అక్షర

కళాకారుల కథ.. వ్యథల బతుకాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బతుకాట’
నవల
-విఆర్ రాసాని
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

‘హోమం’ ‘మెరవణి’ వంటి అసాధారణమైన కథా సృజన చేసిన రచయిత డా.వి.ఆర్.రాసాని. తాను రాసిన ప్రతి కథని ఒక విలక్షణమైన సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి రాశారు రాసాని. ఒక వినూత్నమైన ప్రయోగంగానే రాసారు. నవలా రచయితగాను రాసాని తనదైన ‘ముద్ర’ని తెలుగు పాఠక లోకం మీద ప్రతిష్టించుకున్నారు. (‘ముద్ర’ ఆయన రాసిన ఒక అపూర్వమైన నవలపేరు కూడా!)
‘బతుకాట’ అచ్చమైన తెలుగు పేరుతో వచ్చిన నవల. తెలుగు దేశీయతని సంతరించుకుని పరిశోధనాత్మకంగా వెలుగుచూసిన నవల. వాస్తవంగా నిన్న మొన్నటి వరకు ఈ నేలమీద నడిచిన కళాకారుల జీవిత గాధ. చారిత్రాత్మకం అనిపించే పాత్రల చుట్టు అల్లిన ఇతివృత్తం ఈ నవల బలం. ‘బతుకాట’ నవలకి అమెరికా వారి తానా అవార్డు లభించింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ డిగ్రీ మొదటి సంవత్సరానికి పాఠ్యాంశంగా నిర్దేశించబడిన విశిష్ట నవల ఇది.
యామిగానిపల్లె చిత్తూరు జిల్లాలోని కుప్పం దగ్గరగా వున్న చిన్న గ్రామం. అక్కడ రంగస్థల కళకే అంకితమైన ఒక వంశం వుంది. ఆ వంశంలో తరతరాలుగా ఒక పెద్ద ‘గురువు’ స్థానం ఆక్రమిస్తూ శిష్యుని తయారుచేసుకుని ఆరాధనా భావంతో ఆ కళాసేవ చేస్తూ వుంటాడు. వాళ్ల ఆది గురువు -అణ్ణువు వటేరావు. ఆయన 1867లో మరణించిన దాఖలా వుంది. ఆయన కాలం నుంచి ఐదవతరం వాడైన సిద్ధోజి అలియాస్ సిద్ధప్ప జీవిత చిత్రణ ఈ నవల. గురువుల వంశాచారం ప్రకారం వారి వంశ చరిత్రని ఒక పుస్తకంలో రాసి పెడుతూ వుంటాడు పెద్ద. తరం తర్వాత తరం ఈ ఆచారాన్ని పాటిస్తూ వున్నారు. అలాగే ప్రతి ఉగాది నాడు వారి వాళ్లను చేర్పించి ఆ చరిత్రని చెప్పుకోవాలి. ఉగాది నాటకం, తిరుమల యాత్ర తప్పనిసరి కార్యక్రమాలు.
సిద్ధప్ప, అతని భార్య పూర్ణమ్మ, వారి సంతానం-ఇద్దరు కొడుకులు ఇద్దరు ఆడబిడ్డలు. వీరందరి గాథ ఈ నవలా వస్తువు. నాటక నిర్వహణకు కళాకారులు తయారుకావడం -మందీ మార్బలం, వాద్యాలు, బొమ్మలు, ఆహార్యా విశేషాలు...ఇవన్నీ ఒక సమాచార గ్రంధంలా తెలుస్తాయి పఠితకు. ఉగాది ముందు మూడోరోజు గజ్జెపూజతో నియమ నిష్టలు, రిహార్సల్స్ వంటివి మొదలు. ఉగాది నాడు ‘గురువుల తోపు‘కు కళాకారుల యాత్ర. ఆ తోపు ఎకరా విస్తీర్ణంలో వుంది. అది ఒకప్పుడు విజలాపురం జమిందార్లనుంచి సిద్ధప్ప పూర్వీకులకు ఈనాముగా సంక్రమించిన తోట. గురువుల సమాధులు ఇందులోనేవున్నాయి.
నవల ఐదు తరాల రంగస్థల కళాకారుల స్థితిగతుల్ని, చరిత్రని రికార్డు చేసింది. వస్తుకేంద్రం సిద్ధప్ప జీవితం. ఆయన బతుకాట! ఛిద్ర జీవన విషాదం. క్రమేణా అంతరించి పోతున్న కళారూపాలు, వాటిని ఆశ్రయించుకుని జీవనం సాగించిన వారి దైన్యం. నవలలో గాఢంగా చిత్రితమైనాయి. సిద్ధప్ప కుటుంబం చుట్టు అల్లుకున్న సామాజిక వాస్తవాల్ని సాటి మనుషుల స్వభావాల్లోని వికారాల్నీ, కాలపరిణామంలో జరిగే ఘటనల పరంపరనీ తేటతెల్లం చేస్తు సాగింది నవల. చివరికి సిద్ధప్ప తనకున్న కళారాధనతో ముది వయసులో పట్టుదలతో తిరుమల యాత్రకి పూనుకుని శిష్య బృందంతో తిరుమలకి చేరుకుంటాడు. పళ్ల బిగువున నడకదారిలో వెడతాడు. సామాజికంగా భజనా, పాటా, ఆటా సాగుతాయి. భక్తి తాదాత్మ్యం, కళోత్సాహం సిద్ధప్పని తూలికిందపడేట్టు చేస్తాయి. నర్తన ఆగిపోయింది.
కొడుకు నాగోజీని దగ్గరికి పిలిచి నాడు ఎన్నడో తనతండ్రి తనకు చెప్పిన మాటలే చెప్పి కన్నుమూశాడు. ‘...ఇదంతా ఒక నాటకం. ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు ముగించుకుని పోతూ ఉంటారు. నా పాత్ర అయిపోయింది..మన వంశాచారం ప్రకారం ప్రతీ ఉగాదికి ఊర్లో ‘ఆట’ యేపించు. ప్రతి బెమ్మోత్సవానికీ తిరుపతి కొండకు యాత్ర సాగించు’...ఇదీ సందేశం. గురువుల తోపులో తండ్రి పక్కనే సిద్ధప్పని పూడ్చారు! కాలం సాగిపోతుంది. నాగోజి ముసలివాడైపోయాడు. రవణ టీచరుగా పనిచేస్తున్నాడు. సిద్ధప్ప ఇల్లు వాకిలీ లేవిప్పుడు యామినిపల్లెలో ! గురువుల తోపు కనుమరుగైంది.
వాస్తవ జీవిత చిత్రణతోఒక తరం కళాకారుల జీవన పరిణామ క్రమాన్ని నవలా శిల్పమయంగా ఆవిష్కరించారు రాసాని. ఒక సామూహిక సంక్షోభాన్ని కొన్ని పాత్రల ఆంతరంగిక క్షోభల ప్రతిఫలింపచేసే ప్రయోజనాత్మక నవలని అందించారు. నిస్సందేహంగా ననలాకారుడుగా రాసాని కీర్తికిరీటంలో మరో తురాయి-ఈ ‘బతుకాట’!

-విహారి