ఖమ్మం

తెలంగాణ ఉద్యమకారులకు పదవులిచ్చి గౌరవిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంమలో పనిచేసిన నాయకులకు ప్రభుత్వ పదవులు ఇచ్చి గౌరవిస్తామని డెప్యూటి సిఎం మహమూద్ ఆలీ, రాష్ట్ర రోడ్లు, భవనాలు, శిశుసంక్షేమశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మన్‌గా నియమితులైన దిండిగాల రాజేందర్ ప్రమాణస్వీకార కార్యక్రమం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఖమ్మంజిల్లాలో గోదావరి జలాలను పారించి రైతుల బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు 8వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా తిరుమలాయపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. రాష్ట్రంలోని 31జిల్లాల్లో రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యాదాద్రి దేవాలయం తరహాలో భద్రాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు
అవసరమైన విద్యుత్ అవసరాలను మెరుగుపర్చేందుకు భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టామని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం విజయం కోసం కార్యకర్తలంతా శ్రమించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధి కోసం నూతన కమిటీ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఖమ్మం వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ, కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ పులిగీత, టిఆర్‌ఎస్ నాయకులు తాళ్ళూరి వెంకటేశ్వరరావు, అబ్థుల్ నబీ, సిద్దులు, మనే రామకృష్ణ, సోమయ్య, జక్కంపూడి కృష్ణమూర్తి, గ్రంధాలయ కమిటీ డైరెక్టర్లు బానోత్ కేస్లీ, మోరె భాస్కర్, అక్కిరాజు గణేష్, దుద్దుకూరి సీతారాం తదితరులు పాల్గొన్నారు.

భూప్రక్షాళనపై ప్రశ్నల వర్షం
* పారిశుద్ధ్య పనలుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
చింతకాని, సెప్టెంబర్ 25: గ్రామ సమస్యలపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి దాసరి సామ్రాజ్యం ఆధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ముందుగా ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో గ్రామాలలో ప్రభలుతున్న జ్వరాలపై సర్పంచ్‌లు, ఎంపిటీసిలు ధ్వజమెత్తారు. ప్రత్యేక ఆరోగ్య శిభిరాలు ఎందుకు ఎర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఆరోగ్య కేంద్రాలను ఎర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు ఎంపిడిఒ దృష్టికి తీసుకవచ్చారు. భూప్రక్షాళన కార్యక్రమం వలన గ్రామాలలో రైతులు ఆందోళన చెందుతున్నారని, సర్వేచేసే విధానం రైతులకు అర్ధం కావడం లేదని లచ్చగూడెం ఎంపిటిసి గోవిందరావు ప్రశ్నించారు. భూ ప్రక్షాళనపై ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం గ్రామాలలో భూసర్వే కార్యక్రమం జరుగుతున్నదని, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నాయకులు, రైతులు సహకరించాలని తహశీల్ధార్ శ్రీనివాసరావు కోరారు. సర్వే పారదర్శకంగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. సర్వే చేస్తున్న విధానాన్ని ప్రజాప్రతినిధులకు వివరించారు. పారిశుద్ధ్య పనులపై ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎంపిడిఓ నవాబ్‌పాషా సమాదానం ఇచ్చారు. గ్రామాలలో ప్రణాళికల ప్రకారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిరంతరం గ్రామాలలో అవసరమున్న చోట పారిశుద్ధ్య కార్యక్రమాలు చెపడుతన్నారని తెలిపారు. పంచాయతీ అధికారులు ఆశించిన స్థాయిలో సహకరిండం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఎంపిడిఒ దృష్టికి తీసుకవచ్చారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపిడిఒ పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలో జరుగుతున్న పలు అభివృద్దిపనులపై వివిధ శాఖల అధికారులతోసమీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటీసిలు, పంచాయితీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* డెప్యూటీ సిఎం మహముద్ అలీ
ఇల్లెందు, సెప్టెంబర్ 25: ముస్లీం మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఇల్లెందులో జరిగిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నారని ఎన్నాడూలేని విధంగా ముస్లీం పర్వదినాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ముస్లీం మైనార్టీలకు ప్రభుత్వం అండగా ఉన్నందున ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నారు. సింగరేణి ఎన్నికల్లో టిబిజికెఎస్ విజయం కోసం సహకరించాలన్నారు. గుర్తింపు ఎన్నికలలో టిబిజికెఎస్ విజయం సాధిస్తేనే కార్మికవర్గానికి మేలు జరుగుతుందన్నారు. సదస్సులో ఆర్‌అండ్‌బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ బుడన్‌బేగ్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మడత రమాదేవి, గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, నాయకులు మడత వెంకట్‌గౌడ్, కనగాల పేరయ్య, సిలివేరు సత్యనారాయణ, అక్కిరాజు గణేష్, జానీపాషా తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్‌పై దాడికి ఉద్యోగుల నిరసన
ఇల్లెందు, సెప్టెంబర్ 25: పట్టణంలో ఫ్లెక్సీల తొలగింపు వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. సోమవారం ఉదయం కమిషనర్ రవిబాబు ఇంటిపై టిఆర్‌ఎస్ కౌన్సిలర్ జానీ, పార్టీకి చెందిన నాయకులు కమీషనర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించడం పట్ల ఆగ్రహించిన నేతలు కమిషనర్‌పై దాడిచేశారు. డెప్యూటీ సిఎం మహమూద్ అలీ రాక సందర్భంగా పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వాటిని ఉద్దేశ్యపూర్వకంగానే కమిషనర్ తొలగించారని టిఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. అటువంటిది ఏమీలేదని పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తొలగిస్తున్నామని, విధి నిర్వహణలో భాగంగానే చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే తన ఇంటిపై దాడిచేసి తనను కొట్టారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ అధికారులకు కమిషనర్ ఫిర్యాదు చేశారు. కాగా తాము కమిషనర్‌పై దాడి చేయలేదని, ప్రశ్నించడమే జరిగిందని దానిని కమిషనర్ వక్రీకరించాలని చూస్తున్నారని టిఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇదిలావుండగా కమిషనర్‌కు మద్దతుగా ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరించారు. వివిధ ప్రాంతాలలో ఉన్న చెత్తను ప్రధాన రహదారిపై వేసి నిరసన వ్యక్తం చేశారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఘనంగా దేవీనవరాత్రి ఉత్సవాలు
ఏన్కూర్, సెప్టెంబర్ 25: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గత ఐదు రోజులుగా దేవి నవరాత్రి, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తూతకలింగన్నపేట, ఏన్కూర్, తిమ్మరావుపేట, నాచారం, గార్లఒడ్డు తదితర గ్రామాల్లో ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కొన్ని గ్రామాల్లో అందంగా మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టంపజేశారు. సాయంత్రం సమయంలో చిన్నారు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సహభరితంగా జరుపుకుంటున్నారు.

నేటి అలంకారం విజయలక్ష్మి
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 25: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని లక్ష్మితాయారు అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జ్ఞానేశ్వరి.. విజయప్రధా అని కీర్తిస్తారు పరాశరభట్టార్ వారు. విజయం అంటే కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు. అన్ని రంగాల్లో కూడా విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మను సేవిస్తే అన్ని రంగాల్లో కూడా విజయం ప్రసాదిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మను సేవిస్తే ఆయా రంగాలలోని వారికి సునిశతమైన జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా వారిని విజయులను చేస్తుంది. అన్నింటా మనకు విజయాన్ని అనుగ్రహించడానికై మహాలక్ష్మి విజయలక్ష్మిగా సాక్షాత్కరిస్తోంది.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి తుమ్మల
దమ్మపేట, సెప్టెంబర్ 25: గెలుపే లక్ష్యంగా కెటిపిఎస్ ఎన్నికల్లో పని చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మండల పరిధిలోని గండుగులపల్లిలో సోమవారం తుమ్మలను 1535 విద్యుత్ సంఘం రాష్ట్ర అద్యక్షుడు వజీర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల మట్లాడుతూ రాబోయే గుర్తింపు సంఘ ఎన్నికలలో సత్తా చాటాలని కోరారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిన ముఖ్యమంత్రి కేసీర్‌కు గెలుపు కానుక ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. కేటీపీఎస్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కష్టపడి పనిచేసి విజయం సాధించాలన్నారు. త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సహకరించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొర్రా వెంకటనాయక్, కోసాధికారి పుట్టా నాగేస్వరావు, అంబాల శ్రీను తది తరులు పాల్గొన్నారు.

గంగారంలో ఉచిత వైద్యశిబిరం
ములకలపల్లి, సెప్టెంబర్ 25: మంగపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పాతగంగారంలో సోమవారం వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షలకు గ్రామాలను నలుమూలల నుండి వచ్చిన 192 మంది ప్రజలకు డాక్టర్ ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో పనె్నండు మందికి విషజ్వరాలు వున్నట్లు గుర్తించారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధిగా దోమతెరలు ఉపయోగించాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఎస్‌ఈఒ వెంకటేశ్వరరావు, ఎఎన్‌ఎంలు అనిత, జ్యోతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
దుమ్ముగూడెం, సెప్టెంబర్ 25: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు సోమవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మినగరంలోని దాసాంజనేయస్వామి ఆలయం, నడికుడి గ్రా మంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మినగరం గ్రామంలోని అమ్మవారి ఆలయంలో సుమారు రూ.40వేల విలువజేసే అమ్మవారి మూల విరాట్‌లను ఇచ్చిన రాజమండ్రికి చెందిన నవకోటి వెంకటదుర్గారావు, శేఖర్, శాలీని దంపతులు, సురేష్, సరస్వతి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆరుట్ల రాజగోపాలాచార్యులు, ఆరుట్ల నారాయణాచార్యులు, శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ పూ జా కార్యక్రమాలు జరిగాయి. ఎంపిడివో ఎస్.రమాదేవి లక్ష్మినగరంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వి.బుజ్జి. నటరాజస్వామి, నాగేంద్రరెడ్డి, తాతారావు, అప్పలరెడ్డి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల్లో దోమల మందు పిచికారి
పినపాక, సెప్టెంబర్ 25: మండల పరిధిలో జానంపేట, దుగినేపల్లి పంచాయతీ పరిధిలో పదిహేను గ్రామాల్లో సోమవారం దోమల మందును పిచికారి చేసినట్లు మలేరియా అధికారులు, గ్రామసర్పంచ్ ముత్తయ్య తెలిపారు. గడిచిన పదిరోజుల నుంచి వరి చేలకు పురుగు మందులు రైతులు అధికంగా పిచికారి చేయడం వలన గ్రామల్లోకి దోమల వచ్చి చేరడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్యుల సలహా మేరకు అన్ని గ్రామాల్లో దోమల మందును స్ప్రే చేయడం జరిగిందని సర్పంచ్ ముత్తయ్య తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాదారులపై కేసు నమోదు
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 25: బూర్గంపహాడ్ మండలంలోని బుడ్డగూడెం గ్రామంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు బూర్గంపహాడ్ ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో బుడ్డగూడెం గ్రామం నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న ఎస్సై ఇసుక తరలిస్తున్న ఎపి20ఎక్స్ 8474 నెంబరు గల ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ యజమాని సపావత్ శంకర్ మరియు మరో ఇద్దరు కూలీలను అరెస్టు చేసినట్లు అయన తెలిపారు.
రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన పెద్దమ్మతల్లి
పాల్వంచ, సెప్టెంబర్ 25: శ్రీదేవి శరన్నవరాత్రోత్సవంలో భాగంగా పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం ఆలయ ఈఒ ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సుహాసిని పూజ, యాగశాలలో చంఢీ హోమం లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో 5వ రోజు పెద్దమ్మతల్లి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.