డైలీ సీరియల్

దూతికా విజయం-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తెలుసు!’’ అన్నదామె రహస్యం మాట్లాడిన విధంగా.
‘‘సరే.. ఇప్పుడు చెప్పు.. తమరెవరూ? ఇటెందుకొచ్చారు?’’ అన్నాడు వీరభద్రుడు- ఆ ‘తమరు’ అనే పదం గౌరవ సూచకం కాదనీ, హేళనను సూచిస్తున్నదనీ అతని కంఠస్వరమే తెలియజెపుతున్నది.
అంతేకాదు; తానొక పథకం పన్ని ఈ ఇంట ప్రవేశాన్ని లభ్యపరచుకోవటం జరిగిందని, తన తొందరపాటు కారణంగా వీరభద్రుడు గ్రహించే ఉండాలి. ఐతే తాను వచ్చిన పని మరేదో అయి ఉండాలి. తన మొదటి ఎత్తును అతను గ్రహించినా, తాను మోసుకొచ్చిన సువార్త కారణంగా తనను గొప్పగా చూడకతప్పదు. ఇలాంటి అభిప్రాయాలే అతనికి లేనట్లయితే నిర్భయంగా వెళ్లమనేవాడు, అంతేకాని సంభాషణను అనవసరంగా పెంచే ఉద్దేశ్యాన్ని కనబరచేవాడు కాదు కదా!
‘‘దయచేసి తలుపు మూయండి.. లోపలికి వెళ్ళాక అంతా వివరంగా చెపుతాను’’’
లోపల మరో పురుగు లేకుండటం అనుకూలంగా తోచిందామెకు. వీరభద్రుడు ఒక్క క్షణం తటపటాయించి, తలుపు మూశాడు. అతన్ని అనుసరించి నడిచిందామె.
ఇల్లు విశాలంగా ఉన్నది. చాలా పురాతన కట్టడం. దెయ్యల కొంప అనే జనవాక్యం విన్న తరువాత నిజంగానే భూత గృహమని చూడగానే అనిపిస్తుంది. లోపల వున్న భూతప్రేతాల మాట ఎలా ఉన్నా, బైటినుంచి సజీవమైన దెయ్యాల తాకిడి- అందునా ఈ చీకటి వాన రాత్రిలో ఉండేందుకు వీలు లేదు. పరమపద సోపానంలాటి తన పన్నాగపు పటాన్ని విప్పి అతని ముందుంచి, ఆయా పన్నగాల పాలపడకుండా, నిచ్చెనలు మాత్రమే ఎక్కి ఆ పరమపదాన్ని అందుకునే తంత్రాన్ని విడమరిచి చెప్పే సదవకాశం ఏర్పడింది.
వెలుగులోకి రాగానే వీరభద్రుడు ఆమెను తేరిపార చూస్తుంటే సరస్వతి సిగ్గుపడి మొహం కాస్త వొంచుకున్నది.
ఐతే వీరభద్రుడు తనను ఎంత నిశితంగా పరిశీలిస్తే తనకే అంత మంచిది. రూప లావణ్యాలే గాక, తన మొహంలోని రాజకళ కూడా అతను గ్రహిస్తే, తన ఉత్తమాభిరుచులనూ, వంశౌన్నత్యాన్ని గూర్చి విడమరిచి విశదీకరించవలసిన శ్రమ తనకు తప్పుతుంది. అందుకని సరస్వతి సిగ్గుపడుతూనే, తనను తాను వివిధ కోణాల నుంచి ప్రదర్శించుకున్నది. తడిసిన మేలి ముసుగు తీసి పక్కనే వున్న దండెంమీద ఆరవేటంలో సరస్వతి నిలువెత్తు విగ్రహమూ, కాగడా కాంతిలో మెరిసిపోయింది.
‘‘ఈ వీధి వనితవల్లే లేవే’’ అన్నాడు వీరభద్రుడు తనకు ఏర్పడిన అభిప్రాయాన్ని దాచలేక.
ఇంకా నయం- తాను కూడా వేశే్య అని పొరబడిన విధంగా నటించి, ఎటూ వలచి, వరించి, వలలో చిక్కిన వనితగా భావించి చప్పున దగ్గరికి లాక్కోలేదు! తన చిరునామా వగైరా వివరాలు చెప్పవలసిన సమయమిది.
‘‘బ్రహ్మచారులు, బ్రాహ్మణులు, బ్రహ్వస్వరూపులు, వీర తేజోగుణ సంపన్నులు అయిన వీరభద్రులకు చిన్నరాణి మాధవీదేవి ప్రియసఖి సరస్వతి ప్రణామం చేస్తున్నది!’’ అని ఆమె భక్తిపూర్వకంగా నమస్కరించింది.
‘‘కల్యాణికి శుభమగునుగాక!.. ఆ ఆసనంమీద కూర్చో.. నీవొచ్చిన పనేమిటి?’’ అన్నాడు వీరభద్రుడు ప్రతినమస్కారం చేయకుండానే.
కార్యభారం తెలుసుకోకుండానే ముందుకు సాగటం మంచిది కాదని వీరభద్రుని అభిప్రాయమై ఉంటుందని సరస్వతి తలపోసింది.
‘‘తమ బలప్రదర్శనలకు మా రాణి ముగ్థురాలైంది’’
వీరభద్రుడు తల ఊపాడు;
‘తరువాత?’ అన్నట్లు చూశాడు.
‘‘తమకీ కానుకను సమర్పించమని ఆమె నన్ను పంపింది’’ అని సరస్వతి బొడ్డులోనుంచి సువర్ణ ముద్రికలున్న చిన్న మూటను తీసి వీరభద్రునికి అందిస్తూ ‘స్వీకరించమని ప్రార్థన’ అన్నదామె.
అతను అందుకునేందుకు చేయిజాపే ప్రయత్నమన్నా చేయకుండానే ‘ఆ పక్క ఉంచు.. అసలు సంగతి తేల్చు. నాకీ బహుమానాన్ని పంపేందుకు నీలాటి నవయవ్వనిని, అర్థరాత్రి ఒక పక్క ఆకాశం మేఘావృతమై వున్న సమయంలో మీ రాణి పంపి ఉండదు.. ఆమె మనసు ఏమిటో? మగువ మనసు తెలుసుకోవటం బ్రహ్మతరం కాదు కదా!’’’ అన్నాడు వీరభద్రుడు.
ఈ వీరభద్రుడు బహుబల సంపన్నుడు మాత్రమే కాదు బుద్ధిబలసంపన్నుడు కూడానూ! కాకుంటే రాణి మనసులో మరులుగొలిపే మగవాడై ఉండేవాడా- అనిపించింది సరస్వతికి.
‘‘మా రాణి గోపాలస్వామి భక్తురాలు!’’
‘‘ఎలాంటి భక్తురాలు? మీరాబాయి, సక్కుబాయి లాంటి భక్తురాలా? లేక రాధ లాటి భక్తురాలా?’’ ఎంత కఠినంగా, సూటిగా, మర్మరహితంగా అడిగాడు! గమ్యస్థానాన్ని జేరేందుకు ఎలాటి సహనమూ చూపలేని ఆతృత అతన్ని వేధిస్తున్నట్లున్నదనిపించింది సరస్వతికి. ప్రణయానికీ భక్తికీ వున్న సంబంధాన్ని వీరభద్రుడు ఉద్దేశించాడని ఆమె గ్రహించలేకపోలేదు.
సరస్వతి సూటైన జవాబు చెప్పదలచలేదు.
‘‘సంతాన గోపాలుని భక్తురాలు!’’ అన్నది.
‘‘ఐతే?’’ అన్నాడు వీరభద్రుడు అసలు విషయం తేల్చక ఈ నాన్చుడు ఎందుకనే హెచ్చరికను ధ్వనింపజేస్తూ. రాణి ఎలాంటి భక్తురాలో వీరభద్రుడు ఈసరికి గ్రహించి ఉండాలనుకున్నదామె.
‘‘గత రాత్రి సంతాన గోపాలుడు మా రాణికి స్వప్నంలో సాక్షాత్కరించి, తమలో తన అంశను ప్రవేశపెట్టినట్లూ, తన వరప్రసాదికి మాతృత్వాన్ని వహించమన్నట్లూ ఆజ్ఞాపించాడు’’
‘‘ఏమన్నావు? సంతాన గోపాలుడా ఆ ఆజ్ఞ ఇచ్చింది?’’
‘‘ఔను..’’
‘‘నాక్కూడా గత రాత్రి స్వప్నంలో సాక్షాత్కరించాడు. ఐతే వాడు సంతాన గోపాలుడు కాదు మదనగోపాలుడు! ఆజ్ఞ- రాణికి ఇచ్చిన ఆజ్ఞకు నకలు ప్రతే! సరే అన్నీ వాడి అంశలే కదా! నా స్వప్నానుభూతికి రాణికి జేర్చటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. రాణివాసానికి నేను రాలేను కదా, అన్ని సౌకర్యాలూ వున్న రాణే కబురుపెడుతుంది కదా అని వేచి ఉన్నాను. నిజానికి నీలాటి మెరుపుతీగె ద్వారా ఆ సువార్తను పంపుతుందనే ఎదురుచూస్తున్నాను. వాతావరణమంతా సానుకూలంగా వున్న సమయానే నీలాటి వార్తావాహిని ఒంటరిగా నా దగ్గరికి పంపిన రాణి విజ్ఞతకు జోహారులు!’’ అన్నాడు వీరభద్రుడు తెలివి కక్కే కళ్ళను తమాషాగా ఆడిస్తూ.
తాను తలచినదానికన్నా అత్యధిక పరిమాణాల్లోనే ఈ వీరభద్రుని విజ్ఞాన వాహిని ప్రవహిస్తున్నదనే గాడాభిప్రాయం సరస్వతికి ఏర్పడింది. ఆ విజ్ఞాన తటాకంలో తాను తల మునిగి చావకుండా, తన విజ్ఞానాన్ని తెప్పగా మార్చుకొని జలవిహారం చేయవలసి ఉంటుందని తనును తాను హెచ్చరించుకున్నదామె.
జిహ్వకూ, హృదయానికీ మధ్య వుండే ఆ కాస్త స్థలంలోనూ ఎంత కుత్సితాన్ని నిలవ చేయవచ్చునో సరస్వతికి అర్థమైంది. తనకన్నా తెలివిగలవాడి పాల్పడినట్లు కూడా తెలుసుకున్నదామె. ఖండించేందుకు ఎలాంటి అవకాశమూ లేదని తెలుసు. అతని కాళ్ళకు బంధాలు వేయబోయి, పొరపాటున తనే ఉచ్చులో చిక్కుకున్నట్లయింది.
శరీరంలోకల్లా ఎటుపడితే అటు తేలిగ్గా తిరగగలిగేది నాలుక! హృదయ కుహరంలో అనేక తలపులకు సందర్భాన్ని అనుసరించి కావలసిన వీలుగా రంగుపులిమి, తదనుగుణంగా కంఠస్వరాన్ని కలిపి మాట్లాడి పనులను సాధించుకునే యంత్రాంగంలో ప్రముఖ పాత్ర ఈ నాలుకది!

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు