గుంటూరు

తాగునీటి సమస్యపై స్పందించని అధికారుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 12: తాగునీటి సమస్యను అధిగమించేందుకు కలెక్టర్ కాంతిలాల్ దండే నిధులు కేటాయించినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోక పోవటంతోప్రజలు పీపా నీటికి రూ. 200 చెల్లిస్తున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించటంతో ప్రారంభమైన చర్చ ఆర్‌డబ్ల్యూఎస్ ఇఇ, డిఇ, ఎఇలను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వేసవిలో నీటి ఎద్దడి అధిగమించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వాడివేడిగా చర్చ జరిగింది. సమావేశానికి చైర్‌పర్సన్ జానీమూన్ అధ్యక్షత వహించగా, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కలెక్టర్ కాంతిలాల్ దండే, జెడ్పీ సిఇఒ సుబ్బారావు తదితరులు వేదికపై ఆశీనులైయారు. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులకే దిక్కులేదంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయటంతో మంత్రి ప్రత్తిపాటి జోక్యం చేసుకుని ఆర్‌డబ్ల్యూఎస్ ఇఇ జి శర్మను వివరణ కోరారు. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో 20 బోర్లు వేసినట్లు వెల్లడించటంతో తనతో వచ్చి చూపించాలంటూ ఎమ్మెల్యే పినె్నల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి ప్రత్తిపాటి ఆవేశంగా ఇఇ, డిఇ, ఎఇలను నరసరావుపేట ఆర్డీవో విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. మంత్రి రావెల కిషోర్‌బాబు ఇదే అంశంపై మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి వర్గీయులు అధికంగా మాచర్ల ప్రాంతంలో తాగునీటికి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నప్పటికీ అధికారులు ప్రణాళికయుతంగా ముందుకు సాగటంలేదని ఆరోపించారు. 20 ట్యాంకర్ల నీరు సరఫరా చేయమని కోరితే 3 ట్యాంకర్లు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. తాగునీటి సమస్య అధిగమించేందుకు జిల్లాస్థాయిలో ప్రత్యేకాధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి మాట్లాడుతూ నియోజకవర్గంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ ఉప్పునీరు కావటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ సింగర్ చెరువు ఎండి పోయినందున లక్ష మంది జనాభా తాగునీటి ఎద్దడికి గురవుతున్నారని తెలిపారు. అందువల్ల అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తాగునీటి అవసరాలకు 8 టిఎంసిల నీరు అవసరం ఉన్న దృష్ట్యా మంత్రులు దృష్టిసారించాలన్నారు. బొల్లాపల్లి మండలంలో తండాల్లో ఎస్‌సి, ఎస్‌టిలు నివసిస్తున్న ప్రాంతాలు గుర్తించి మంత్రి రావెల నిధులు మంజూరు చేయాలన్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారి నియమించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలన్నారు. పుష్కరాల వౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చించాలన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రుణమాఫీ చేసే సమయంలో ఆధార్ కార్డుకు లింకు పెట్టటంతో అందులో దొర్లిన తప్పుల కారణంగా బ్యాంకులో రుణమాఫీ జరగడం కష్టంగా ఉందన్నారు. అధికారులను రుణమాఫీ జాబితా కోరినప్పటికీ ఇవ్వటంలేదని ఆరోపించారు. బోగస్ సొసైటీలు ఉన్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరగా కలెక్టర్ కాంతిలాల్ దండే సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మేడికొండూరు మండలంలో మూడు బ్రిడ్జిల నిర్మాణం వలన రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ మాచర్ల, వెల్దుర్తి, రేపల్లె, దుర్గి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. వాటి భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పొన్నూరు జడ్పీటీసీ కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్‌సి కార్పొరేషన్‌లో మంజూరైన రుణాలు పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల నుంచి ఎండిఓ రూ 10 వేలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. నీరు-చెట్టు కింద ములుకుదురు గ్రామంలో రూ 70 లక్షల అవినీతి జరిగిందంటూ మంత్రి ప్రత్తిపాటి దృష్టికి తీసుకువెళ్లారు. చర్యలు తీసుకోని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. మాచర్ల జడ్పీటిసి ఎస్ గోపిరెడ్డి మాట్లాడుతూ తండాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీటి ట్యాంకర్లు సరిగా రావటం లేదన్నారు. మంత్రి ప్రత్తిపాటి స్పందిస్తూ అధికారులు జియో ట్యాగింగ్ పద్ధతి అనుసరించాలన్నారు. అమృతలూరు జడ్పీటిసి పృధ్వీలత మాట్లాడుతూ పేపర్రు గ్రామంలో తాగునీరు పచ్చగా వస్తోందని, ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. చుండూరు ఎంపిపి ఉయ్యూరు అప్పిరెడ్డి మాట్లాడుతూ ఏడాది గడుస్తున్నా పంప్ హౌస్ కనెక్షన్ ఇవ్వలేదని అధికారిపై ఆరోపణ చేశారు. మంత్రి ప్రత్తిపాటి స్పందిస్తూ సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు మాట్లాడుతూ వాగులు ప్రవహించే ప్రదేశం, ఎత్తిపోతల పథకాలు ఉన్న చోట్ల చెక్ డ్యామ్‌లు నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ మాట్లాడుతూ రేపల్లె, బాపట్ల నియోజవర్గాలపై అధికారులు తీవ్ర వివక్ష చూపిస్తున్నారని, బాపట్ల, కర్లపాలెం మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించక పోవటం బాధాకరమన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దాచేపల్లి జడ్పీటిసి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ తంగెడ రేవును పుష్కరాల సందర్భంగా అభివృద్ధి చేయాలన్నారు. జన్మభూమి గ్రామకమిటీల్లో ఎవరి ప్రమేయం లేకుండా సభ్యులను మార్చారని ఆరోపించారు. పెదకూరపాడు జడ్పీటిసి షేక్ మస్తాన్ షరీప్ మాట్లాడుతూ అమరావతి ఇరిగేషన్ మేజర్ పనులు నాణ్యత లేకుండా జరుగుతున్నందున సంబంధిత ఎఇని సమావేశాలకు రమ్మని 3 సార్లు పిలిచిన రాలేదన్నారు. దీనిపై మంత్రి ప్రత్తిపాటి స్పందిస్తూ ఎఇని సస్పెండ్ చేయాలన్నారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి విలేఖరులతో మాట్లాడుతూ రూ 24.66 కోట్లతో తాగునీటి సమస్య అధిగమించేందుకు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. ఎక్కడైనా తాగునీటి చెరువులు నిండని పక్షంలో తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. తాగునీటి సరఫరాకు నిధుల కొరత లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనంద్‌బాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అనధికార నిర్మాణాలు చేపడితే చర్యలు
గుంటూరు (కార్పొరేషన్), ఫిబ్రవరి 12: భవన నిర్మాణాల కోసం గుంటూరు నగరపాలక సంస్థ అనుమతించిన ప్లాన్ ప్రకారంగానే నిర్మాణాలు చేపట్టాలని లేని పక్షంలో చర్యలు తప్పవని కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. నగరంలో ఉద్యోగనగర్ శివారు ప్రాంతం, ఎస్‌వి ఎన్ కాలని, కలెక్టర్ బంగ్లా వెనుక తదితర ప్రాంతాలో శుక్రవారం ఆమె పర్యటించి భవన నిర్మాణ ప్లాన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి పట్టణప్రణాళికాధికారులనుద్దేశించి మాట్లాడుతూ అనధికార భవన నిర్మాణాలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. అలాగే నిర్మాణంలో ఉన్న భవనాల ముందు ప్లాన్ కాపీని ప్రదర్శించాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో భాగంగా జాతీయరహదారి చిలకలూరిపేట మీదుగా చుట్టుగుంట నుండి పేరేచర్ల వైపు వెళ్లే రోడ్లలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ యేసుదాసు, ఎస్ ఇ గోపాలకృష్ణారెడ్డి, ఈ ఈ రాంనాయక్, ఎంహెచ్ ఓ నాగేశ్వరరావు, బయాలజిస్టు వీర్రాజు, సిపి ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

