రాష్ట్రీయం

రైతుల నుంచి భిన్నస్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 13: అమరావతి నిర్మాణానికి రుణ మంజూరు నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం బుధవారం గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలు సేకరించింది. మాట్సన్ జాన్ ఆర్నే నేతృత్వంలో కుదా బిర్గిత్, డాక్టర్ కాస్ట్రో గొంజాలో, మాక్సన్ తదితరులు తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు మండలం నేలపాడులో రైతులతో సమావేశమయ్యారు. రాజధాని భూసేకరణలో అన్యాయాలు, అక్రమాలు జరిగాయని, పచ్చని పొలాలను నాశనం చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెళ్లటంతో విషయ నిర్ధారణకు ప్రపంచబ్యాంకు బృందం క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. తుళ్లూరు మండలం పర్యటించిన సందర్భంగా నేలపాడులో రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రైతు సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. రైతులు మాట్లాడుతూ రాజధాని నిర్మాణంతో ఆహారభద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదన్నారు. వ్యవసాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చామన్నారు. కేవలం 200 మంది రైతులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మి రుణ పరపతిని ఆపొద్దని వినతిపత్రాలు సమర్పించారు. 34వేల ఎకరాల భూమిలో కేవలం 4వేల ఎకరాల్లో మాత్రమే మూడు పంటలు పండుతాయి. మిగిలినవి మెట్ట్భూములు. ఐదు శాతం వరి వేశారు. 95 శాతం వాణిజ్యపంటలపై ఆధారపడి ఉన్నాయి. దీనివల్ల ఆహార భద్రతకు ఎలాంటి నష్టంలేదని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రాజకీయాల కతీతంగా సమష్టిగా రాజధాని నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారన్నారు. రైతులకు కౌలుతో పాటు రైతుకూలీలకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాజకీయ లబ్ధి కోసం స్వార్థంతో కొందరు చేసే ఫిర్యాదులు పట్టించుకోవద్దని విన్నవించారు.
కాగా భూ సమీకరణ, సేకరణను వ్యతిరేకిస్తున్న మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి, పెనుమాక రైతులు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ ముప్పుతోపాటు ఏటా మూడు పంటలు కోల్పోతున్నామని, వ్యవసాయాధారిత ప్రాంతంలో విచ్చలవిడిగా భూసమీకరణ, సేకరణ జరిపి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని వాదనలు వినిపించారు. భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఏటా 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉండవల్లిలో సీడ్ యాక్సిస్ రోడ్డు కారణంగా శ్మశానాలు కూల్చివేయాలని నిర్ణయించారని, ప్రత్యామ్నాయ మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత తెదేపా అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏమిటనే సందేహాలను వ్యక్తం చేశారు. రైతుల వాదనలు విన్న ప్రతినిధులు నివేదికను ప్రపంచబ్యాంక్‌కు సమర్పిస్తామని వెల్లడించారు. అనంతరం ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.