ఖమ్మం

తెలంగాణలో అప్పుల్లేని అన్నదాతే కెసిఆర్ లక్ష్యం: మంత్రి తుమ్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అన్నం పెడుతున్న రైతులు అప్పులు లేకుండా ఆర్థికంగా బలపడి ఉండటమే కెసిఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో సోమవారం జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సమావేశంలో వారు మాట్లాడుతూ అన్నదాతలంతా అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారని దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులకు, అవమానాలకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతులకు పంటలు పండించేందుకు పెట్టుబడుల నిమిత్తం ఎకరాకు రూ. 4వేలు చొప్పున వారి ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో మొత్తం 1.10 కోట్ల ఎకరాల భూమిలో రైతులు పంటలు పండిస్తున్నారని ఇందుకు పెట్టుబడిగా ఏడాదికి రెండు పంటలకు గాను 8వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా కెసిఆర్ సంచలానాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. ఈ విధానం భారతదేశంలో ఎక్కడా లేదని అన్నారు. రైతులు అప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లే పరిస్థితి ఉండకూడదనే నేరుగా డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో రైతులు ఎవరి వద్ద అప్పు చేయకుండా ఏడాదికి ఎకరాకు రూ. 50 వేలు సంపాదించాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పెట్టుబడితో పాటు సాగునీరు, 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తుందన్నారు. ఇక ముందు అప్పుల కోసం బ్యాంకులు కూడా రైతుల వద్దకే వెళ్లాలన్నారు. రైతు ఆర్థికంగా బలపడాలని తెలిపారు. ఖమ్మం జిల్లాకు కృష్ణా జలాలు రాకపోతే పంట భూములన్నీ ఎడారిగా మారుతున్నాయని ఇలాంటివి జరగకుండా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలో గల 9లక్షల ఎకరాలకు రెండు పంటలకు సరిపడ సాగునీటిని అందించేందుకు రూ. 8వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయన్నారు.
వర్షాలు పడటంలో జాప్యాలు జరిగినా రైతులు ధైర్యంగా రెండు పంటలు పండించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో సలహాలు, సూచనలు తదితర అంశాలపై సమస్యల నివృత్తి కోసం వేలకోట్లు వెచ్చిస్తున్నామన్నారు. 2500 మంది వ్యవసాయశాఖ అధికారులను నియమించామని, భూసార పరీక్షా కేంద్రాలను పెంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్‌రావు, కలెక్టర్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది : ఎమ్మెల్యే

పినపాక, సెప్టెంబర్ 11: దేశానికి వెనె్నముక వంటి రైతు ఈ దేశానికి అన్నం పెడుతున్న తరుణంలో రైతు బాగుంటేనే దేశం బాగు పడుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పినపాక వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వాలైనా రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమన్నారు. అందుకే కేసీఆర్ రైతులను బాగు చేసేందుకు రైతు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని, తద్వారా వారి భూములు, పట్టాలు తదితర విషయాలపై రెవెన్యూశాఖ విలీనైంత త్వరగా పట్టాల మార్పిడి ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు వినియోగించుకొని వారసత్వ పట్టాలను పొంది ఉంటే రానున్న వ్యవసాయ సీజన్ నుంచి రూ.4వేలు ప్రభుత్వం అందిస్తుందని, ఈ మేరకు సీఎం ప్రకటన చేశారన్నారు. రైతుల కోసం నిత్యం శ్రమ పడుతున్న ముఖ్యమంత్రిని, తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వ్యవసాయశాఖ నిర్వహించే ఈ రైతు కమిటీల్లో ప్రతి గ్రామంలో పెద్దలే కమిటీలో ఉంటారని, వారి నిర్ణయం ప్రకారమే భూముల్లో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. రెవెన్యూ సిబ్బంది కానీ, వేరే వ్యక్తులు గానీ వారి మాటలను పట్టించుకోరని స్పష్టం చేశారు. ఈ సౌకర్యాన్ని రైతులంతా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వ్యవసాయశాఖ అధికారులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిన్నారుల మృతిపై విచారణ జరపాలి
* వైద్యులను సస్పెండ్ చేయాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 11: ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందటంపై పలు రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులుపై చర్యలు తీసుకొని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేసి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, ప్రజా సంఘాల ఆధ్యర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శారదలు మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యానికి బదులు చిన్నారుల మరణమృదంగం వినిపిస్తుందన్నారు. ఖమ్మం రూరల్‌మండలం పల్లెగూడెంకు చెందిన ఎన్ నాగమణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిందని ఆమెకు పురుడుపోయడంలో వైద్యులు, సిబ్బంది అనుసరించిన తీరుపై మండిపడ్డారు. మహిళ పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరగా ఆమెకు సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యధోరణిని వ్యవహరించడంతో ఆమె బిడ్డ అడ్డంతిరిగి మృతి చెందిందన్నారు. ఇల్లెందుకు చెందిన మరో మహిళా ఇదే పరిస్థితిలో తన బిడ్డను కోల్పోయో పరిస్థితి కలిగిందన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునికరిస్తున్నామని చెబుతున్న మంత్రులు ఖమ్మం సంఘటనపై ఏమి సమాధానం చెబుతారన్నారు. ఇటీవల మంత్రి ప్రారంభించిన మాతాశిశు కేంద్రంలోనే ఈ పరిస్థితులు దాపురిస్తే ఇక రాష్ట్ర పరిస్థితులు ఏలా ఉన్నాయో పాలకులే చెప్పాలన్నారు. అన్ని వసతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తూ మరణాలకు కారకులౌతున్నారన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు ఆసుపత్రి పనితీరు, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, మహిళా జిల్లా అధ్యక్షురాలు బండి మణి, సిపిఐ నాగర కార్యదర్శి జానీమియా, సలాం, పోటు కళావతి, సదాలక్ష్మి, రాధ, శారద తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు ప్రారంభం
* మార్కెట్ చైర్మన్ కృష్ణ
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 11: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ ద్వారా పెసల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం నుండి ప్రారంభించనున్నట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ హలులో వ్యాపారులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెసల రైతులను అన్ని విధాలుగా అదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ ద్వారా పెసలను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. రైతులు పెసలలో 14శాతం తేమ ఉండేలా చూసుకోవాలని, రైతు పట్టాదారు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, వీఆర్‌వో దృవీకరణ పత్రాలను ఖచ్చితంగా సమర్పించాలని సూచించారు. పెసల రైతులు ఏ విధంగా మోసపోకుండా సిసి కెమెరాలు, వాహన నెంబర్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపనున్నట్లు తెలిపారు. పిఎసిఎస్ ద్వారా కొనుగోలు చేసే పెసలలో 14శాతం తేమ, ఆకుపచ్చని రంగు, తడవని పెసలకు మాత్రమే గిట్టుబాటు ధరైన 5,575రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వ్యాపారులు దీనికి సహకరించాలని అధికారులను, వ్యాపారులను కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నరశింహరావు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్‌కుమార్, మార్కెట్ కార్యదర్శి సంతోష్‌కుమార్, పాలకవర్గ సభ్యులు, వ్యాపారులు పాల్గొన్నారు.

