రాజమండ్రి

సమభావం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని దృష్టిలో అందరూ సమానమే!

పాపాత్ములు, పుణ్యాత్ములు అని

భేదమెందుకు? జీవులన్నీ ఆ పరాత్పరుని

సృష్టే కదా! మరెందుకు ఈవివక్షత? నిన్న

జరిగిన ఘోర సంఘటన కృష్ణారావుని

పరిపరి విధాల ఆలోచించేలా చేస్తోంది.

అతను పట్టణానికి పదిహేను కిలోమీటర్ల

దూరంగానున్న ఒక గ్రామంలో బ్యాంకులో

పనిచేస్తున్నాడు. షిర్డీసాయి భక్తుడు. అన్ని

మతాలు ఒకటేనని నమ్మేవాడు. పుట్టుకతో

హిందువైన అతడు బాబా బోధనలను,

కథలను నిత్యం చదువుతూ ఉంటాడు.

దేవుడొక్కడేనని అందరూ ఒప్పుకున్నట్లే

ఉంటారు, కానీ ఆచరణలో మాత్రం మా

దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్పని

తన్నుకోవడానికి సిద్ధపడుతున్నారు,

ఏమిటీ విచిత్రం? సత్యం ఎక్కడ ఉంది? నా

సందేహాలకు సమాధానాలు ఎవరిస్తారు?

అంతా అయోమయంగా తోచింది

కృష్ణారావుకి. అన్ని ఆఫీసుల్లోను వివిధ

మతాలకు చెందిన ఆరాధనా చిత్రపటాలను

ఒకదాని ప్రక్కన ఒకటి ఏర్పాటుచేశారు.

కాని ఉద్యోగుల మనసులు మాత్రం

దూరదూరంగానే ఉంటున్నాయి.

కృష్ణారావు చాలా కలుపుగోలుతనంగా

అందరితోను మెలగుతాడు. కాని అందరూ

తనతో అలా ఉండటంలేదని బాధపడుతూ

ఉంటాడు. అజ్ఞానంతోనో, జ్ఞానంతోనో

కొందరు తమ మనోభావాలను

వక్రమార్గంలో పయనింప చేస్తున్నారు.

దానికి కారణం మత గురువులేనని అతని

భావన. మానవుడు ఏదో ఒక మత మార్గం

అనుసరించక తప్పదు. దానిని అదనుగా

తీసుకుని కొంతమంది స్వార్ధ ద్రోహులు

అసుర స్వభావంతో ప్రజలను తప్పుదోవ

పట్టిస్తున్నారు. అశాంతికి మూలం

ఎక్కడోలేదు, ఇటువంటి తెలిసీ తెలియని

గురువులే కారణం. అజ్ఞానంతో

ప్రజలున్నంత కాలం మతాలు మారణ

హోమాన్ని సృష్టిస్తూనే ఉంటాయి.

ఆఫీసులో తిరుపతి ప్రసాదాన్ని

తిరస్కరించినపుడల్లా వద్దనుకున్నా కోపం

వచ్చేది కృష్ణారావుకి. ఎంతో ప్రయత్నంతో

కోపాన్ని అధిగమించేవాడు. వసుధైక

కుటుంబ భావన వస్తుందా? పరిపరి విధాల

ఆలోచనలతో గందరగోళ పరిస్థితిలోనున్న

కృష్ణారావు
‘సార్ మేనేజర్ గారు పిలుస్తున్నారు’ అన్న

అటెండర్ జాన్ పిలుపుతో ఉలిక్కిపడి

ఈలోకంలోకి వచ్చాడు.
‘ఏవయ్యా జాన్ బాస్ ఎలా వున్నాడు,

హాటా? కూలా?
‘కూల్‌గా ఎప్పుడైనా చూశామా సార్!’ అని

నవ్వుకుంటూ ఫ్లాస్క్ తీసుకొని

బయటికెళ్లాడు జాన్ టీ కోసం.
తన సీట్లోంచి లేచి మేనేజర్ రూమ్‌కి దారి

తీసాడు కృష్ణారావు
‘మే ఐ కమిన్ సార్!’ అంటూ డోర్ తీసుకుని

లోపలికెళ్లాడు
‘రావయ్యా కూర్చో!’ అంటూ సైగ చేశాడు

మేనేజర్ వెంకటేశ్వరరావు
‘నలభై ఎనిమిది గంటలు గడిస్తే గాని

చెప్పలేమన్నాడు డాక్టర్, హాస్పటల్ నుండే

వస్తున్నాను’ అంటూ దేవుడి పటానికి

నమస్కరించి తిరిగి తన సీట్లో

కూర్చున్నాడు మేనేజర్.
‘చాలా బాధగా ఉంది సార్! నేను ఎంత

చెప్పినా వినలేదు!’ అన్నాడు కృష్ణారావు
‘నిన్న నీ బండి రిపేర్‌లో ఉందని సహాయం

స్కూటర్ మీద వెళ్లావుట కదా! అసలేం

జరిగిందయ్యా! అన్నాడు మేనేజర్
‘అవును సార్! సరిగ్గా నల్లపాడు రావిచెట్టు

దగ్గరకి వెళ్లేసరికి హఠాత్తుగా వర్షం

ప్రారంభమయింది. పది నిముషాలలో ఇళ్లకి

వెళ్లిపోవచ్చులే అనుకున్నాం. ఇంటికెళ్లి టీ

తాగుదాం అంటూ స్పీడు కూడా పెంచాడు.

