తెలంగాణ

నిరంతర విద్యుత్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణలో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు జనవరి 1వ తేదీ నుంచి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ప్రకటించారు. వచ్చే మార్చిలో వేసవి ప్రారంభం దృష్ట్యా విద్యుత్ డిమాండ్ 11వేల మెగావాట్ల దాటినా తట్టుకునే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, దీనికి సంబంధించి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనికి వ్యూహాన్ని ఖరారు చేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల పడే లోడ్, ఎక్కువ లోడ్‌లు వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 24 గంటల కరెంటు వల్ల లోడ్‌లు క్రమంగా పెరుగుతాయన్నారు. విద్యుత్‌పై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంపిణీ, సరఫరా వ్యవస్థల మధ్య సమన్వయం సాధించామన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా తమకు తెలియచేయాలని అన్ని స్థాయిల అధికారులకు అప్రమత్తంగా ఉండి చెప్పాలన్నారు. వచ్చే జూనన్ నుండి ఎత్తిపోతల పథకాల పంప్ హౌజ్‌లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున లోడ్ మరింత ఎక్కువవుతుందన్నారు.వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ దేశ చరిత్రలో కొత్త చరిత్రను సృష్టించనున్నట్లు చెప్పారు. గ్రిడ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ అదనపు ఏర్పాట్లు చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విద్యుత్ ఉన్నతాధికారుల బృందాన్ని అభినందించారు.
దశాబ్ధాల తరబడి రైతులు కరెంటు కష్టాలు అనుభవించారని, అందుకే కరెంటు సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రైతులకు మేలు చేయడం కన్నా మించిన సంతృప్తి మరొకటి ఉండదన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణకు కరెంటు కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మార్చామన్నారు. కొత్త సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను వేసినట్లు వివరించారు. దాదాపు 9500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తలెత్తుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామన్నారు. 2016 జూలై నుంచి పాత మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ అందించామన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2018 జనవరి 1వ తేదీ నుంచి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారవు. రూ.12610 కోట్ల వ్యయంతో 24 గంటల నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ట్రాన్స్‌కో, డిస్కాంలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. 2014 నవంబర్ 20 నుంచి కరెంటు కోతలను ఎత్తివేసి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా, పరిశ్రమలు, గృహాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రారంభించామన్నారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 6574 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 14845 మెగావాట్లకు చేరుకుందని జెన్కోసిఎండి ప్రభాకరరావు చెప్పారు. 2022 నాటికి తెలంగాణలో 28వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులో తేవాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను ఖరారుచేసినట్లు చెప్పారు.