రాష్ట్రీయం

చంద్రబాబును జనం క్షమించరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో పాలనా వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న ఆయనను ప్రజలు క్షమించరని, ఇసుక మాఫియాల నుండి చినబాబుకు మామూళ్ళ వర్షం కురుస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం గుంటూరు తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ వద్ద ఏర్పటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలు ప్రాణాలకు తెగించి పంచపాండవుల మాదిరిగా రాజీనామాలు చేసి నిరవధిక దీక్షకు దిగారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి పోరాటం చేస్తున్నది తామేనని, నాలుగు సంవత్సరాలుగా బీజేపీతో పొత్తుపెట్టుకొని హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కొత్తడ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో కృష్ణానదిని తోడిపోసిన పచ్చచొక్కాల నేతలు, కాంట్రాక్టర్లు..చినబాబుకు వాటాలు ముట్టజెబుతున్నారని ఆరోపించారు. గిట్టుబాటు ధరలులేక రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. నాలుగేళ్ళ టీడీపీ పాలనలో రాష్టమ్రంతా అవినీతితో నిండిపోయిందని, అందుకే ఢిల్లీలో పోరాటానికి చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారన్నారు. తమ ఎంపీలతో పాటుగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలుచేస్తే కేంద్రం దిగివచ్చేదని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 45 ఏళ్ళకే 2వేల రూపాయలు పింఛను ఇస్తామన్నారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఆసుపత్రుల్లో వెయ్యి రూపాయలు బిల్లు దాటిన ప్రతి ఒక్కరికీ వర్తించేలా చూస్తామన్నారు. మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సేవలతో పాటుగా 10వేల రూపాయల పింఛను ఇస్తామన్నారు. గృహ యజమాని ఆనారోగ్యానికి గురైతే ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కాలేదని, తాము అధికారంలోకి రాగానే వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం లేని గ్రామం లేదని, అయితే మంచినీరు లేని గ్రామాలు కోకొల్లలుగా
ఉన్నాయన్నారు. రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా అధికారుల నుండి నోటీసులు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు. వేలిముద్రలు పడటం లేదని వృద్ధులకు పింఛన్లు నిలిపివేసే పరిస్థితులు రానున్న తమ ప్రభుత్వంలో ఉండవన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడిని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టిన విషయం గుర్తుపెట్టుకున్న ప్రజలు క్షమించే పరిస్థితి లేదన్నారు. మరోమారు రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పరిపాలన కొనసాగాలంటే ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆదరించాలని ప్రజల్ని అభ్యర్థించారు.
చిత్రం..తెనాలి బహిరంగ సభలో మాట్లాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్