ఎడిట్ పేజీ

నదులు.. జాతీయ జీవన సుధలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గంగా సంగమమిచ్చగించెనె?
మదిన్ కావేరి దేవేరిగాన్
అంగీకార మొనర్చునే యమునతో
ఆనందమున్ పొందునే?
రంగత్తుంగ తరంగ శోభలతో, ఆ
రత్నాకరేంద్రుడు నీ
అంగంబంటి సుఖించునేని
గుణ భద్రా తుంగభద్రా నదీ!’’
మహాకవి తెనాలి రామకృష్ణుడు తుంగభద్రానది గొప్పతనం గురించి ఇలా భావించడంలో మన మాతృ భూమిని పండిస్తున్న నదులు అనుసంధానమై ఉండడం సాహిత్యపు‘్ధ్వని’! మనదేశంలోని వివిధ ప్రాంతాలలోని సాహిత్యపు ‘్ధ్వనులు’ నిజానికి ఈ హైందవ జాతీయ సాంస్కృతిక స్రోతస్వినీ తరంగాల ‘్ధ్వనుల’కు ప్రతిధ్వనులు మాత్రమే! ఈ దేశపు నదులు ఈ మాతృదేవి దేహంలోని జీవనాడులు, ఈ దేశప్రజల జీవన నందన వనానికి సహజమైన పునాదులు! నదులు భూగర్భంలో అనుసంధానమై ఉన్నాయి. ‘గంగోత్రి’ భూగర్భ జలం ‘తలకావేరి’ వద్ద పెల్లుబుకడం కేవలం విశ్వాసం కాదు, భరత భూమి స్వరూప నిహిత అంతర్గత శాస్త్ర విజ్ఞాన వాస్తవం కూడ... కావేరి, గంగా నదుల జీవజలాలు అంతర్గతంగా అనుసంధానమై ఉన్నాయి! ఈ జీవ జలాల ‘సత్త్వం’ పొందిన జనుల జీవన స్వభావం సింహళంలోని ‘తామ్రపర్ణి’ నుండి ‘కైలాస’ పర్వత సమీపంలోని మానస సరోవరం వరకు అనుసంధానం అయిఉండడం భారత జాతీయ అఖండ ఏకాత్మతకు ప్రత్యక్ష ప్రమాణం.. నదులు సనాతనమై స్వచ్ఛతకు ప్రతీకలు! భారతదేశంలోని సరస్వతీ దృషద్వతీ నదుల మధ్య ప్రాంతంలో ఈ సాంస్కృతిక స్వచ్ఛత అంకురించడం మానవ చరిత్రకు ఆరంభం! ఈ రెండు నదుల మధ్య ప్రాంతం అందువల్లనే ‘బ్రహ్మావర్తం’ అయింది! ప్రపంచంలోని తొలి మానవుడు ‘సరస్వతీ’ ‘ద్వషద్వతీ’ తీరాలలో పుట్టి పెరిగాడు! వెలుగు తూర్పునుండి పడమటికి ప్రసరిస్తోంది, స్వచ్ఛమైన సంస్కారాలు భారతదేశంనుండి పడమటికి వ్యాపించాయి, తూర్పునకు విస్తరించాయి. మానవులు భారత్‌నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వాస్తవమైన చరిత్ర. ఈ చరిత్రకు ‘శైశవ డోలిక’లు భారతదేశపు నదులు... ‘గంగ’ మరో‘గంగ’గా అసంఖ్యాక ‘గంగాధారలు’గా విస్తరిల్లడం నదుల మధ్యకల సహజమైన అనుసంధానం! నర్మద...వంశధార...సింధు, బ్రహ్మపుత్ర...ఇవన్నీ ఒకే సాంస్కృతిక స్వభావానికి విభిన్న రూపాలు, జాతీయ జీవన సుధలు ‘గంగా స్నానం’ ‘తుంగాపానం’- అన్నది ఈ సుధా మధురిమ! ‘తుంగ’ ‘్భద్ర’లో కలసి తుంగభద్రగా మారింది, తుంగభద్ర ‘కృష్ణ’తో సంగమిస్తోంది. ఇది ఉపరితల అనుసంధాన ప్రతీక.. యమున, సరస్వతీ నదులు ‘గంగ’తో జట్టుకట్టడం అంతర్గత భౌగోళిక సాంస్కృతిక సత్యం, ప్రయాగ వద్ద ‘సరస్వతి’ స్వభావపతాక! స్వభావం కనిపించదు, అనుభూతం అవుతుంది!