అప్పటికే ఉరుములు, మెరుపులు,

పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం

బీభత్సంగా మారిపోయింది. నాయుడుగారి

ఫామ్ దాటి వెళ్లాం, అంతే చాలా దగ్గరలో

ఉన్న కొబ్బరి చెట్టు మీద పిడుగు పడి

చెట్టు నిలువునా తగలబడిపోయింది. మా

గుండెలు ఒక్కసారి ఆగినట్లు అయినాయి.

వెంటనే నేను సహాయంగార్ని

కృష్ణమందిరం దగ్గర ఆగుదామన్నాను.

అంటూండగానే గుడి దగ్గరకొచ్చేసాం.

సహాయం గారు స్కూటర్ స్లోచేసి దిగండి

నేను వెళ్లిపోతాను అన్నారు. అదేమిటండీ

పిడుగులు చాలా దగ్గరగా పడుతున్నాయి,

వెళ్లడం అంతమంచిది కాదు, వర్షం తగ్గే

వరకూ గుళ్లో కూర్చుందాం అంటూండగానే

పూజారిగారు లోపలికి రమ్మని సైగ

చేశారు, కానీ సహాయంగారు తట

పటాయిస్తూ
‘ఆ ఎందుకులెండి జస్ట్ ఐదు నిముషాల్లో

వెళ్లిపోతాను’ అంటూ బండి స్పీడ్ పెంచారు.
‘నామాట వినండి, మరేం ఫరవాలేదు

కృష్ణుడంటే జగద్గురువు, అందరికీ రక్షణ

కల్పించే గోవర్ధన గిరిధారి, రండి’ అంటున్నా

నన్ను నవ్వుతూ, అయిష్టంగా చూస్తూ

వెళ్లిపోయారు సహాయంగారు.
అలా వెళ్లిన రెండు నిముషాల్లో ఫెళఫెళ

మంటూ పిడుగులు పడ్డాయి చాలా

దగ్గరలో. అప్పటికే నేను గర్భగుడి ముందు

హారతి తీసుకుంటున్నాను. ఒక్కసారి

భయం వేసింది. ఏదో కీడు శంకిస్తున్న నా

మనసును కృష్ణుని రూపంపై లగ్నం

చేశాను. హరేరామ మంత్రాన్ని స్మరిస్తూ

సర్వేజనా సుఖినోభవంతు, స్వామి

అందరినీ కాపాడు అంటూ కళ్లు

మూసుకొని ఉండిపోయాను. కాసేపు

పూజారిగారు పెట్టిన అటుకుల ప్రసాదం

తింటూ మండపంలో కూర్చున్నాను. పది

నిముషాలకి సెల్ రింగ్ అవ్వడంతో ఆన్‌చేసి

అలా ఉండిపోయిన నన్ను కుదుపుతూ

‘ఏమయింది బాబూ’ అన్నారు

పూజారిగారు.
‘నన్ను దింపి వెళ్లిన సహాయం గారికి

దగ్గరగా పిడుగు పడిందట, ఆయన్ని

హాస్పటల్‌లో చేర్చారుట, చాలా సీరియస్‌గా

ఉందని’ అంటూ కంగారుగా లేచి
‘స్వామి వెళ్లొస్తాను’ అంటూ హాస్పటల్‌కి

వెళ్లాను సార్! అంటూ గబగబా జరిగింది

చెప్పాడు కృష్ణారావు.
‘సహాయం కూడా నీతోబాటు ఆగిపోయి

ఉంటే బాగుండేదయ్యా!’ అన్నారు మేనేజర్.
‘నేను చెప్పినా వినలేదు సార్! అయినా

భగవంతుని దృష్టిలో అందరూ సమానమే!

కాని ఇలా ఎందుకు జరిగిందో అర్ధం

కావడంలేదు’ అన్నాడు చాలా బాధగా

కృష్ణారావు.
‘ఏదీ మన చేతుల్లో ఉండదేమో! ఏది

ఏమైనా సహాయం త్వరగా కోలుకుంటే

బాగుండునయ్యా!’ అన్నాడు మేనేజర్.
‘చావు బతుకుల మధ్యనున్న సహాయం

గార్ని చూసిన దగ్గర నుండి మనసంతా

కకావికలం అయిపోతోంది సార్! ఉదయం

గుళ్లో సహాయం పేరుమీద అర్చన

చేయించి త్వరగా కోలుకోవాలని ఆ

కృష్ణ్భగవానుని కోరాను’ అన్నాడు

కృష్ణారావు
‘మంచి పని చేశావయ్యా!’ అన్నాడు

మేనేజర్.
‘్భగవంతుని దృష్టిలో అందరూ

సమానమే కదా! ఎందుకిలా జరిగిందని

పూజారి గార్ని అడిగాను సార్!’ అన్నాడు

కృష్ణారావు.
‘ఏమన్నారు?’ ఆత్రుతగా అడిగాడు

వెంకటేశ్వరరావు
‘సాయంకాలం మాట్లాడుకుందాం! ఆఫీసు

నుండి వచ్చేటపుడు ఒక్కసారి ఆగండి’

అన్నారు పూజారి గారు
‘ఓకే సాయంకాలం నేనూ వస్తా నీతో’

అంటూ హెడ్ ఆఫీసు నుండి వచ్చిన ఫోను

రిసీవ్ చేసుకున్నాడు మేనేజర్

వెంకటేశ్వరరావు.
‘అలాగే సార్!’ అంటూ రూమ్ నుండి

బయటకు వచ్చాడు కృష్ణారావు
తన సీట్లోకి రాగానే కప్పులో టీ పోసిచ్చాడు

అటెండర్ జాన్
‘్థ్యంక్స్’ అంటూ కప్పు అందుకున్నాడు
టీ తాగిన పది నిముషాలకి సెల్‌మోగింది
‘్థంక్ గాడ్’ అంటూ లేచి అందరికీ

శుభవార్త! సహాయంగారు
ఔట్ ఆఫ్ డేంజర్, ఇప్పుడే మాట్లాడారుట,

కాంపౌండర్ ఫోన్ చేశాడు’
అంటూ ఆఫీసంతా కలియ తిరుగుతున్న

కృష్ణారావుకేసి అందరూ ఆనందంగా

చూశారు జాన్ మళ్లీ అందరికీ టీలు

పోసిచ్చాడు.
ఈ హడావుడిలో మేనేజర్ కూడా

బయటకు వచ్చి ‘ఆ! విషయం తెలిసిందన్న

మాట! ఎనీ హౌ సహాయం గార్కి ఆపద

తప్పింది’ అంటూ తనూ ఓ టీ కప్పు

అందుకున్నాడు.
* * *
గంట ముందుగానే మేనేజర్, కృష్ణారావు

కారులో బయలుదేరారు.
దారిలో కొబ్బరికాయలు, పళ్లు

తీసుకున్నారు.
‘ముందు గుడికి వెళ్లి తరువాత హాస్పటల్‌కి

వెడదాం’ అన్నారు మేనేజర్.
‘అలాగే’ అంటూండగానే గుడి దగ్గర

కారాగింది.
ఇద్దరూ కారు దిగి, కాళ్లు కడుక్కొని

దేవాలయ ప్రదక్షిణ చేసి, దర్శనం

చేసుకున్న వారిని అనుసరిస్తూ

ధ్యానమందిరానికి తీసుకువెళ్లారు

పూజారిగారు.
ఉదయం అడిగిన ప్రశ్నకు సమాధానం

ఏవిధంగా ఉండబోతుందోనన్న

ఉత్సుకతలో ఉన్నారు ఇద్దరూ.

పూజారిగారు అక్కడ ఉన్న వేదిక మీద

వ్యాసపీఠానికి నమస్కరించి కూర్చొని

వారిద్దరినీ కూడా కూర్చోమని సైగచేసి, ఇది

తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్యా

రాజగుహ్య యోగంలో ఇరవై తొమ్మిదవ

శ్లోకం అంటూ పరమగురువు భగవద్గీతకు

నమస్కరించి సమ్మోహం సర్వభూతేషు

నమే ద్వేష్యో స్తినప్రియః
యే భజన్తి తుమాం భక్త్యామయితే తేషుచా

ప్యహమ్!
చాలా శ్రావ్యంగా చదివి భావం చెప్పడం

మొదలుపెట్టారు పూజారిగారు.
‘సర్వ భూతములయందు నేను

సమభావంతో ఉంటాను. నాకు

ఎవరియందు ద్వేషంలేదు. నాకు ఎవడూ

ఇష్టుడు కాడు నన్ను భక్తితో సేవించేవాడు

మాత్రం నాలో ఉంటారు. నేను

వారిలోనుంటాను’ అని భగవానుడు

అభయమిచ్చాడు అంటూ ముగించారు.
అప్పటికే ఇద్దరి కళ్ల వెంట ఆనంద

భాష్పాలు రాలుతున్నాయి. అర్ధం

అయిందా అన్నట్లు చూస్తున్న పూజారిగారి

కేసి చూస్తూ తలలాడించారు ఇద్దరూ.
అక్కడే ఉన్న గీతాబోధ చిత్రానికి

వినమ్రంగా నమస్కరించి
‘వస్తామండి’ అంటూ పూజారిగారి దగ్గర

సెలవు తీసుకున్నారు.
‘ఎలాగయినా సహాయం గార్కి భగవద్గీతను

అవగాహన చెయ్యాలయ్యా కృష్ణారావ్’

అంటున్న వెంకటేశ్వరరావుగారి కేసి

చూస్తూ...
‘సహాయం గారు బతికి బట్టకట్టారు సార్!

అంతేచాలు’ అంటూ కళ్లు

మూసుకున్నాడు కృష్ణారావు.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు, సీతంపేట, రాజమహేంద్రవరం చరవాణి: 9491171327