డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు ఎంతగా అలసిపోయినా మొహంలో అలసట, దాని అడుగున డిటర్మినేషన్. ఎంతమందిని ప్రాణాలతో రక్షించగలమా అని.
నా బలవంతంమీద ముగ్గురు వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. ఎవరి మనసూ తిండిమీద లేదు. గడుస్తున్న ప్రతిక్షణం ఆకలి హరింపజేస్తోంది. గుండె బరువెక్కించేస్తోంది. అందరి ప్లేట్లలో అన్నం పెట్టి పెరుగు వేశాను.
గ్లాసుతో నీళ్లు తీసుకు తాగుతున్న వౌళి కళ్లు ఖాళీగా ఉన్న తేజా కుర్చీమీద పడ్డాయి. ప్రతిరోజూ తేజా అదే ఛెయిర్‌లో కూచుని భోజనం చేస్తుంది, వౌళికి ఎదురుగా.
ఒక్కసారి వౌళి మొహం వివర్ణమయింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇక అక్కడ కూచోలేనట్లు లేచి వెళ్లిపోయాడు.
అతనివంకే బాధాగా చూస్తూ ఉండిపోయాడు మూర్తిగారు. సావిత్రి కళ్ళతోనే సైగ చేసింది, అతన్ని వౌళి దగ్గరకు వెళ్లమని.
బాల్కనిలో నుంచున్న వౌళికి పక్కగా నుంచున్నారు మూర్తిగారు. చెయ్యి భుజం చుట్టూ వేశారు. ఆ సమయంలో మాటలు అనవసరం, మూగగా క్షణాలు గడుస్తున్నాయి.
టెలివిజన్‌లో కలకలం వినిపించింది. అందరం అటే చూశాం. ఇద్దరు ఫైర్ ఫైటర్స్ ఆనందంతో కౌగిలించుకుంటున్నారు.
మరో ఇద్దరు సర్వైవర్స్‌ని కనుక్కున్నారట. ఎంత మంచి విషయం. అదో మిరకిల్. వాళ్లు కొండమీద గుండుసూదులు కోసం వెదుకుతున్నారు.
మనసులోనే మళ్లీ ప్రార్థించాను. భగవంతుడా- తేజా కూడా దొరికేలా చెయ్యి. నేనెప్పుడూ ఏదీ కావాలని ప్రార్థించను. వ్యక్తిగతంగా కోరను. నాదీ ఒక్కటే ప్రార్థన. చాలా స్వార్థపూరితమయిన ప్రార్థన. ‘ సర్వేజనో సుఖినోభవంతు’- అందులో నా వాళ్లు కూడా వుంటారన్న స్వార్థం. మరో ప్రార్థన. నన్ను సరైన దారిలో నడిపించమని. కాని నా మనసు ఇవాళ ఆ రెండూ కోరడంలేదు. నేను నిర్వహించే చాలా కార్యాలలో ఏ ఒక్క పుణ్యకారం వున్నా, అది తేజాని రక్షించాలి. చేసిన పుణ్యాలకు ప్రతిఫలం ఆశిస్తున్నాను. అదే నా ప్రార్థన.
నేను నిగూఢంగా చాలా కార్యాలే చూస్తాను. అవి పుణ్యకార్యాలా కాదా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎంతోమంది బీద విద్యార్థులను చదువులకు ఏర్పాట్లు చేస్తున్నాను. ఎంతమంది అనాధ పిల్లలకు ఆధారం కల్పిస్తున్నాను. ఇవన్నీ అందరికి చెప్పడం నాకు ఇష్టం లేదు.
నాచేత సహాయం పొందినవాళ్ళంతా నన్ను చూడంగానే- మీరు, మీ కుటుంబం చల్లగా వుండాలమ్మా అని అంటారు. అదొక్కటే నేను కోరుకునేది. ఏ ఒక్కరి ఆశీర్వచనము, దీవెన అయినా ఫలించాలని-
అందరం బరువైన హృదయాలతో నడుం వాల్చాము. ఎవ్వరికీ నిద్ర రావడంలేదు. ఎగబీలుస్తున్న సావిత్రి ఊపిరి, ఆమె ఎంత కుమిలిపోతోందో తెలుపుతోంది. లేచి పచార్లు చేస్తున్న వౌళి హృదయం ఎంత విలపిస్తోందో తెలుస్తోంది. నేను, మూర్తిగారు బయటకు ఏడవడంలేదు, అంతే!
నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఉష కెవ్వుమంది. అందరం ఉలిక్కిపడ్డాం.
