రాష్ట్రీయం

నేనూ రాయలసీమ బిడ్డనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 24: ‘నేనూ రాయలసీమ బిడ్డనేనన్న విషయం నన్ను విమర్శించే వాళ్లు గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమకు న్యాయం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు పారిశ్రామికీకరణ, కొత్త పరిశ్రమలన్నీ కర్నూలు, అనంతపురం, తిరుపతిలోనే వస్తున్నాయి. ఇది వికేంద్రీకరణ కాదా’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, వారు మనల్ని రెచ్చగొట్టేందుకే ప్రయత్నిస్తున్నందున, దాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలు వ్యవహరించాలని ఆదేశించారు. శనివారం పార్టీ నాయకులు, ఎంపీలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో బీజేపీపై అనుసరించాల్సిన వ్యూహం, ఇటీవల బీజేపీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌పై చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సోము వీర్రాజు చేసిన విమర్శలను కొందరు నేతలు ప్రస్తావించారు. దానికి స్పందించిన బాబు విష్ణువర్ధన్‌రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాళ్లు మనల్ని రెచ్చగొట్టి వాతావరణాన్ని ఎమోషనల్‌గా తీసుకువెళ్లాలని చూస్తున్నారు. మీరెవరూ వాళ్ల ఉచ్చులో పడకండి. మాట్లాడితే మాట్లాడనివ్వండి. మీరేమీ పట్టించుకోవద్దు. మనకొచ్చిన నష్టమేమీ లేదు. చూద్దాం. వాళ్లు ఎక్కడదాకా వెళతారో? వాళ్లు చిన్న చిన్న వాళ్లతో మాట్లాడిస్తున్నారు. వాళ్లు హోదా, బడ్జెట్‌లో మనకు జరిగిన అన్యాయంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు రాయలసీమ లాంటి అంశాలు తీసుకువస్తున్నార’ని అన్నారు.
హోదా, బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై పోరాడి సాధిస్తారని ప్రజలు తమపై నమ్మకంతో ఉన్నందున ఆ దిశగానే వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు హైకోర్టు, బడ్జెట్‌లో 20 వేల కోట్లు వంటి అంశాలకు సంబంధించి బీజేపీ చేసిన డిమాండ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లకు రాయలసీమ సమస్యలు ఇప్పుడు గుర్తుకు
వచ్చాయా? హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని అంబేద్కరే చెప్పారు కదా? మరి వాళ్లు ఇప్పటివరకూ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు అమరావతిని దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్ వస్తోంది. మరి చేస్తారా? రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలంటున్న వాళ్లు కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని వస్తున్న డిమాండ్లపై ఏమంటారు? ఏంటిది? వీళ్లు ఎక్కడకు పోతున్నారు? మనం రాష్ట్ర హక్కుల గురించి పోరాడుతుంటే వీళ్లు ప్రాంతీయ సమస్యలు లేవనెత్తడం కొత్త సమస్యలు సృష్టించి మనల్ని ఇబ్బందిపెట్టాలనే కదా? ఎవరెన్ని మాట్లాడినా రాష్ట్రానికి మనం తప్ప మరెవరూ మేలు చేయరన్న భావన జనంలో ఉంద’ని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల నుంచి రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ నాయకులు ఇప్పుడు మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటన్నది అందరికీ తెలుసన్నారు. ‘వీళ్లంతా ఒక విషయం మర్చిపోతున్నారు. నేనూ రాయలసీమ బిడ్డనే. నాకంటే సీమ సమస్యలు, పరిష్కారాలు వీళ్లకు తెలుసా? అసాధ్యమైన పులివెందులకూ మనం నీళ్లిచ్చాం. మరో ఏడాదిలో కర్నూలులో బ్రహ్మాండమైన ఎయిర్‌పోర్టు రాబోతోంది. ఉర్దు యూనివర్శిటీ మనమే తెచ్చాం. అనంతపురంలో కియా మోటార్స్ వచ్చింది. తిరుపతి సెల్‌ఫోన్ల హబ్‌గా మారింది. కర్నూలులో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కు రాబోతోంది. వాళ్లు బడ్జెట్‌లో సీమకు 20 వేల కోట్లు పెట్టమంటున్నారు. వాళ్లు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. మనం ఇప్పటికే 18 వేల కోట్లు ఖర్చు పెట్టాం’ అని వివరించారు.
గతంలో సీమ ఉద్యమాలు చేసిన వారిని ప్రజలు ఏవిధంగా గుర్తించారో తెలుసునని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో కొందరు చేసిన సీమ ఉద్యమాలపై ప్రజలు ఏవిధంగా స్పందించారో గమనించాలన్నారు. రాష్ట్భ్రావృద్ధి, న్యాయమైన హక్కుల సాధన కోసం టీడీపీ ఎంతవరకైనా వెళుతుందన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు సమావేశాల వరకూ ఇదే పంధా కొనసాగించాలని, బీజేపీ నేతలు చేసే ప్రకటనల వెనుక లక్ష్యాన్ని అర్ధం చేసుకుని సంయమనం వహించాలని ఆదేశించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వైసీపీ కేంద్రాన్ని నిలదీయకుండా, పోరాడుతున్న మనల్ని విమర్శిస్తున్నారంటే ఎవరు ఎవరితో బంధం కోసం పరితపిస్తున్నారో ప్రజలకు అర్థమయిందని వ్యాఖ్యానించారు.