రాజమండ్రి

నీ కనులు నావిగా చేసి చూస్తా! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నువ్వంటే నాకస్సలిష్టం లేదు’ ఓరగా చూస్తూ అంది స్నిగ్ధ. అందులో ఇష్టంలేనితనం అస్సలు లేదు. ‘నాక్కూడా’ అంతే ఓరగా చూస్తూ అన్నాడు శ్రవణ్ తన మాటలో మరింత ఇష్టం చూపిస్తూ. ‘మరి లేకపోతే దేవుడంటే ఇష్టం కలగడం లేదంటావా?!’ అపార్థం చేసుకుంటాడేమోనన్న భయంతో లాలనగా అంది. ‘ఇష్టంగాని, అయిష్టం గాని నాకు లేవు.’
‘కళ్లు పోతాయి’ లెంపలేసుకుంటూ స్నిగ్ధ. ‘నీ కనులు నావిగా చేసి చూస్తా’ అన్నాడు రాగం తీస్తూ.
‘్ఛ! మొండి... చో చ్వీట్!’ అంది ముద్దుగా
‘చిన్న కరెక్షన్, జగమొండి చో! హాట్!’ అనుకరించాడు.
‘మేమంతా అన్నవరం వెళ్తున్నాం’
‘అంతా అంటే?!’
‘కుటుంబం మొత్తం’
‘నేను కూడా ఓ ఫ్రెండ్‌ని తీసుకుని రానా?’
‘ఎందుకు! దేవుడంటే ఇష్టం లేదన్నావుగా’
‘దేవతంటే ఇష్టం కదా!’ అందుకే నేను వాడు. నిద్దురపోయే రాతిరి నడిగా’
అంటూ ... చీకట్లో పాడుకుందామని వేళాకోళంగా అన్నాడు.
‘ఇక్కడ ఉన్నది శ్రీయ కాదు స్నిగ్ధ’ రోషంగా అంది.
‘సో వాట్’ ఇద్దరికీ కావల్సింది చాక్లెట్స్ కదా!’
‘ఏయ్! నిన్నూ’ కొట్టడానికి సిద్ధపడుతూ వెంటపడింది స్నిగ్ధ
‘ఊరికినే ప్లీజ్! ఆగు! నోట్ అవుతాం. అందరూ మనవైపే చూస్తున్నారు’ అంటూ బై చెప్పి బయలుదేరాడు శ్రవణ్.
......
శ్రవణ్ స్నిగ్ధ ఒకే కళాశాలలో అగ్రికల్చరల్ బిఎస్సీ చదువుతున్నారు. పిజి, ఆ పైన రీసెర్చి చేయాలని శ్రవణ్ కోరిక. స్నిగ్ధకు కూడా మొక్కల పెంపకం చాలా ఇష్టం. వాళ్లిల్లు పార్కులా ఉంటుందని చాలా మంది చెబుతారు. పూవులను ఎవరైనా కోస్తేనే విలవిల్లాడే కోమల హృదయం స్నిగ్ధది. కొంతమంది జంధ్యాల పాపయ్య శాస్ర్తీ గారి పుష్ప విలాపం చదువుతూ స్నిగ్ధను పోలిస్తే, మరి కొంతమంది ‘స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతీ కుమారి’ అంటూ ఏడిపిస్తుంటారు.
ఆ రోజు కాలేజీకి బయలుదేరిన స్నిగ్ధ రోడ్డుకి అడ్డంగా వచ్చిన పిల్లవాడు బస్ కింద పడటం చూసింది. కాలుకి బలంగా దెబ్బ తగిలి రక్తం ఓడుతున్న అతనిని శ్రవణ్ రెండు చేతులపై వేసుకొని ఆటో మాట్లాడి హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ‘స్నిగ్ధా! నా బ్యాగ్ తీసుకెళ్లు’ అంటూ వెళ్లిపోయాడు. ఆ రోజు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ ఎన్నో ఉన్నాయి. కాలేజీ వదిలే టైమ్‌కి వచ్చాడు అలసిపోయినట్టుగా ఉంది అతని ముఖం.
‘అన్నీ నీకే కావాలా’ కోపంగా అంది స్నిగ్ధం.
‘ఇప్పుడేమయింది’ కనుబొమ్మలెగరేశాడు.
‘ఆ అబ్బాయికేమన్నా అయితే’ స్నిగ్ధ
‘నేనుండగానే’ అతని కంఠంలోని కాన్ఫిడెన్సుకు స్నిగ్ధకు తిక్కరేగింది.
‘పోలీసులకు వాళ్లకేం చెబుతావ్’
‘ఏది జరిగితే అదే’ నిర్లక్ష్యంగా అన్నాడు. ముందుగా ఆపదలో ఉన్న వారిని రక్షించితే ఈ అమ్మాయి ఇలా రియాక్ట్ అవుతుందేమిటి? రేపు ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తాను బ్రతకగలడా? తనకు డౌట్ వేస్తుంది. ‘నేనేమంటున్నానంటే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. నీవు జైళ్లు, పోలీస్ స్టేషన్లు అంటూ తిరిగితే వారు అదొక సాకుగా చెబుతారు. నీకేం? ఎగబీలుస్తూ అంది.
‘అప్పుడే పెళ్లేంటి? నానె్సన్సు’ తను భయపడేది ఇంట్లో వాళ్ల గురించని తెలిశాక రిలాక్సయ్యాడు.
‘చూడు! ఆ విషయం నాకొదిలెయ్’
‘అసలు నీది లవ్వా? కాదా?’
‘అవునో కాదో నా కళ్లు చెబుతాయిలే’
‘అవి కృష్ణా, గోదావరిలా మారి నా బొమ్మని ఈస్ట్‌మన్ కలర్‌లో చూపిస్తున్నాయి మరి. ఎలా చూడను?’
‘సో! లవ్ ఆల్వేస్ వెయిట్స్ రా!’
‘చదువు పూర్తయ్యే వరకూ కామ్‌గా ఉందాం!’
‘ఒక్క సినిమాకి తీసుకెళ్లమన్నా తీసుకెళ్లవు. మన ఫ్రెండ్స్ చూడు ఎంచక్కా సినిమా కెళ్తారు’ నిందాపూర్వకంగా అంది స్నిగ్ధ,
‘చూడు బంగారూ. కాలేజ్‌లో ఓ బెంచ్‌పై కూర్చుని మాట్లాడుకుంటుంటేనే మన వాళ్లు ఎన్ని పేర్లు రాశారో గోడల మీద తెలియదా నీకు?’
‘అలా రాస్తేనే కదా మజా’
‘మజా! ఏంటి మజాను, స్ప్రైట్, లింకా... మన విషయం పేరెంట్స్‌కి తెలిస్తే వాళ్లెంత బాధపడతారో ఆలోచించావా?’
‘బాధపడటానికి వాళ్లకు తెలుస్తుందా! తెలిసినా కాదని అంటే సరిపోతుంది’
‘అంటే మన ప్రేమ అంత చెత్తదన్నమాట. చూడు బంగారు. ఎవరూ చూడకపోయినా, ఏమీ చెప్పకపోయినా మనం ధర్మానికి, నీతికి, నిజాయితీకి భయపడాలి. అది నీ దృష్టిలో ‘దైవం’ అనుకున్నా నాకెటువంటి అభ్యంతరం లేదు.
‘చెప్పు! వినేవాళ్లుంటే ఎన్ని నీతులైనా చెప్తావ్’ అంది స్నిగ్ధ.
అంటే వినేవాళ్ళున్నారనేగా. ఇంకో విషయం మన పక్కన మీ నాన్నగారుండగా నీవు నా పక్కన కూర్చుని సినిమా చూడగలవా?’
‘వామ్మో! ఉహుహు’ కంగారుగా అంది స్నిగ్ధ.
‘దీనిని బట్టి ఏం అర్థమవుతుంది నీకు. ఇప్పుడు మనం కలిసి వెళ్లడం అనేది తప్పన్నమాట.
‘ఇంట్లో బామ్మలేని లోటు తీరుస్తున్నాడీ శ్రవణ్’ ఇప్పుడే ఇలా ఉంటే ఇకముందెలా ఉంటుందో లైఫ్’ లోలోన అనుకోబోయి పైకే అనేసింది.
‘సరే అంతగా ముచ్చటపడుతున్నావ్ కాబట్టి రేపు నీ బర్త్‌డే రోజు ఒక చోటికి వెళదాం. సెలబ్రేట్ చేసుకుందాం. ఓ.కే.నా!
‘వీడస్సలర్ధం కాడు సుమీ! అనుకుంటూ సంతోషంగా ఓ.కే చెప్పింది. ‘ప్లీజ్ చెప్పు’
‘సస్పెన్స్’.. శ్రవణ్
శ్రవణ్ ఆన్‌లైన్లో కేబ్ బుక్ చేశాడు. ఇద్దరూ బయలుదేరారు. ఓ గంప నిండా యాపిల్స్, మరో గంప నిండా బత్తాయిలు. మరో గంపలో కర్జూరం, కొన్ని చాక్లెట్లు, ఓ పెద్ద కేక్. ఏమిటో రాఘవేంద్రరావు సెట్టింగ్ వేయడానికా అన్నట్లుంది అనుకుంది. ఒక పేకెట్ నిండే పేస్ట్‌లు,. ఇవెందుకో అనుకుంటుంది. కేబ్ తిన్నగా వసుమతీ వృద్ధాశ్రమం ముందు ఆగింది. గేటు దగ్గర జవాన్లు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ గంపల్లోనివన్నీ మోసుకుపోయారు. అక్కడ ఓ గదిలో మామిడి తోరణాలతో, గులాబీలతో అలంకరించిన చోట కుర్చీలలో ఆడ, మగ అందరూ ఇరవై ఏళ్లకు పైబడిన వారే. హేపీ బర్త్‌డే టు స్నిగ్ధ, ధర్మోకోల్‌పై రంగుల అక్షరాలు మెరుస్తున్నాయి. కేక్ అక్కడ తెచ్చి పెట్టాడు శ్రవణ్. ‘ఈ రోజు ఈ అమ్మాయి స్నిగ్ధ తన పుట్టిన రోజు ఇక్కడే జరుపుకోవాలనుకుందంటే తీసుకొచ్చాను. మీ అందరి ఆశీస్సులు తనకు కావాలి.’ అందరూ అక్షింతలతో ఆశీర్వదిస్తూ నుదుటిపై ముద్దుపెట్టారు. జరుగుతున్నది కలో నిజమో తెలియలేదు. అంతలో ఇద్దరు బామ్మలు వచ్చారు. ‘బాబూ శ్రవణ్ ఈ అమ్ము యెవరు?’
‘బామ్మా! ఈమె మా కాలేజీలో చదువుతోంది.’ ఈసారి ఆశ్చరయ్యపోయింది స్నిగ్ధ.
‘మీ అందరి మధ్య బర్త్‌డే జరుపుకోవాలంటేనూ’ నవ్వుతూ అన్నాడు.
‘బాబూ’ పళ్లు నొప్పులు పుడుతున్నాయి. నా కొడుకు నీకు నెల నెల కడుతున్న డబ్బే ఎక్కువ అంటున్నాడు, పేస్ట్ తెచ్చావా బాబూ!’ అమె ఆత్మీయంగా అడుగుతుంది స్వంత మనవడితో మాట్లాడినట్టుగా.
‘బామ్మా! మీకే కాదు. అందరికీ తెచ్చాను.
‘మా నాయనే’ నూరేళ్లు చల్లగా ఉండు.
‘అందరికీ చిరునవ్వుతో ఫ్రూట్స్ ప్యాక్ చేసి చకచక ఇస్తున్నాడు శ్రవణ్
అన్నీ ఓ.కే. తనను పెళ్లాడుతున్నట్టు ఎందుకు చెప్పలేదు. ఉక్రోషం ఎక్కువైంది స్నిగ్ధకు. అదే రిటన్ అవుతూ కేబ్‌లో అడిగింది.
‘చూడు బంగారు! మనం ప్రేమికులమన్న విషయం పేపర్లో పడక్కర లేదు. అసలు ఎవరికీ తెలియాల్సిన పని లేదు. పార్కుల్లో తిరగక్కర్లేదు. ఇంట్లో వాళ్ల పరువు తీయనక్కర లేదు. మనిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకముంటే చాలు. సెటిల్ అవ్వగానే అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం.
‘ఒప్పుకోకపోతే’
‘లవ్ ఆల్వేస్ వెయిట్స్’
‘ఎన్ని జన్మలు?’
‘ఎన్ని జన్మలైనా.. ఏడిపిస్తూ...రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది గదా. తొంభైలో నీకు తాళి గడతా’.. అల్లరిగా అన్నాడు శ్రవణ్.

- బిహెచ్‌వి రమాదేవి సెల్: 9441599321