అక్కడే పచార్లు చేస్తున్న వౌళి చటుక్కున దాన్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. అయినా అది ఏడుపు మానలేదు. నేను లేచి పాలు వేడి చేసి ఇచ్చాను. వౌళి తదేకంగా దానివంకే చూస్తూ పాలు పట్టసాగాడు.
దానే్న చూస్తూ వున్న వౌళి కళ్లు తడిసిపోయాయి. బుగ్గలమీంచి నీరు కారిపోయింది. ఆ నీరు ఉషమీద పడకుండా వుండటానికి భుజం ఎత్తి కళ్లు తుడుచుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తూంటే మా ముగ్గురి మనసులు ద్రవించిపోయాయి.
‘‘అమ్మను మిస్ అవుతున్నావా’’ అడిగాడు కూతురిని. అది అర్థమయినట్లు పాలు తాగటం ఆపి తండ్రి వంకే చూసింది. దాన్ని బలంగా గుండెలకు హత్తుకుంటూ మీ టూ అంటూ లేచి లోపలకు వెళ్లాడు.
నా మనసు పరిపరి విధాలా పోయింది. సావిత్రి దుఃఖం ఆపుకోలేకుండా వుంది. మూర్తిగారు ఏమీ చెయ్యలేని వాడిలా ఉండిపోయాడు. ఉదయం నుండి నాకు నేను చెప్పుకుంటున్న ధైర్యం నీరుకారిపోతోంది వీళ్లందరి మధ్య.
సావిత్రి తేజాకి ఏదో జరిగిపోయినట్లే మాట్లాడుతోంది. ఉష ఎంత దురదృష్టవంతురాలో అని వాపోతోంది.
నేను ఇక వూరుకోలేకపోయాను. ప్లీజ్ స్టాప్ అన్నాను కొంచెం కఠినంగానే! తెల్లబోయినట్లు చూశారు ఇద్దరూ.
‘‘ప్లీజ్ స్టాప్.. ప్లీజ్ స్టాప్’’ అన్నాను ఆవేశంగా!
‘‘చెడు వూహించవద్దు, చెడు తలచవద్దు. మనకే ఏ విషయం నిర్థారణగా తెలియనంతవరకూ, మీ మనసులోకి మరో ఆలోచన రానివ్వద్దు. తేజా బాగుంది. ప్రాణాలతో వుంది. దొరుకుతుంది. అదే ఆలోచించండి. అదే ప్రార్థించండి. నా కొడుకు ఆనందాన్ని తుడిచేయాలని ఎవ్వరూ అనుకోరు. భగవంతుడు కూడా! అది నమ్మండి’’ అని లేచి బాల్కనీలోకి వెళ్లిపోయాను.
వాళ్లతో అంత గట్టిగా, నమ్మకంగా అని వచ్చాను కాని నా మనసులో ధైర్యం సన్నగిల్లిపోతోంది.
ఉష అంత కెవ్వుమంటూ ఎందుకు లేచింది. అంతసేపు ఎందుకేడుస్తోంది? ఏ సిక్త్‌సెన్స్ ఏమీ చెప్పడంలేదు కదా! తేజాకి ఏమీ జరగలేదు కదా
మనిషి మరణిస్తే, ఆత్మ ఆత్మీయుల చుట్టే తిరుగుతుందని మామ్మ చెప్పేది. అలాంటిది ఏమీ జరగడం లేదు కదా!
భయం నన్ను చుట్టుముట్టేసింది- మన్‌హటన్ ఐలెండ్‌కి మల్లెనే- అమెరికా దేశానికి మల్లెనే! ప్రపంచ శాంతికి మల్లేనే!
‘‘అమ్మా’’ వౌళి పిలుపు వినిపించింది. గబగబా చీర చెంగుతో కళ్ళు తుడిచేసుకుని వెనక్కి తిరిగాను.
‘‘ఉష ఏడుస్తోంది. అత్తయ్యగారి చేతుల్లో కూడా మానడంలేదు. నువ్వు వచ్చి చూస్తావా’’ అన్నాడు.
వెంటనే లోపలకు వెళ్లాను. ఉషకు ఇష్టమైన బ్లాంకెట్‌లో దాన్ని కప్పి ఎత్తుకున్నాను. రెండు చేతులతో హత్తుకున్నాను. అలవాటయిన స్పర్శ, వెచ్చదనం అయినా ఏడుస్తూనే ఉంది. మెల్లిగా దానికి అలవాటయిన జోలపాట కూనిరాగంగా పాడుతున్నాను. ఇవాళ నా పాట నాకే మామూలుగా వినిపించడంలేదు. ఏదో అపశృతి వినిపిస్తోంది. విషాదం వినిపిస్తోంది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి