అనంతపురం

ఫైన్ పడుద్ది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 24 : ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన జిల్లా రవాణా శాఖ వివిధ సేవలు, పన్నులు, తనిఖీల ద్వారా ఖజానాను నింపుతోంది. ముఖ్యంగా నిబంధనల ఉల్లంఘనుల నుంచి అపరాధ రుసుంను వసూలు చేస్తూ వాహన చోదకులు, యజమానులను బెంబేలెత్తిస్తోంది. ప్రధానంగా వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, జీవిత కాల పన్నులు, త్రైమాసిక పన్నులు, సేవా, ఇతరత్రా రుసుముల ద్వారా రవాణా శాఖ ఆదాయాన్ని ప్రతి ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 27 శాతం అదనంగా సమకూర్చుకుంటోంది. లక్ష్య సాధనకు రవాణా శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రత దృష్ట్యా నిబంధనల ఉల్లంఘనులపై కొరడా ఝలిపిస్తోంది. జిల్లాలో 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలతో పాటు ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 54,712 కేసులను రవాణా శాఖ అధికారులు నమోదు చేశారు. ఈ సంఖ్య 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు 23,215 కాగా, 2017 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 31,497 కేసులు నమోదు చేశారు. కాగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో తనిఖీల (డిటెక్షన్) ద్వారా రూ.24.88 కోట్లు వసూలు చేయాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో లక్ష్య సాధనలో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారులు రూ.20.42 కోట్లు మేర అపరాధ రుసుం వసూలు చేశారు. రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ కరవు జిల్లా అనంతపురంలో మాత్రం ఇది భారీ మొత్తమేనని చెప్పొచ్చు. ఓవైపు పోలీసు శాఖ సైతం తనిఖీలు నిర్వహిస్తూ ఆటోలు, నిబంధనలు పాటించని వాహనదారులపై విరుచుకు పడుతూ భారీగా అపరాధ రుసుం వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి సురక్షిత ప్రయాణంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా సహకరించాలని అవగాహన కల్పిస్తున్నారు. లేకుంటే ఫైన్ పడుద్ది అంటూ హెచ్చరిస్తున్నారు. కాగా అధికారిక గణాంకాల మేరకు 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికుల్ని చేరవేయడంపై 444, అతి వేగంపై 165, అధిక లోడుతో సరుకు రవాణా చేస్తున్న వాహనాలకు 2,736, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిపై 9,739 కేసులు నమోదు చేశారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 14,990 మందిపైన, భారీ వాహనాలకు రెఫ్లెక్ట్స్, లేదా టేపులు లేని వాహనాలు గుర్తించి 19,151, డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా ఉండటం, రెండో డ్రైవర్ లేకపోవడం వంటి ఉల్లంఘనకు 736, అపసవ్య మార్గంలో వాహనాలు నడపడంపై 602, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడిపే 6,137 మందిపైన కేసులు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ ఉల్లంఘనల కింద ఈ ఏడాది జనవరిలో 1,439, ఫిబ్రవరిలో 1,429, మార్చి నుంచి ఇప్పటి వరకు 1,376 కేసులు నమోదు చేశారు. కాగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.175.43 కోట్లు ఆదాయాన్ని సమకూర్చాలని రవాణా శాఖ నిర్దేశించిన నేపథ్యంలో రూ.187.13 కోట్లు ఆర్జించి రాష్ట్రంలో 5వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ లక్ష్యంలో 106.67 శాతం సాధించడం విశేషం. ఇందులో త్రైమాసిక పన్నులు రూ.43.82 కోట్లకు గానూ, రూ.44.11 కోట్లు (100.67 శాతం) సాధించి రాష్ట్రంలో రెండో స్థానం, లైఫ్ టాక్స్ వసూళ్లలో రూ.8,028 కోట్లకు గానూ, రూ.8,264 కోట్లు (102.94 శాతం) వసూలు చేసి మూడోస్థానం, ఫీజుల రూపేణా రూ.20.61 కోట్లకు రూ.33.81 కోట్లు (164.09 శాతం) రాబట్టి రెండో స్థానం, సర్వీస్ చార్జీల రూపేణా రూ.5.84 కోట్లకు గానూ రూ.6.13 కోట్లు (105.08 శాతం) వసూలు చేసి రెండో స్థానంలో నిలిచి లక్ష్యాన్ని సాధించింది.

సీఎం పర్యటన రద్దు

అనంతపురం, ఏప్రిల్ 24 : నేడు జిల్లాలో సాగాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయింది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు చేసినట్లు మంగళవారం సీఎం కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. దీంతో సీఎం పర్యటన నిమిత్తం సిద్ధం చేసిన వాహనాలను తిప్పి పంపించేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథి కుమార్తె వివాహానికి నేడు సీఎం హాజరు కావాల్సి ఉంది. అలాగే నగర సమీపంలోని రూరల్ మండల పరిధిలో ఉన్న శిల్పారామంలో అభివృద్ధి పనులు ప్రారంభించడం, నీరు-చెట్టు కార్యక్రమంతో పాటు జిల్లా అధికారులు, పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించేలా పర్యటనను రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సోమవారమే హెలిపాడ్‌ను, సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. అయితే సీ ఎం పర్యటన రద్దు కావడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు.

సత్యసాయి అవతారమే ఓ సందేశం
* ప్రశాంతి నిలయంలో 8వ ఆరాధనోత్సవం
పుట్టపర్తి, ఏప్రిల్ 24 : భగవాన్ సత్యసాయి బాబా తన జీవితమే ఓ సందేశం అని చాటి చెప్పి ప్రపంచ మానవాళిని సాయి మార్గంలో నడిపిన మహనీయుడు అని వక్తలు కొనియాడారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయి బాబా 8వ ఆరాధనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేశ, విదేశాల నుండి వేలాదిమంది సాయి భక్తులు ప్రశాంతి నిలయం చేరుకుని ఆరాధనోత్సవాలలో పాల్గొన్నారు. సాయి విద్యార్థులు వేద మంత్రోచ్ఛారణలు భక్తి గేయాలాపనలతో ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్టు సభ్యులు నాగానంద ఆరాధనోత్సవ ప్రసంగం చేశారు. భగవాన్ సత్యసాయి భౌతికంగా లేకపోయిన ఆధ్యాత్మికంగా కోటాను కోట్ల సాయి భక్తులలో మిలితమై వున్నారన్నారు. ఆయన ఆధ్యాత్మిక గురువుగా ప్రేమ, శాంతి, సేవ అనే సద్గుణాలను బోధించి సేవలో ప్రత్యక్షంగా పాలుపంచుకొని ప్రపంచాన్ని ముందుకు నడిపారన్నారు. ఆయన సూచించిన మార్గంలో పయనించి సమాజ సేవకు పునరంకితమవుదామన్నారు. విద్య, వైద్యం, తాగునీరువంటి మహత్తర భృహత్కర పథకాలను వేల కోట్లు ఖర్చు చేసి మానవాలికి ప్రసాదించారన్నారు. ఆయన చూపిన మార్గంలో నడిచేందుకు ఆయన సంకల్ప బలంతో ప్రతి సాయి భక్తుడు కంకణబద్దుడై వున్నారన్నారు. ఈ సందర్భంగా సుమారు 50వేల మందికి పైగా అన్న, వస్త్ర, ప్రసాద నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. సత్యసాయి మార్గాన్ని పరిచయం చేస్తూ సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్, చక్రవర్తి, ప్రసాదరావు, మోహన్, నాగానంద, టీకేకే భగవతి, సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కేవీఆర్ వర్మ పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం పంచ, రత్న క్రిటి, అన్నమయ్య, సత్యసాయిని కీర్తిస్తూ ప్రముఖ గాయిని రాజ్‌కుమార్ భారతి బృందం కీర్తనలు ఆలపించి భక్తులను మైమరిపించారు. అనంతరం 2100 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ట్రస్టు సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంఎల్‌ఏ జే. గీతారెడ్డి, టీవీఎస్ ఛైర్మన్ శ్రీనివాసన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, మాజీ డీజీపీ హెచ్‌జె దొర, ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు చలం, అనంతరం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డిలు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
*మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, ఏప్రిల్ 24: గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, సెర్ఫ్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం జెడ్పీ సమావేశం మందిరంలో గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమ అమలులో భాగంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చంద్రకాంతి పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో చంద్రన్న బాట ద్వారా కొత్తగా సీసీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. గ్రామాలకు పెద్ద దిక్కుగా సర్పంచ్‌లు ఉండాలని గ్రామాలలో వౌళిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించడంలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని మంత్రి తెలిపారు. జిల్లాలో పార్టీలకతీతంగా ప్రజలకు కావలసిన వౌళిక వసతులు కల్పించుచున్నామని తెలిపారు. జిల్లాలో 600 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించి నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కొరకు ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. గత సంవత్సరం నీటి ఎద్దడి నివారణ కొరకు రావలసిన బకాయిలు 8 కోట్ల నిధులను కలెక్టర్ జి.వీరపాండ్యన్ విడుదల చేశారని తెలిపారు. అన్న అమృత హస్తం, గిరిగోరు ముద్దలు, దళితవాడ ప్రజలకు అదనంగా పౌష్టికాహారం అందజేయడం కొరకు 3 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. జిల్లాను స్వచ్ఛ అనంతపురంగా తీర్చిదిద్దిన కలెక్టర్, అందుకు సహకరించిన సర్పంచులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, అన్ని శాఖల ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సీసీ రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లాలో వివిధ పంచాయతీలలో విశిష్ట సేవలందించిన ఆయా గ్రామ పంచాయతీల అధికారులకు, సిబ్బందికి మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ పూల నాగరాజు, ఎమ్మెల్యేలు విశే్వశ్వరరెడ్డి, హనుమంతరాయచౌదరి, కలెక్టర్ జి.వీరపాండ్యన్, గ్రామ స్వరాజ్ అభియాన్ పరిశీలకులు సత్యనారాయణ, జిల్లాలోని జెడ్పిటీసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నమ్మించి మోసం చేసిన బీజేపీ..
* మంత్రి కాలవ శ్రీనివాసులు
కణేకల్లు, ఏప్రిల్ 24 : నాలుగు సంవత్సరాలు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టన సైకిల్‌యాత్ర మంగళవారం మండల పరిధిలోని 43 ఉడేగోళం, బ్రహ్మసముద్రం, బెణేకల్లు, ఎస్‌ఆర్‌ఎం క్యాంప్, గోణేహాల్, గనిగేర గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడిగా ఉన్న రాష్ట్రానికి అడ్డంగా విడదీసిన పాపం కాంగ్రెస్‌ది అయితే.. మిత్రపక్షంగా ఉంటూ నమ్మించి మోసం చేసింది బీజేపీ అన్నారు. ఎంతో విశ్వాసంగా నాలుగు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడన్నారు. భారీ విగ్రహ ఏర్పాటుకు రూ.2500 కోట్లు మంజూరు చేశారుతప్ప, నూతన రాజధానికి కేవరం రూ.1500 కోట్లు మాత్రమే అందించిన మోదీకి రాష్ట్రంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. పోలవరం ద్వారా ఈప్రాంతానికి నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రూ.కోట్లు వెచ్చించి యుద్ధప్రాతిపదికన హంద్రీనీవాను పూర్తి చేసేందుకు చంద్రబాబు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి జిల్లాలో చెరువులు నిండి ఎటుచూసినా పంటలు కళకళలాడుతాయన్నారు. హంద్రీనీవా ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 24వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. కాగా ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి 5కోట్ల ఆంధ్రుల అభిమానాన్ని మోదీ కాళ్ల ముందు పెట్టి లాలూచి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసుల నుంచి బయటపడడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ ప్రజలు గమణిస్తున్నారని, 2019 ఎన్నికల్లో ఎంతో అపార అనుభవం ఉన్న చంద్రబాబుకు ఓటు వేసి పసిపాపగా ఉన్న రాష్ట్రాన్ని బతికిద్దామని పిలుపునిచ్చారు.

శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయికుమార్
* ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు
కదిరి టౌన్, ఏప్రిల్ 24: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం సినీ నటుడు, బీజేపీ నేత సాయికుమార్ దర్శించుకున్నారు. సాయికుమార్‌కు ఆలయ అర్చకులు, బీజేపీ నాయకులు, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్నాటక శాసన సభ ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న సందర్భంగా పార్టీ బీఫాం, నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద వుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయికుమార్ వెంట ఆయన కుమారుడు, సినీ హీరో ఆది, అల్లుడు ఉన్నారు. అనంతరం ఆలయ అర్చకులు పార్థసారథిచార్యులు, నరసింహాచార్యులు స్వామివారి చిత్రపటం అందించి, దుశ్శాలువతో సత్కరించారు. ఎన్నికల్లో విజయం సాధించాలని స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చానని ఆయన తెలిపారు.