విజయవాడ

ఆత్మీయ స్పర్శ కోసం ‘ఆలోచన చేద్దామా!’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతోజు మోహన్‌కృష్ణ కృష్ణా జిల్లా తిరువూరు వాసి. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూటివ్. ప్రవృత్తిగా కవితలు రాస్తూ సాహిత్య కృషి చేస్తున్నాడు. మృదుభాషి. ప్రేమతత్వం కలిగినవాడు. ఏఒక్కరినీ నొప్పించటం అతనికి గిట్టదు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. అన్నింటికీ మించి సమాజంపై సమగ్ర దృష్టి వున్న కవి. అందుకు నిదర్శనమే తాజాగా ఆయన వెలువరించిన ‘ఆలోచన చేద్దామా!’ కవితా సంపుటి. ఇందులో మొత్తం 36 కవితలున్నాయి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ఫలితాలపై నిరసన గళం వినిపించాడు మోహన్‌కృష్ణ. ముఖ్యంగా మనుషుల మధ్య మానవ సంబంధాలు మల్లెపువ్వంతా స్వచ్ఛంగా వికసించి, మానవత్వపు పరిమళాలు నలుదిశలా విరజిమ్మాలనే ఆకాంక్షను వ్యక్తపరిచాడు. కొన్ని కవితల్లో ప్రముఖులను స్మరించుకున్నాడు. సామాజిక చైతన్యం దిశగా తన కలాన్ని పరుగులు పెట్టిస్తున్న మోహన్‌కృష్ణకు అభినందనలు.
తారస్థాయికి చేరిన పాలకుల నిర్లక్ష్య ధోరణిని చీల్చి చెండాడుతూ, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న దుస్థితిని ‘సూర్యునితో పోటీపడి/ ధరలు మండుతున్నప్పుడు’ అంటూ జాతిద్రోహులను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి ముందడుగు వేయండని, ఓటు వేసే ముందు ఆలోచిద్దాం.. వేకువ పూలై వికసిద్దాం.. అంటూ ప్రబోధించాడు. ఈ సంపుటిలో ఒక ఆణిముత్యం ‘పైపై బతుకులు/ వైఫై కాలం’ కవిత. నేటి మానవ సంబంధాలను లోతుగా పరిశీలిస్తూ తన ఆవేదనను కవితాత్మకంగా వ్యక్తపరిచాడు కవి. ‘ఇప్పుడంతా/ పైపై బతుకున/ పైపై పొరలలో అల్లుకున్న బంధాలే/ లోతుల్లోకి తొంగిచూసే తీరికేది ఎవరికైనా?/ పలకరింపు సమాధానాలన్నీ కుశలాలే/ ఆత్మను తాకే స్పర్శ/ మనసును హత్తుకునే కౌగిలి/ కష్టం పంచుకునే హృదయం మృగ్యమే!’ మానవత్వంతో జీవించేవాడే అసలైన మనిషని.. అది అందరూ కలిగి వుండాలనే ఆకాంక్షను వెలిబుచ్చాడు.
‘నేస్తమా!/ మనం ఉదయిస్తున్న సూర్యుడిలా వెలుగులు నింపాలే కానీ/ అస్తమిస్తున్న సూర్యునిలా కన్నవాళ్లకు చీకట్లు మిగల్చటం తప్పే’ అంటాడు. చిన్న చిన్న సమస్యలకే అనాలోచిత ధోరణితో ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల్లోని పిరికితనాన్ని పారదోలి, ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశాడు ‘ఆలోచించు.. నేస్తమా..’ కవితలో. ఈ కవిత నేటి పరిస్థితులకు ఒక మేలుకొలుపు గీతం!
