అంతర్జాతీయం

రోహింగ్యా శరణార్థులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 13: రాజకీయాలను పక్కనపెట్టి మయన్మార్‌నుంచి పారిపోయి వస్తున్న శరణార్థులను ఆదుకోవడానికి కొనసాగుతున్న మానవతా కృషికి మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశలకు విజ్ఞప్తి చేసింది. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లోని రఖినే రాష్ట్రంలో ఉండే మైనారిటీ ముస్లింలే ఈ రోహింగ్యాలు. వీరు అనేక దశాబ్దాలుగా అణచివేతను ఎదుర్కొంటున్నారు. 1948లో స్వాతంత్య్రం పొందినప్పటినుంచి కూడా మయన్మార్ వీరిని పౌరులుగా గుర్తించడానికి నిరాకరిస్తూనే ఉంది. గత ఆగస్టు 25న రోహింగ్యా మిలిటెంట్లు డజన్ల సంఖ్యలో పోలీసు పోస్టులు, ఒక మిలిటరీ బేస్‌లపై దాడి చేయడంతో తాజా ఉద్రిక్తత మొదలైంది. దీనికి ప్రతిగా మయన్మార్ మిలిటరీ గ్రామాలకు నిప్పు పెట్టి ప్రజలను తరిమేయడం ద్వారా ప్రతీకార దాడికి దిగింది. ఫలితంగా ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది మయన్మార్‌ను వదిలిపెట్టి పారిపోయారు.
ఈ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్ట్ఫోనె డుజారిక్ ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు అందుతున్న నివేదికలు, చిత్రాలు చూస్తే పరిస్థితి హృదయవిదారకంగా ఉందని అర్థమవుతుందని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా మొత్తం ప్రపంచ మానవాళి వీరిని ఆదుకోవడానికి కొనసాగుతున్న మానవతా చర్యలను సమర్థించాలని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. 3లక్షల మంది రోహింగ్యా శరణార్థులకోసం అత్యవసర ప్రణాళికను ఐరాస సిద్ధం చేస్తోందని డుజారిక్ చెప్తూ, అయితే ఈ సంఖ్య ఇప్పుడు దాన్ని దాటిపోయిందని, అందువల్ల మరింత సాయంకోసం విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. వీలయినంత త్వరగా సహాయం దేశంలోకి వచ్చేలా చూడడానికి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ (యుఎన్‌సిహెచ్‌ఆర్), ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్‌పి) కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు.
మయన్మార్‌లో రోహిగ్యా ముస్లింల సమస్య తీవ్రమైన నేపథ్యంలో ఆ దేశ ఆధికార పార్టీ నేత ఆంగ్‌సాన్ సూకీ ఈ వారం జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. వేల సంఖ్యలో దేశం వదిలి పారిపోతున్న రోహింగ్యా శరణార్థులకు మద్దతుగా మాట్లాడక పోవడంపై సూకీపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు పెద్దఎత్తున విమర్శలు కురిపిస్తున్నాయి. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అణచివేతకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం జరిపిన నేతగా గుర్తింపు ఉన్న ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇప్పుడు రోహిగ్యా ముస్లింల సమస్యపై పెదవి మెదపక పోవడంపై అంతర్జాతీయంగా పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.