విశాఖపట్నం

రైటర్ సూరజ్ (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజన విరామ సమయంలో కాలక్షేపం కోసం వారపత్రిక తీసి పేజీలు తిప్పుతున్న హరీష్‌రావు అందులో ఉన్న ప్రకటన చూసి డంగైపోయాడు.
‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సూరజ్ సూపర్‌ఫాస్ట్ సీరియల్ లవ్ అండ్ రివెంజ్ త్వరలో ఆరంభం’
‘అంటే జూనియర్ అసిస్టెంట్ సూరజ్ గొప్ప రచయితన్న మాట’ అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం వెంటనే అతడిని తన క్యాబిన్‌కి పిలిపించాడు.
‘‘సార్’’ అన్నాడు సూరజ్ లోపలికి వచ్చి అత్యంత వినయంగా.
కూర్చోమన్నట్లు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు హరీష్‌రావు.
ఉన్నపళంగా, అదీ లంచ్ టైంలో బాస్ తనను ఎందుకు పిలిచాడో తెలీక విస్తుపోతూ కూర్చున్నాడు.
‘‘కంగ్రాచ్యులేషన్స్. నువ్వు రచనలు చేస్తావని నాకిప్పుడే తెలిసింది’’ అన్నాడు హరీష్‌రావు.
ఆ మాటకు విస్తుపోతూ ‘‘ ఈ విషయం మీకెలా తెలిసింది?’’ అన్నాడు సూరజ్.
‘‘నువ్వు చెప్పనంత మాత్రాన మాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? చూడు ఇది’’ చేతిలో ఉన్న పుస్తకాన్ని అతడికిచ్చాడు హరీష్‌రావు.
అందులో ఉన్న ప్రకటన చూసి ‘‘అదా... ఏదో అప్పుడప్పుడు’’ బుర్ర గోక్కుంటూ అన్నాడు సూరజ్.
‘‘నువ్వు రచయితవన్న విషయం ఎందుకంత గోప్యంగా ఉంచావో నాకర్ధం కావడంలేదు. నీవంటి గొప్ప రైటర్ స్ట్ఫాలో ఉన్నారంటే ఎంత క్రెడిటో తెలుసా? పత్రికలో ఏ చిన్న రచన పడ్డా నా అంత గొప్ప రచయిత లేడనుకుంటూ కాలరు ఎగరేసుకుని తిరిగే వారిని చూసాను. సాహిత్యంలో ఇంత ప్రతిబ ఉన్న నువ్వు ఎంతో నిగర్విగా ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అన్నాడు మెచ్చుకోలుగా.
ఆ మాటకు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు సూరజ్.
మరుక్షణం ఆ వార్త ఆఫీసంతా పాకింది.
‘‘యు ఆర్ గ్రేట్’’ అంటూ అతడికి ఒకరి తర్వాత ఒకరు షేక్‌హ్యాండిస్తూ ఆకాశానికి ఎత్తేశారు.
వారి ఉత్సాహాన్ని గమనించిన హరీష్‌రావు ‘‘మనమంతా కలసి రేపు సూరజ్‌ని ఘనంగా సన్మానించాలి. ఏమంటారు?’’ అన్నాడు సిబ్బందిని ఉద్దేశించి.
‘‘వద్దుసార్. ఆ పని మాత్రం చేయకండి. నాకీ సన్మానాలు, పొగడ్తలంటే ఇష్టం ఉండదు. అందుకే నేను రచయితనన్న నిజాన్ని మీకింత వరకు తెలియనివ్వలేదు. మరీ పట్టుబడితే నేను చేయడం మానుకోవలసి వస్తుంది’’ అన్నాడు.
మరి అతగాడిని ఇబ్బంది పెట్టలేదు స్ట్ఫా. పత్రికలో నవల ఆరంభం అవగానే అంతా పుస్తకాలు కొన్ని సీరియల్‌ని శ్రద్ధగా ఫాలో అవుతూ టీ బ్రేక్‌లో సూరజ్‌ని కలసి అతడిని పొగడడం రొటీన్‌గా మారింది.
బాస్ సైతం అతనిని ఇదివరకులా కాకుండా ప్రత్యేకంగా చూడసాగాడు.
‘‘చేస్తున్న పని ఏదైనా మరో రంగంలో ప్రతిభ ఉందని తెలిస్తే ఇంతటి ఆదరణ లభిస్తుందా’’ అనుకున్నాడు సూరజ్.
రోజులు గడుస్తున్నాయి.
ఫ్యామిలీతో వైజాగ్ వెళుతున్నట్లు పది రోజులు లీవ్ పెట్టాడు సూరజ్.
వెంటనే సెలవు సాంక్షన్ చేశాడు హరీష్‌రావు. అదే మునుపైతే పెట్టిన రోజుల్ని సగానికి కుదించి లీవు గ్రాంట్ చేసేవాడు.
సడన్‌గా సూరజ్ విశాఖపట్నం వెళుతున్నాడంటే అక్కడ సాయంత్రాలు బీచ్‌లో కూర్చుని మరో నవల ఆరంభించడానికే సందేహం లేదనుకున్నారంతా.
‘‘విష్ యు హ్యాపీ జర్నీ’’ అన్నాడు హరీష్‌రావు.
సూరజ్ ఊరికి వెళ్లి పది రోజలవుతోంది.
‘‘పాపం మన సూరజ్ చనిపోయాడండి’’ నొచ్చుకుంటున్నట్లు అన్నాడు అకౌంటెంట్ అనిల్ న్యూస్ పేపరు చూపిస్తూ.
‘‘ ఏమిటి మీరంటున్నది? మన సూరజ్ చనిపోయాడా?’’ నమ్మలేనట్లు చూసాడు బాస్ హరీష్‌రావు.
‘ప్రముఖ నవలా రచయిత సూరజ్ అస్తమయం’
‘‘పాపి చిరాయువు సుకృతీగతాయ: అన్నట్లు పాపం మన సూరజ్‌కి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయన్న మాట’’ అంటూ సానుభూతి కనబరిచాడు కంప్యూటర్ ఆపరేటర్ కాశీనాథ్.
‘‘తక్షణం మన ప్రియతమ స్ట్ఫా మెంబర్ సూరజ్ సంతాపసభ ఏర్పాటు చేసి అతడికి నివాళులు అర్పించాలి’’ తన అభిప్రాయాన్ని ప్రకటించాడు హరీష్‌రావు.
బాస్ ప్రతిపాదనకు సై అన్నట్లు స్ట్ఫాంతా పొలోమంటూ ఆఫీసు ఆవరణలో హాజరయ్యారు.
సూరజ్ ఆత్మకి శాంతి కలగాలంటూ అంతా నిలబడి రెండు నిముషాలు వౌనం పాటించారు.
వౌనానంతరం హరీష్‌రావు నోర విప్పాడు.
‘‘ ఆంధ్ర సాహిత్య వినీలాకాశం నుండి ఓ తార రాలిపోయింది. ఆ మహా రచయిత మన స్ట్ఫా మెంబర్ సూరజ్’’ అంటూ ఉండగా గేటు తీసిన శబ్దమైతే అంతా అటువైపు చూశారు.
అప్పటికే వెలవెలబోయిన ముఖంతో సూరజ్ నిలబడి ఉన్నాడు.
చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొచ్చాడో తెలీక అంతా నివ్వెరపోయారు. అయితే అసలు సిసలైన నవలా రచయిత సూరజ్ వేరొకరని అవగతమవడానికి వారికి ఎంతో సేపు పట్టలేదు.
ఆ తర్వాత సూరజ్ రచనలు ఏవీ?

పుస్తక సమీక్ష

మహామనీషి
ఎపిజె అబ్దుల్ కలాం
‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అని స్ఫూర్తిదాయక నినాదంతో విద్యార్థి, యువలోకాన్ని మేల్కొలిపిన మహానుభావుడు అబ్దుల్‌కలాం. దేశభవిష్యత్తు, ప్రగతి విద్యార్థిలోకం పైనే ఆధారపడి ఉందని, ఇది తిరుగులేని సత్యమని కలాం ఎలుగెత్తి చాటారు. రాష్టప్రతి పదవిని అలంకరించినా విద్యార్థులతోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు. అచంచలమైన ఆత్మవిశ్వాసం గల కొందరి గొప్ప వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అంటారు స్వామి వివేకానంద. కలాం ఆజన్మాంతం అతి సాధారణ జీవితం గడిపారు. ఆయన నిష్కల్మష మనస్తత్వం, నిరాడంబర జీవనం భారత జాతికే గర్వకారణం. కలాం శుద్ధ శాఖాహారి. మద్యపానం ఆయనకు బద్ధ విరోధి. ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌తో పాటు విశ్వజనీనమైన భగవద్గీతను సైతం చదివేవారు. తనలో అణువణువు భౌతిక తత్వాన్ని నింపుకున్న కలాం తాను అభివృద్ధి చేసిన అణ్వస్త్ర అధునాతన విధానం ద్వారా మన దేశాన్ని ప్రపంచంలో అత్యంత బలవత్తరమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. అందుకోసం విజన్-2020 నివేదికను రూపొందించారు. యువశక్తిని సక్రమ మార్గంలో వినియోగించుకుంటే భారత్ ప్రపంచానికే తలమానికం అవుతుందని కలాం ఆకాంక్ష. నేడు భారతదేశపు అమ్ములపొదిలో అగ్రరాజ్యాలకు ధీటైన క్షిపణులు, మిసైళ్లు తయారు చేసుకోగలిగామంటే ఆ గొప్పతనం కలామ్‌కే దక్కుతుంది. నాయకుడంటే సూపర్‌మ్యాన్ కాదు. ఇతరుల నుండి ఆశించకుండా పరులకు ఏదివ్వడానికైనా సిద్ధపడే వాడే నిజమైన నాయకుడు. ఉదాత్త హృదయం నాయకుని పెట్టని ఆభరణం. తప్పనిసరైన లక్షణం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా ఉన్నవాడే నిజమైన నాయకుడని కలాం పేర్కొనేవారు. విద్యార్థి లోకాన్ని, యువతను తన ప్రసంగాలు, రచనల ద్వారా వెన్నుతట్టి లేపారు. ప్రాథమిక స్థాయిలోనే ఉపాధ్యాయులు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేయాలని ప్రబోధించేవారు. నేటితరం తల్లిదండ్రుల పట్ల ఆరాధన భావాన్ని, గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని, దేశం పట్ల భక్త్భివాన్ని పెంపొందించుకోవాలన్న ఆయన సూచనలను ఆచరణలో చూపాలి. అదే ఆయనకు సరైన నివాళి అవుతుంది. ‘ ఈ భువిపై నా చివరి రోజు ముగిసిన వెంటనే నిన్ను చేరుకుంటానమ్మా’ అన్న ఆయన మాటలు అమ్మ పట్ల ఆయనకున్న అనురాగానికి నిదర్శనం. కలాం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ప్రబోధాలు యువతకు, విద్యార్థి లోకానికి దిశానిర్దేవం చేస్తాయి. అణువిస్ఫోటం ద్వారా ఉద్బవించే శక్తి కన్నా దేశంలోని మానవ వనరులు మరింత శక్తివంతమని కలాం ప్రగాఢ విశ్వాసం. చంద్రుడిని అద్దంలో చూపించినట్లు కలాం జీవితం గురించి చక్కగా వివరించిన ఈ పుస్తకాన్ని ఉచితంగా పొందాలంటే రచయిత మందపల్లి రామకృష్ణారావు సెల్ 9441649118లో సంప్రదించవచ్చు..

- వాండ్రంగి కొండలరావు,
పొందూరు, శ్రీకాకుళం జిల్లా - 532168.

అభ్యుదయ బాటలో సాగిన
కాలగమనంలో...
కవిత సమాజాన్ని చైతన్యపరిచేదిగా ఉండాలి. మనిషి మంచితనాన్ని వ్యక్తీకరించేదిగా సాగాలి. ఈ ‘కాలగమనంలో’ కవితా సంపుటిలోని కవితలు నిజాయితీ, నిబద్ధతతో ఆకట్టుకుంటాయి. దోసపాటి సత్యనారాయణ వచన కవిత్వ రచన ద్వారా పాఠకులకు సుపరిచితులే. కవి అభ్యుదయ బాటలో పయనిస్తున్నారని ఈ కవితలను చదివితే అర్ధమవుతుంది. ఈయన తొలి కవితా సంపుటి ‘జ్వాలాముఖి’ విప్లవ భావాలను అభ్యుదయ బాటలో సాగుతుంది. భక్తిప్రపత్తులమయం, కవుల నిలయం, కళల ఆలయం, ప్రసిద్ధ పుణ్యనదీతీరం గల రాజమహేంద్రవరం విశిష్టతను తెలియజేస్తూ ‘నా రాజమహేంద్రవరం’ కవితను రాశారు. అలాగే ‘మేడే’ కవితలో బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే మేడేను సాదరంగా ఆహ్వానించాలని అభిలషించారు.
‘ఈ జన్మకది చాలు’ అంటూ తన అర్ధాంగినే నాయకను చేస్తూ ప్రేమకు ప్రతీకవై నాలో సగమై నన్ను నిరంతరం వెంటాడే నువ్వు నా అర్ధాంగివైనందుకు ఈ జన్మకిది చాలని చెప్పడం అర్ధాంగి విలువను చెప్పినట్లు అయింది. స్వాతంత్య్రానికి పూర్వం ఆంగ్లేయుల చేతుల్లో బానిసలుగా ఉన్నప్పుడు గరిమెళ్ల కళం గర్జించింది. ‘నాకొద్దీ తెల్లదొరతనం’ అంటూ పిడికిలి బిగించింది. కానీ నేడు కవి ‘నాకొద్దీ నల్లదొరతనం’ అంటూ ఎలుగెత్తి చాటడం సాహితీప్రియులందరినీ ఆలోచింపజేస్తుంది. కవి గోదావరి తీరంలో మెసలడం వలన ఎక్కువ కవితల్లో గోదావరిని స్పృశించారు. చిన్న కవిత ఎంతో శక్తివంతమైనదని నిరూపిస్తూ ‘సమాధి మాట్లాడదు/సందేశాన్ని ఇస్తుంది/గత చరితను తెలుసుకుని/బ్రతుకు దిద్దుకొమ్మని/రాబోయే తరానికి/నీ చరితను/ ఆదర్శంగా ఇమ్మని’ అంటూ నగ్నసత్యాన్ని తెలిపారు. బాపూజీని స్తుతిస్తూ కవిత రాశారు. అయితే కవిత్వంలో ఇంకా గాఢత ఉండాలి. భవిష్యత్తులో మంచి కవితా సంపుటాలను వెలువరించాలని ఆశిద్దాం.
- ప్రతులకు -
దోసపాటి సత్యనారాయణ, గాయత్రీ నిలయం, 6-13-15, టి-నగర్,
రాజమండ్రి,
సెల్ : 9866290025

- ఈవేమన, శ్రీకాకుళం.
సెల్ : 7893451307.

మనోగీతికలు

బంగారు కొలను
నా భారతదేశమే
బంగారుకొలను
అందులోన వికసించే
అందాల పువ్వులం
భావిపౌరులం
సూర్యచంద్రకాంతులతో
వెలుగొందే వీరులం!
స్వార్ధపు కొంగలను
కొలను చేరనీయం
విషసర్పాలను రానీయం
మాయదారి మొసళ్లను
దరి చేరనీయం
మా పెద్దలు చూపిన దారిలోనే నడుస్తాం
భారతమాత కీర్తిని చాటుతాం!

విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి, సెల్ : 9246666585.

గృహిణి
అమ్మా! ఓ దేవతామూర్తీ
పొద్దు పొడవక ముందే నిద్రలేచి
ఇల్లువాకిలి శుభ్రపరచి
మధ్యాహ్న భోజనం వండి వార్చి
పిల్లాపాపల్ని చూసుకుని
వాళ్లని బడికి సాగనంపి
వడివడిగా పొలం గట్టుకు చేరి
కంకుల కొడవలి చేతపట్టి
వరిమడిలోకి దిగి
వరికంకులను రాశులుగా పోసి
కూలిడబ్బులు చేతపట్టి
రాత్రిళ్లు భర్త నిరీక్షలో
తాగి ఇంటికొచ్చిన వాడిని
జీవితకాలం భరించే సహనమూర్తి

- బుద్ధా రామారావు, బృందావనం, పాయకరావుపేట-08854-256886.

హాస్యపు హైకూలు
సాయం సమయం
వీధంతా నిర్మానుష్యం
అతిథి వచ్చి ఇంట్లో అడుగు పెట్టినా
అంతటా నిశ్శబ్దమే
ధారావాహికలకు
చిన్నాపెద్దా మమేకం
మాటాపలుకూ లేని
వౌన ప్రవాహం
వేళ కాని వేళ
అడుగు పెడితే అంతా
నిరాదరణే !
బుల్లిపెట్టంతా
గిల్లికజ్జాలు తెచ్చే
చెల్లు చీటీయె

శ్రీమాన్ శ్రీకాశ్యప, సింహాచలం.
సెల్ : 9985520479

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.

email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- దూరి వెంటకరావు, దాసన్నపేట మెయిన్‌రోడ్డు, విజయనగరం-2. సెల్ : 9666991929.