5.4కోట్లతో జెడ్పీ మిగులు బడ్టెట్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 12: జిల్లా పరిషత్ 2015-16 సవరణ బడ్జెట్, 2016-17 అంచనా బడ్జెట్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం చైర్మన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన జరిగింది. జిల్లా పరిషత్ ఇన్‌చార్జ్ ఎవో రవిచంద్రారెడ్డి బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టారు. జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్‌ను రెండు విధాలుగా చూపారు. 2015-16 ఆర్థిక ఏడాది మార్చి 31తో ముగియనుంది. దాంతో మిగిలిన కాలానికి సవరణ బడ్జెట్ రూపొందించారు. ఏప్రిల్ 1నుంచి 2016-17 ఆర్థిక ఏడాది ప్రారంభమవడంతో అంచనా బడ్జెట్‌ను తయారు చేశారు. 2016-17లో అంచనా బడ్జెట్‌లో రాబడులు, ఆదాయం రూ.588.71 కోట్లువస్తాయని అంచనావేశారు. వ్యయం, ఖర్చులు రూ.583.06 కోట్లు కాగా మిగులు బడ్జెట్ కింద రూ.5.64 కోట్లు చూపించారు. 2015-16 సవరణ బడ్జెట్‌లో ఆదాయం రూ. 365.02 కోట్లు ఉండగా 353.77 కోట్లు వ్యయంగా పేర్కొన్నారు. 2016-17 సంబందించి అంచనాబడ్జెట్‌లో అదనంగా రూ.223.69 కోట్లు వృద్ధి అయినట్లు వివరించారు.

ఎయర్‌గన్స్‌తో నీటిఎద్దడిపై యుద్ధం

తెనాలి రూరల్, ఫిబ్రవరి 12: ప్రస్తుత తరుణంలో అపరాల సాగులో నీటి ఎద్దడిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు రెయిన్ గన్ సేవలను వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం అదనపు డైరెక్టర్ పి సుశీల పేర్కొన్నారు. మండలంలోని నేలపాడు పంచాయతీ పరిధిలో తెనాలికి చెందిన రైతు తోట చినవెంకటేశ్వర్లు పొలంలో మినుము పంటపై శుక్రవారం రెయిన్‌గన్ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా సుశీల మట్లాడుతూ ఏపి ఎంఐపి ఆధ్వర్యంలో సన్న, చిన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీపై రెయిన్‌గన్‌ను అందజేస్తారన్నారు. మార్చి మాసం నుండి ఈపథకం విస్తృతంగా అమలులోకి వస్తుందన్నారు. దీని ధర 28వేలు కాగా రెయిన్ గన్‌తోపాటు 500అడుగుల పైపులు ఉచితంగా అందజేయ టం జరుగుతుందని కేవలం 10శాతం మాత్రమే రైతులు ఖర్చులు భరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరుశాతం సబ్సిడీపై రెయిన్ గన్ ఇస్తారు. పంట ఎండకుండా కష్టకాలంలో సాగు పూర్తికావడానికి రెయిన్‌గన్ దోహదపడుతుందని రైతులకు వివరించారు. అంతేగాకుండా పంట దిగుబడులు అదనంగా మూడు బస్తాల వరకు వస్తాయని చెప్పారు. పూతకు ముందు రెయిన్‌గన్‌తో నీరు అందిస్తే చాలునని తెలిపారు. రైతులు ఈపథకాన్ని ఉపయోగించుకోనేలా అధికారులు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటిసి అన్నాబత్తుని జయలక్ష్మి, వ్యవసాయశాఖ గుంటూరు ఉపసంచాలకులు వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్ ఎడిఏ అక్తర్ హుస్సేన్, ఎఓలు పి వెంకటనర్సయ్య, విజయబాబు, ప్రేమ్ సాగర్, ఎఇఓలు రమేష్‌బాబు,అనిల్, వెంకటరమణ, ఎంపిఇఓలు, రైతులు పాల్గొన్నారు.

జనజాగృతికి మహోదయం పలికే రచనలు అందించండి

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 12: సామాజిక సమస్యలను ప్రధాన అంశాలుగా చేసుకుని, ప్రజలందరికీ మేలు చేకూర్చేలా, జనజాగృతికి మహోదయం పలికేలాగా నిర్ధిష్టమైన, తులనాత్మక ఆలోచనా విధానంతో, చక్కటి, చిక్కటి, వెచ్చటి రచనలు అందించాలని సాహితీరంగ ప్రముఖుడు శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం (హైదరాబాద్) రచయితలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై కవి, రచయిత డాక్టర్ రామడుగు వెంకటేశ్వరశర్మ స్వయంగా తాను ఏర్పాటుచేసిన ఈ యేటి సాహితీ పురస్కారాన్ని పార్వతీశంకు అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విశ్వజనని పత్రికా సంపాదకుడు పిఎస్‌ఆర్ ఆంజనేయప్రసాద్ అధ్యక్షత వహించారు. సత్కార గ్రహీత పార్వతీశం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నేటి రచయితలు కూడా సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడే రచనలు అందించాలని కోరారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వరశర్మకు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షత వహించిన పిఎస్‌ఆర్, జ్యోతి ప్రజ్వలన చేసిన వెంకటేశ్వరస్వామి దేవాలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, స్వాగతోపన్యాసం చేసిన శ్రీనివాసుల రఘురామ్, ఎస్‌బిఐ మేనేజర్ కె విద్యాసాగర్, జిల్లా రచయితల సంఘం కార్యదర్శి ఎస్‌ఎం సుభాని, జి కూర్మనాథస్వామి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ తదితర ప్రముఖులు పార్వతీశం దంపతులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి పురస్కారం అందజేసి ఆయన సేవలను కొనియాడారు.

భక్తి శ్రద్ధలతో సరస్వతీ మహాయజ్ఞం

అమరావతి, ఫిబ్రవరి 12: స్థానిక సరస్వతీ శిశుమందిరంలో శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతీమాత విగ్రహం వద్ద యాజ్ఞిక బ్రహ్మ పరాశరం రామకృష్ణమాచార్యు లు సరస్వతీ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం 20 మంది చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో శిశుమందిరం ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శివపార్వతి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. శిశుమందిరం కమిటీ అ ధ్యక్షుడు పులిపాటి వెంకట పవన్‌కుమార్ చిన్నారులకు పలకలు, బలపాలతో పాటు సరస్వతీమాత చిత్రపటాల ను అందజేశారు. కార్యక్రమంలో శిశుమందిరం కమిటీ సభ్యులు సూరెడ్డి గాంధీ, శరణం జనార్ధనరావు, చిన్నారు ల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే మండల పరిధిలోని మునగోడు, మల్లాది జెడ్పీ హైస్కూళ్లలో కూడా సరస్వతీమాత విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా వసంతపంచమి వేడుకలు నిర్వహించుకున్నారు.

హనుమంతప్పకు ఘన నివాళి

గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 12: తెగువ, సాహసం, మొక్కవోని దృడసంకల్పంతో తుదిశ్వాస విడిచే వరకు పోరాడి అమరుడైన హనుమంతప్ప అవగాహన సంస్థ సభ్యులు ఘన నివాళులర్పించారు. శుక్రవారం అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో హనుమంతప్ప తదితర అమరవీరుల సంతాపసభకు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు ఎంవి రమణరావు అధ్యక్షత వహించారు. సభలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ తుది శ్వాసవిడిచే వరకు హనుమంతప్ప ప్రదర్శించిన అసాధారణ స్ఫూర్తి, పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. విద్యావేత్త ఆర్‌వి సింగరయ్య మాట్లాడుతూ లాన్స్ నాయక్ హనుమంతప్ప మరణించడం దేశంలో విషాదాన్ని నింపిందన్నారు. సమావేశంలో జాతీయ జెండాలు చేతబూని హనుమంతప్పా అమర్హ్రే అంటూ నివాళులర్పించారు. బిసి సంక్షేమ సంఘం నాయకులు పాశం రవీంద్రయాదవ్, వెంకటేశ్వరర్డె, కె జయకుమార్ పాల్గొన్నారు.

ముమ్మరంగా శనగ నూర్పిడి

పెదనందిపాడు, ఫిబ్రవరి 12: మండల పరిధిలో శనగ నూర్పిడిలు ముమ్మరమయ్యాయి. ఈ ఏడాది మండల పరిధిలో 2,580 హెక్టార్లలో శనగపంట వేశారు. ధర అంతంతమాత్రంగా ఉండటంతో పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయోరావోనని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ముదురు శనగ ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటా ఒక్కింటికి 4 వేల రూపాయల ధర పలుకుతుంది. కౌలు, ఖర్చులు పోతే మిగిలేది స్వల్పమాత్రంగా ఉండటంతో రై తులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా శనగపంటకు పూర్తిస్థాయిలో మద్దతుధర ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

టైల్‌పాండ్‌ను సందర్శించిన ఇంటెలిజెన్స్ అధికారులు
రెంటచింతల, ఫిబ్రవరి 12: కృష్ణానదిపై సత్రశాల్లో నిర్మించిన టైల్‌పాండ్ ప్రాజెక్టును శుక్రవారం హైదరాబాద్ నుండి వచ్చిన ఇంటెలిజెన్స్ అధికారులు సందర్శించారు. ఈ ప్రాజెక్టుపై ఉంచిన భద్రతా సిబ్బంది ఎంత వరకు దీనిని కాపాడగలరనే దానిపై చర్చలు జరిగాయి. భద్రతా సిబ్బందికి ఆయుధాలు లేకపోవడంతో ఆయుధాలు ఇచ్చేదానిపై చర్చ జరిపామన్నారు. గతంలో ఇంధన కార్యదర్శి అయిన అరవిందకుమార్ ఈ ప్రాజెక్టు పూర్తిగా తమకే చెందుతుందని ప్రకటించారు. దీంతో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని, ఈ ప్రాజెక్టు పూర్తిగా తమ పరిధిలోది కాబట్టి తమకే చెందుతుందని ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా 25మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల ఉగ్రవాద చర్యలు పెరిగిన నేపథ్యంలో వాళ్ళు ఆయుధాలతో వస్తే, వీరు ఎదుర్కొనడానికి ఆయుధాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతా: స్పీకర్ కోడెల
సత్తెనపల్లి, ఫిబ్రవరి 12: సత్తెనపల్లి నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతతంగా ఉన్నత స్థాయిలో నిలబెడతానని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జరిగిన తైవాన్ స్పేయర్లు, సిల్పాలిన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే శాస్ర్తియ పద్దతుల్లో పంటలను సాగు చేయాలన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఆర్‌ఒ ప్లాంట్ కావాలన్నా మంజూరు చేయిస్తానని రైతులకు హామీనిచ్చారు. అనంతరం స్పీకర్ కోడెల చేతులమీదుగా స్పేయర్లు, సిల్పాలిన్ పట్టలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, ఎంపీపీలు బొర్రా కోటేశ్వరరావు, చీదరబోయిన ఉమాదేవి, రాజుపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట మోహనరావు, డీసీ చైర్మన్ గోగినేని కోటేశ్వరరావు, తోడేటి రవి, మక్కపాటి రామచంద్రరావు, మండల తెదేపా అధ్యక్షులు కోమటినేని శ్రీనివాసరావు, ముప్పాళ్ళ మండల పార్టీ అధ్యక్షులు రావిపాటి దేవేంద్రరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దింటి వెంకటేశ్వర్లు, రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షులు పూజల చినవెంకట కోటయ్య, లాంఫారం శాస్తవ్రేత్త జి.శారద, హార్టీకల్చర్ అధికారణి ప్రేమలత, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ముడుపుల కోసమే తాత్కాలిక రాజధాని:ఆర్కే

మంగళగిరి, ఫిబ్రవరి 12: 2018 చివరినాటికి రాజధాని తుదిదశ నిర్మాణం పూర్తి చేస్తామని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు రెండేళ్ల కాలానికి తాత్కాలిక రాజధానికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్థిక లోటులో ఉన్నామంటూ బీద అరుపులు అరుస్తున్న ప్రభుత్వం తాత్కాలిక రాజధాని పేరుతో సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటన్నారు. 20 ఎకరాల్లో తాత్కాలిక రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ఆకస్మికంగా దాన్ని 45 ఎకరాలకు పెంచడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆర్కే ఆరోపించారు. హైదరాబాదులో పదేళ్లు ఉండే అవకాశం ఉండగా రాజధాని నిర్మాణం శరవేగంగా జరుపుతామని చెబుతూనే తాత్కాలికాల పేరుతో ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆర్కే అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఒకవేళ ఇక్కడి నుంచే పరిపాలన సాగించాలనుకుంటే గుంటూరు - విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్శిటీలను వినియోగించు కోవచ్చని, శాశ్వత నిర్మాణాలకే ఎంత ఖర్చు చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో చదరపు అడుగుకు గరిష్టంగా 1800 రూపాయలకు మించి ఖర్చు కాదని, తాత్కాలిక రాజధాని నిర్మాణాలకు ఎంత ఎక్కువ ఖర్చు చేసినా 1000 - 1200 మించి ఖర్చు కాదని, మరి తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం బిడ్ వేసిన సంస్థలకు మాత్రం 3500 నుంచి 4000 రూపాయల వరకు కేటాయిస్తున్నారంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారాయణ వాటాలు పంచుకోవడానికేనని ఆరోపించారు.
ఒకవైపు రాజధాని నిర్మాణంలో అవినీతి ఊహలకు అందదని ప్రజలకు తెలిసి పోయిందని పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఉంటూ రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా కేంద్రంనుంచి నిధులు సాధించుకుని ప్రజా రాజధానిని నిర్మించి రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం రైతులనుంచి భూములను లాక్కుని, వారినే మళ్లీ చందాలు అడిగి హుండీలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు పడుతోందన్నారు.
జూన్ నాటికి ఉద్యోగులు తరలి రావాల్సిందేనని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు వారికి కనీస వసతులు కల్పించి అప్పుడు తరలించాలని ఆర్కే సూచించారు.