ఈ ‘సనాతన’ జీవన అనుభూతి ఈ జాతీయ సముదాయాన్ని అనుసంధానం చేస్తోంది! ‘సనాతనం’ అని అంటే ‘శాశ్వతం’ - ఎటర్నల్ అని అర్ధం, ఈ సనాతన అనుభూతి హిమాలయాలతో సముద్రాన్ని అనుసంధానం చేస్తున్న సంస్కృతి, అసంఖ్యాక వైవిధ్యాలు అద్వితీయ సంస్కృతిగా ప్రస్ఫుటించడం ఈ జాతీయ స్వభావం, నిరంతర అనుసంధానం! ‘కావేరీ’ తీరంలో పుట్టి పెరిగిన మహా కవయిత్రి గోదాదేవి, యమునా తీరంలో పుట్టిపెరిగిన యదుకుల కృష్ణుని కథను గానం చేసింది! ఇదీ అనుసంధానం... ఈ అనుసంధానాన్ని శతాబ్దులపాటు విదేశీయ ముష్కరులు చెడగొట్టడానికి యత్నించారు! ఈ స్వరూప సంపదను విదేశీయ తస్కరులు దోచుకునిపోయారు, ఈ స్వభావ కిరణాలను విదేశీయ వికృతులు ఇప్పటికీ దిగమింగుతునే ఉన్నాయి. మన అటవీ సంపద నష్టం కావడం మన నదులు ఎండిపోవడానికి ఏకైక కారణం, మన జీవన వ్యవహార రీతి విదేశీయ భావదాస్యగ్రస్తం కావడం నదుల మాలిన్యానికి కారణం, నీటి కాలుష్యానికి కారణం! వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్- పేరుతో, ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- పేరుతో కొనసాగుతున్న ప్రహసనం ఈ విదేశీయ భావ దాస్యానికి కొనసాగింపు. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’వారు భూగర్భాన్ని కుళ్లగించి చుక్కనీరు మిగలకుండా కొల్లగొడుతున్నారు, కాలుష్య రసాయనాలు కలసిన ‘శీతల పానీయాల’-కోల్డ్ డ్రింక్స్, సాఫ్ట్‌డ్రింక్-ను మన చేత తాగిస్తున్నారు! తాగుతున్న మన జీవన స్వభావం కలుషితమైపోయింది! భూగర్భం ఎండిపోయింది. పరిశ్రమల కాలుష్యం ‘ముచికుందా నది’ని ‘మూసీ’ మురుగుగా మార్చివేసింది! అనంతగిరి అడవులలో ‘ఓషధీ’ జలాలతో తెలంగాణ ప్రజలకు అమృత ఫలాలను అందించిన ముచికుందా నది మురికి పట్టిన ‘మూసీగుంట’గా మారడం ఉదాహరణ మాత్రమే! దేశమంతటా ఇదే దుస్థితి! పాశ్చాత్యుల రాజకీయ బీభత్స ‘పాలన’ కొండవాగులను కాలుష్యంతో నింపింది, ‘ప్రపంచీకరణ’ ఈ జీవ ధారలను హత్య చేసింది, చేస్తోంది, నీటి చుక్క మిగలకుండా నాకేస్తోంది! తెలంగాణ ప్రభుత్వం నదుల అనుంధానం కోసం నడుం బిగించింది, ఆంధ్రప్రదేశ్ ఇదివరకే నడుం బిగించింది! వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రప్రభుత్వం వారు నడుములను బిగిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వాలన్నీ ‘ప్రపంచీకరణ’ను మరింతగా విస్తరింప చేస్తున్నాయి. నదులను నామరూపాలులేకుండా నశింప చేయడానికై ‘కాలుష్యం కోరల’ను వికృతంగా విసురుతున్న ‘బహుళ జాతీయ సంస్థలు‘ విదేశాల నుంచి నందనవనంలోకి పందుల మందలవలె చొరబడిపోయాయి...నదులు మిగలని చోట ‘అనుసంధానం’ ఎలా సాధ్యం? నదుల పరిరక్షణకై కన్యాకుమారి నుంచి హరిద్వారం వరకు ప్రస్తుతం నడుస్తున్న ‘మహాయాత్ర’కు ఇదంతా విచిత్రమైన నేపథ్యం! ‘ఈశా’ స్వచ్ఛంద జాతీయతా సంస్థ అధిపతి జగ్గీ వాసుదేవ ధర్మాచార్యుని ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ‘నదీ పరిరక్షణ శోభాయాత్ర’-ర్యాలీ ఫర్ రివర్స్- ప్రస్తతం తెలుగు నేలపై పరుగులు తీస్తోంది, అమరావతిని దాటింది. భాగ్యనగరం-హైదరాబాద్‌లో ప్రవేశించింది. కావేరీనది పుష్కరాలు ప్రారంభం కావడం సమాంతర శుభ పరిణామం! నదులు భారతీయ స్వచ్ఛతకు ప్రతీక, ‘ప్రపంచీకరణ’ కాలుష్య పతాక! అందువల్ల ‘ప్రపంచీకరణ’ కబంధ బంధంనుంచి విముక్తిని సాధించడం నదుల రక్షణకు నీటి స్వచ్ఛతకు వౌలిక ప్రాతిపదిక...
నీరు పుష్కలంగా ఉండడం అనాదిగా భారత భూమి స్వరూపం, నీటిని పుష్కలంగా ఉపయోగించుకొనడం భారత జాతీయ స్వభావం! నీరులేని దేశాలవారు నెలల తరబడి స్నానాలు చేయరు. ఎడారులలో, గడ్డిపోచ మొలవని శిలామయ గిరి ప్రదేశాలలో నివసించినవారు చర్మపు సంచులలో నీటిని నింపుకుని వారాల తరబడి దాచుకోవడం శతాబ్దుల విదేశాల చరిత్ర. ఇది సహజ వైపరీత్యం! మంచుగడ్డల వంటి దేశాలలో పుట్టి పెరిగిన వారు చుట్టు నీరు ముంచెత్తుతున్నప్పటి స్నానం చేయని చరిత్ర కూడ కొనసాగింది.
చలికి వణికిపోయినవారు స్నానం కాదు కదా, శౌచక్రియకు కూడ నీటిని ఉపయోగించని దుస్థితి... పాశ్చాత్య దేశాలలోని ‘చలి’ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ దుస్థితి కొనసాగుతోంది! సమ శీతోష్ణ స్థితి భారతీయులకు పంచభూతాలు ప్రసాదించిన వరం! నేల, నీరు, నిప్పు, గాలి, నింగి- ఈ పంచ భూతాలు కలిసి ప్రకృతి ఏర్పడింది, మానవుడు ఏర్పడుతున్నాడు. అందువల్ల పంచభూతాల భౌతిక స్వచ్ఛతతో మానవుని భౌద్ధిక స్వచ్ఛత ముడివడి ఉంది. తినే తిండి తాగేనీరు పీల్చే గాలి, నివసించే భూమి ప్రాతిపదికగా వివిధ జాతుల జీవ స్వభావం వికసించడం శాస్ర్తియ విజ్ఞానం ధ్రువపరచిన చరిత్ర!! భారతీయ జాతీయ జీవన స్వచ్ఛతకు ‘పంచ భూత భాసితమైన’ ప్రకృతిని భారతీయులు పూజించడం పరి రక్షించడం!! ‘పుడమి మమ్ములను పునీతం చేయుగాక’ అన్నది మాతృభూమిని పూజించడానికి లక్ష్యం! అయితే పుడమిని పునీతం చేయగల మాధ్యమం నీరు.. నీరు ఆకాశంలోని మందాకిని, వియద్గంగ... నీరు వాన చినుకు, నీరు నది, బావి, చెఱువు, సరస్సు, కొలను, పడియ, చెలమ, దొన, వాగు, వంక... చివరికి మహార్ణవం! ‘నీరు నేలను పరిశుభ్రం చేయుగాక, పరిశుభ్రమైన నేల మమ్ములను పరిశుభ్రం చేయుగాక..’ - ‘ఆపఃపునన్తు పృథివీం పృథివీ పూతా పునాతుమామ్..’ అన్నది వేద ద్రష్టల ఆకాంక్ష, నీటి వలన లభించే ‘స్వచ్ఛత’ కేవలం బాహిరమైనది, భౌతికమైనది కాదు, ఈ స్వచ్ఛత అంతర్గతమైనది ఆత్మగతమైనది కూడ! అందువల్లనే ‘సత్వగుణం నిండిన సరస్వతీ నది జలాలతో స్నానం చెయ్యి. నీవు నల్లని రంగు కలవాడవయినప్పటికీ అంతరంగం పరిశుద్ధమైన వాడవు కాగలవు’ అని మహాకవి కాళిదాసుని ‘యక్షుడు’ నల్లటి ఆషాఢ మాసపు పర్జన్యునికి బోధించాడు. ‘పర్జన్యం’ అని అంటే మేఘం!
‘గత్వా తాసాం అభిముఖమపాం
సౌమ్య సారస్వతీ నాం...
అంతః శుద్ధః త్వమసి భవిత
వర్ణమాత్రేన కృష్ణః...’
సరస్వతీ నది భారత జాతి అంతరంగ నిహితమైన సంస్కృతి.. ఈ నది ఇప్పుడు ఎండిపోయింది, ‘ప్రపంచీకరణ’ వాణిజ్య బీభత్సపు కాలుష్య వేడిమికి మన సంస్కృతి ఎండిపోతోంది, మనజీవన జలాశయ పరిమళం వాడిపోతోంది, బురద నిండిపోతోంది! ‘అకర్దమం ఇదం తీర్థం సన్మనుష్య మనోయథా...’ అని శిష్యుడైన భరద్వాజునికి ‘మంచి మనుష్యుని మనసు వంటి బురద లేని స్వచ్ఛమైన నీటి మడుగు’ను వాల్మీకి మహర్షి చూపించాడు! ‘మానసిక స్వచ్ఛతకు పరిసరాల స్వచ్ఛతకు ప్రాతిపదిక’ అన్నది ఆదికవి ధ్వనింప చేసిన పాఠం! వర్తమాన భారత జాతీయ సహజ సమష్టి మానసిక స్వచ్ఛత అందువల్ల నదీ జలాల భౌతిక స్వచ్ఛతకు గీటురాయి! ఈ స్వచ్ఛతను దిగమింగుతున్న పాశ్చాత్య భావదాస్య గ్రహణంనుండి విముక్తి సాధించడానికి కృషి జరుగుకపోవడం, ఈ విముక్తి ధ్యాస లేకపోవడడం వౌలికమైన ప్రమాదం.. ‘అక్కడ ప్రవహిస్తున్న కొండ వాగులను ఆయన కొయ్య నెక్కి దాటాడు’ అన్నది భారతీయుల అనాది ప్రస్థానంలోని ఒక ఘట్టం! ‘అక్కడ ఒక నీటి ‘పడియ’ కనిపించింది..ఈ పడియ వద్ద ఆయన తన మూట విప్పాడు... రెండురొట్టెలు తిన్నాడు...’ అన్నది మరో కథ!
‘సాయంకాలమైంది, జలపాతం వద్ద ఆయన స్నానం చేశాడు. సూర్యుడికి అర్ఘ్యం వదిలాడు...’ ఇది ఇంకొక ఘట్టం! ‘ఆ లోయలోని మైదానంలో వారు విత్తనాలు చల్లుతారు నాలుగు నెలలకు పంటను కోసుకుంటారు. వారు చేయవలసిన పని మరొకటి లేదు. నీరు ప్రవహిస్తుంది, పండిస్తుంది...’- ఇదీ నదీ లోయలలోని జీవన ప్రస్థానం! ‘అంచితమే నదీతమే, దేవితమే..’ అని సరస్వతీ నదిని ప్రార్ధించడంతో తొలి మానవుని జీవన ప్రస్థానం మొదలైంది! నదుల నీరు ‘్భమి’ని, జన్మనిచ్చి పోషించే తల్లిని చేసింది, మాతృభూమిని చేసింది! తల్లి ‘పాప’కు పాలిస్తోంది. మాతృభూమి ‘పిల్లల’కు నీరును ఇస్తోంది. నీరు అమృతం... మాతృభూమి వక్షస్థలమైన పర్వత శ్రేణినుంచి జాలువారే అమృతధార నదీ జలధార!!

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్ : 99510 38352