ఇద్దరు కమారులు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్‌ఏ అంజనేయులు మృతదేహన్ని పరిశీలించి కేసు నమోదు చేసారు.

ప్రముఖ కవి సీతారాంకు కాళోజి పురస్కారం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, సెప్టెంబర్ 8: ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సాహితి విమర్శకుడు సీతారాంకు ప్రభుత్వం కాళోజి పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. తెలుగు అధ్యాపకుడిగా, కవిగా జిల్లాకు పరిచయమైన సీతారాం అనేక పుస్తకాలను రచించారు. సన్ ఆఫ్ మాణిక్యం, ఇదిగో ఇక్కడిదాకా, మానుకోట ముచ్చట్లు, కుప్పం కబుర్లు లాంటి అనేక పుస్తకాలను రచించారు. సాహిత్య సంకలనాలు, కథా సంకలనాలను ప్రచురించారు. ఆంధ్రభూమి దినపత్రికలో కూడా అనేక రచనలను చేశారు. కాగా సీతారాంకు పురస్కారం దక్కడం పట్ల ప్రముఖ కవి ప్రసేన్ ఆనందం వ్యక్తం చేశారు. సీతారాం రాసిన సన్నాఫ్ మాణిక్యం పుస్తకానికి ప్రసేన్ ముందుమాట రాయటం గమనార్హం. కాగా జిల్లాకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇంతకుముందు కూడా సీతారాం అనేక అవార్డులు అందుకున్నారు.
ఆటలే ఆరోగ్యానికి మూలం
కామేపల్లి, సెప్టెంబర్ 8: ఆటపాటలే సంపూర్ణ ఆరోగ్యానికి మూలమని జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. శుక్రవారం ఊట్కూరులోని సామాజిక కేంద్ర ఆవరణలో ఆమె బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ నిత్యం యువకులు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లకే అంకితం కాకుండా ఉదయం, సాయంత్రం తీరిక సమయాల్లో ఆటలు ఆడుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ధన్‌రాజ్, సిఇఓ నగేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సామినేని రాఘవులు, కాత్సాయని, పాశం కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.

రామాలయంలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది హల్‌చల్
* భక్తుడిపై దాడికి యత్నించిన వైనం
* ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన ఈవో
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 8: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అర్చకులు, సిబ్బంది ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఆలయంలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఒక భక్తుడిపై అనుచితంగా ప్రవర్తించడం, భక్తుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం పట్టణానికి చెందిన నవీన్ ప్రతి శుక్రవారం రామయ్య దర్శనార్థం ఆలయానికి వెళ్తున్నాడు. ఈసారి కూడా ఆలయంలోకి నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతన్ని ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎస్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆలయంలోకి వెళ్లాలంటే క్యూలైన్ల నుంచే వెళ్లాలని చెప్పారు. స్థానికుడని, ప్రతి శుక్రవారం ఆలయానికి వస్తానని చెప్పినా వినలేదు. చివరకు నవీన్ క్యూలైన్ల గుండా వెళ్లే ప్రయత్నం చేయగా అతని ముందే మరో భక్తుడిని ఎస్‌పీఎఫ్ సిబ్బంది నేరుగా ఆలయంలోకి పంపారు. ఇది గమనించిన నవీన్ అతని మాత్రం ఎందుకు నేరుగా ఆలయంలోకి పంపారని ప్రశ్నించగా అతనిపై ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఘర్షణకు దిగారు. ఎక్కువ మాట్లాడితే ఆలయంలోకి కూడా పంపమని, నోరు మూసుకొని వచ్చిన పని చేసుకోని వెళ్లాలని ఘాటుగా చెప్పడంతో నవీన్ కూడా వారితో వాదించాడు. భక్తులు ఎవరైనా సమానమేనని చెప్పిన మీరు కావాల్సిన వారిని లోపలికి నేరుగా ఎలా పంపుతారని ప్రశ్నించగా రాయలేని భాషలో తనను తిట్టారని, బయటకు నెట్టివేసే ప్రయత్నం చేశారని బాధితుడు నవీన్ పేర్కొన్నాడు. అయిన వారిని ఆలయంలోకి నేరుగా పంపుతున్నారని, ప్రశ్నించిన తనపై దాడికి యత్నించారని అతను స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆలయ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ఈవో దృష్టికి రావడంతో ఈవో విచారణకు ఆదేశించారు. భక్తుడి ఫిర్యాదు మేరకు విచారణ చేసి 48 గంటల్లో నివేదికను అందజేయాలని ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్‌ను ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఆలయంలో అర్చకులు, సిబ్బంది క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అర్చకులు విధులకు ఆలస్యంగా రావడం, పూజాది కార్యక్రమాలను మమ అనిపించడం, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఆలయంలో పరిపాటిగా మారింది. మూడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన ఈవో ప్రభాకర శ్రీనివాస్ పరిపాలన, ఆలయ భద్రతపై దృష్టిసారించినా ఎటువంటి మార్పును తీసుకు రాలేకపోయారన్న అపవాదు ఉంది. దానికి తగినట్లుగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ మూడు నెలల కాలంలో ఆలయ ప్రాంగణంలోని గుడి తలుపులకు తాళం వేయకుండా అర్చకుడు వెళ్లిపోయారు. ఆలయంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మూలవరుల చిత్రాలను ఒక అర్చకుడు సోషల్ మీడియాలో ఉంచడం కూడా సంచలనమైంది. ఇటీవల సువర్ణ పుష్పార్చన పూజను 108 పుష్పాలతో కాకుండా 50లోపు పుష్పాలతో నిర్వహించి ఆలయంలో పూజాది కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఇక ఆలయం తలుపులు ఆలస్యంగా తీయడం, కొందరు అర్చకులు విధులకు ఆలస్యంగా రావడం సర్వసాధారణమైంది. భక్తులు ఫిర్యాదు చేస్తే తప్ప పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే దానిపై విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత విచారణ నివేదికను వెలుగులోకి రాకుండా చేయడం వంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామంతో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి కూడా విచారణను మమ అనిపిస్తారా ? నిజాలు నిగ్గు తేల్చుతారా అన్నది తేలాల్సి ఉంది.