మంచి మాట

గీతామందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీత శ్రీకృష్ణుని హృదయమందిరం. మానవ జీవిత మార్గదర్శి. ఆనంద సాగరం. అమూల్య జ్ఞాన రత్నభాండాగారం. సకల ధర్మాల సమన్వయ సారం. చైతన్యానికి ఊతమిచ్చే చేవగల గ్రంథరాజం. వ్యక్తిత్వ వికాసానికి కరదీపిక. ఇహపరాలకు ముక్తిప్రదాత. తత్త్వజ్ఞాన నిధి. ఉపనిషద్వేద సార సంగ్రహ గని. సకల శాస్త్ర సమ్మోహితావని. అజ్ఞానాంధకారాలను తొలగించే విద్యుత్‌మణి. భగవద్గీతకు సాటియైన గ్రంథం విశ్వసాహిత్యంలో మరొకటి కానరాదు.
పార్థసారథి, హృషీకేశుడు, గోపాలుడు, గోవిందుడు, యోగీశ్వరుడు, సర్వజ్ఞుడు, మధుసూదనుడు, వాసుదేవుడు, రాజరాజేశ్వరుడు, విష్ణువు, అచ్యుతానందుడు, శ్రీకృష్ణుడు, భగవానుడు, నారాయణుడు, పురుషోత్తముడు, శౌరి, పరబ్రహ్మ, శ్రీహరి నామాలతో అష్టాదశ అధ్యాయాల అధ్యక్షుడుగా వెలుగొందాడు. అర్జునుని ఆసరా చేసుకొని సకల మానవాళికి జ్ఞానామృతాన్నందించాడు.
భగవద్గీత 701 శ్లోకాలలో శ్రీకృష్ణుడివి 574, అర్జునుడివి 85, సంజయుడివి 41, ధృతరాష్ట్రుది ఆరంభంలో ఒకటితో విరాజల్లుతుంది. గీత మానవాళికి కర్తవ్యాన్ని బోధించింది. సోమరితనం కూడదని హెచ్చరించి చైతన్యాన్నందించింది. విధి నిర్వహణలో ధర్మమయ ప్రవర్తనతో సాగాలని, పిరికితనం, దుర్బలత్వం, కర్మశూన్యత కూడదని చెప్పి ధైర్యాన్నందించింది. ఇంద్రియాలకు రాగద్వేషాలకు లొంగరాని సూచించింది.
బాగా ఆచరించే పరధర్మం కంటే, స్వధర్మాచరణ మేలైందని, బ్రహ్పార్పణ భావంతో కర్మాచరణ గావించాలని మనస్సును చంచలం కానీకుండా సాధనతో అదుపులో ఉంచుకోవాలని, అంతర్ బాహ్యశుద్ధి అవసరమని సర్వప్రాణి కోటియందు సమత్వబుద్ధిని కలిగియుండాలని దృఢచిత్తం. ఆత్మవిశ్వాసం కలిగి సుఖ దుఃఖాలకు, రాగద్వేషాలకు, అరిషడ్వర్గాలకు చలించరాదని వెల్లడించింది.
కామక్రోధ లోభాలు నరకద్వారాలని వాటికి లొంగరాదని హెచ్చరించింది. విషయ వాంచలు బుద్ధిని దిగజారుస్తాయని, ప్రజ్ఞ, జ్ఞానం, వివేకం, వైరాగ్యం వంటి సాధన గుణాలతో వాటిని అణగదొక్కాలని సూచించింది.
కర్తవ్య దీక్ష, సత్యవాక్పాలన, వేదాధ్యయనం, ఇంద్రియ నిగ్రహం, పరోపకారం, సత్సాంగత్యం, సచ్ఛీలం, దానధర్మాలు, త్యాగభావం, సేవాతత్పరత, నిరాడంబరత మున్నగువాటిని పెంపొందించుకోవాలని పేర్కొంది.
సాత్వికాహారం, యుక్తకార్యాచరణం, సత్ప్రవర్తన, సత్కర్మలు మేలు చేస్తాయని ఉత్తముల మార్గమే అనుసరణీయం, ఆచరణీయం కావాలని అందుకు శాస్త్రాలే ప్రమాణాలని గుర్తించమంది.
విద్యవలన వినయం, శ్రద్ధవలన జ్ఞానం సిద్ధిస్తాయని, ధ్యానయోగ సాధన ప్రధానమైనదని, చాడీలు చెప్పడం, వినడం కూడదని మమత, అహంకారం, ఈర్ష్య, ద్వేషాలు పనికిరావని, లోకహితాన్ని కోరాలని నేర్పుతో కర్మనాచరిస్తే అది యోగంగా మారునని, మనిషిని మనీషిగా మార్చునని తెలిపింది. సత్కర్మాచరణం దైవారాధన వంటిదని, పత్రం పుష్పం ఫలం తోయం (జలం) ఏదైనా భక్త్భివంతో సమర్పిస్తే చాలని వస్తు విలువలతో పనిలేదని గీత చెబుతోంది.
మాయా జగత్తులో ఉన్నా తనని నమ్ముకున్నవారిని ఆ మాయ ఏమీ చేయజాలదని భగవంతుడు ఆదుకుంటాడని, త్రికరణశుద్ధిగా ఉండాలని (మనసా, వాచా, కర్మణః) ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ధైర్యం, అంకితభావం, ద్వంద్వాలందు సమత్వ భావం, భక్తిశ్రద్ధలు, సంతృప్తి ముఖ్యమని గీతావాణి విశదపరుస్తుంది.
త్రిగుణాలలో (సత్వ, రజో, తమో) సత్వగుణం ప్రధానమని దానిని అలవర్చుకోవాలని సదా ధ్యానయోగాన్నవలంభించాలని, ఎవరు ఎలా తనని ఆరాధిస్తారో, తానా మార్గంలోనే వారిని ఆదుకుంటాడని, గీత అభయమిస్తోంది.
ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలని, కర్మఫలం త్యాగం చెయ్యాలని, ప్రతి ప్రాణిలో తన ఆత్మను చూడగలగాలని, పునర్జన్మ వుందని జన్మ జన్మకు ఆత్మని మెరుగుపరచుకోవాలని, మోహాన్ని విడనాడాలని, కర్తవ్య కర్మలను విధిగా నెరవేర్చాలని, శ్రద్ధగలవారికే జ్ఞానం సిద్ధిస్తుందని గీతా ప్రబోధం. ఇంతటి మహత్వాన్ని కూడినందుననే శ్రీశంకరులు గేయం గీతానామ సహస్రం అని ప్రబోధించారు. భగవద్గీతని పఠిస్తూ, ఆచరిస్తూ, దైవానుగ్రహమునకు పాత్రులవుదాం.

-చెళ్ళపిళ్ళ సన్యాసిరావు