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన విఆర్వో
వైరా, సెప్టెంబర్ 11: ఓ రైతు వద్ద రూ. 27వేలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ విఆర్వో ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సోమవారం మండల పరిధిలోని గండగలపాడు గ్రామానికి చెందిన జోనెబోయిన గోవిందరావు అనే రైతుకు చెందిన పొలాన్ని సాదాబైనామా పట్టదారుపాసుపుస్తకం కోసం రైతు గత 4నెలలుగా తిరుగుతూ ఉన్నాడు. ఇటీవల తహశీల్దార్ సంతకం కూడా అయిపోయింది. కాని విఆర్వో తనకు రావలసిన సొమ్ములకోసం రైతును ఇబ్బందిపెడుతూ లంచం డిమాండ్ చేస్తున్నాడు. కాగా రైతు గోవిందరావు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఎసిబి డిఎస్పీ సాయిబాబు, సిఐలు రమణమూర్తి, పద్మ పక్కా ప్లాన్‌తో విఆర్వోను పట్టుకున్నారు. ఓవైపు రాష్ట్రప్రభుత్వం రెవిన్యూవ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకొంటుంటే మమల్ని మార్చలేరన్నట్లు రెవిన్యూ అధికారులు కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఎసిబి అధికారులు సంఘటనపై తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కోట రవికుమార్‌తో కూడా సమావేశమై వివరాలు సేకరించారు. ఈయన 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత బదిలీపై కొణిజర్ల మండలంనుండి ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తూ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు.

రైతు సంక్షేమం కోసమే రైతు సమన్వయ సమితులు

దమ్మపేట, సెప్టెంబర్ 11: రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు సేవా సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో దమ్మపేట, ములకలపల్లి మండలాలకు చెందిన రైతు సమన్వయ సమితి కమిటీలకు సోమవారం ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరావులు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్దించిన తర్వాత రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఆప్పులు, ఆత్మహత్యలు లేని రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వానికి రైతులు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని వర్గాల వారు సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీల తరహాలోనే రైతుల సంక్షేమం కోసం సమన్వయ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఈ కమిటీల పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేయటం మంచిది కాదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు అధికారులు సైతం తాము రైతు కుటుంబం నుంచి వచ్చామని చెపుతున్నా, రైతు శ్రేయస్సు కోసం నేటి వరకు ఎవరూ పనిచేయలేదని అన్నారు. రాబోయే రోజుల్లో అన్నం పెట్టే రైతన్న అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ రైతాంగ సంక్షేమం కోసం విద్యుత్, తాగునీటి రంగాలపై దృష్టి సారించారని తెలిపారు. రాబోయే రోజుల్లో కోటి ఎకరాలకు సాగునీరు అందించటంతోపాటు నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. రైతు సమన్వయ సమితులు రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత రైతులు పెట్టుబడుల కోసం తరుము కోకుండా ఎకరానికి రూ.4వేలు చొప్పున ప్రభుత్వమే సహాయంగా అందిస్తుందన్నారు. వచ్చే మే నెల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. నిజాం ప్రభుత్వ హాయాంలో భూసర్వే జరిగిందని, వాటినే నేటికీ ప్రమాణికంగా తీసకోవాల్సి వస్తుందని, రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసి మరొక కొత్త అంకానికి తెరతీస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, వ్యవసాయశాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

రామయ్యను దర్శించుకున్న జిల్లా ఎస్పీ
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 11: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా సోమవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు అర్చకులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన ఆయన గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఏఎస్పీ సునీల్‌దత్, సిఐ శ్రీనివాసులు, ఎస్సై కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై అబ్బయ్య ఉన్నారు.

కల్లూరులో రైతు సమన్వయ సమితి ఏర్పాటుపై రగడ

కల్లూరు, సెప్టెంబర్ 11: రైతు సమన్వయ సమితి ఏర్పాటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఒ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహంచి జెసి వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీఒ కుముదిని సింగ్‌కు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వినతిపత్రాలు అందజేశారు. రైతు సమన్వయ సమితి ఏర్పాటుతో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని, రాజకీయాలకు అతీతంగా గ్రామ సభలద్వారా సమితులు నిర్ణయించాలని, 39 జిఒ రద్దు చేయాలని పొంగులేటి జెసికి, ఆర్డీఒకు వివరించారు. అనంతరం పొంగులేటి విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సమితిగా మార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని అన్నారు. మాటల తూటాలతో ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా నిర్వహించే 39జిఒను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్నీ అవాంతరాలేనని 3ఎకరాల భూమి మూలనపడిందని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మాణంలోనే కూలి పోతున్నాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించక పోవటంతో రోడ్డున పడి ఆందోళనలు చేస్తున్నారని, జిల్లాలో శిశు మరణాలు 4కు చేరాయని ఆరోపించారు. రాష్ట్రంలో వైద్య శాఖకు రోగం వచ్చిందని ఆసుపత్రులలో కనీస వసతులు లేక రోగులు నానా అవస్థలు పడుతూ శిశు మరణాలు సంభవించాయని దీనికి బాధ్యతగా ఆరోగ్యశాఖామంత్రి వెంటనే రాజినామా చేయాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టుతున్న వివిధ పథకాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫిట్-1లో బొగ్గు వెలికితీత పనులు ప్రారంభించాలి

టేకులపల్లి, సెప్టెంబర్ 11: ఓవర్ బర్డెన్ పనులు వేగవంతం చేసి, ఫిట్-1లో బొగ్గు వెలికితీత పనులు త్వరగా ప్రారంభించాలని సింగరేణి సంస్ధ సివిల్ డిపార్ట్‌మెంట్ జనరల్ మేనేజర్ రాంభద్రరాజు ఆదేశించారు. సోమవారం కోయగూడెం ఓసిలోని ఫిట్-1 లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ పనులను, సివిల్ వర్కషాపు పనులను పరిశీలించారు.
దీనిలో భాగంగా రోడ్ల డైవర్షన్, కె ఓ సిలో ఫిట్-1లో వేబ్రిడ్జి నిర్మాణం, సిసి రోడ్లను ఆయన పరిశీలించారు. ఓబి పనులను వేగవంతం చేసి తొందరగా బొగ్గు ఉత్పత్తులను సాధించడానికి పనులు ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కె.లక్ష్మీనారాయణ, కె ఓ సి ప్రాజెక్టు అధికారి కాకర వేణుగోపాల్, మేనేజర్ కృష్ణయ్య, ఏరియా సివిల్ డిపార్ట్‌మెంట్ ఎస్ ఇ రాజ్‌కుమార్, స్ధానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

13 నుండి రాజకీయ ఖైదీల వారోత్సవాలు
* 14న ఖమ్మంలో సదస్సు
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 11: ఈ నెల 13నుండి 19వ తేది వరకు రాజకీయ ఖైదీల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాజకీయ ఖైదీల విడుదల కమిటీ(సిఆర్‌పిపి)రాష్ట్ర కార్యదర్శి రవీంద్రనాధ్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జతిన్‌దాస్ వర్థంతిని పురస్కరించుకొని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 14న ఖమ్మంలో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు విరసం నాయకులు వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా పాల్గొంటారని వెల్లడించారు. రాజకీయ పరంగా జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని నిరాహార దీక్షచేస్తూ 63వ రోజుల జతీన్‌దాస్ అమరుడయ్యారన్నారు. ఆయన పోరాట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఈ వారోత్సవాలు నిర్వహస్తున్నామన్నారు. ఈ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో టిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మచ్చా విద్యాసాగర్, సిఆర్‌పిపి, సిఎల్‌సి నాయకులు విప్లవ్‌కుమార్, రవి, స్వాతి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.