క్రీడాభూమి

రెండు టెస్టులు గెలిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కెప్టెన్‌గా భారత్‌కు ఎక్కువ విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించే దిశగా విరాట్ కోహ్లీ దూసుకెళుతున్నాడు. శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిస్తే, ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీ సరసన కోహ్లీకి చోటు దక్కుతుంది. మూడో టెస్టు నుంచి అతనికి విశ్రాంతినిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ ఆ టెస్టులోనూ కోహ్లీ బరిలోకి దిగి, భారత జట్టు విజయభేరి మోగిస్తే, గంగూలీని మూడో స్థానానికి నెట్టి, అతను రెండో స్థానాన్ని ఆక్రమిస్తాడు. గంగూలీ 49 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించి 21 విజయాలను అందించాడు. కోహ్లీ ఇప్పటి వరకూ 29 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి, 19 విజయాలను నమోదు చేశాడు. కాగా, ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 60 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా టీమిండియాను నడిపించి, 27 విజయాలు సాధించాడు. అతని రికార్డుకు కోహ్లీ కొంచం దూరంలో ఉన్నందున, ముందుగా రెండో స్థానంలో ఉన్న గంగూలీతో సమంగా నిలవడం లేదా అతనిని అధిగమించడంపై దృష్టి కేంద్రీకరిస్తాడు
.
విజయ్‌కి విశ్రాంతి?

ఒకప్పుడు భారత జట్టుకు టాప్ ఆర్డర్‌లో ఎవరు ఆడతారన్న భయం ఉండేది. ఎవరైనా గాయపడినా లేక అందుబాటులో లేకపోయినా, మిడిల్ ఆర్డర్‌లో ఉన్న వారెవరూ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే సాహసం చేసేవారుకారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. ఓపెనర్ స్లాట్ కోసం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం, భారత బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ. శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేష్ రాహుల్‌లో ఒకరికి విశ్రాంతి ఇవ్వాల్సిన పరిస్థితి. వీరిలో విజయ్‌ని తుది జట్టులోకి తీసుకోవడం లేదని కెప్టెన్ కోహ్లీ పరోక్షంగా చెప్పాడు. ఓపెనింగ్ స్లాట్‌కు పోటీ తీవ్రంగా ఉన్నందువల్ల, ఫామ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ కొంత మందికి మ్యాచ్ ఆడే అవకాశం రావడం లేదని కోహ్లీ అన్నాడు. ఇలాంటి పరిస్థితిని ఒకసారి ధావన్ ఎదుర్కొంటే, మరోసారి రాహుల్‌కు ఎదురైందని చెప్పాడు. ఇప్పుడు వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారని, కాబట్టి, వీరిని జట్టులోకి తీసుకోక తప్పదని వ్యాఖ్యానించాడు. దీనితో విజయ్‌కు మొండి చేయి తప్పదని అంటున్నారు.

చండీమల్ ‘మంత్రం’ పారేనా?

కోల్‌కతా: పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్‌ను గెలవడానికి మంత్ర విద్య తోడ్పడిందంటూ శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగుతునే ఉంది. క్రీడల్లో మంత్రాలు ఏమిటని కొంత మంది ప్రశ్నిస్తే, ఆత్మవిశ్వాసం లేనివారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మరి కొందరు ధ్వజమెత్తుతున్నారు. జట్టు ఆటగాళ్లు కూడా అతను చేసిన ‘విచ్‌క్రాఫ్ట్’ వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఎంతో కష్టపడి పాకిస్తాన్‌ను ఓడిస్తే, అది అదృష్టవశాత్తు లేదా అద్భుతం జరగడం వల్లే సాధ్యమైందన్న రీతిలో చండీమల్ అనడం వారికి రుచించడం లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. మొత్తం మీద ‘మంత్ర విద్య’ వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన చండీమల్ భారత్‌పై సిరీస్‌ను కూడా అదే తరహాలో తీసుకుంటాడా లేక స్వశక్తితో పోరాడతాడా అన్నది చూడాలి.