మనం నిద్ర లేవకముందే తాజా వార్త పత్రికలను మన గుమ్మానికి చేర్చే పేపర్‌బాయ్‌ల కడగండ్లను కళ్లకు కట్టినట్లు ‘పేపర్‌బాయ్’ కవితలో వివరించిన తీరు బాగుంది. ‘ఇంటి ఆవరణలో/ గంపెడు వార్తలను గుమ్మంలో/ తన గుప్పెటతో చల్లిపోతాడు/ నిత్యం శ్రమించే/ కర్మయోగి వాడు’ అంటూ పేపర్‌బాయ్‌ల దయనీయ స్థితిని ఆవిష్కరించాడు మోహన్‌కృష్ణ. పాఠకుల కళ్లు చెమ్మగిల్లేలా సాగిన కవిత ‘పసివాడి లేఖ’. ‘అ’ అంటే అమ్మకాదు అమెరికా అంటూ/ ‘డి’ అంటే డాడీ కాదు డాలర్ అంటూ/ బడి ఒడిలో నేర్పుతున్నారు/ ప్రపంచీకరణ చెరలో బందీలైన/ తల్లిదండ్రుల కోర్కెలకు అంతంటూ లేద’ని పసివాడి దృష్టి కోణం నుండి ప్రపంచీకరణ దుష్పరిణామాలను వివరించటంలో కవి ప్రతిభ అమోఘం. ‘అందం ముందు/ ఆకలి ఓడిపోతుందా?/ ఆకలిలో ఉన్న కవిత్వం/ అందంలో ఎక్కడున్నది?/ ఆకలి నిజం/ అందం/ అద్దానికి అబద్ధానికి/ అనుబంధం’ అంటూ ఆకలి విలువను అభివ్యక్తీకరించిన తీరు అద్భుతం.
‘చిరునవ్వు విలువ/ అమూల్యం../ మనుషులను దగ్గర చేస్తుంది/ మమతల వారధి కడుతుంది’ అని చెప్పిన కవిత నిజంగా అమూల్యమైనదే!
రైతులు ప్రేమలో విఫలం కావటం వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. దీనికి చలించి మోహన్‌కృష్ణ రాసిన ‘అవును.. ప్రేమే కారణం’ కవిత రైతు త్యాగాలకు అద్దం పట్టేలా సాగింది. ‘అన్నదాతకు అన్నింటి మీదా ప్రేమే/ భూమంటే ప్రేమ/ విత్తనాలంటే ప్రేమ/ వర్షమంటే ప్రేమ/ పెరిగిన పైరంటే ప్రేమ’ అంటూ కవితా పాదాలతో రైతుకు హారతి పట్టాడు.
ఇలా.. మిగిలిన కవితలన్నిటా ఆలోచనా గుణముంది. అపసవ్య మార్గంలో సాగుతున్న సమాజాన్ని మంచి దారిలో నడిపించాలనే తపనా వుంది. సమాజ శ్రేయస్సు, చైతన్య స్ఫూర్తిని బలంగా కలిగిన వాడు కనుకనే అనంతోజుడు సూర్యుడిని అనేక కవితల్లో పోలికగా తీసుకుంటూ.. సరికొత్త ఉషస్సులను తన కవనం ద్వారా గుమ్మరిస్తూ.. మరో తరానికి కొత్త బాటలు వేసేందుకు ‘ఆలోచన చేద్దామా!’ అంటూ మన ముందుకొచ్చాడు. మంచి కవర్ డిజైన్‌తో ముస్తాబైన తొలి సంపుటిని తన మాతృమూర్తి కీ.శే. శ్రీమతి అనంతోజు విజయలక్ష్మి గారికి అంకితమివ్వటం సముచితంగా వుంది. మరింత బలమైన సాంద్రత కలిగిన కవిత్వాన్ని తన భావాల్లో నింపుకొని, అక్షరాలను శరాలుగా మలచుకొని విశ్వశ్రేయస్సు కోసం కవిత్వ సమరం నిరంతరాయంగా కొనసాగిస్తాడనటంలో సందేహం లేదు. మరెన్నో పుస్తకాలు వెలువరించి, మోహన్‌కృష్ణ గొప్ప కవిగా వెలుగొందాలని మనసారా కోరుకుందాం.

- రాచమళ్ల ఉపేందర్, ఖమ్మం. చరవాణి : 9849277968