హైదరాబాద్

రోడ్డెక్కిన పాలీహౌస్ రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రైతు సంక్షేమమే తమ ధ్యేయం అంటూ ప్రభుత్వం పాలీహౌస్‌ల నిర్మించుకున్న రైతులకు భారీ ఎత్తున సబ్సిడీ కల్పిస్తామని చేసిన ప్రకటనలను నమ్మి మోసపోయామంటూ రైతులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లాలో రైతులకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు చెప్పిన మాటలను నమ్మి లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఉన్న ఆస్తులను అమ్ముకుని పాలీహౌస్ నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం తమకు మొండిచేయి చూపించిందంటూ బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తమను ఆదుకోకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటూ కొంతమంది రైతులు పురుగుల మందు, పెట్రోల్ డబ్బాలతో ఉద్యానవన శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడ ఆందోళన చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నేరుగా అసెంబ్లీ ముందు గన్‌పార్క్‌వద్ద బైఠాయించారు. దీనితో స్థానిక పోలీసులు విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాలంటూ వారిలోని ఐదుగురు రైతులను తమ వెంట తీసుకుని కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. రైతులు అక్కడికి వెళ్లగానే తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ కమిషనర్ కార్యాలయంలో బైఠాయించారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్లడంతో విషయం తెలుసుకున్న మిగిలిన రైతులు గన్‌పార్క్‌వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ యువనేత కార్తీక్‌రెడ్డి రైతులతోపాటు బైఠాయించడంతో పోలీసులు మండిపడ్డారు. 2015లో అప్పులుచేసి ఉన్న భూములను అమ్మేసి పాలీహౌజ్‌లు ఏర్పాటుచేస్తే తమకు రావాల్సిన సబ్సిడీ విడుదల చేయకపోవడంతో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిలతోపాటు ఉద్యానవన శాఖ అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మెట్రోరైలు చార్జీల సవరణ?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 13: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న జంటనగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సమయం దగ్గరపడుతోంది. అయితే ప్రాజెక్టు కాగితాల స్థాయిలో ఉన్నపుడు సుమారు పదిహేనేళ్ల క్రితం ప్రతిపాదించిన ఛార్జీలు ఇపుడు వర్కవుట్ అయ్యే అవకాశాల్లేకపోవటంతో ఛార్జీలను సవరించేందుకు మెట్రోరైలు సిద్దమైంది. ఇప్పటికే కనిష్ట, గరిష్ట ఛార్జీలను సవరిస్తూ పంపిన ప్రతిపాదనలు సర్కారు పరిశీలనలో ఉన్నాయి. వచ్చే నవంబర్ 28న రెండు కారిడార్లు 1,3ల్లోని సుమారు 30 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సర్కారు ఈ రెండు కారిడార్లలో పనులను పూర్తి చేసేందుకు వచ్చే నెల 15 నిర్ణీత గడువుగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు వద్దనున్న చార్జీల సవరణపై అక్టోబర్ 15 తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముంది. గతంలో రూపొందించిన డిజైల్ ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా 2007 ప్రకారం మెట్రోరైలు ఛార్జీలు కనిష్ఠంగా రూ. 8, గరిష్ఠంగా రూ. 12 గా నిర్ణయించారు. అయితే హైదరాబాద్ మెట్రోరైలు తర్వాత పనులు ప్రారంభించిన నిర్ణీత గడువు కన్నా తక్కువ సమయంలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన చెన్నై మెట్రోరైలు ఛార్జీలపై మెట్రోరైలు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కానీ అక్కడ వసూలు చేస్తున్న ఛార్జీల కన్నా తక్కువగా సవరించేలా మెట్రో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. చెన్నై మెట్రోరైలు పదికిలోమీటర్ల ప్రయాణానికి రూ. 40 వరకు టికెట్ ఛార్జీలను వసూలు చేస్తుండటం, ఇది ఒక రకంగా చెప్పాలంటే చెన్నై మహానగరంలోని సామన్య ప్రజలకు కాస్త విలువేనన్న అభిప్రాయాలు వ్యక్తం కావటంతో చెన్నై మెట్రో ఛార్జీలకు కన్నా హైదరాబాద్ మెట్రో ఛార్జీలు ఖరారు కానున్నట్లు సమాచారం.

వైశ్యులకు ఐలయ్య క్షమాపణ చెప్పాలి

ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: వైశ్యుల మనోభావాలను కించపరిచే విధంగా పుస్తకాన్ని రచించిన కంచె ఐలయ్య.. వైశ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైశ్య ఆత్మగౌరవ సమితి డిమాండ్ చేసింది. సమితి ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నామినేటెడ్ చైర్మన్లు సంపత్ కుమార్, దామోదర్ పాల్గొని మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కంచె ఐలయ్య రచనలు ఉన్నాయని, కనీస పరిజ్ఞానం లేకుండా తనో మేధావిగా ఇతర కులాలను కించపరచడం ఏమిటని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం పరస్తూ ఇతర కులాలను కించపరచడం ఐలయ్యకు తగదని అన్నారు. దేశంలో ఉంటూ ఇతర దేశాలకు మద్దత్తు పలుకుతున్న ఐలయ్య.. విద్శేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వ్యాపారం చేసుకుంటూనే సామాజాభివృద్ధికి తోడ్పడే వైశ్యులపై విషం చిమ్మడం మానుకోవాలని అన్నారు. ఐలయ్య తీరుమార్చుకొని వైశ్య జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కంచె ఐలయ్యలపై పిడి యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చకిలం రమణయ్య, శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కార్యదర్శి శశి, భగవంతరావు, లింగన్న జయరామ్ పాల్గొన్నారు.
వౌన వ్రతం
వనస్థలిపురం: వైశ్యుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన పుస్తకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్య వైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్ చౌరప్తాలో వౌన వ్రతం నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు బిజ్జాల వేణుగుప్తా, కోశాధికారి కొత్త రవి గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్య వైశ్య సంఘం మండల, బస్తీ నాయకులు పాల్గొని కంచి ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వేణు గుప్తా, రవి గుప్తా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైశ్యులు పటిష్టం చేస్తున్నారని, విదేశీ డబ్బులకు ఆశపడి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే దుర్మార్గపు ఆలోచనలతోనే వైశ్యులపై అనుచితంగా పుస్తకం రచించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా, చింతల రవి కుమార్ గుప్తా, తెరట్‌పల్లి శ్రీనివాస్ గుప్తా, నాగమణి శ్రీనివాసులు పాల్గొన్నారు.

రైతుల సంఘటితానికే సమన్వయ సమితి
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 13: రైతులను సంఘటితం చేయడానికే ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పద్మారెడ్డి గార్టెన్‌లో బుధవారం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితీల మండల, గ్రామ సభ్యులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్యఅతిథులుగా కలెక్టర్ ఎంవి రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. రైతు సమన్వయ సమితీల సభ్యులచే కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ సమన్వయ సమితుల్లో 30 శాతం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బిసిలను కలుపుకుని కమిటీలను వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సమన్వయ సమితీ సభ్యులు రైతుల ప్రతినిధులుగా పని చేస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు. మార్కెట్‌లో ఏ పంటకు డిమాండ్ ఉంది, ఏ పంటలు వేసుకోవాలి అనే విషయంపై అవగాహన పెంచుకుని సభ్యులందరు చర్చించుకుని రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పట్ల దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పారు. రైతులకు తొమ్మిది గంటల కోత లేని విద్యుత్‌ను అందిస్తుందని, రానున్న రోజుల్లో 24 గంటల విద్యుత్‌ను అందించనున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయ పథకం ద్వార చెరువులను పునరుద్ధరించటంతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ యాగ ఫలితంగా వర్షాలు పడి చెరువులు నిండి జలకళతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా ఎకరానికి రూ.4వేలు అందించటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, వైస్ ఎంపిపి గ్యార లక్ష్మయ్య, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, ఆర్డీఓ హనుమంత్ రెడ్డి తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, ఎంపిడిఓ శోభ, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అప్పిలేట్ అథారిటీ డైరక్టర్ రేసు లక్ష్మారెడ్డి, సమన్వయ సమితీ సభ్యులు నందారెడ్డి, జిల్లా సమితి సభ్యురాలు చంద్రకళ, మండల సమన్వయకర్త కొంతం అంజిరెడ్డి, సహకార సంఘం డైరక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్‌లు గాంధారి లక్ష్మినారాయణ, స్టివెన్, రమేశ్, బైనగారి నాగరాజు, కీసరగుట్ట ఆలయ కమిటీ డైరక్టర్ తరిణే మహింద్రా చారి, ఎవో శ్రీవాణి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కుమార్ పాల్గొన్నారు.

అండర్-17 వాలీబాల్ చాంప్ డిఫెన్స్ ల్యాబ్ స్కూల్

చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 13: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య అధ్వర్యంలో నగరంలో జరుగుతున్న పాఠశాలల క్రీడల్లో భాగంగా బండ్లగూడ మండల్ ఇంటర్ జోనల్ క్రీడోత్సావాలు ఫలక్‌నుమా ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో అండర్-17 బాలబాలికల వాలీబాల్ ట్రోఫీలను కాంచాన్‌బాగ్‌లోని డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది. అండర్-17 బాలుర విభాగంలో డిఫెన్స్‌ల్యాబ్ స్కూల్, శ్రీచైతన్య, తెలంగాణ కూలికుతుబ్‌షా రెసిడెన్షియల్ స్కూల్, బాలికల్లో డిఫెన్స్ ల్యాబ్ స్కూల్, శ్రీచైతన్య, శారదా విద్యాలయ జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. ఖోఖో అండర్-17 బాలురలో రోసరీ గ్రామర్ హైస్కూల్ గౌలిపుర, జ్ఞానభారతి హైస్కూల్ గౌలిపుర, ఆల్ ఖురేషి హైస్కూల్ బార్కాస్, బాలికల్లో ప్రభుత్వ హైస్కూల్ ఫలక్‌నుమా, రోసరి హైస్కూల్ గౌలిపుర, ప్రభుత్వ హైస్కూల్ పాయోనీర్ బజార్ రక్షాపురం కాలనీ జట్లు వరుస స్థానాల్లో నిలిచాయి. కబడ్డీ అండర్-17 విభాగంలో బాలుర విభాగంలో రోసరీ గ్రామర్ హైస్కూల్ గౌలిపుర, గ్రీన్‌బర్డ్ హైస్కూల్ బండ్లగూడ, ప్రభుత్వ హైస్కూల్ ఫలక్‌నుమా, బాలికల్లో రోసరి గ్రామర్ హైస్కూల్, చాంద్రాయణగుట్ట ప్రభుత్వ హైస్కూల్ జట్లు గెలుపొందాయి. అండర్-14 కబడ్డీ టోర్నమెంట్ బాలురలో రోసరి గ్రామర్ హైస్కూల్, జిహెచ్‌ఎస్ జంగమ్మెట్, తెంలగాణ కులీకుతుబ్‌షా రెసిడెన్షియల్ స్కూల్, వాలీబాల్‌లో బాలురలో శ్రీచైతన్య స్కూల్, చాంద్రాయణగుట్ట హైస్కూల్, ప్రోబెల్స్ హైస్కూల్ ఇంజన్‌బౌలి, బాలికల్లో డిఫెన్స్ ల్యాబ్, శ్రీచైతన్య, చాంద్రాయణగుట్ట ప్రభుత్వ హైస్కూల్, ఖోఖో బాలురలో రోసరీ గ్రామర్ స్కూల్, తెలంగాణ కులీకుతుబ్‌షా రెసిడెన్షియల్ స్కూల్, బాలికల్లో ప్రభుత్వ హైస్కూల్ ఫలక్‌నుమా, జిజిహెచ్‌ఎస్ పాయోనీర్, రోసరీ గ్రామర్ హైస్కూల్ జట్లు వరుస స్ధానాల్లో నిలిచాయి. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జంగమ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ రేహమాన్ విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీలు, సర్ట్ఫికెట్‌లను అందజేశారు. బండ్లగూడ మండలం డిప్యూటీ విద్యాశాఖాధికారి డి.సురేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య బండ్లగూడ మండల స్పోర్ట్స్ కన్వీనర్ కె.వెంకట స్వామి, ఉపాధ్యాయులు పి.జగన్‌మోహన్ గౌడ్, విజయ్‌భాస్కర్, జబ్బర్, రంజిత్ రెడ్డి, డి.గిరివర్దన, బాలి, మాధవ రావు, వరలక్ష్మీ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్‌ను నిర్మిద్దాం
చిక్కడపల్లి, సెప్టెంబర్ 13: స్వఛ్ఛ భారత్‌లో భాగస్వాములవుతూ స్వచ్ఛ హైదరాబాద్‌ను నిర్మించుకుందామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం ముషీరాబాద్‌లోని పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. భోలక్‌పూర్‌లోని ఇంద్రానగర్ సెకండ్ వెంచర్‌లో కమ్యూనిటీ హాల్, మహమ్మద్ నగర్‌లో పబ్లిక్ టాయిలెట్స్‌తో పాటు కవాడిగూడలోని సింగారికుంట జిహెచ్‌ఎంసి గ్యారేజీలో నిర్మించిన టాయిలెట్స్‌ను ప్రారంభించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం కూడా వ్యక్తిగతంగా నిర్మించుకునే మరుగుదొడ్లకు ప్రతి యూనిట్‌కు రూ.12 వేలు చెల్లిస్తోందని వివరించారు. అక్టోబర్ 2 వరకు పేద బస్తీలలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణం, మరుగుదొడ్లు వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అఖిల్, జిహెచ్‌ఎంసి ఇఇ లక్ష్మీనారాయణ, డిఇ నామ్యా నాయక్, ఎఇలు పర్వతాలు, తిరుపతి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి శంకర్, బిజెపి ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ రమేష్‌రామ్, రాష్ట్ర నాయకులు సికె శంకర్, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు.