తెలంగాణ

బీజేపీతో మాకొచ్చే నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్జాల చంద్రశేఖర్
ఏవో ఒకటీ అరా స్థానాలను విపక్షాలు దక్కించుకున్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర సమితికొచ్చే ప్రమాదం ఏమీ లేదు.. తెలంగాణలో భాజపా బలపడుతోందని ఆ పార్టీ నేతలు పనిగట్టుకుని మరీ ప్రచారం చేసుకుంటున్నా ఆ ప్రభావం మాపై ఉండనే ఉండదు.. కాంగ్రెస్, భాజపా, తెరాస త్రిముఖ పోటీ వల్ల మాకు లాభం తప్ప నష్టం లేదు. మంత్రివర్గంలో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదు.. తెరాసలో అసమ్మతి అనేదే లేదు.. పార్టీకి సంబంధించి ‘ఓనర్లం.. కిరాయిదార్లం..’ అంటూ కొందరు వ్యాఖ్యానించడం ముమ్మాటికీ తప్పే. పార్టీలో అందరూ సమానమే. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు. సంపదను సృష్టించడానికి అప్పులు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. నూతన సచివాలయం నిర్మాణాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ‘తెలంగాణ విమోచన దినం’పై మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అయినా దీనిపై మరింత లోతుగా చర్చ జరగాల్సి ఉంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం పరిధి విస్తారమైనది. వివిధ వర్గాల వారితో విస్తృత సంబంధాలు ఏర్పరచుకోవడంతో పాటు, వారి సలహాలు, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కీలక బాధ్యత నాపై ఉంది. పార్టీ ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రతిష్ట కాపాడడం అందరి విధి.. లోక్‌సభ సభ్యుడిగా విశేష అనుభవం సంపాదించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో కీలక నేతగా ఎదిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ‘ఆంధ్రభూమి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
*
హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలో బీజేపీ బలపడినా తమకు నష్టమేమి లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ట్రయాంగిల్ పోటీ తమకు కలిసివచ్చే అంశమేనన్నారు. రాష్ట్ర గవర్నర్ నియామకాన్ని తాము రాజకీయం కోణంలో చూడటం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారినే గవర్నర్‌గా నియమించడం అనవాయితీగా వస్తున్నదేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌డీ తివారీని, జనతాదళ్ హయాంలో ఆ పార్టీ నాయకుడు కృష్ణకాంత్‌ను గవర్నర్‌గా నియమించిందని వినోద్‌కుమార్ గుర్తు చేశారు. ఈఎస్‌ఎల్ నరసింహాన్ ఒక్కరే రాజకీయాలతో సంబంధం లేని సివిల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి అని పేర్కొన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్ బుధవారం ‘ఆంధ్రభూమి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రివర్గ విస్తరణ మొదలుకొని తెలంగాణ విమోచన దినం వరకు, రాష్ట్ర బడ్జెట్ మొదలుకొని సెక్రటరేట్ నిర్మాణం వరకు పార్టీ, ప్రభుత్వ, రాజకీయ వివిధ అంశాలపై నిర్మోహమాట సమాధానాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత తమ పార్టీలో అసమ్మతి పెల్లుబుకిదనడంలో వాస్తవం లేదని చెప్పారు. గులాబి జెండాకు ఓనర్లం, కిరాయిదారులు అనే వ్యాఖ్యలు సరికాదని వినోద్‌కుమార్ తప్పుపట్టారు. పార్టీ అంటే అనేక లక్షల మంది సమూహం. ఇందులో కొందరు ఓనర్లు, మరి కొందరు కిరాయిదారులంటూ ఉండరని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్టు చేస్తున్న విమర్శలకు అర్థం లేదన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ఆదాయాన్ని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను పరిగణనలోకి తీసుకొని రూపొందించగా, పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రస్తుత అర్థిక పరిస్థితిని, ఆర్థిక మాంద్యంతో తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. మరి ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అవాస్తవికమా? అని కొందరు పసలేని విమర్శలు చేస్తున్నారు. అప్పటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అది కరక్ట్, ఇప్పటి ఆర్థిక పరిస్థితికి ఇది కరక్ట్ అన్నారు. ఆర్థిక మాంద్యం ఒక్క తెలంగాణకే పరిమితమైన అంశం కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కొత్త సచివాలయం, శాసనసభ భవనం నిర్మాణం ఎందుకనే విమర్శ సరికాదన్నారు. కొత్త
సచివాలయం అనేది రాష్ట్ర కీర్తిని ప్రస్పటించే అంశమన్నారు. కొత్త రాష్ట్రానికి కొత్త సచివాలయం నిర్మించుకోవడంలో తప్పేమి లేదన్నారు. ప్రతి దానిని భూతద్దంలో చూడటం, వ్యతిరేకించడం మంచిదికాదని హితవు పలికారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అవి అప్పులు కాదని రాష్ట్ర సంపదను పెంచడానికి చేసే ప్రయత్నంగా వినోద్‌కుమార్ అభివర్ణించారు. మేడిగడ్డ బ్యారేజిని నిర్మించాం, దాని నిర్మాణానికైన ఖర్చు కంటే దాని విలువ ఎన్నో రెట్లు ఎక్కువ పెరిగిందన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన డబ్బును బ్యాంకులో దాచుకున్నాడు, మరొక వ్యక్తి అప్పు చేసి ఒక ప్లాట్ కొన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్యాంకులో దాచుకున్న డబ్బు కంటే అప్పు చేసి కొనుగోలు చేసిన ప్లాట్ విలువ ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. ప్రభుత్వం చేసే అప్పులు కూడా రాష్ట్ర సంపదను పెంచే వౌలిక సదుపాయాలపైనేనని వినోద్‌కుమార్ వివరించారు. తెలంగాణ విమోచన దినం అంశంపై టీఆర్‌ఎస్ వైఖరిలో ఉద్యమకాలం నుంచి ఒకేలా ఉందన్నారు. ప్రతిఏటా తమ పార్టీ కార్యాలయంపై త్రివర్థ పతాకాన్ని ఎగురవేస్తున్నామన్నారు. దీనిని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌పై చర్చ జరగాలన్నారు. తెలంగాణ విమోచన దినమని కొందరు, విలీన దినమని కొందరు, విద్రోహ దినమని మరి కొందరు రకరకాల వాదనలున్నాయి. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించి సీఎం కేసీఆర్ పెద్ద బాధ్యతను అప్పగించారన్నారు. దీని పరిధి ఎంతో విస్తారం, విస్తృతమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్‌గోయింగ్ పథకాలు, కార్యక్రమాల బాగోగులను సమీక్షించడం, అలాగే ప్రజలకు అవసరమైన పథకాలు, కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం ప్రణాళిక సంఘం బాధ్యతేనని అన్నారు. ప్రణాళికా సంఘానికి మరే శాఖకు లేనివిధంగా ప్రతి మండలంలో, జిల్లాలో యంత్రాంగం ఉంటుందని, ఏ సమాచారం కావాలన్నా, లెక్కలు కావాలన్నా క్షణంలో ప్రభుత్వానికి అందజేసే యంత్రాంగం తమకు ఉందన్నారు. అయితే దీనిని మరింత పటిష్టపరచడానికి సిబ్బందికి త్వరలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం వివిధ రంగాలలో నిపుణులు, ప్రజ్ఞావంతులతో సీఎం ఫెలోషిప్ ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించిందని, అదే తరహాలో తెలంగాణలో కూడా ఏర్పాటు చేసే అంశంపై యోచిస్తున్నట్టు వినోద్‌కుమార్ వివరించారు. వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయడానికి తాను వారిధిగా మారన్నారు. రాజ్యసభకు పంపించడానికి మరో ఏడేనిమిది నెలలు పెడుతుందని, అప్పటి వరకు ప్రభుత్వానికి అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు అందించే పనిని తనకు సీఎం అప్పగించారన్నారు. కరీంనగర్‌లో తన ఓటమికి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బలంగా వీచిన వీర జాతీయవాద భావోద్వేగమే కారణమన్నారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మొదటి నుంచి పట్టుందని, ఇక్కడి నుంచి రెండుసార్లు విద్యాసాగర్‌రావు గెలిచారని గుర్తు చేశారు. దీనికి తోడు తమ పార్టీ నాయకుల అతివిశ్వాసం కూడా కారణమేనని వినోద్‌కుమార్ వివరించారు.
*మీడియాలో వచ్చే కథనాలపై స్పందించను. అసమ్మతి ముచ్చటేలేదు. పదవులు అనేవి
అందరికీ ఒకేసారి లభించవు. కాస్త ముందూ వెనుకా పనితీరును బట్టి అవకాశాలు లభిస్తుంటాయ.
*కొత్త సచివాలయానికి వెయ్యి కోట్లు ఖర్చు
అవుతుందనే దాంట్లో వాస్తవమే లేదు. మహా అంటే వంద కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదన్నారు. ప్రగతి
భవన్‌ను నిర్మించినప్పుడు కూడా ఇలాగే విమర్శించారు. వాస్తవాలు తెలిశాక ఎవరూ మాట్లాడలేదు
*నాకు అప్పగించిన ప్రణాళికా సంఘం బాధ్యతలతో సంతృప్తిగానే ఉన్నాను. ఎంపీ కంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో సంబంధాలు ఉండే సంస్థ నాది.
* ప్రతి పది, పదిహేనళ్లకు ఒక్కసారి ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. దాని ప్రభావం దేశంపైనా పడింది. అలాగే రాష్ట్రాలపైనా కచ్చితంగా ఉండి తీరుతుంది.
చిత్రం... రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