ఆటాపోటీ

‘బాధ్యత’గా దూకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. 2014 చివరిలో మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు కెరీర్‌ను ముగిస్తున్నట్టు ఆస్ట్రేలియా టూర్ మధ్యలో ప్రకటించినప్పుడు, సెలక్టర్లు ఆ బాధ్యతలను కోహ్లీకి అప్పచెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో ధోనీ వనే్డ, టి-20 ఫార్మాట్స్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో, అన్ని ఫార్మాట్స్‌కూ కోహ్లీనే నాయకుడయ్యాడు. సహజంగా కెప్టెన్‌గా భారాన్ని తలకెత్తుకున్న తర్వాత ఎవరైనా దూకుడును తగ్గించుకుంటారు. జట్టు ప్రయోజనాల పేరుతో ఆచితూచి ఆడడడం మొదలు పెడతారు. కానీ, కోహ్లీ ప్రస్థానం అందుకు భిన్నంగా సాగుతున్నది. కెప్టెన్‌గా ఎంపిక చేయడం ద్వారా సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, టీమిండియాకు వరుస విజయాలను అందిస్తున్నాడు. కెప్టెన్‌గానేగాక, బ్యాట్స్‌మన్‌గానూ రాణిస్తూ, భారత క్రికెట్‌ను శాసిస్తున్నాడు. శ్రీలంక టూర్‌ను 9-0తో ముగించడం అతని నాయకత్వ ప్రతిభకు తాత్కారణం. ఈ టూర్‌లో భాగంగా జరిగిన మూడు టెస్టులు, ఐదు వనే్డలు, ఒక టి-20 ఇంటర్నేషనల్స్‌లో అతను దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ కెప్టెన్, బ్యాట్స్‌మన్ బాధ్యతలను సమర్థంగా పోషించాడు. బుధవారం జరిగిన ఏకైక టి-20లో 54 బంతుల్లోనే 82 పరుగులు సాధించి, భారత్‌కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాడు. అంతేగాక, ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 15,000 పరుగుల మైలురాయిని చేరిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అత్యధిక పరుగుల జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది. అతని విజృంభణకు శ్రీలంక నుంచి ఎలాంటి సమాధానం లేకపోయింది. చివరి మ్యాచ్‌ని కూడా దక్కించుకోవడం ద్వారా, ఈ టూర్‌ను కోహ్లీ బృందం 9-0 తేడాతో ముగించింది. 2010లో మూడు ఫార్మాట్స్‌తో కలిపి, పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా ఒకసారి ఇదే తేడాతో చిత్తుచేసింది. ఆ రికార్డును భారత్ సమం చేయడం వెనుక కోహ్లీ పాత్ర ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ప్రతి బ్యాట్స్‌మన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఫలితం తల్లకిందులు కావచ్చన్న భయంతో జాగ్రత్త పడతాడు. ఆ బ్యాట్స్‌మన్‌పైనే కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఉంటే, తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాడు. ఆటగాడిగా అద్భుతాలు సృష్టించిన ఎంతో మంది నాయకత్వ బాధ్యతలు తలెకెత్తుకున్న తర్వాత దారుణంగా విఫలయ్యారు. కానీ, కోహ్లీ ఆటలోగానీ, మైదానంలో అతను అనుసరించే వ్యూహాలు లేదా సమయోచిత నిర్ణయాల్లోగానీ ఎలాంటి మార్పు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే, కెప్టెన్‌గా అతను మరింత మెరుగైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. వెనకడుగు వేసే అలవాటుగానీ, అతి జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడే తత్వగానీ అతనికి లేవని బుధవారం నాటి మ్యాచ్ స్పష్టం చేస్తుంది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి లోకేష్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ శర్మ మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. లసిత్ మలింగ వేసిన బంతి అతని బ్యాట్‌ను ముద్దాడుతూ, మిడ్ ఆన్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న తిసర పెరెరా చేతుల్లోకి వెళ్లింది. ఛేజింగ్ మొదట్లోనే వికెట్ కూలి, ఫస్ట్‌డౌన్‌లో తాను బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చినప్పటికీ కోహ్లీ ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ రాహుల్ అవుటైనప్పటికీ తడబడలేదు. మనీష్ పాండేను ఒకవైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు తాను పరుగుల వేటను కొనసాగించాడు. జట్టు విజయం ముంగిట నిలిచినప్పుడు, కోహ్లీ వికెట్ కూలింది. పాండే కెరీర్‌లో తొలి టి-20 అర్ధ శతకాన్ని సాధించి, నాటౌట్‌గా నిలవగా, భారత్ విజయకేతనం ఎగురవేసింది. కోహ్లీ అందించిన సహకారంతోనే పాండే హాఫ్ సెంచరీ చేశాడనడం అతిశయోక్తి కాదు. అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఉన్న రోజు నుంచి ఇప్పుడు సీనియర్స్ జట్టుకు నాయకత్వం వహించడం వరకూ కోహ్లీ ఎప్పుడూ తన పంథాను మార్చుకోలేదు. మైదానంలో దూకుడుగా ఉండే తత్వాన్ని వీడలేదు. అన్ని ఫార్మాట్స్‌లోనూ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా అతను తనదైన దారిలోనే వెళుతున్నాడు. దూకుడు పెరుగుతున్నదేగానీ తగ్గడం లేదు.
మొండి పట్టుతో సమస్యలు!
ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టుకు ఉత్తమ సేవలు అందిస్తున్నప్పటికీ, మొండిగా వ్యవహరిస్తూ, తాను అనుకున్నదే జరగాలని పట్టుబడుతూ ఒక్కోసారి బోర్డు పెద్దలకు, సెలక్టర్లకు కోహ్లీ సమస్యలు సృష్టిస్తున్నాడన్నది వాస్తవం. అనిల్ కుంబ్లేకు కోచ్‌గా కాంట్రాక్టును పొడిగించకుండా, కొత్త కోచ్‌ను ఎంపిక చేయాలని బోర్డు నిర్ణయించిన క్షణం నుంచి మొదలుపెడితే, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి రవి శాస్ర్తీని కోచ్‌గా ఎంపిక చేసే వరకూ జరిగిన పరిణామాలు కోహ్లీ ఆధిపత్య పోరాటానికి నిదర్శనాలు. ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో కుంబ్లే కాంట్రాక్టు ముగిసిన నేపథ్యంలో, అతనినే కొనసాగిస్తారని అంతా అనుకున్నారు. కానీ, కుంబ్లేతో కోహ్లీకి ఉన్న విభేదాలు చివరి క్షణాల్లో తెరపైకి వచ్చాయి. దీనితో కొత్త కోచ్‌ని ఎంపిక చేయాల్సిన పరిస్థితి నుంచి బోర్డు అధికారులు తప్పించుకోలేకపోయారు. కుంబ్లేపై కోహ్లీకి ఉన్న వ్యతిరేకతే ఈ పరిణామాలకు కారణమన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ప్రతి మ్యాచ్‌పైనా దృష్టి పెట్టాలని, ఉన్నత ప్రమాణాలతో ఆడని వారికి జట్టులో స్థానం ఉండదని కుంబ్లే హెచ్చరించడం కోహ్లీకి ఏమాత్రం నచ్చలేదని సమాచారం. నిజానికి కుంబ్లే కోచ్‌గా వ్యవహరించిన ఏడాది కాలంలో భారత్ ఉన్నత శిఖరాలను అధిరోహించింది. 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 12 విజయాలు సాధించింది. నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కేవలం ఒకే ఒక మ్యాచ్‌ని చేజార్చుకుంది. కుంబ్లే పర్యవేక్షణలోనే టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. కానీ, ఈ గణాంకాలన్నీ కోచ్‌ని మార్చితీరాలన్న కోహ్లీ డిమాండ్ ముందు నీరుగారిపోయాయి. కుంబ్లేను సమర్థంగా పక్కకుతప్పించి, తాను కోరుకున్న విధంగా రవి శాస్ర్తీని ఆ స్థానంలో నిలబెట్టాడు కోహ్లీ. వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీలంక టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ, ఇదే మొండి వైఖరి అన్ని విషయాల్లోనూ సానుకూల ఫలితాలను అందిస్తుందనిగానీ, ఎల్లప్పుడూ జట్టును ఉన్నత స్థాయిలో నిలబెడుతుందనిగానీ ఊహించలేం. పైగా, ఒక వ్యక్తి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాల ఆధారంగా మార్పులుచేర్పులు చేసుకుంటూ పోతే, టీమిండియా భవిష్యత్తు ఏమవుతుందనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. కోహ్లీ తన తీరును మార్చుకుంటాడనే ఆశిద్దాం.
టి-20 ఇంటర్నేషనల్స్‌లో ‘టాప్-5’: 1. బ్రఎండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్) 71 మ్యాచ్‌ల్లో 2,140 పరుగులు, 2. తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) 80 మ్యాచ్‌ల్లో 1,889 పరుగులు, 3, విరాట్ కోహ్లీ (్భరత్) 50 మ్యాచ్‌ల్లో 1,830 పరుగులు, 4. మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) 61 మ్యాచ్‌ల్లో 1,806 పరుగులు, 5. మహమ్మద్ షెజాద్ (అఫ్గానిస్తాన్) 58 మ్యాచ్‌ల్లో 1,779 పరుగులు.

- కౌస్త్భు