సబ్ ఫీచర్

చేటు చేస్తున్న చెత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో రోజురోజుకు చెత్త పెరిగిపోతోంది. ముఖ్యంగా వేల సంవత్సరాలైనా పూర్తిగా ధ్వంసం కాని ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. ఇక రోజువారీగా ఇళ్లనుంచి బయటపడుతున్న చెత్త తక్కువేమీ కాదు. కాలుష్యానికి, రోగాల వ్యాప్తికి ఇదే కారణం. ప్రపంచం నెత్తిన పెద్దమొత్తాల్లో వ్యర్థ పదార్థాలను కుమ్మరిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. స్వచ్ఛ్భారత్ వంటి కార్యక్రమాలు వచ్చిన తరువాత కాస్తంత మార్పు కనిపిస్తున్నా మనం పడేస్తున్న చెత్తతో పోలిస్తే తొలగిస్తున్నది అసలు లెక్కలోకి రాదు. ప్రతిరోజు మన దేశంలో ప్రజలు పడేస్తున్న వ్యర్థ పదార్థాలు, చెత్త కనీసం 45 మిలియన్ టన్నుల మేరకు ఉంటుందంటే నమ్మాలి. చెత్తను విడదీసే ప్రక్రియ ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువే. ఎటువంటి ట్రీట్‌మెంట్ చేయని చెత్త మనదగ్గర రోజూ 30 లక్షల ట్రక్కుల లోడు మేరకు ఉత్పత్తి అవుతోంది. కేవలం మునిసిపల్ సిబ్బంది సేకరిస్తున్న చెత్తకు సంబంధించిన లెక్కలు ఇవి. ఇక పరిగణనలోకి రాని లెక్క సంగతి చెప్పలేం. ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తించవలసి ఉంది. పేదవారు పడేస్తున్న చెత్తకన్నా రెట్టింపు స్థాయిలో సంపన్నులే వ్యర్థ పదార్థాలను, చెత్తను బయటపడేస్తున్నారు. ఇది అధ్యయనాల్లో తేలిన నిజం. భారత్‌లో లక్షా 33వేల 760 టన్నుల చెత్త రోజూ బయటపడుతోంది. స్వచ్ఛ్భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా 62వేల కోట్ల మేరకు నిధులు ఖర్చు పెడుతోంది. కేవలం చెత్త తొలగించడానికి ఇన్ని కోట్ల ప్రజాధనం వెచ్చించాల్సి వస్తోంది. నిజానికి ప్రజల్లో చైతన్యం వచ్చి చెత్త నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వ్యర్థాలు, చెత్తను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇందాక చెప్పుకున్నట్లు దేశంలో లక్షా 33 వేల టన్నుల చెత్త వీధుల్లో పడుతుంటే అందులో కేవలం 91 వేల టన్నుల చెత్తను మాత్రమే తొలగించగలుగుతున్నారు. అందులో 25వేల టన్నుల మేరకు చెత్తను శుభ్రం చేయగలుగుతున్నారు. నిజానికి చెత్త లేకుండా చూడటంలో, ఉన్న చెత్తను తొలగించడం, శుభ్రం చేయడంలో సిక్కిం, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో రోజుకు కేవలం 25 టన్నుల చెత్త బయటపడుతుంది. కేవలం 40 ట్రక్కుల లోడు మేరకు చెత్త తొలగించవలసి వస్తోంది. ఈ రాష్ట్రం చేపట్టిన చర్యలు మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిజానికి చెత్త మన ఇళ్లలోనే కాదు, సముద్రాల్లోనూ చేరుతోంది. చివరకు ఎవరెస్ట్ అంతటి ఎతె్తైన పర్వతాలపైనే ఉంటోంది. అంతరిక్షంలో మనవల్ల చేరుతున్న వ్యర్థాలకు లెక్కేలేదు. ఎవరెస్ట్ వంటి పర్వతాలపై పర్వతారోహకులు పడేస్తున్న ప్లాస్టిక్ సీసాలవంటివి పేరుకుపోతున్నాయి. అక్కడ చేరిన చెత్తను తొలగించేందుకు షెర్పాలు కిలోకు రెండు డాలర్ల మొత్తాన్ని అడుగుతారు. నిజానికి చాలామంది పర్వతారోహకులు తమ తీసుకువెళ్లిన చెత్తను తిరిగి తొలగించేందుకు సిద్ధంగానే ఉంటారు. కానీ ఒక్కోసారి వాతావరణం అనుకూలించదు. పల్లెల్లోకన్నా పట్టణాలు ఎక్కువగా వ్యర్థాలను విడిచిపెడుతున్నాయి. నిజానికి వ్యర్థాలను వినియోగించి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి, మరికొన్ని వస్తువులను తయారు చేయవచ్చు. అయితే సామాజిక స్పృహ, బాధ్యత ప్రజల్లో పెరిగితేనే ఇది సాధ్యం. రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తున్నవారు పడేసే చెత్తను మనం చూస్తునే ఉంటాం. కానీ అలా ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని చెబితే వినేవారు తక్కువ. ప్లాస్టిక్ బదులు వస్త్ర, కాగితం వస్తువులను వాడటం ఇప్పుడు తక్షణ అవసరం. వాడి పడేసే ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువుల జోలికి వెళ్లకపోవడం మరో మంచి పని. కొబ్బరి చిప్పలు, పుచ్చకాయ డిప్పలు, అరటిపళ్ల తొక్కలతో కండోమ్స్, శానిటరీ నేప్‌కిన్స్ వంటి కలపి పడేయకుండా ఉండటం అత్యవసరం. ఏటా వ్యవసాయానికి మనం ఈ చెత్తనుం 5.4 మిలియన్ టన్నుల ఎరువులను అందించే అవకాశం ఉంది. చైనాలో చెత్తను, వ్యర్థాలను శుభ్రం చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లు 150 ఉంటే మన దేశంలో కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి. మనం పడేస్తున్న చెత్తలో 32,890 టన్నుల చెత్తను ఉపయోగించి 439 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఆధునిక జీవన విధానంలో వ్యర్థాలు, చెత్త ఉత్పత్తికాక తప్పదు. దాని పరిమాణం తగ్గేలా చూడటం, మళ్లీ దానిని ఉపయోగించుకునేలా చూడటం మన బాధ్యత. లేనిపక్షంలో ఆ చెత్త మన జీవితాలను నాశనం చేయడం ఖాయం.

-రవళి